Facebook Twitter
తెలుగువాడి జీవితాన్ని కళ్లకు కట్టిన – కాశీయాత్ర చరిత్ర

తెలుగువాడి జీవితాన్ని కళ్లకు కట్టిన – కాశీయాత్ర చరిత్ర

 

 

ఒకే ఒక్క పుస్తకంతో సాహిత్య చరిత్రలో నిలిచిపోవడం సాధ్యమేనా అంటే సాధ్యమే! ఆ పుస్తకం అత్యద్భుతమైనదో, అరుదైనదో అయినప్పుడు పాఠకులు దాన్ని తలకెత్తుకోవడమే కాదు, ఆ పుస్తక రచయితను కూడా చిరకాలం తల్చుకుంటారు. అలాంటి అరుదైన పుస్తకం ‘కాశీయాత్ర చరిత్ర’. ఆ పుస్తకాన్ని రాసిన రచయిత ఏనుగుల వీరాస్వామయ్య!

మానవ చరిత్రలో యాత్రాసాహిత్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం. ఇన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా మనం ఇంకా హుయాన్‌త్సాంగ్, మార్కోపోలో వంటి యాత్రికులని తల్చుకుంటున్నామంటే... కారణం వారు వదలివెళ్లిన స్మృతులే! రుద్రమదేవి వీరత్వం దగ్గర్నుంచీ కృష్ణదేవరాయల గొప్పదనం వరకూ లోకానికి తెలిసింది ఇలాంటి యాత్రా సాహిత్యం వల్లనే! అందుకనే తెలుగులో తొలి యాత్రాగ్రంథంగా పేరొందిన కాశీయాత్ర చరిత్ర గురించి ఇప్పుడు ఇంతగా చెప్పుకొంటున్నాం.

 

ఏనుగుల వీరాస్వామయ్య వ్యక్తిగత జీవితం గురించి తెలిసింది చాలా తక్కువే! అది కూడా ఆయన తన గ్రంథంలో పేర్కొన్న విషయాల ద్వారా, ఆ గ్రంథానికి రాసిన పీఠికల ద్వారా తెలుస్తోంది. వీరాస్వామయ్య 1780 ప్రాంతంలో చెన్నైలో జన్మించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోయినా, కష్టపడి పైకి వచ్చారు. ఇటు హిందూ ధార్మిక గ్రంథాలతోనూ, అటు ఆంగ్లంలోనూ పట్టుసాధించడంతో... బ్రిటిష్‌ అధికారుల వద్ద ట్రాన్స్‌లేటర్‌గా ఉద్యోగం సంపాదించారు.

ఆంగ్లేయులు వేషబాషలు, సంప్రదాయాలు మన దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు వారికి మన దేశాన్ని ఏలేందుకు ఇక్కడి ధర్మసూక్ష్మాలు, ఆచారవ్యవహారాల గురించి ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలి. వీరాస్వామయ్య వంటి ట్రాన్స్‌లేటర్ల ద్వారానే ఈ సమస్యని అధిగమించగలిగేవారు. అందుకనే వీరాస్వామయ్యకి మంచి పలుకుబడి ఉండేది. ఆ పలుకుబడితోనే ఆయన కాశీయాత్రిను సాగించ తలపెట్టారు. 1830 మే 18వ తేదీన మొదలైన ఆయన కాశీయాత్ర సరిగ్గా 15 నెలల 15 రోజులపాటు సాగింది.

వీరాస్వామయ్యగారు వందమందికి పైగా పరివార జనాన్ని తీసుకుని ధూంధాంగా కాశీకి బయల్దేరారు. ఆ రోజుల్లో ఇప్పటిలా రైళ్లు, మోటర్‌ వాహనాలు ఎలాగూ లేవు... కనీసం ఎక్కడికక్కడ వంతెనలు కూడా ఉండేవి కాదు! ఇక రోడ్ల సంగతి చెప్పేదేముంది. నడవడానికి కాస్త వీలుగా ఉన్న బాటను ‘బాటసరాళం’ అని పిలిచి అదే పూలపాన్పుగా భావించి నడిచిపోయేవారు. వీరాస్వామయ్య పరివారం ఈ బాటసరాళం మీద నడుస్తూ, అవసరమైన చోట పడవల సాయంతో నదులను దాటుతూ, అడవులగుండా ప్రయాణం చేస్తూ తన యాత్ర సాగించింది. ఎక్కడికక్కడ సత్రాలలోనో, గుడారాలు వేసుకునో బస చేసింది.

ఒంటిమిట్ట, తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, ప్రయాగ, గయ వంటి పుణ్యక్షేత్రాలెన్నో చూసుకుంటూ వీరాస్వామయ్య తన యాత్రను సాగించారు. దారిలో కోల్‌కతా, హైదరాబాదు వంటి మహానగరాలనూ దాటుకుని వెళ్లారు. ఆనాటి బ్రిటిష్‌ పాలనకు కేంద్రాలుగా ఉన్న మచిలీపట్నం వంటి ప్రదేశాలను దర్శించారు. మొత్తానికి ఆయన బృందం మద్రాసు నుంచి కాశీ వరకు ఉన్న దేశాన్ని ఒక చుట్టు చుట్టిందని చెప్పవచ్చు. ఆ అనుభవాలన్నింటినీ వీరాస్వామయ్య ఎప్పటికప్పుడు ఓ గ్రంథరూపంలో నమోదు చేయడమే అసలు విశేషం!

 

వీరాస్వామయ్య కేవలం బ్రిటిష్‌ అధికారి మాత్రమే కాదు, మహాపండితుడు. దానికి తోడు సునిశితమైన పరిశీలన కలిగినవాడు. దాంతో తను చూస్తున్న క్షేత్రాలను, అక్కడి ఆచారాలను రాస్తూనే.... వాటికి తనదైన అభిప్రాయాలను జోడించారు. ఆ కాలంలో జీవనం గురించి, వేర్వేరు ప్రాంతాల్లో ప్రజల స్వభావం, ఆయా క్షేత్ర మహత్యాల గురించీ కాశీయాత్రలో మనకి విలువైన సమాచారం ఎంతో తెలుస్తుంది. పైగా అప్పటికింకా కొన్ని ప్రదేశాలలో రాచరికం కూడా ఉంది. దాంతో ఇటు బ్రిటిష్‌ పాలకుల తీరు, స్థానిక రాజుల ప్రాభవం కూడా ఈ గ్రంథంలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.

వీరాస్వామయ్య ఓ బ్రిటిష్ అధికారి. పైగా ఆంగ్లతరహా విద్యాభ్యాసం పట్ల అభిరుచి ఉన్నవాడు. అందుకనే తన మిత్రులు శ్రీనివాస పిళ్లై, రాఘవాచార్యులతో కలిసి 1853లో హిందూ లిటరరీ సొసైటీ అనే విద్యాసంస్థను నెలకొల్పాడు. అయినప్పటికీ ఆయన గ్రంథం ఆంగ్లేయుల పక్షపాతంతోనో, హైందవ ఆచారాల పట్ల వ్యతిరేకతతోనో కనిపించదు. ఆకాలానికి వీరాస్వామయ్య అభిప్రాయాలు కాస్త ఆధునికంగానే కనిపిస్తాయి.

కాశీయాత్రచరిత్ర పుస్తకాన్ని మొట్టమొదటిసారి 1838లో ప్రచురించారు. నిజానికి వీరాస్వామయ్య తన గ్రంథాన్ని అప్పటి వ్యవహారిక భాషలోనే రాశారు. కానీ దాదాపు 200 ఏళ్లనాటి ఆ భాష మనకి ఏమంత సులువుగా అర్థం కాదు. ఎక్కడికక్కడ ఆనాటి పదాలకు అర్థవివరణ సాగినా పాఠకుడు పుస్తకంలో మమేకం అవ్వడానిక కాస్త సమయం పడుతుంది. యేను అని ఉంటే ‘నేను’ అనీ భాట అని ఉన్నది ‘బాట’ కావచ్చుననీ కొన్ని పేజీలు దాటాక కానీ ఇప్పటి పాఠకులకు అర్థం కాదు. అయినా ప్రతి తెలుగువాడూ కాస్త ఓపిక చేసుకుని చదివీతీరాల్సిన గ్రంథమిది. మన పూర్వీకులు ఎవరన్నా తన కాలంలోని విషయాలు చెబుతూ ఉంటే వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో... కాశీయాత్ర చరిత్రలోని ప్రతి పేజీ అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తొలి ముద్రణలకి సంబంధించిన కాశీయాత్ర చరిత్ర కాపీ నెట్‌లో ఉచితంగానే దొరుకుతుంది. ఓసారి ప్రయత్నించి చూడండి!

 

- నిర్జర.