Facebook Twitter
వెంకటరమణీయం

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌థ‌ల పోటీలో క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి రూ. 516 గెలుపొందిన క‌థ 


 


‘‘మూడు రోజ్నుంచీ చావబాదుతున్నావ్‌.. నీకిదేమన్నా న్యాయంగా వుందా?’’ నీరసంగా అడుగుతున్నాడు మా బాస్‌గారు మేడంబాస్‌గారిని.

ఆవిడ విలాసంగా కాలు మీద కాలేస్కుని కూచుని... ‘‘పురుషుండు, గార్దభమునున్‌ స్థిరమగు దండనములేక చెడిపోవుదురిలన్‌... కరుణ దంపక నెలకొక పరిమైనం గొట్టవలయు పత్ని పురుషునన్‌...’’ పద్యం చెప్పి నిన్ను కొట్టడంలో తప్పు లేదన్నట్లు చూసింది.

‘‘ఆ! మహా చెప్పావులే గొప్ప. పెళ్లాన్నీ పేడతట్టనీ వారానికోసారి దులపమన్నారు పెద్దలు. నేనెప్పుడన్నా కొట్టానా...?’’ ఏడుపు ఆపుకుంటూ అన్నాడాయన.

‘‘ఆపండి మీ ఏడుపుగొట్టు వేషాలు. ఒట్టి నంగనాచి తుంగబుర్రవి మరి. అసలు నువ్వు చేసిన పనికి...’’ కోపం ఆపుకోలేక చీపురుకట్ట విసిరిందాయన మీదకు. 

‘‘ఇప్పటికి మూడు చీపురుకట్టలు విరిగినై మూడు రోజులల్ల. ఇంకా ఎన్ని విరిగితే సారుకు విముక్తి వస్తుందో పాపం..!’’ బైట నిలబడి సానుభూతి చూపిస్తూ కళ్లు వత్తుకుంది నా పెళ్లాం.

మా యజమాని గారింట్లో ఇంటి మనిషిలాంటి పనిమనిషి తను. నేనేమో ఆఫీసులోనూ, ఇంట్లోనూ అయ్యగారికి అనుంగుబంటుని. బండికి చోదకున్నీ... అంటే డ్రైవర్‌గిరీ కూడా నాదే. అసలు మా అయ్యగారికి ఈ దురవస్థ రావడానికి ఒక రకంగా నా అజ్ఞానమే కారణమేమో. గత ఇరవై రోజులుగా జరిగిందంతా నాకు సినిమా రీలులాగా రింగా... రింగా... రింగా...

*

అయ్యగారూ నేనూ మామూలుగానే ఆఫీసుకెళ్లాం. వెళ్లగానే ఆఫీసు రూం టేబుళ్లు, కుర్చీలు తుడిచి అయ్యగారిని సుఖాసీనులను చేయడం నా విధి. అంతలోనే మోగింది ల్యాండ్ లైన్ ఫోన్‌.

‘‘హలో! హలో!’’ మామూలుగా మా బాస్‌ అరచినట్లే మాట్లాడుతాడు. 

అవతలి వారెవరోగానీ మళ్లీ... ‘‘హలో! హలో!’’ అన్నారు తీయగా.

టేబుల్‌ మీద కాగితాలూ, ఫైళ్లూ సర్దుతూ దుమ్ము తుడుస్తున్న నాకు అవతలి వారి గొంతు లీలగా వినిపిస్తూనే ఉంది.

‘‘హలో! కల్యాణ్ గారున్నారాండి’’ దీర్ఘంగా, తీయగా, మూలుగులాగా అదేంటో సన్నగా వినిపిస్తోందా గొంతు. 

మా బాస్‌ సీట్‌లో కాస్త నిటారుగా కూర్చుని... ‘‘కల్యాణగారా! ఆ పేరుతో ఎవరూ లేరండిక్కడ’’ అన్నాడు.

అవతలి వారు ఆడవారైనందుకేమో అంత మర్యాద! లేకపోతే, మా అయ్యగారికి ల్యాండ్‌లైన్‌ ఫోనంటేనే చిరాకు. బాస్‌గారు ఆశ్వమేధ యాగాలకు వెళ్తున్న సంగతిని మేడంగారు కనిపెట్టి... నిఘా కోసం పెట్టిందా ల్యాండ్‌లైన్‌. ఎప్పుడు ఫోన్‌ చేసినా సీట్లో ఉండాల్సిందే. లేకపోతే, లక్షలకు లక్షలు తగలేసినందుకు ఆవిడ చేతిలో పిండికొట్టబడిన చరిత్ర మా అయ్యగారిది. అలవాటుగా పదకొండున్నరకు కాంటిన్‌ నుండి టీ తెచ్చి కప్పులో పోసి బాస్‌కిద్దామని లోపలికెళ్లానా... ఇంకా ల్యాండ్‌లైన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. ఇందాకటి గొంతే తీయగా, ముద్దగా. ఆనందిస్తూ ఆరాలు తీస్తున్నాడీయన ఇవతల్నుంచి.

‘‘మీరేం చేస్తుంటారండీ...’’

‘‘ఇదివరకేదో చేసేదాన్నండీ... ప్రస్తుతానికి ఖాళీ’’ చెప్పిందా స్వరం.

ఎంత ల్యాండ్‌లైన్‌ అయినా నావి పాముచెవులని మా బాస్‌కి తెలుసు. అందుకే నన్ను బైటికి వెళ్లమన్నాడు. అయినా అవతలి వాళ్లేం మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి ఇవతలి వాళ్ల హావభావాలు చూస్తే సరిపోదా? ఎన్నిసార్లు అమ్మగారితో తిట్లు తిని అవి జీర్ణంకాక ఇక్కడీయన మా మీద అరచి శాంతి చేసుకోలేదూ! మరో అరగంటకు విజిటర్స్‌ ఎవరో వస్తే స్లిప్‌ తీసుకుని లోపలికెళ్లాను చూపిద్దామని. ఇంకా ల్యాండ్‌లైన్లోనే ఉన్నాడాయన. అవతలి వారెవరో జీవితచరిత్ర చెప్తున్నట్టు. ఇవతల ఈయన భక్తిగా మూలుగుతూ వింటున్నాడు.

కాసేపయ్యాక పిలుస్తానని చెప్పమన్నాడు. కానీ గంటసేపటి తర్వాత బెల్లు కొట్టాడు. వాళ్లను పిల‌వమని పీలగొంతుతో చెప్పాడు. ఎంత రాంగ్‌ కాల్‌ ఫోనైనా రెండు గంటలు ఏకబిగిన మాట్లాడితే అల్సి పోరామరి!

మధ్నాహ్నం భోజనం ముగించి లేస్తుంటే మళ్లీ మోగిందా ల్యాండ్‌లైన్‌.

‘‘హలో...’’ అంది తీయగా.

‘‘హలో... మీరేనా... చెప్పండి’’ మళ్లీ చెక్కరధారకి అతుక్కుపోయాడు బాస్‌. 

అకౌంట్స్‌ చూస్తూ బుర్రవేడెక్కి కాఫీలూ, గ్రీన్‌ టీ లూ మార్చి మార్చి తాగే ఆయన ఇవ్వాళ ఆ ఊసే లేదు. గంట కొట్టడమే లేదు. ఫైళ్లు ముట్టుకోనే లేదు.
ఆఖరికి ఐదున్నరకు ఆ ఫోన్‌ వదిలి... పెదరాసి పెద్దమ్మ కథలన్ని వరసపెట్టి విన్నవాడిలాగా, ఏదో పోగొట్టుకున్నవాడిలాగా, అన్యమనస్కంగా రెండు ఫైళ్లేవో చూసి, ఇంటికి బయల్దేరాడు ఏడుగంటలకు.

*

మర్నాడు మామూలుగానే వచ్చాడాఫీస్‌కు. నేను బాటిల్‌లో వాటర్‌ నింపుతున్నా, ఫ్రిజ్‌లో పెడదామని. ల్యాండ్ లైన్ ఫోన్‌ మోగింది.

‘‘హలో! ఆ! రమణిగారా... రాత్రంత బాగా నిద్రపోయారా. మీ బాధంతా విన్నందుకేమో నేను మాత్రం పడుకోలేక పోయాను. ఎనీ హావ్‌! ఇప్పుడెలా ఉంది మీకు? జలుబు తగ్గిందా?’’

మళ్లీ మొదలైంది. అవతలి తేనె ఊటలూ... ఇవతల చప్పరింతలూ. ఈ రోజూ గడిచింది నిన్నటిలాగే.

ముచ్చటగా మూడో రోజు.

ఆఫీసుకు రాగానే నన్ను పిలిచి ఒక చెక్కు నాచేతికిచ్చి... ఫలానా ఎకౌంట్‌లో వేయమన్నాడు. పేరు చూస్తే... వెంకటరమణ.. యాభైవేలు... 
నాకు తెలిసి మా కంపెనీ రిటైల్‌ డీలర్‌లలో వెంకటరమణ పేరు ఎవరికీ లేదు. ఒకవేళ ఉన్నా రిటైల్ డీల‌ర్‌ మా కంపెనీకి పెద్దమొత్తాలు కడితే... మేము చిన్నమొత్తాలు కమీషన్‌గా ఇస్తుంటాం. ఏదో కీడు శంకిస్తున్నా పని పూర్తి చేసుకొని ఆఫీస్‌కు వస్తే అయ్యగారప్పటికీ రిసీవర్‌కూ చెవికీ ముడేసుకున్నారు. మధ్యాహ్నం లంచ్‌ టైంకి మాట్లాడ్డం ఆపి తినడానిక్కూర్చున్నాడు.

అప్పుడు మోగింది ఫోన్‌, అమ్మగారి నుండి. ‘అదే పనిగా ఫోన్‌ ఎంగేజ్‌ వస్తోందీ. ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నార‘ని ఆరాలు తీసింది. బిగుసుకుపోయాడీ మహానుభావుడు. తిట్లు తిని పెట్టేసాడప్పటికి.

మళ్లీ మూడు గంటకు మోగిందా ల్యాండ్‌లైన్‌.

‘‘హలో... రమణిగారూ... నా సెల్‌ నంబర్‌ చెప్తా. రాస్కోండి’’

సెల్‌ఫోన్‌లో మొదలైందింక తేనె ఊట.

మరుసటి రోజు మధ్యాహ్నం ల్యాండ్‌లైన్‌ మోగింది. మా బాసయ్యగారు సెల్‌ఫోన్లో వగలుపోతున్నాడయ్యె. ‘‘ఐ విల్‌ మీట్‌ యూ, వెరీ షార్ట్‌లీ’’ అనుకుంటూ...

ఇంక తప్పదని నేను ఫోనెత్తాను. అమ్మగారు... అయ్యగారి సెల్‌ ఎంగేజొస్తుందేమని.

రిసీవర్‌ ఆయనకిచ్చాను. ‘‘ఇప్పుడే... ఇప్పుడే... డియర్‌. ఫ్రెండ్‌ చాలా రోజుల తర్వాత ఫోన్‌ చేస్తేనూ...’’ బుకాయిస్తున్నాడు.

మరో నాలుగు రోజులూ ఇదే తంతు. మొత్తం వారం దాటింది ఈ రాంగ్‌ కాల్‌ కనెక్టయ్యి. ఇద్దరు మనుషులు ఎడతెగకుండా వారంపాటు మాట్లాడుకుంటే ఎన్ని అబద్ధాలు చెప్పుకొని ఉంటారూ... బడాయికాకపోతే...

ముచ్చటగా మరో మూడు రోజుల తర్వాత మరో లక్ష రూపాయల చెక్కు రాసి చేతికిచ్చాడు. మళ్లీ అదే పేరు... వెంకటరమణ. బ్యాంకులో వేసొచ్చాను కానీ... ఈ వెంకటరమణకు, ఆ రమణికీ ఏదో సంబంధం ఉందనిపించింది. అమ్మగారి దృష్టిలో పెట్టాలా... అనిపించిందొకసారి. అర్థమో, అనర్థమో ఎందుకైనా మంచిది వేచిచూస్తేనే మంచిదని సరిపెట్టుకున్నానారోజుకు.

మరుసటి రోజు ఫోన్లు... తేనె ఊటలూ. ఈయనగారి సొల్లు.

‘‘ఉయ్‌ విల్‌ మీట్‌ టుడే ఈవెనింగ్‌. ఇహి... హిహి...’’

సాయంత్రం తొందరగా బయల్దేరి ఒక రెస్టారెంట్‌కు పోనివ్వమన్నాడు. ఒక్కడే ఒక టేబుల్‌ దగ్గర కూచుని ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లు దిక్కులు చూసి చూసి చివరికి ఒక్కడే వచ్చి కార్లో కూచున్నాడు.

మళ్లీ సెల్‌ఫోన్లో సొల్లు, ‘‘రాలేదేం డియర్‌... ఓహో... ఓహో... పర్లేదు... వుయ్‌ విల్‌ మీట్‌ అనెదర్‌ టైం. హి... హి... హి...’’

మరో రెండు రోజు తర్వాత అయ్యగారు రాంగ్‌ కాల్‌ రమణికి కనెక్టయ్యి ఉండగా ఇంటి నుండి అమ్మగారి ఫోన్‌... ఎవరితో అదే పనిగా ఫోన్లో మాట్లాడుతున్నారనీ. ఎంత ప్రయత్నం చేసినా కంపెనీ వాళ్లకి ఫోన్లో దొరకట్లేదట ఎందుకనీ? వాళ్లకు పంపాల్సిన చెక్కును బ్యాంకులో ఎందుకు జమ చేయలేదనీ? వాళ్లు ఇంక ఆగలేక అమ్మగారికి ఫోన్‌ చేశారనీ... అరచి కరిచేసింది.

దుమ్ము దులపటం అయిపోయాక ఆ పూట మాత్రం బుద్ధిగా ఎకౌంట్స్‌ చూసి కంపెనీకి జమ చేయాల్సిన డబ్బులో ల‌క్షన్నర తగ్గినా... ‘‘ఐ విల్‌ అరేంజ్‌ సూన్‌... హి... హి... హి...’’ అని చెప్పి సర్దుకున్నాడప్పటికి.

*

తెల్లారిన్నుండి అయ్యగారి వంకరతోక... ల్యాండ్‌లైన్‌ నుండి రాంగ్‌కాల్‌ రమణమ్మకు తగులుకుండు. అమ్మగారు మధ్యాహ్నం సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేసి, ల్యాండ్‌ లైన్‌కు అదే పనిగా ఎందుకు తగులుకున్నావంది? ఒకసారి నాతో మాట్లాడించుకొని అర్జంటుగా ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ను శుభ్రంగా కడిగెయ్యమంది కోపంగా.
కనెక్షన్‌ తీసి మూలకు ఉంచిన బకెట్‌ నీళ్లలో పడేసానాఫోన్‌ని.

ఖిన్నుడయిపోయి చూస్తున్నారు అయ్యగారు. కిక్కురుమనలేదు. ముభావంగా కారెక్కారు. మధ్యలో రోడ్డు పక్కన కారాపమని, ఒక చెట్టుకింద చేరగిలపడి సెల్‌ఫోన్‌లో తీయగా మాట్లాడే వారి బాధలన్నీ విన్నాడేమో... పొద్దున్నే ఆఫీస్‌కు రాగానే మరో లక్షన్నర చెక్కు రాసిచ్చి బ్యాంకుకు పొమ్మన్నాడు.
నేను బ్యాంకుకు పోలేదు. చక్కగ ఇంటికొచ్చి అమ్మగారికిచ్చిన ఆ చెక్కును. 

అదిగో అప్పటి నుండి అయ్యగారీ గదిలో బందీ అయ్యి.... మూడు చీపుర్లూ విరిగేటన్ని తన్నులు తింటున్నారు, మూడు రోజులుగా. రింగా... రింగా... రింగులై పోయినయి.

*

అమ్మగారూ... అమ్మగారూ... నా పెండ్లాం పరిగెత్తుకొస్తుంది ఈ మూల స్టోర్‌ రూం దగ్గరికి.

‘‘అయ్యగారికి ఫోన్‌ వస్తుంది. ‘హలో’ అంటున్నరు తీయగా. ఎవరని దబాయిస్తే పెట్టేస్తున్నరు’’ అని చెప్పింది.

ఎట్లా పట్టుకోవాలి ఈ రాంగ్‌కాల్‌ రమణినీ అని ఆలోచించి, అమ్మగారు వాళ్ల చెల్లెలి కొడుకు గోపిని పిలిపించింది. విషయమంతా గోపీబాబుకు చెప్పి, భర్త చేసిన నిర్వాకం బైట పెట్టుకొని రాంగ్‌కాల్‌ రమణిని వేటాడమని వేడుకొంది.

మూడు రోజుల తర్వాత గోపిబాబు ఇంటికొస్తూనే అమ్మగారిని తీసుకొని డాబా మీదకెళ్లాడు. అయ్యగారి సెల్‌ఫోన్‌తో రాంగ్‌కాల్‌ రమణికి ఫోన్‌ కలిపి ఫోన్‌ను అమ్మగారి చెవికి ఆనించి వాటర్‌టాంక్‌ వెనక నిలబడమన్నాడు.

పక్కింటి డాబా మీద పెంట్‌హౌస్‌లో రెంట్‌కు ఉండే ఇద్దరు కుర్రాళ్లలో ఒకడు ఓరగా వీళ్ల డాబా మీదకు చూస్తూ ఆడగొంతుతో మెల్లగా, తీయగా ‘‘హలో’’ అన్నాడు.

‘‘హలో...’’ తియ్యగా.

ఇంకా తియ్యగా ‘‘హలో...’’

అర్థమైపోయింది అందరికీ.

కాసేపటికి పక్కింటి ఓనర్‌గారి హాల్లో అందరం కలిసి పైన పెంట్‌హౌస్‌ రెంట్‌ కుర్రాళ్లని పిలిపించాం.

'ఏంటి బాబూ ఈ మోసం?' అని కడిగేయబోయింది అమ్మగారు. వాళ్లు ఏమాత్రం తొణక్కుండా, బెణక్కుండా ‘‘ఆంటీ! లాస్ట్‌మంత్‌ మా చెల్లెలు మా దగ్గర నాలుగు రోజులుందామని ఊర్నొండొచ్చింది. మీ వారు వాకింగ్‌ వంకతో డాబా మీదకొచ్చి మా చెల్లిని తినేసేలాగా చూడ్డం... మొక్కకు నీళ్లు పోసే వంకతో పైపుతో మా చెల్లి మీద నీళ్లు పోయడం లాంటి వికృతాలు చేసాడు. అందుకే మీ ఆయన్ని ఒక ఆట ఆడిద్దామని రమణి పేరుతో మిమిక్రీ చేశా. బై ది బై నా పేరు వెంకటరమణ. వచ్చీ పోయే ప్రయివేట్‌ ఉద్యోగాలకు గాలం వేసే నిరుద్యోగులం’’ చెప్పుకొచ్చాడతను.

‘‘మరి వెంకటరమణ పేరుతో డబ్బు గుంజారుగా...’’ ఆవేశపడ్డాడు గోపీబాబు.

‘‘నిజమే. డబ్బు తీసుకున్నాం. అసలు వెంకటరమణ అనే పేరులోనే మహత్తుంది. ఆడో... మగో... తెలియకుండా ఆట ఆడిస్తుందాపేరు. ముందు మీరు స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్‌ చేయండి. మేమొచ్చి లొంగిపోతాం’’ అన్నారు నిశ్చయంగా. 

ఆ స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ మా అమ్మగారికి అయ్యగారికి ఏకైక సంతానం... అమ్మాయిగారి మొగుడుగారు.

అయ్యో! చెప్పకూడని చోట పుండు. అల్లుడు వైద్యుడు అంటే ఇదేనేమో. లబలబ లాడుకుంటూ ఇంట్లోకొచ్చిన అమ్మగారు... అయ్యగారిని ఇంకో రెండు చీపుర్లు విరిగేదాకా కొట్టారని సవివరంగా చెప్పనవసరం లేదనుకుంటా.

రంగా... రంగా... అంతా వెంకటరమణీయం. వెంకటరమణా... గోవిందా! సంకట హరణా... గోవిందా!!
 

- కోట్ల వ‌న‌జాత‌