Facebook Twitter
ఆధునిక నవలకు ఆరంభం – Ulysses

 

ఆధునిక నవలకు ఆరంభం – Ulysses

 

 

 

ఇంగ్లిష్లో నవలలు రావడం మొదలై దాదాపు 400 సంవత్సరాలు గడుస్తోంది. కానీ అవన్నీ మన రోజువారీ జీవితంలో జరిగే సంఘటనల గురించో, సాహసాల గురించో రాసినవే! మనిషి మనసులో లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం చాలా అరుదుగా జరిగింది. మనిషి ఆలోచనలనీ, ప్రవర్తననీ విశ్లేషించే ప్రయత్నం ఏ నవలలోనూ కనిపించదు. ఆ లోటుని భర్తీ చేసిన మొదటి పుస్తకమే... యులిసీస్ (Ulysses).

జేమ్స్ జోయ్స్ అని ఓ ఐర్లండ్ రచయిత ఉండేవాడు. చిన్నకథలు, కవితలు, నాటకాలు రాయడంలో ఆయన దిట్ట. సంగీతం చెబుతూ, చదువు నేర్పుతూ, పాటలు పాడుతూ జీవితాన్ని నెట్టుకొచ్చేవాడు. ఒక్కచోట కూడా నిలకడగా ఉండకుండా ప్రపంచం అంతా తిరుగుతూ ఉండేవాడు. అలాంటి జేమ్స్ జోయ్స్కి వచ్చిన ఆలోచనే యులిసీస్ నవల. ఈ నవలలో ప్రధాన నాయకుడు Leopold Bloom. ఆ బ్లూమ్ అనే ఆయన జీవితంలోని ఒక్క రోజులో జరిగే సంఘటనలతోనే యులిసీస్ నడుస్తుంది.

Leopold Bloom ఒక సాదాసీదా యూదుడు. ఐర్లండ్ రాజధాని డబ్లిన్లో ఓ చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు.  16 June 1904న ఆయన జీవితంలో జరిగిన ఘటనలే యులిసీస్ నవలలో కనిపిస్తాయి. స్నేహితునితో వాదన, స్త్రీల పట్ల ఆకర్షణ చెందడం, లేనిపోని గొడవల్లో ఇరుక్కోవడం, అంత్యక్రియలకు హాజరు కావడం, హోటల్కి వెళ్లడం... లాంటి సందర్భాల దగ్గర్నుంచీ తన భార్య వేరొకరితో ప్రేమలో ఉందని తెలుసుకోవడం వరకూ ఈ రోజు అనేకమైన విషయాలు జరుగుతాయి. పైన చెప్పుకొన్న విషయాలన్నీ బహుశా చాలామంది జీవితాల్లో జరిగేవే! కానీ ఆయా ఘటనలని వివరిస్తూనే వాటి వెనుక అంతర్లీనంగా సాగే ఆలోచనలని పేర్కొనడమే యులిసీస్లో ప్రత్యేకతగా నిలుస్తుంది. ఆ వివరణ వల్లే ఈ కథ 700 పేజీలకు పైగా సాగే భారీ నవలగా మారింది. గ్రీకు రచయిత హోమర్ రాసిన ఒడీసే కావ్యం, యులిసీస్ నవలకు ప్రేరణగా చెబుతారు. పాత ఇతివృత్తాన్ని తీసుకుని ఇప్పటి సమాజానికి అనుగుణంగా రాయడం వల్ల కూడా యులిసీస్ను గొప్ప ప్రయోగంగా భావిస్తుంటారు.

యులిసీస్ నవలలో ప్రతి పాత్రా, ప్రతి సంఘటనా, ప్రతి సంభాషణా ఏదో ఒక తత్వానికి ప్రతీకగా సాగుతుంది. బ్లూమ్ ఒక సగటు మనిషికి ప్రతినిధిగా నిలిస్తే... అతని స్నేహితుడు స్టీఫెన్ బాధ్యతారాహిత్యానికీ, స్వార్థానికీ, ఆత్మన్యూనతకీ ప్రతీకగా కనిపిస్తాడు. విధి, చావు, ప్రేమ లాంటి ఎన్నో అంశాలు యులిసీస్లో అడుగడుగునా చర్చకి వస్తాయి. యులిసీస్ మొదటి ఓ ధారావాహికగా వెలువడింది. ఆ తర్వాత దీన్ని నవలారూపంలో ప్రచురించారు. యులిసీస్ను నవలగా ప్రచురించీ ప్రచురించగానే ఓ సంచలనంగా మారిపోయింది. అప్పటి వరకూ ఉన్న ప్రేమకథలు, సాహసగాథలకు భిన్నంగా మనస్తత్వ విశ్లేషణతో సాగిన ఈ నవల ఆంగ్ల సాహిత్యంలో మైలురాయిగా నిలిచింది. ఓ సరికొత్త ప్రయోగంగా కొందరు దీనిని తలకెత్తుకుంటే, ఏమాత్రం అర్థం కాని గందరగోళం అంటూ మరికొందరు పెదవి విరిచారు. మొత్తానికి ఓ సరికొత్త అనుభవం కోసం చదివితీరాల్సిన పుస్తకంగా అందరూ ఒప్పేసుకున్నారు. ఇందులోని కొన్ని ఘట్టాలు మరీ అసభ్యంగా ఉన్నాయంటూ అమెరికాలో యులిసీస్ నవలను నిషేదించారు. ఎవరేమన్నా ఆంగ్లసాహిత్యంలో ఒక కొత్త ఒరవడికి మాత్రం యులిసీస్ దారితీసింది. అందుకే సాహిత్యాభిమానులు ఇప్పటికీ యులిసీస్లో పేర్కొన్న జూన 16వ తేదీని కథానాయకుడు బ్లూమ్ పేరు మీదుగా Bloomsday గా జరుపుకొంటారు.

- నిర్జర.