Facebook Twitter
ఇంగ్లిషుతో ఆడుకున్న శామ్యూల్‌ జాన్సన్‌

ఇంగ్లిషుతో ఆడుకున్న శామ్యూల్‌ జాన్సన్‌!

 

 


ఇవాళ కంప్యూటర్లో గూగుల్‌ హోంపేజి చూసిన ప్రతి ఒక్కరికీ ‘శామ్యూల్‌ జాన్సన్‌’ పేరుతో ఓ డూడుల్‌ కనిపించడం ఖాయం. ఇంగ్లిషులో ఓ నిఘంటువుని రూపొందించిన ఆయన 308వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్‌ ఈ డూడుల్‌ని రూపొందించింది. ఇంతకీ ఎవరీ జాన్సన్‌. ఆయన రూపొందించిన డిక్షనరీ ఎందుకంత ప్రత్యేకం.

తెలుగులో మొట్టమొదటి నిఘంటువు అనగానే బ్రౌన్‌ నిఘంటువు, సూర్యరాయాంధ్ర నిఘంటువులాంటి పుస్తకాలు ఎలాగైతే గుర్తుకువస్తాయో.... ఆంగ్లంలో మొదటి తరం నిఘంటువులలో శామ్యూల్‌ రూపొందించిన Dictionary of the English Language అంతే ప్రసిద్ధం. ఎప్పుడో 1755లోనే ఆయన ఈ నిఘంటువుని తయారుచేశారు.

శామ్యూల్‌ నిఘంటువు ఎంత ప్రత్యేకమో, ఆయన జీవితమూ అంతే విభిన్నంగా కనిపిస్తుంది. శామ్యూల్‌ 1709లో ఇంగ్లండులో జన్మించాడు. ఆయన తండ్రిది పుస్తకాల వ్యాపారం. దాంతో సహజంగానే శామ్యూల్‌ చిన్నప్పటి నుంచి పుస్తకాల మధ్యే పెరిగాడు. ఆయన చిన్నప్పుడే Scrofula అనే ఒకరకమైన క్షయ రావడంతో, శరీరం అంతా గాట్లతో నిండిపోయింది. దాంతో తనని వింతగా చూసే జనం మధ్య కాకుండా, తనని అక్కున చేర్చుకునే పుస్తకాలతోనే ఎక్కువగా స్నేహం చేసేందుకు ఆయన ఇష్టపడేవాడట.

శామ్యూల్‌ ఏకసంథాగ్రాహి ఏ విషయం విన్నా, చదివినా... ఇట్టే దాన్ని మెదడులో భద్రపర్చుకునేవాడు. సహజంగానే అలాంటి తెలివితో, చదువులోనూ బాగా రాణించసాగాడు. కానీ దురదృష్టవశాత్తూ, శామ్యూల్‌ పెరుగుతున్నకొద్దీ ఆయన తండ్రి ఆర్థికస్థితి దిగజారిపోసాగింది. దాంతో ఆక్స్‌ఫర్డులో చదువుని సైతం మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది.

ఆర్థికంగా ఎలాగైనా నిలదొక్కుకునేందుకు శామ్యూల్‌ 1737లో లండన్‌కు చేరుకున్నాడు. అక్కడ ఓ నాలుగు డబ్బుల కోసం ఆయన చేయని పనంటూ లేదు. పిల్లలకు చదువు చెప్పడం, అనువాదాలు చేయడం, కవితలు రాయడం, పత్రికలు వ్యాసాలు రాయడం... ఇలా ఏదో ఒక పనితో కడుపు నింపుకొనే ప్రయత్నం చేశాడు. అలా క్రమంగా ఓ మంచి రచయితగా శామ్యూల్‌ పేరు ప్రచారంలోకి రాసాగింది. సంపద పోగు కాకున్నా, ఆకలితో పడుకోవాల్సిన దుస్థితి తప్పింది.

1746లో శామ్యూల్‌ దగ్గరకి కొందరు ప్రచురణకర్తలు వచ్చారు. ఇంగ్లిషులో ఓ నిఘంటువుని రూపొందించమని అడిగారు. అప్పటికి ఇంగ్లిషులో నిఘంటువులు లేవని కాదు. కానీ వాటిలో ఏదో ఒక లోటు ఉండేది. అందుకని ఓ పరిపూర్ణమైన నిఘంటువుని రూపొందించమంటూ శామ్యూల్‌ని అభ్యర్థించారు ప్రచురణకర్తలు. దాంతో శామ్యూల్‌ ఓ తొమ్మిదేళ్లపాట శ్రమించి ఓ నిఘంటువుని రూపొందించాడు. శామ్యూల్‌ కేవలం మధ్యాహ్నం సమయంలో మాత్రమే నిఘంటువు పని మీద కూర్చునే తీరిక చిక్కేది. వందలాది పుస్తకాలని చుట్టూ పేర్చుకుని, ఆ తొమ్మిదేళ్ల పాటు సాగించిన శ్రమ ఓ యజ్ఞాన్ని తలపించేదట.

ఎట్టకేలకు 1755లో శామ్యూల్‌ నిఘంటువు ఓ కొలిక్కి వచ్చింది. దాన్ని ప్రచురణకర్తలు భారీ లాభాలకు అమ్ముకున్నారు. ఈ రోజుల్లో లెక్కల ప్రకారం ఒకో నిఘంటువు వెల దాదాపు 30 వేల రూపాయలకు పైమాటే పలికింది. ఇంతాచేసి ఆ లాభాలలో శామ్యూల్‌కు కొంత కూడా వాటా లేకపోయింది. ఆ తర్వాత చాలాకాలం ఆయన్ను దరిద్రం వెంటాడింది. ఒకానొక సందర్భంలో అప్పులపాలై అరెస్టయ్యాడు కూడా!

శామ్యూల్‌ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం తర్వాతకాలంలో ఆయనకు కొంత పింఛనుని ఏర్పాటు చేసింది. శామ్యూల్‌కు అండగా నిలిచే స్తోమత ఉన్న స్నేహితులూ పరిచయం అయ్యారు. అయితే అప్పటికే శామ్యూల్‌కు వయసు మీదపడింది. క్రమంగా ఆరోగ్యం క్షీణించింది. తన 75వ ఏట లండన్‌లో మరణించాడు.

శామ్యూల్‌ నిఘంటువు రూపొందించిన 173 ఏళ్ల తర్వాత కానీ మరో నిఘంటువు (oxford dictionary) పూర్తికాలేదంటే... ఆయన కృషి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. శామ్యూల్‌ రూపొదించిన నిఘంటువు మొట్టమొదటిది కాకపోవచ్చు.

ఇప్పుడున్న పదాలలో కేవలం ఐదో వంతు పదాలకే (42,773) అందులో చోటు ఉండవచ్చు. కానీ తొలి సమగ్రమైన నిఘంటువుగా, ఒక వ్యక్తి సాధించిన అద్భుతమైన కార్యంగా ఆయన నిఘంటువు మిగిలిపోతుంది. పైగా ఆయన ఇచ్చిన అర్థాల ఆధారంగా ఆనాటి ప్రజల జీవనవిధానం కూడా అర్థం చేసుకోవచ్చునంటారు. అలాంటి మనిషి కోసం ఓ డూడుల్‌ని రూపొందించడం అర్థవంతమే కదా!

 

- నిర్జర.