TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
దయ్యం?!
రామయ్య ఒకరోజు రాత్రి భోజనం చేసాక తోటకి బయలుదేరాడు. అవి అమావాస్య రోజులు, దాంతో వెన్నెల కూడా లేదు. కొంచెం దూరం పొయే సరికి 'గాలి కొంచెం బరువెక్కిందా' అనిపించింది. దూరంగా చింత చెట్టు పైన కావచ్చు- నల్ల చీర కట్టుకొని, గజ్జెలు కట్టుకున్న కాళ్లని ఘల్లు ఘల్లున ఊపుతూ చెట్టు మీద కూర్చుని ఉన్నది ఏదో ఆకారం. రామయ్య 'అరే! ఏంటి, ఆ చప్పుడు?!' అని జాగ్రత్తగా చూసాడు. చెట్టు మీద ఏవో ప్లాస్టిక్ పేపర్లు.. మనిషంటూ ఎవరూ కనిపించలేదు. 'కానీ శబ్దం ఎలా వస్తున్నది?' తెలీలేదు. 'దయ్యం కావచ్చు!' రామయ్య భయంతోటే 'చెట్టు మీద దయ్యం నాకేం భయ్యం' అనుకుంటూ ముందుకు సాగాడు.
కాసేపటికి పెద్దకొండ వచ్చింది. కొండను చూడగానే రామయ్య ప్రాణం కూడా లేచి వచ్చింది. 'అమ్మయ్య! పెద్దకొండ వచ్చేసింది. దీన్ని దాటేస్తే చాలు మా పొలం వస్తుంది' అని సంతోషం వేసింది.
కొండ మలుపులోనే, ముళ్ల చెట్టు కింద ఓ పెళ్లి కూతురు నిలబడి ఉన్నది- 'అయినా పెళ్ళి కూతురు ఇట్లా చీకట్లో, మలుపు మీద, ముళ్లచెట్టు క్రింద ఎందుకు నిలబడి ఉంటుంది? ఈమె పెళ్ళి కూతురు కాదు- పెళ్ళి కూతురు లాంటి-'
"నన్ను కాపాడండి! మీకు పుణ్యం ఉంటుంది" అన్నదామె, అకస్మాత్తుగా. ఒక్కసారిగా వణికి పోయి, మళ్ళీ తేరుకున్నాడు రామయ్య. 'గొంతు మనిషి గొంతులాగానే ఉంది అచ్చం!' అనుకున్నాడు "పుణ్యం అంటోంది చూడు, పుణ్యం! దయ్యాలకు పుణ్యం పాపం తెలుస్తాయా?.." "నన్ను కాపాడండి! మీరెవరో మంచి వాళ్ళలా ఉన్నారు. నన్ను మీ ఇంటికి తీసుకుపొండి. ఇంట్లో దాచండి కొన్ని రోజులు! ప్లీజ్.." ప్రాధేయపడిందది.
"ఇంగ్లీషు వచ్చిన దయ్యం, చూసావా? ప్లీజ్ అంటున్నది'.. పైకి మటుకు "ఏమైందమ్మా?! ఇంత అర్థరాత్రివేళ ఇక్కడేం చేస్తున్నావు? మీది ఏ ఊరు?" అని అడిగాడు. 'మాట్లాడే దయ్యం' అని మనసులో అనుకుంటూ. దయ్యం వలవలా ఏడ్చింది. రామయ్యకు మనసు క్రుంగిపోయింది. కాళ్ళు వణికాయి. "నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. నాకేమో చదువుకోవాలని ఉంది. చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తాను. ఈ పెళ్ళి గిళ్ళి వద్దు. అందుకే నేను రాత్రికి రాత్రి పారిపోయి వచ్చాను. ఇంత వరకూ వచ్చాను గానీ, ఇప్పుడు ఏం చేయాలో తెలీక ఏడుస్తున్నాను" అన్నది.
రామయ్య ఆ దయ్యం కాళ్ల కేసి చూసాడు. పారాణి పెట్టుకొని ఉంది ఎర్రగా. కాళ్ళు కొంచెం ప్రక్కకు తిరిగి ఉన్నాయా అనిపించింది. 'దీన్ని ఎట్లా వదిలించుకోవాలి దేవుడా?' అని మనసులోనే ఆంజనేయస్వామిని తలచుకున్నాడు. మాట్లాడకుండా వెనక్కి తిరిగి ఊరివైపు అడుగులు వేసాడు. 'ఇది నా వెంట రాదు- రాదు- రాదు ఆంజనేయా! ఆంజనేయా!' అనుకుంటూ. గజ్జెల శబ్దం అతన్ని అనుసరించింది. రామయ్య వెనక్కి తిరిగి చూడకుండా గబగబా నడిచాడు. గజ్జెల శబ్దం కూడా వేగం పుంజుకున్నది.
కొద్ది సేపటికి రామయ్యకు ఒక ఐడియా వచ్చింది. 'దయ్యాలకు నిప్పు అంటే భయం!' తను అగ్గి పెట్టె తీసి, బీడీ వెలిగించుకుంటూ మెల్లగా వెనక్కి తిరిగి చూసాడు. గజ్జెల దయ్యం రెండడుగులు వెనక్కి వేసింది. అతను ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని గబగబా నడక మొదలెట్టాడు. గజ్జెల శబ్దం వెన్నంటే వస్తోంది. కొంచెం దూరంగా ఉన్నట్టుంది. ఊళ్ళోకి వచ్చాక, "ఇప్పుడింక ఇది భస్మమైపోతుంది చూడు!" అనుకుని ఆంజనేయస్వామి గుడి ముందు నిలబడి గట్టిగా మొక్కుకున్నాడు రామయ్య. గజ్జెల శబ్దం ఆగిపోయింది. గట్టిగా నవ్వుకొని, అయినా వణికే కాళ్లతో కంగారుగానే స్వామికి మళ్ళీ ఓసారి మొక్కుకొని, నడక మొదలెట్టాడు రామయ్య. మళ్ళీ మొదలైంది గజ్జెల శబ్దం. ఈసారి అది అతని ప్రక్కనే నడుస్తోంది. రామయ్యకు ఇప్పుడు తల త్రిప్పేందుకు కూడా భయం వేసింది. "ఇంట్లోకి పోవాలా, వద్దా?" అనుకున్నాడు.
నేరుగా పోలీసు కానిస్టేబుల్ వీరాస్వామి ఇంటి తలుపు తట్టాడు. "ఓ సారూ! ఓ సారూ! నేను రామయ్యని. అర్జంటుగా తలుపు తియ్యాల" అంటూ. వీరాస్వామి తలుపు తెరిచి "లోనికి రా! ఏంటి సంగతి?" అన్నాడు. "ద.. దయ్యం వచ్చింది నా వెనకనే!" గుసగుసగా చెప్పాడు రామయ్య. వీరాస్వామి టార్చి వెలుగులో చూసాడు. అవతల మూలగా నిలబడి ఉన్నది ఒక అమ్మాయి, పెళ్ళి కూతురు వేషంలో. "ఈమె దయ్యం కాదు. మనిషే. ఏదో సమస్యలో ఉన్నట్లుంది. లైటు వేస్తాను ఆగు" అని లైటు వేసాడు. "వెలుగులో మాయం ఐపోతుంది" అనుకున్న ఆ పిల్ల నిక్షేపంగా నిలబడి ఉంది అక్కడ, ముఖం అంతా కన్నీళ్ళ చారికలతో.
వీరాస్వామి ఆమెను, రామయ్యని కూడా పోలీసు స్టేషనుకు పిల్చుకెళ్ళి, కేసు నమోదు చేయించాడు. తర్వాత పోలీసుల చొరవ వల్ల ఆ అమ్మాయి తల్లిదండ్రులు, బంధువర్గం అంతా ఆమెని పై చదువులు చదివించేందుకు అంగీకరించారు. ఆ అమ్మాయిని ప్రభుత్వ హాస్టల్ లో చేర్చి, కాలేజీలో చదువుకునే ఏర్పాటు చేసాడు వీరాస్వామి. ఆరేళ్ల తర్వాత ఆ పాప పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వ అధికారి ఐనప్పుడు, వాళ్ల తల్లిదండ్రులు వచ్చి వీరాస్వామికి, రామయ్యకి ధన్యవాదాలు చెప్పుకున్నప్పుడు వాళ్లకి కలిగిన సంతోషం ఇంతా ఇంతా కాదు! "ఐనా ఇట్లా ఏ పాపకీ జరగకూడదు. నేను ఎదురయ్యాను కాబట్టి సరిపోయింది. వేరే ఏ దుర్మార్గులో ఎదురయ్యుంటే ఆ పాప గతి ఏమౌను?!" అన్నాడు రామయ్య, పోలీసు వీరాస్వామితో.
కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో