Facebook Twitter
కస్తూరి రంగ రంగ!

కస్తూరి రంగ రంగ!

 

 


కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగా
శ్రీరంగ రంగ రంగా నినుబాసి యెట్లు నేమరచుందురా॥

కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనపుడు
దేవకి గర్భమునను కృష్ణావతారుడై జన్మించెను॥

ఏడురాత్రులు ఒకటిగా ఏక రాత్రిని జేసెను
ఆదివారం పూటనూ అష్టమి దినమందు జన్మించెను॥

తలతోటి జననమైతే తనకు బహు మోసంబు వచ్చు ననుచు
యెదురుకాళ్ళను బుట్టెను ఏడుగురు దాదులను చంపెనపుడు॥

తన రెండు హస్తములతో దేవకి బాలుణ్ణి యెత్తుకొనుచు
అడ్డాలపై వేసుకు ఆ బాలు చక్కదనము చూచెను॥

వసుదేవ పుత్రుడమ్మా ఈబిడ్డ వైకుంఠవాసుడమ్మ
నవనీత చోరుడమ్మ ఈబిడ్డ నందగోపాలుడమ్మా॥

 

(ఒకవైపు శ్రీకృష్ణుని మహిమను వర్ణిస్తూ, ఆయన చేసిన సాహసాలను కీర్తిస్తూ... పిల్లలను నిద్ర పుచ్చేందుకు తల్లులు పాడే లాలి పాట ఇది. చిన్నాచితకా మార్పులతో ఈ పాట చాలా రూపాంతరాలుగా వినిపిస్తుంది. పైన కనిపించే పాట మాత్రం ప్రయాగ నరసింహ శాస్త్రి సేకరించిన ‘తెలుగు పట్టె పాటలు’ పుస్తకంలోది)