TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
వినాయకుడి పెళ్లి
వినాయకుడి తమ్ముడు సుబ్రమణ్యం చాలా అందంగా ఉంటాడు. అన్నకంటే ముందు తమ్ముడి పెళ్ళే కుదిరింది. అంగరంగ వైభోగంగా జరిగింది పెళ్ళి. ఎక్కడెక్కడి దేవతలూ సుబ్రమణ్యం పెళ్ళికి విచ్చేశారు. దాన్ని చూసిన తర్వాత వినాయకుడికీ అనిపించింది- 'తనకూ పెళ్ళైతే బావుంటుంది కదా' అని. పెళ్ళి హడావుడి తగ్గే వరకూ ఆగి, ఆనక అమ్మ పార్వతి ఖాళీగా కూర్చున్నప్పుడు దగ్గరికెళ్ళి నిలబడ్డాడు- "అమ్మా! తమ్ముడి పెళ్ళి చేశావు కదా! మరి నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు?" అని అడిగేశాడు.
పాపం పార్వతమ్మ! దిగాలుగా తన ముద్దుల పెద్ద కొడుకు వైపు చూసింది. లోలోపలే బాధపడింది. "చిన్నవాడు సుబ్రమణ్యమేమో ఎంతో అందంగా ఉంటాడాయె! దాంతో వాళ్ళు పిలిచి పిల్లనిచ్చిరి! మరి, నువ్వేమో ఏనుగు తలతో, పొడవాటి తొండంతో ఉంటివాయె! పోనీలే అంటే, మేం ఎంత చెప్పినా వినక, అందరూ పెట్టిన కుడుములూ ఉండ్రాళ్ళు,వడపప్పు తిని-తిని, అందరూ పోసిన పానకం తాగి-తాగి బొజ్జ పెంచావాయె ! నీకు పిల్లనిస్తామని ఇప్పుడు ఎవరూ ముందుకు రావట్లేదు కద నాన్నా!" అని మనస్సులోనే బాధపడింది.
అయినా ఈ సంగతి పిల్లవాడికి ఎట్లా చెబుతుంది; చిన్నబుచ్చుకుంటాడు గదా. అందుకని పైకి ఏమన్నదంటే- "మరేఁ బాబూ! నువ్వెళ్ళి, పెళ్ళికూతురి కోసం ఒక కొత్త కోక, మంగళ సూత్రాలూ పట్టుకు రా నాయనా! నేనేమో ఈలోగా పిల్లను చూస్తాను" అని బుజ్జగించి పంపేసి, ఊపిరి పీల్చుకున్నది- "అమ్మయ్య! ఇప్పటికైతే సమస్య తప్పింది!" అనుకుంటూ. అయితే వినాయకుడికి ఇదేమీ తెలీదు కదా; వెంటనే ఆనందంగా తన ఎలుక వాహనమెక్కి, భూలోకానికి వచ్చేశాడు. వచ్చి అలసిపోయి, ఒక చెట్టు క్రిందున్న అరుగు మీద కూర్చున్నాడు. ఆ అరుగు చుట్టూతా ఏవేవో గింజలు పడి ఉన్నాయట. ఆ సమయంలో అక్కడి గింజలు ఏరుకు తినేందుకు అక్కడికి ఒక కోడిపుంజు వచ్చింది.
వినాయకుడు దాన్ని చూసి "ఓ కోడిపుంజూ! ఒక సారి ఇలా రా!" అని పిలవగానే , 'నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరా?'అని దగ్గగకొచ్చింది కోడిపుంజు. చూడగా, అక్కడ అరుగు మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు! దాంతో అది సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ గభాల్న దగ్గరికి వచ్చి, రెక్కలు మడిచి నమస్కరిస్తూ "చెప్పండి స్వామీ! కులాసానా? నన్ను పిలిచా-రెందుకూ?" అని అడిగింది.
"ఓహో, కోడిపుంజూ! నీ రెక్కలు ఎంత అందంగా ఉన్నాయ్! నీజుట్టు కిరీటంలాగా ఎంత బావుంది! నువ్వు చెప్పిన పనల్లా చాలా చక్కగా చేస్తావనీ, సమయ పాలన అంటే ఏంటో నీనుండే నేర్చుకోవాలనీ అందరూ చెబుతుంటారు! మరి నువ్వు నాకూ ఓ పని చేసి పెడతావా? చక చకా వెళ్ళి, నాకో కొత్త కోక తెచ్చిపెట్టు; మా అమ్మ నాకు పెళ్ళి చేస్తుందిట!"అన్నాడు. "అంత పెద్ద స్వామి తనను పొగిడాడే!" అని కోడిపుంజు చాలా సంతోషించింది. "దానిది ఏముంది స్వామీ! ఒక్క నిముషంలో పెద్ద బజారు కెళ్ళి, 'వినాయకుడి పెళ్ళికి కొత్త కోక కావాలి' అని అడిగి తెచ్చేస్తా స్వామీ! ఇక్కడున్నట్లే వచ్చేస్తాను" అని వేగంగా వెళ్ళిపోయింది కోడి! .
అంతలో అక్కడ మొలిచి ఉన్న పచ్చగడ్డిని తినేందుకు గొర్రెపోతు ఒకటి అటుగా వచ్చింది. దాన్ని చూసి వినాయకుడు బలే మురిసిపోయాడు- 'ఈరోజు అన్నీ మంచి శకునాలే! నేను తిరక్కుండానే అన్ని పనులూ ఎట్లా అయిపోతున్నాయో చూడు!" అని సంతోషపడ్డాడు. "ఓ గొర్రెపోతూ! నాకో పని చేసి పెట్టరాదూ? త్వరలో నా పెళ్ళి జరగనున్నది! దానికోసం నువ్వు కంసాలి దగ్గరికెళ్ళి మంగళ సూత్రాలు చేయించుకురా, వెంటనే వెళ్ళు!" అని చెప్పాడు.
గొర్రెపోతు "ఓహో! అట్లానా స్వామీ! అయితే మాకు పప్పన్నం దొరుకుతుందన్నమాట! ఇదిగో! ఇప్పుడేవెళ్ళి తెస్తాను. అదెంతలోకి!మీరడిగారని చెప్పి ఇప్పుడే కంసాలి దగ్గరికి వెళ్ళి పట్టుకు వచ్చేస్తాను చూడండి!" అంటూ వెళ్ళింది. వినాయకుడు అక్కడే ఓ కునుకు తీసాడు. ఆయన లేచి చూసేసరికి సాయంకాల-మైంది. పోయిన వాళ్ళు ఇద్దరూ ఇంకా తిరిగి రాలేదు! ఇక దాంతో వినాయకుడే మెల్లిగా ఎలుక వాహనం ఎక్కి బయల్దేరాడు- ఇద్దర్నీ వెతుక్కుంటూ.
కొంతదూరం వెళ్ళే సరికి కోడిపుంజు కనిపించింది. "ఏమే, కోడిపుంజూ ! నా కొత్త కోక ఎక్కడ?" అని అడిగాడు దాన్ని. అదన్నది- "స్వామీ! మీకోసం కొత్త కోక తీసుకు వస్తున్నానా, అంతలో అక్కడ నాకు ఒక జొన్నకంకి కనిపించింది. దాన్ని చూడగానే విపరీతంగా ఆకలేసింది. 'ఒక్క కంకి తినేసి వద్దాం' అని మీ కొత్త కోకను పక్కన పెట్టి, కంకి తినేసి వచ్చాను- చూస్తునుగదా, కోక లేదు! దాంతో ఇక మధ్యాహ్నం నుండీ దాన్నే వెతుకుతూ తిరుగుతూ ఉన్నానయ్యా" అని.
వినాయకుడన్నాడు- "చూడు కోడిపుంజూ, నువ్వు కొత్త కోక తీసుకువస్తేనే నా పెళ్ళి! అందుకని త్వరగా వెళ్ళి వెతుక్కు రా! లేకపోతే ఎలుక చేత నిన్ను కొరికించేస్తా, జాగ్రత్త!" అని బెదిరించాడు. దాంతో కోడిపుంజు 'కొత్తకోకో'అని అరుచుకుంటూ, ఆ కొత్తకోక కోసం ఈనాటికీ వెతుకుతూనే ఉంది, పాపం! ఆ అరుపేనట, మనకు 'కొక్కొరోకో' అని వినబడేది!
కోడిపుంజు కోక తేకపోయేసరికి, 'ఇక సరేలే' అని వినాయకుడు గొర్రెను వెతుకుతూ ఆ బజారూ ఈ బజారూ తిరిగాడట. అనుకున్నట్లుగానే, గొర్రెపోతు ఎదురైంది. స్వామి కోపంగా "ఏయ్ గొర్రెపోతూ! నా తాళి బొట్టెక్కడ?" అనగానే, అది వణికిపోతూ "స్వామీ! తమరు అడిగారని చెప్పగానే కంసాలి కనకయ్య తాళిబొట్టు చేసి ఇచ్చేశాడు; ఆ తర్వాత వస్తూ వస్తూంటే నాకు ఆకలేసింది; ఆ సజ్జచేలో గడ్డి తింటూ ఒక్క క్షణం ఏమారాను- అంతలోనే ఎవరో ఆ తాళిబొట్టు కాజేశారయ్యా" అని భయపడుతూ చెప్పింది గొర్రెపోతు. వినాయకునికి మహా కోపం వచ్చేసింది. "నువ్వు త్వరగా వెతికి తెచ్చివ్వు. నా పెళ్ళి జరగాలంటే ఆ తాళి కావాల్సిందే!" అనేశాడు హుంకరిస్తూ.
"అట్టాగే స్వామీ!" అని గొర్రెపోతు పాపం, ఆనాటి నుండీ ఈనాటి వరకూ వంచిన తల ఎత్తకుండా ఆ తాళిబొట్టు కోసం వెతుకుతూనే ఉంది. అయినా ఏం చేస్తాం, ఈరోజు వరకూ కూడా అటు తాళిబొట్టు కాని, ఇటు కొత్తకోక గానీ రానే లేదు! దాంతో మరి వినాయకుడి పెళ్ళి జరగనే లేదు. పైపెచ్చు 'వినాయకుని పెళ్ళికి వెయ్యి విఘ్నాలు’ అన్న సామెత పుట్టింది.
మరి మీకేమైనా కొత్తకోక గానీ తాళిబొట్టు కానీ దొరికితే తెచ్చివ్వండేం! అప్పుడు జరిగే వినాయకుడి పెళ్ళికి మనమూ వెళ్లచ్చు; కావల్సినన్ని కుడుములూ ఉండ్రాళ్ళూ బలేగా తినచ్చు!
కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో