TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 15 వ భాగం.
ప్రోలయ వేమారెడ్డి రాజ్యాన్ని స్థాపించాక, అత్యంత పరాక్రమంతో భూములను ఆక్రమించి తమ్ములకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇచ్చాడు.
వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి తెలివితేటలున్నవాడు. వ్యవహార సమర్ధుడు. అతనికి సముద్ర తీర గ్రామాలమీది అధికారం, ఓడలమీద వర్తక పెత్తనం ఇచ్చాడు. అతడు ద్వీపాంతర వర్తకాన్ని బాగా వృద్ధి చేసి అన్నగారికి వజ్రాలు, సువర్ణం, సుగంధ దినుసులు తెచ్చి ఇచ్చేవాడు.
మల్లారెడ్డి ఎర్రాప్రగడకి స్నేహితుడు.. సన్నిహితుడు.
రెండు వత్సరములు గడవగానే అద్దంకి రాజ్యం కళకళలాడ సాగింది. సాహిత్యాభిలాష మెండుగా గల వేమారెడ్డి, కొలువులోనికి కవులనాహ్వానించ సాగాడు.
మల్లారెడ్డి, అన్నగారికి ఎర్రనని పరిచయం చేశాడు.
మల్లారెడ్డి ఆదరణకు సంతుష్టుడైన ఎర్రాప్రగడ మన్నేరు మీదనున్న గుడ్లూరు వదలి, గుండ్లకమ్మ నదీ తీరాననున్న చదలవాడకు కదల వలసి వచ్చింది.
స్నేహితుడు మడిమాణ్యాలను కానుకగా ఇచ్చాడు మరి..
"చదలవాడకా?" సూరన, పోతమాంబలు ఒకింత అసంతృప్తిగా అన్నారు.
"గుడ్లూరులో ఇన్ని గుడులున్నాయి.. నీలకంఠేశ్వరుని సన్నిధిని వదిలి ఎటుల.. ఇచ్చట శిష్యులు, పరిపాలన.." నిజమే.. వేమారెడ్డి సూరనగారిని గుడ్లూరు యోగక్షేమాలు చూసుకోమని యుద్ధానికి ముందే నియమించారు. అచ్చటి కార్యక్రమాలతో మమేకమైపోయిన సూరన్నకి గుడ్లూరు వదలుట కష్టమే..
"తప్పదు తండ్రీ.. చదలవాడలో రామాలయం కట్టబోతున్నారు మల్లారెడ్డి. మనం దానిని పర్యవేక్షించాలి. అక్కడి వారికి విద్యని నేర్పాలి. గుడ్లూరులో మీ శిష్యులు చాలా మందే ఉన్నారు కద.. ఇరువది సంవత్సరాల నుండి వారిని మీరు అన్ని విద్యలలో నిష్ణాతులని చేశారు. పైగా..
మల్లరధినీ నాధుడు నన్ను అనేక ఐశ్వర్యములతో సముపేతుడిని చేశాడు. మరి ఆ మాణ్యాలను అనుభవించవద్దా! ఇచ్చటి కన్ననూ జీవనం మరింత సొబగుగా ఉంటుంది. సందేహం లేదు."
సూరన్నకి తప్పలేదు..
రాజు తలుచుకుంటే అంతే మరి.
ఈ మారు అంతగా చింతించలేదు సూరన్న కుటుంబీకులు. ఏ విషయమునందైననూ మొదటి సారి ఉన్నటువంటి ప్రభావం రెండవ సారి ఉండదు. మూడవసారి ఉత్సాహం ఉంటుంది. ఆ పైన అసంకల్పితంగా మార్పు కోరుకుంటుంది మనసు.
అదే అనుకున్నాడు సూరనార్యుడు గుడ్లేరు వదులు తున్నప్పుడు. పైగా ఆ ఊరితో నున్న అనుబంధం కూడా తక్కువేం కాదు. వంశోద్ధారకుడు, మున్ముందు చరిత్రలో తమవంశం చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు చెయ్యగలవాడూ అయిన ఎర్రన పుట్టింది అక్కడే. అతడి బాల్య క్రీడలను తాము ఆస్వాదించినది అక్కడే.
ఎన్ని ముద్దులు, ఎన్నెన్ని మురిపాలు!
శ్రీ కృష్ణుడికి రేపల్లెతో ఉన్నట్టి అనుబంధం, ఎర్రనకి గుడ్లేరుతో.
తమ కుటుంబాన్ని ఆదుకుని ఆదరించిన గుడ్లేరు వాస్తవ్యులు..
ముఖ్యంగా గుడ్లేరు లో నున్న ఆలయాలు.. ఆధ్యాత్మిక వాతావరణం మరొక చోట దొరుకుతుందని లేదు.
ప్రతీ శివరాత్రికీ నీలకంఠేశ్వరుని దర్శించుకుంటామని, మిత్రులందరికీ మరీ మరీ చెప్పి, భారమయిన హృదయములతో ఆ ఊరిని వదిలారు అందరూ. ఎర్రన స్నేహితులు పొలిమేర వరకూ వచ్చి వీడ్కోలు చెప్పారు.
ఏ గ్రామమున కైనా, పట్టణమున కైననూ నీటి వనరులు ముఖ్యం.
నిత్య గృహ కృత్యాలకి, పాడి పంటలకీ కూడా అత్యవసరమైనది నీరు.
గుడ్లేరు మన్నేరు నది ఒడ్డున ఉంటే, చదలవాడ, గుండ్లకమ్మ నది ఒడ్డున ఉంది.
చదలవాడ వచ్చిన వెంటనే తమతమ కార్యక్రమాలలో తలమునకలైపోయారు సూరనార్యుని కుటుంబ సభ్యులు.
…………….
12
రామాలయం..
రామపట్టాభిషేక సమయంలో వశిష్ట మహర్షి నుడివిన మాట.. భారతావనికి ఇచ్చిన వరం.
“పది ఇళ్ళుండిన గ్రామములోనైననూ రామమందిర ముండుగాక!”
రామనామం పలుకగానే మనసు పరవశించిపోదా..
పరమశివుడే తారకమంత్రం జపిస్తుంటే..
శంకరస్వామి శిష్యుడు ఎర్రన, రామభక్తుడైన మల్లారెడ్డిని రామాలయం కట్టమని ప్రోత్సహించుటలో వింత ఏమున్నది..
"ప్రాతఃస్మరామి రఘునాధ ముఖారవిందం
మందస్మితం మధురభాషి విశాల ఫాలమ్
కర్ణావలంబి చలకుండల శోభిగండం
కర్ణాంత దీర్ఘనయనం నయనాభిరామమ్."
ప్రాతః కాలమున రఘునాధుని ముఖకమలమును స్మరించాలి. ఆ ముఖబింబము చిరునవ్వుతో కూడినది. తియ్యని మాటలు పలుకునది. కుండలములచే ప్రకాశించు కర్ణములు, శోభాయమానమైన చెక్కిళ్ళు, ఆకర్ణాంత విశాలనేత్రాలు కలిగినది.
"అటువంటి విగ్రహం కల ఆలయం కట్టించు. రామో విగ్రహాన్ ధర్మః. ప్రాతఃకాలమున గ్రామ ప్రజలందరూ శ్రీ రామదర్శనం చేసుకోగలిగిన భాగ్యం కలిగించు."
మిత్రుని మాట వినడమే కాదు.. తక్షణం అమలు పరచాడు మల్లారెడ్డి.
చదలవాడలో రామాలయ నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. ఒక వత్సరంలో ఆలయ నిర్మాణం జరిగి, రామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠ చేయించారు. సూరన, ఎర్రన నిర్మాణ వ్యవహారాల్లో పాలు పంచుకుని, అతి త్వరలో ప్రతిష్ఠ జరుగుటకు తోడ్పడ్డారు.
ప్రోలయవేమారెడ్డి, రెడ్డి రాజ్య స్థాపకుడు.. స్వయంగా చదలవాడకు వచ్చి తమ్ముడు కట్టించిన ఆలయానికి అగ్రహారం ఇచ్చాడు.
ఒక చంద్రగ్రహణం నాడు, గుండ్లకమ్మ నదిలో ఇసుక తిన్నె మీద కూర్చుని ఈ అగ్రహారాన్ని ఇచ్చి, శాసనం తయారు చేయించాడు వేమారెడ్డి.
ఆ అగ్రహారానికి తమ్ముడి పేరున మల్లవరం అని పేరుపెట్టాడు. చదలవాడ గ్రామానికి అరక్రోసు దూరంలో ఈ మల్లవరం ఉంది.
అప్పుడే ఎర్రనని అన్నగారికి పరిచయం చేశాడు మల్లారెడ్డి.
ఎర్రన వంశ వృక్షమును..
తాతగారి ప్రఖ్యాతిని, సూరనార్యుని ప్రతిభను.. ఎర్రాప్రగడ పాండిత్యాన్ని వేమారెడ్డి ప్రభువునకు విశదీకరించాడు.
అచ్చటనే ఉన్న సూరనార్యునకు నమస్కరించాడు ప్రోలయ వేమారెడ్డి.
"ఆచార్యులు మాకు తెలియకపోవడమేమి.. మేమే కద కరాపర్తి నుండి మనసీమకు రప్పించినది. యుద్ధ సమయమున, మా తోడు నీడయై మన పట్టణములను.. గ్రామములను కాపాడినది వీరే..
రాజ్య స్థాపన అయిన పిదప.. రాచ కార్యములలో పడి కాస్త ఉదాసీనత కలిగినది. క్షమించండి ఆచార్యా! కుశలమేనా? మా తమ్ముడు మీ యోగక్షేమములు చూచుచున్నందులకు మాకు ఆనందముగ నున్నది."
మల్లారెడ్డి ఆనంద భరితుడైనాడు.
“ఎర్రాప్రగడ వారు కవి వర్యులు, పండితులు అన్నావు కదూ మల్లా! మల్లవరం గ్రామాన్ని శ్రీవారి భోగానికి సమర్పిస్తున్న సందర్భంలో వారిని రామాయణ కావ్యం వ్రాయమని కోరుతున్నాను."
ఎర్రన్నకి ఆశ్చర్యానందాలతో నోట మాట రాలేదు.
తన చిరకాల వాంఛ..
ప్రభువులకి ఏ విధంగా ఎరుకయింది?
శ్రీరాముల వారి అనుగ్రహం ఉంటే జరుగనిదేముంది.
"మహా ప్రసాదము. కానీ.." కన్నుల నిండా భాష్పాలతో అన్నాడు ఎర్రాప్రగడ.
"ఏమది మహాకవీ?" వేమారెడ్డి ప్రభువు ప్రసన్నవదనారవిందుడై అడిగాడు. తేజో విరాజితుడైన ఈతడు నిస్సంశయముగా ఎన్నదగిన కవియే..
మహాకవి.. అప్పుడే? ఇంకా ఏ రచనా చెయ్యక మునుపే.. ముందుగా తాతగారికిచ్చిన వాగ్దానము తీర్చాలి. నన్నయగారి అరణ్యపర్వ పూరణ చేసి, ఆదికవి ఆశీర్వాదము తీసుకుని.. ఆ పైననే ఇతర రచనలు. ఇంటి విషయాలు తండ్రిగారు చూసుకుంటారు. ధన ధాన్యాదులకి లోటు లేదు.. ప్రభువు ప్రాపు ఉంది. ఇంకేం కావాలి..
పది సంవత్సరములుగా ఎన్నో కావ్యాలు క్షుణ్ణంగా చదవడమయింది. ముప్పదియారు వృత్తాల వరకూ ఛందస్సు కరతలామలకమే.. ధార చిన్ననాట నుండియే ఉందని తాతగారి నమ్మకము.
"కొద్ది సమయము కావాలి ప్రభూ! అత్యవసరమైన కార్యము నిర్వర్తించవలె.."
"మీ అనుకూలము కవి వర్యా! మేము వేచి చూచెదము."
ఆ క్షణమున ఒక మహాకవి కావ్య రచనకి ఆవిర్భావం జరిగింది.
ఆంధ్ర సాహిత్యంలో కొత్త యుగము ఆరంభమయింది.
……………
13
ఒక శుభ ముహుర్తమున ఎర్రాప్రగడ కావ్యారంభమును చేశాడు.
నన్నయగారి శైలినీ, శిల్ప రహస్యాలనూ, మరొక్కసారి వారి భారతమును చదివి ఆకళింపు చేసుకున్నాడు. తిక్కనగారి రచనా విధానాన్ని కూడా అర్ధం చేసుకున్నాడు. ఆ రెంటి మధ్యనూ వారధి కట్టాలి..
తాతగారు చెప్పినట్లు రెండు పర్వతములను కలిపి వంతెన కట్టే సాహసమే..
నన్నయగారు అరణ్యపర్వంలో మూడున్నర ఆశ్వాసాలు వ్రాశారు. వారి ఆఖరి పద్యం,
"శారదరాత్రు లుజ్వలలసత్తర తారక హార పంక్తులం
జారుతరంబులయ్యెవికసన్నవకైరవగంధబంధురో
చార సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్ణమాణక
ర్పూర పరాగ పాండు రుచి పూరములం బరిపూరితులై."
ఎందరో కవులు, సాహిత్యాభిలాషులు ఈ పద్యాన్ని ఎన్ని మారులు చదివారో! ఇంకా ఇంకా ఎందరు చదువుతారో.."
భారతం పూర్తి చెయ్యాలనుకున్నవారు ఈ పద్యం నుండి ప్రారంభించాలి. కానీ తిక్కన గారు అరణ్య పర్వం వదిలేసి, విరాట పర్వం నుంచి మొదలు పెట్టారు.
అపశకునమనుకున్నారేమో.. ఎవరూ అరణ్యపర్వాన్ని పూరించ సాహసించలేదు.
ఎర్రాప్రగడ అటువంటి మూఢనమ్మకాలని దరి చేరనియ్యలేదు. మిగిలిన మూడున్నర ఆశ్వాసాలూ వ్రాయడమే కాక, అవికూడా రాజరాజ నరేంద్రునకే అంకిత మివ్వదలచాడు..
తాతగారికి వాగ్దానం చేసినట్లుగానే!
ఎర్రన్న అనుకున్నదానికంటెనూ కష్టతరమే.
మధ్యలో ఆరంభిస్తే..
ఇష్టదేవత ప్రార్ధన చెయ్యడానికి లేదు..
పెద్దల ఆశీస్సులు అందుకొనుటకు లేదు. తానెవరో చెప్పుకొనుటకు లేదు..
అయిననూ సాహసించాడు..
ఆందుకే కవిత్రయంలో ఒక్కడయ్యాడు.
అతడి తెలివి అపారము. తాను చెయ్యవలసిన దానిలోనే దైవ ప్రార్ధనకి అవకాశం ఎక్కడుందో అని వెదకి చూశాడు.
ఒక ఘట్టంలో, సరస్వతీ గీత అని ఒక భాగం ఉంది. అందులో తారుక్ష్యుడు అనే ముని సరస్వతీ దేవిని ప్రార్ధించవలసి ఉంది. అతడు భారతీదేవిని ఆరాధించి, దేవి ప్రత్యక్షమైతే తన సందేహాలను దీర్చుకుంటాడు.
సంస్కృత మూలంలో వ్యాస మహర్షి సరస్వతిని స్తుతించలేదు.
నన్నయగారి భారతం వలెనే, ఎర్రనగారు కూడా అనువాద రచన చెయ్యదలచుకోలేదు. తాను స్వతంత్రంగా.. మెరుగులు దిద్ది, అవసరమైన చోటున కల్పన జేసి.. వద్దనుకున్న వద్ద వదిలేసి వ్రాయదలచారు.
అందువలన వాగ్దేవీ స్తుతితో తన కావ్యమును ప్రారంభించాడు..
"అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీప్తికా
చుంబిక దిగ్విభాగ శ్రుతి సూక్త వివిక్త నిజ ప్రభావ భా
వాంబర వీధి విశృతవిహారి ననుం గృప జూడు భారతీ."
ఆ తరువాత భారత రచనా ప్రారంభం..
నన్నయ భట్టారకుని మనమున నుతించి శారదవేళను వర్ణించ నారంభించాడు ఎర్రన.
కన్నులు మూసుకున్నాడు. నన్నయ ఆవహించినట్లే..
"శారదరాత్రు లుజ్వల.." పద్యాన్ని తలచుకున్నాడు. ఆ తరువాత ఏ విధంగా సాగుతుంది శారద రాత్రి?
"స్ఫురదరుణాంశురాగరుచి బొంపిరి వోయి నిరస్త నీరదా
వరణములై దళత్కమల వైభవజ్రుంభణ ముల్లసిల్ల ను
ద్గురతరహంస సారస మధువ్రతవిస్వనముల్ సెలంగగా
గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళ జూడగన్."
ఒక్కసారి శారదరాత్రులు.. పద్యం క్రింద తన పద్యం పెట్టి చూసుకుని, గట్టిగా పైకి చదివాడు.
పదముల అమరిక, వాక్య నిర్మాణము, యతి ప్రాసలతో సహా.. వేరెవరికో గాదు తనకే నన్నయగారు వ్రాసినట్లే అనిపించింది.
ఇంక ఆ గంటం ఆగలేదు..
స్నాన, ధ్యాన, ఆహార పానీయాది నిత్యకృత్యములకు, నిదురకు తప్ప లేచింది లేదు.
పూర్తి అయ్యాక ఒకసారి తిరగేసుకున్నాడు తన కావ్యాన్ని ఎర్రన.
మొత్తం, నలభైయారు ఘట్టాలు, 1595 గద్య పద్యాలతో అరణ్యపర్వ శేషం ముగిసింది.
ఇందులో ఇరవై మాత్రమే భారత కథకి సంబంధించినవి. మిగిలినవి పురాణ కాలక్షేపాలు. ఎర్రనకి ఉత్సాహం కలిగించిన విషయం ఒకటుంది ఇందులో..
తను చిన్ననాటినుండీ అనుకుంటున్నది..
అదే.. రామాయణ రచన.
వ్యాస రామాయణం అరణ్యపర్వంలోనే ఉంది. రామ రావణుల జననం నుండీ రాఘవాభ్యుదయం వరకూ.. ఇది సంక్షిప్త రామాయణం.
అయితే ఇది వ్రాయబోయే మహాకావ్యానికి ఒక సాధన మాత్రమే.. వేమారెడ్డి ప్రభువు కోరిన రామాయణ గ్రంధం కూడనూ తను వ్రాయాలి.. అందులో ఏ మాత్రం అనుమానం లేదు.
…………….
నన్నయగారి ఇతిహాస శైలితో ప్రారంభించి, తిక్కనగారి నాటకీయ శిల్పంలో ముగించగలిగాడు ఎర్రన తన భారత భాగాన్ని. మొదట కొంచెం అధికంగా ఉన్న సంస్కృత పదాలు పోను పోను తగ్గసాగాయి.
తాతగారు చెప్పిన వారధి సంతృప్తిగా కట్టగలిగినట్లే.
నన్నయగారి శైలే కాదు, భావ స్ఫూర్తిని కూడా ప్రతిఫలించగలిగాడు ఎర్రాప్రగడ.
అనృతమాడుటకు అభ్యంతరం లేని పరిస్థితులను నన్నయగారు వ్రాసినది జ్ఞప్తికి వచ్చింది ఎర్రనకి ఒక సందర్భంలో..
భూతహితంబుగా బలికితే బొంకు కూడా సత్య ఫలమునిస్తుందనీ,
భూతభయాస్పదంబగు ప్రభూతపు సత్యం బొంకు వంటిదేననీ
ప్రాణాతురుడు, పరిణయంబునందును పలుకు బొంకు సత్యాశియంబనీ
వీనినే ధర్మ సూక్ష్మములనెదరనీ.. వివరించాడు.
తను చేసిన వర్ణనలు కూడా సంతృప్తిగా అనిపించాయి ఎర్రనకి.
ఇరువది తొమ్మిదో ఘట్టం నుండీ రామాయణం ప్రారంభమవుతుంది. ఇంకా నన్నయగారి శైలిలోనే నడిచింది..
అవును మరి.
ఇది నన్నయగారి అరణ్య పర్వంలో భాగం..
అదే న్యాయం.
ఒక్కసారి కావ్య రచన ఆరంభించాక ధార సాగిపోతూనే ఉంటుంది. కవి హృదయాన్ని, చేతలను మించి కూడా నడుస్తుంటుంది ఒక్కొక్కసారి.
రామ లక్ష్మణులు చూసిన పంపా సరోవర వర్ణన చదువుకుంటుంటే అదే అనిపించింది ఎర్రనకి..
"కమనీయ కమలినీ కహ్లార దళ కేస
రాన్విత జలముల నర్ఘ్య విధియు.."
నన్నయగారి శైలే..
సావిత్రీ చరిత్ర వ్రాసే సమయమున ఎర్రనకి ఆవేశము వచ్చింది. ఆమె కష్టములు.. అవి అధిగమించడానికి ఆమె చేసిన పోరాటము..
అందుకే ఆ చరిత్రనే ఒక ప్రబంధము లాగ వ్రాశాడు. అనేక మారులు మూల గ్రంధమును చదివి ఎంతో అవగాహనకి రావలసి వచ్చింది. తన శ్రమనంతయూ ఒక సారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు ఎర్రన. అదే సమయానికి, పోతమాంబ కోడలితో సహా వచ్చి ఎదుట నిలిచింది.
"అబ్బాయీ! నీ కావ్యంలోనుంచి ఏదయినా నాలుగు ముక్కలు చెప్తే వినాలని ఉంది మాకు. మరీ మాకు అర్ధంకాని క్లిష్ట పదాలతో కాక మామూలు భాషలో చెప్పు."
ఇంకేముంది.. ఆడువారికి రోమాంచితము సావిత్రీ సత్యవంతుల కథ. తనకీ ఇష్టమయింది, వారికీ నచ్చేది.. అదే చెప్తే స్వామి కార్యము, స్వకార్యము నెరవేరినట్లే.
ఎర్రన వారిని ఎదురుగా కూర్చోమని ప్రారంభించాడు.
……………………..
.....మంథా భానుమతి