Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 14వ భాగం

 

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 14వ భాగం


   ఢిల్లీ ప్రజలకి, రాజప్రాసాదంలో హత్యలూ.. రాత్రికి రాత్రి సుల్తాన్ మారిపోవడాలూ అలవాటైపోయాయి.
   పొద్దున్నే లేచి.. "రాత్రి అలా జరిగిందిట" అంటూ ఏదో సాధారణ వార్తలా చెప్పుకోవడం..
   ఆ తరువాత, వారి పనులను మామూలుగా చేసుకోవడం. ఏ సుల్తాన్ అయినా ఒక్కటే.. వారి జీవితాల్లో మార్పు ఉండదు.
   "ఈ రోజు వరకూ నేను ముసల్మాన్‍గా బ్రతికినా, పుట్టుకతోనూ.. మానసికంగానూ నేను హిందువునే. నాలో హిందూ రక్తం ప్రవహిస్తోంది. అణువణువునా హిందూత్వం ఉంది. నేను హిందూ సామ్రాట్‍నే.. ఢిల్లీ ఈ రోజునుండీ హిందూ సామ్రాజ్యం.
   హిందూ రాకుమారి దేవల దేవి.. తండ్రితో దిక్కులేకుండా అడవిలో పారిపోతుంటే పట్టి బంధించి ఆమె మతం బలవంతంగా మార్చారు. ఆమె భర్త శంకర్‍దేవ్‍ని దారుణంగా హత్య చేశారు. ఆమెని నేను వివాహం చేసుకున్నాను. నేటి నుండీ దేవల దేవి హిందూ మహారాణీ."
    ఖుశ్రో ఖాన్ తన పేరును నసీరుద్దీన్‍గా మార్చుకున్నాడు. హిందూ పేరే పెట్టుకోవచ్చు కదా! ఏ మూలో ముస్లిములంటే కొద్ది భయం ఉందేమో!


                            
   హిందూ చక్రవర్తి నసీరుద్దీన్ హిందువుల మీద జిజియా పన్నును ఎత్తేశాడు. హిందువులు కూడా ప్రధమ పౌరులని ప్రకటించాడు. వారిదేశంలోనే వారు హీనంగా బ్రతకడం అన్యాయమన్నాడు. ఆలయాలను పునరుద్ధరించాడు. తన సేనలలో కొన్నింటిని హిందువుల పరి రక్షణకై నియోగించాడు.
   హిందూ రాజులు ఈ మార్పును స్వాగతించినా వారి వారి బలాలను సమకూర్చుకుని, ఢిల్లీ హిందూ సుల్తాన్‍కు తోడుగా ఉండి సమైక్యంగా దేశం నుండి ముస్లిములను తరిమి కొట్టాలనే ఉద్దేశ్యాన్ని మరచారు.
   స్వార్ధం.. స్వార్ధం.
   తామూ తమ రాజ్యం క్షేమంగా ఉంటే చాలు. దేశం ఏమైపోయినా ఫరవాలేదు.
   అదే వారు చేసిన తప్పు. జీవితంలో వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని నాశనం చేసుకున్నారు.
   ఐకమత్యం లోపిస్తే అలుసేనని మరచారు.
   హిందూ ధర్మ పునరుద్ధరణకై ప్రయత్నం చేసిన, చేస్తున్న ఖుశ్రో, దేవలదేవిలు ఒంటరిగా పోరాడవలసి వచ్చింది. చుట్టూ ముసల్మానులు.. అదీ కక్షగట్టిన వాళ్ళు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు.
   అఫ్ఘనిస్తాన్ నుండీ కర్ణాటక వరకూ విస్తరించిన నసిరుద్దీన్ సామ్రాజ్యం.. కొద్దినెలలే అయినా హిందువుల పాలిటి బంగారు కాలం.
   ముసల్‍మానులు ఒదిగి ఒదిగి ఒక మూలకు ఉండిపోయారు.
   అదే విధంగా కొనసాగితే..
   హిందూదేశ చరిత్రే మారిపోయేది.. మరో విధంగా ఉండేది.
   కానీ.. విధి బలీయమయినది.
   అవకాశం ఒకేసారి తలుపుతడుతుంది. ఆదమరిస్తే అంతే..
   అదే జరిగింది నసీరుద్దీన్ విషయంలో.
   ఎన్నో సంవత్సరాల ప్రణాలికని అతిశయం తలకెక్కి ధ్వంసం చేశాడు. ఎన్నో పగళ్ళు మొహంలో భావాల్ని తెలపకుండా శిలలా ఉండగలిగాడు అంతవరకూ! ఎన్నో రాత్రులు రహస్యంగా మేలుకుని వ్యూహాలు పన్నాడు. ఎంతో మంది తన వారిని గుండె బండ చేసుకుని వధింఛాడు..
   అతని కఠోర శ్రమ అంతా అతని అనాలోచిత చర్యల వల్ల నాశనం అయిపోయింది. దేవలదేవి ఎంతగానో వారించినా ఫలితం సున్నా..
   అనుకున్నది అనుకున్నట్లు అయితే.. తనకి ఎదురే లేదనుకుంటాడు మానవుడు.
   ముస్లిములు తమ విషయంలో చేసిన తప్పులే.. అపరాధాలే, తనూ వారి విషయంలో చేశాడు నసీరుద్దీన్.
   దేశంలోని హిందువులనందరినీ ఒక దగ్గర చేర్చి, ఆ ఉద్యమాన్ని కొనసాగించవలసింది పోయి.. అహంభావంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తించాడు.
   నిండు సభలో, ముస్లిమ్ మంత్రులు, సేనానాయకుల సమక్షంలో.. సింహాసనం మీద ఖురాన్ ప్రతులను పరచి వాని మీద కూర్చున్నాడు. వారి మతాన్నీ.. అప్పటివరకూ తాను రోజూ చేసే నమాజ్‍నీ అవహేళన చేశాడు. ఇంకా.. అతి హీనమైన పనులు.. వర్ణించడానికి ఏహ్యమైన పనులు చేసి, ముస్లిమ్ సర్దార్‍ల మనోభావాల్ని దెబ్బ తీశాడు.
   కోటలో, రాజప్రాసాదంలో సగం మంది పైగా ఉన్న ముస్లిమ్‍లు సహించలేని స్థితి వచ్చింది.
   నసీరుద్దీన్ పతనం ప్రారంభమయింది.
                                 ………..

   ఘాజీ మాలిక్..
   అల్లావుద్దీన్ సైన్యంలో అతి ముఖ్యుడైన సేనాని. మంగోలులను సరిహద్దునుంచి తరిమికొట్టిన బలవంతుడు. ముల్తాన్‍లో ప్రతినిధిగా ఉన్నాడు. అసమర్ధ ముబారక్ షా సుల్తాన్‍గా ఉన్నప్పుడు స్వతంత్రం ప్రకటించుకుని, ముల్తాన్, సింధు, ఉచ్ రాజ్యాలకు తనే రాజునని ప్రకటించుకున్నాడు. అతని కొడుకు, ఫకిర్ మాలిక్ నసీరుద్దీన్ ఖుశ్రో కొలువులో ఉన్నాడు.
   ముసల్మాన్ సర్దార్లు అందరూ కలిసి, ఫకిర్ మాలిక్‍ని రహస్యంగా ముల్తాన్ పంపించారు.
   ఢిల్లీలో జరుగుతున్న అత్యాచారాలని తండ్రికి తెలియజేశాడు ఫకిర్.
   ఘాజీ మాలిక్ కుతకుతా ఉడికిపోయాడు.
   "కాఫిర్ ఖుశ్రో.. హిందువా!" అవునన్నట్లు తల ఊపాడు ఫకిర్.
   "జీహాద్.."
   భూనభోనాంతరాలు దద్దరిల్లేలా అరిచాడు ఘాజీ.
   మూడువేలమంది సుశిక్షితులైన సైనికులతో ఢిల్లీకి బయలుదేరాడు. పంజాబ్ వద్ద అతడిని ఎదుర్కున్నారు ఢిల్లీ సైన్యం.

 


                       
   నసీరుద్దీన్ ఖుశ్రో సింహాసనం మీద కూర్చుని ముస్లిములని ఏ విధంగా అవమాన పరచాలా అని ఆలోచిస్తుండగా.. ఢిల్లీ కోటలోకి ప్రవేశించారు ఘాజీ సైన్యం.
   తుఫాన్‍లా ప్రవేశిస్తున్న జీహాదీలను చూసి పారిపోయారు ఖుశ్రో, దేవలదేవిలు.
   ఇద్దరినీ తరిమి తరిమి పట్టుకుని చిత్రవధ చేసి చంపేశాడు ఘాజీ.
   పురిట్లోనే సంధికొట్టి పోయింది నసీరుద్దీన్ హిందూ సామ్రాజ్యం.
   హిందువుల పాట్లు మొదలయ్యాయి.. ఇంకా భయంకరంగా!
   ఘాజీ వెంటనే తాను చక్రవర్తినని ప్రకటించుకోలేదు. ఖుశ్రో చేసిన తప్పు తాను చెయ్యదలుచుకోలేదు. మూడు రోజులు, తన ప్రభువు అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానికి సంతాపాన్ని ప్రకటించి, రాజ మందిరంలోనే ఉండి పోయాడు.
   ఆ తరువాత ఖిల్జీ వారసులెవరైనా ఉన్నారా అని వెతికాడు. కొందరిని మాలిక్ కాఫర్ చంపుతే, మిగిలిన వారందరినీ ముబారక్ షా చంపేశాడు.
   తొందరపడకుండా.. ముస్లిమ్ పెద్దలచేతనే.. మంత్రులు, సేనానులు, దండనాయకుల సమక్షంలో ఘాజీ మాలిక్ తమ నూతన చక్రవర్తి అని ప్రకటింపజేశాడు.
   క్రీ.శ. పదమూడు వందల ఇరవయ్యో సంవత్సరంలో.. ఘాజీ మాలిక్ ఢిల్లీ సుల్తాన్‍గా, "ఘియాజుద్దీన్ తుగ్లక్‍" అనే పేరుతో ప్రమాణ స్వీకారం చేశాడు.
   అతని కొడుకు ఫకిర్.. మహమ్మద్ షా తుగ్లక్ అయ్యాడు.
   హిందూ దేశంలో ఖిల్జీ వంశ పాలన, నసీరుద్దీన్ ఖుశ్రోఖాన్ విప్లవంతో అంతరించిపోయి తుగ్లక్ వంశ పాలన మొదలయింది.
                             .......................
                                   
                                     11
   "హా..హా! ఢిల్లీ సింహాసనం మీద హిందూ చక్రవర్తి.. మనం స్వతంత్రులమౌతున్నాం.." ప్రతాపరుద్రుడు ఆనందంగా అరిచాడు.. వేగుల వార్త విని.
   సభలో కరతాళధ్వనులు మిన్నంటాయి.
   "అక్కడికక్కడే బోలెడు సమస్యలు వాళ్ళకి.. హిందువు మోసం చేసి సామ్రాట్ అయ్యాడని ముసల్మానుల అసంతృప్తి.. హీన జాతివాడు సింహాసనమెక్కాడని హిందువుల కినుక.. అంతా అస్తవ్యస్తం. ఇదే సరయిన సమయం. మన నాయంకరులకి యుద్ధ సన్నిద్ధులను కమ్మని వర్తమానం పంపండి గన్నమ నాయుడుగారూ!" మహామంత్రికి ఆదేశాలిచ్చాడు.
   దాది గన్నమనాయుడు సమర్ధుడైన సేనాని.. అంతటి క్లిష్ట పరిస్థితులలోనూ.. సాధ్యమయినంత ప్రజారంజకంగా పరిపాలన సాగించడానికి దోహదపడుతుంటాడు. అతడే ప్రతాపరుద్రుని మంత్రి, కోశాధికారి కూడా.
   "యుగంధర్" అని ఆత్మీయంగా అందరిచేతా పిలిపించుకునే అందరివాడు.
   గన్నమనాయుడి వంశీయులు తరతరాలుగా కాకతీయ ప్రభువులకు సేనానులుగా సేవలందిస్తున్నారు.
   ఒక్క క్షణం ఆగుతే పరిస్థితులు మారుతాయేమోనన్నట్లు లేచి పరుగులు పెట్టారు అందరూ.
   శివదేవయ్యగారు మాత్రం కన్నులు మూసుకుని కదలకుండా కూర్చునుండి పోయారు.
   ప్రతాపరుద్రుడు పట్టించుకోకుండా లేచి వెళ్ళిపోయాడు.
   అప్పుడు కళ్ళు తెరిచిన శివదేవయ్యగారు విరక్తిగా ఒక్క నవ్వు నవ్వి లేచారు.
                                 …………..
   ప్రతాపరుద్రుడి నాయంకరులు నాలుగు సంవత్సరాలనుండీ ముసల్మాన్ రాజుల బానిసత్వం నుండి విముక్తికై ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
   ముసునూరి ప్రోలయ నాయకుడు, ద్వార సముద్రం వీర బల్లుడు, అద్దంకి వేమారెడ్డి.. వారిలో ప్రముఖులు.
   వారందరూ యుద్ధానికి సిద్ధం అవుతూనే ఉన్నారు..
   ఢిల్లీలో పరిస్థితులు మారిపోయాయి.
   నసీరుద్దీన్ ఖుశ్రోను నరికేసి, ఘజియుద్దీన్ తుగ్లక్ సామ్రాట్ అయ్యాడు. అతడు ఆరితేరిన యుద్ధవీరుడు. అల్లావుద్దీన్ నమ్మినబంటు. అల్లాఉద్దీన్ వ్యూహాలన్నీ బాగా తెలిసినవాడు.
   ప్రతాపరుద్రుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఢిల్లీ సుల్తాన్‍కు కప్పం కట్టడం మానేశాడు. సామంతులందరినీ సమకూర్చుకుని ముస్లిమ్ దండయాత్రని ఎదురుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు.
   రెండు సంవత్సరములు ఎదురుచూసిన సుల్తాన్ తన కొడుకుని, పెద్ద సైన్యంతో దక్కనుకి పంపాడు.. హిందూ కాఫిర్‍ల మదమడచమని.
   ఉలూఘ్ ఖాన్ .. ఇతన్నే మహమ్మద్ బీన్ తుగ్లక్ అని అంటారు.. తండ్రి అంతటి వీరుడు. అపారమైన సైన్యంతో పూనా, దేవగిరిలను స్వాధీనం చేసుకున్నాక ఓరుగల్లును ముట్టడించాడు.
   తయారుగా ఉన్న కాకతీయ సామ్రాజ్య వీరులు ఉల్లూఖాన్ సేనలను తరిమి కొట్టారు. కానీ ఎనిమిది మాసాల ఆ సుదీర్ఘ యుద్ధం వల్ల ఎంతో నష్టం జరిగింది. ఎందరో సైనికులు అసువులు బాసారు. అశ్వ, గజ దళాలు అనేక కష్టాలు పడ్డారు. కాళ్ళు విరిగిన జంతువులను నరికి చంపవలసి వచ్చింది.
   ఉల్లూఖాన్ దేవగిరి పారిపోయాడు.
   కాకతీయ రాజ్యంలో విజయోత్సవాలు.. పోయిన వారు పోగా మిగిలిన వారు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. సేనానులందరూ వారి వారి సీమలకు వెళ్ళిపోయారు.
   అంతలో ఢిల్లీ సుల్తాన్ మరణించాడన్న వార్త దావానలంలా వ్యాపించింది.
   ఆనంద హేలలకు అంతులేకుండా పోయింది. పారిపోయిన ఉల్లూఖాన్ ఇప్పుడు సుల్తాన్..
   కాకతీయ సామ్రాజ్యం మరల స్థాపించబడింది.
   ప్రతాపరుద్రుడు చక్రవర్తి.. పూర్వ వైభవం తిరిగి వస్తుంది.. అని అందరూ ఊహించారు.
   యుద్ధంలో అలిసి అలిసి సోలిపోయిన వారందరూ లేచి నిలదొక్కుకున్నారు. ఆయుధాలు అటకెక్కించారు. ఎన్నెన్ని సంవత్సరాల పోరాటం.. చివరికి అంతమయింది.
   అంతకన్నా కావలసినది ఏముంది?
   చక్రవర్తినుండి, చాకలివాని వరకూ విశ్రాంతి తీసుకుంటున్నారు.. మానసికంగా, శారీరికంగా.
                               …………..
   ఉల్లూఖాన్.. వట్టి జిత్తులమారి.
   తండ్రి చనిపోయినట్లు తనే పుకారు సృష్టించాడు. అదనపు సేనలను పంపమని ఢిల్లీకి వర్తమానం పంపాడు. దేవగిరి సేనలను కూడా సమీకరించాడు.
   ఓరుగల్లు సైన్యం ఏమరుపాటుగా ఉన్నప్పుడు విరుచుకు పడ్డాడు.
   పంట పొలాల మీద ఆంబోతులు పడినట్లు వీర విహారం చేసి, అడ్డం వచ్చిన వాళ్ళని నరికేశాడు. కోటలో ప్రవేశించి ప్రతాపరుద్రుడిని, రాణీ విశాలాక్షిని.. సేనాధిపతులను.. అందరినీ బంధించాడు.
   కోహినూరు వజ్రముతో సహా బంగారము, వజ్ర వైడూర్యాలు.. సంపదనంతా ఇరువదివేల గుర్రములపై, వంటెలపై, ఏనుగులపై నుంచారు. వానితో పాటుగా.. గన్నమనాయుడిని, ప్రతాపరుద్రుడిని ప్రత్యేకమయిన కాపలాతో ఢిల్లీకి తరలించాడు.
   ప్రతాపరుద్రుడు అవమాన భారంతో కృంగిపోయాడు. ఢిల్లీ చేరితే సుల్తాన్ ఏ శిక్ష వేస్తాడో తెలుసు. ముందు మతం మార్చుకోవాలి.. ఆ తరువాత..
   హరపాల దేవుడు గుర్తుకొచ్చి గజగజ వణికి పోయాడు.
   అప్పుడు గుర్తుకొచ్చారు శివదేవయ్యగారు. సలహాలు తీసుకోవడం సరే.. వారితో మాటలాడి ఎంతో కాలమయింది.
   సాక్షాత్ శివుని అవతారం వారు.
   ప్రతాపరుద్రుడు పశ్చాత్తాపంతో కృంగి పోయాడు. శివదేవయ్య గారు ఒకప్పుడు చెప్పిన సంగతి జ్ఞప్తికి వచ్చింది.
   "కాకతీయ సామ్రాజ్యం స్థాపించి వేయి వత్సరములయినది. ఇంక దైవబలము మనకు లేదు.. పద్మాక్షీ అమ్మవారి ఖడ్గ ఖేచకములు మాయమయినవి."
   మానవమాత్రులు చేయగలిగినది ఏమున్నది.. విధి వ్రాత తప్పించుటెవరి తరము?
   ఢిల్లీ వెళ్తున్న సుల్తాన్ సేనలు నర్మదానదీ తీరమున ఆగాయి. సాయం సమయమయింది. ముసల్మానులు నమాజు చేసికొనుటకు, ఒడ్డున వస్త్రములు పరచినారు.
   ప్రతాపరుద్రుడు నది ఒడ్డునకు వెళ్ళి నిలబడినాడు.. కాళ్ళు చేతులు కడుగుకొను వాని వలె. అందరూ చూస్తూనే ఉన్నారు.. భూమ్యాకాశాలకు నమస్కరించి నదిలో దూకేశాడు. కొద్ది సేపటిలోనే సుదూర తీరాలకి కొట్టుకొని పోయాడు. వార్త విన్న విశాలాక్షీ దేవి, తను కూడా ప్రాణ త్యాగము చేసింది.
   వేయి సంవత్సరముల కాకతీయ సామ్రాజ్యం అంతరించింది.
   చరిత్రలో మిగిలిపోయింది.
                                  ………...
   ఉల్లూఖాన్ ఓరుగల్లును దౌలతాబాద్ (దేవగిరి)లో ప్రతినిధిగానున్న మాలిక్ బుర్హానుద్దీన్ అధీనంలో నుంచాడు. శ్మశానంలా తయారయిన సామ్రాజ్యాన్ని ఎవరు ఏలితే ఏమి?
   తెల్లవారితే..
   వెల్లల్లేక నల్లగా మారిన గోడలు
   నాచు పట్టిన ఇళ్ళలో
   కుళ్ళిపోయిన మనుషులని
   నీళ్ళతో కడుపు నింపి
   ఊళ్ళకి ఊళ్ళని కొల్లగొట్టడం..
   ఇంతే జీవితం. వేంగీకి, వెలనాడుకి, పాకనాడుకీ వలసలు పెరిగిపోయాయి. రాజ్యపాలన అంటే దోచుకుని తినడం కాదు..
   నీటి వనరులు చూడాలి. వ్యవసాయం చెయ్యాలి. వ్యాపారం చెయ్యాలి. విద్యలు నేర్పాలి. వివాహాది శుభకార్యాలు చెయ్యాలి. ఆటపాటలు.. సంగీత సాహిత్యాలు..
   ఎప్పటికి వచ్చేను ఆ రాజ్యం..
   వస్తుంది వస్తుంది త్వరలో
   చీకటి వెనుకే వెలుగు.
   తెలుగు నాట ఢిల్లీ పాదుషా రాజ్యం అంతరించలేదు.  కానీ.. బలహీనమైపోయింది.
   అదీ ఒకందుకు నయమే. తెలుగు వారి జీవితాలలో వెలుగు రాబోతోంది.
   అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
                             …………..

   బెండపూడి అన్నయమంత్రి, కొలను రుద్రమదేవుడు.. వీరిరివురు దేశాభిమానులు. చెల్లాచెదురైన హిందూ రాజులను కలిపి తెలుగునాడు విముక్తికి కృషి చేయదలచారు.
   ప్రతాపరుద్రుని నాయకులను కొందరిని సమావేశ పరచారు.
   వారిలో ముసునూరి ప్రోలానీడుని నాయకునిగా ఎన్నుకున్నారు. ఇతడు కృష్ణా మండలములోని నూజివీడుకి చెందినవాడు. ఇతని పినతండ్రి మనుమడే కాపయ నాయకుడు. పినతండ్రికి అన్నిటా చేదోడు వాదోడుగా ఉంటాడు.
   ప్రోలానీడు నాయకులనందరినీ ఒక త్రాటి మీదికి తెచ్చి, ఓరుగల్లు విముక్తికి వ్యూహములు పన్నసాగాడు. ఆ నాయకులలో అద్దంకి వేమారెడ్డి ముఖ్యుడు.
   వేమారెడ్డి, పశువుల కాపర్లు, రైతులతో పెద్ద సైన్యాన్ని సమకూర్చాడు.
   వీరి విప్లవాన్ని గూర్చి విన్న ఢిల్లీ పాదూషా తుగ్లక్, అణచి వేయడానికి ఓరుగల్లు నుండి సేనలను పంపాడు. దానికి మాలిక్ మక్బుల్ సైన్యాధికారి.
   ఈ మాలిక్ మక్బుల్ ఎవరో కాదు.. మతం మార్చుకున్న దాది గన్నమనాయుడు.. యుగంధర్. అల్లాని కొలువకపోతే చర్మం ఒలిచేస్తామన్నాడు డిల్లీ సుల్తాన్. మతం మార్చుకుని, కొన్ని యుద్ధాలలో సుల్తాన్‍కు సేనాపతిగా ఉండి.. చివరకు ఓరుగల్లుకు వచ్చాడు.
   అతను మాలిక్ కాఫర్ లాగా, ఖుశ్రోఖాన్ లాగా సుల్తాన్‍కి ద్రోహం చెయ్యదలచుకోలేదు. చరిత్ర గుణపాఠమయింది. మంచో చెడో జరిగింది జరిగిపోయింది. సేనానిగా ఏ సైన్యంలోనున్నా ఒక్కటే.. అటు వుంటే ముస్లిములను చంపాలి. ఇటు వుంటే హిందువులని చంపాలి.
   చేసేదొకటే.. చంపడం. ఎవరైతే నేమి..
   ముస్లిమ్ సైనికులు దండెత్తి రాగానే వారు ఆగి ఉన్న చోట నీటిని కలుషితం చేయించాడు వేమారెడ్డి. కనిపించకుండా చెట్ల చాటున దాగి దెబ్బ కొట్టసాగారు అతని సైనికులు.. అందరూ సామాన్య ప్రజలే..

          
   ముస్లిమ్ సైనికులందరికీ కడుపులు పాడయి కదల లేకపోయారు. వారందరినీ.. సేనా నాయకుడితో సహా ఓరుగల్లుకు తరిమి కొట్టారు తెలుగు వీరులు.
   ఓరుగల్లు వద్ద కాపయ నాయకుడు తుగ్లక్ సైనికులను ఎదుర్కొని, ఓరుగల్లును చేజిక్కించుకున్నాడు. తెలుగునాట తెలుగు రాజులు రాజ్యమేలనారంభించారు.

 


   అద్దంకి రాజధానిగా ప్రోలయ వేమారెడ్డి, రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు.
   యుద్ధ వాతావరణం నుండి బయటపడిన పాకనాడులో నిజమైన రాజ్యపాలన మొదలయింది.
                 
                                 ---------------

 

 

 

 

 

.....మంథా భానుమతి