TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
మనసుకు బానిసలయ్యామో అంతే సంగతులు....
అనగనగా ఒక రాజు. ఆయన ఏ కొరత రానివ్వక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గర ఒక బానిస ఉన్నాడు. రాజుగారి అవసరాలను ఎప్పటికప్పుడు గమనించి ఆ పనులను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చేసి మంచి పేరు పొందుతుండేవాడు. రాజు గారికోసం చేసే పనులలో ఎక్కడా తేడా రాకుండా చూసుకునే వాడు. అతనంటే రాజుకు కూడా ఎంతో ఇష్టం. అతనిపై నమ్మకం కూడా ఎక్కువే రాజుకు. ఒకరోజు రాజు అతనితో "నీకు ఏం కావాలో నన్ను అడుగు. నీకు నేనది ఇస్తాను. ఆలోచించకు. ఏది కావాలన్నా అడుగు" అన్నాడు. అతను ఒక్క క్షణం కూడా ముందువెనుకలు ఆలోచించక "రాజా, నేను కూడా మీలాగా రాజుగా ఈ దర్బారులో మీ సింహాసనంలో కూర్చోవాలని ఉంది" అని చెప్పాడు. నిజానికి ఈ కోరిక అడగవచ్చా అడగకూడా అని ఆ బానిసకు తెలియదు. అడగడమైతే అడిగేసాడు. అతని మాటకు రాజు ఖంగు తిన్నాడు. అయినా ఆ భావాన్ని మొహంలో చూపించక కాస్సేపటికి సర్దుకుని "సరే అలాగే కానివ్వు" అని చెప్పాడు రాజు. రాజు వెంటనే మంత్రులను పిలిచి "ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను. వినండి. ఈ సేవకుడికి ఒక్క రోజు రాజు కావాలని, నా సింహాసనంలో కూర్చోవాలని కోరిక. అది నెరవేర్చడానికి అవసరమైన ఏర్పాట్లు చూడండి. నన్ను మీరందరూ ఎలా రాజుగా గౌరవిస్తారో అలాగే అతని పట్ల కూడా నడచుకోవాలి. అతను ఏం చెప్తే అది చెయ్యాలి. మేం చెయ్యం అని మీలో ఏ ఒక్కరూ కూడా అనకూడదు. ఎందులోనూ ఒక్క ఆవగింజంత తేడా కూడా రాకూడదు" అని ఆదేశించాడు.
బానిస సేవకుడు రాజయ్యాడు.
అతను సింహాసనంలో కూర్చోగానే యేమని ఆజ్ఞాపించాడో తెలుసా..?
"రాజు తల నరకాలి" అని.
సభలో ఉన్న వారందరూ ఖంగుతిన్నారు. నోట మాట లేదు. కానీ ఏం లాభం. అతనిప్పుడు రాజు. కనుక మరో దారి లేదు. అతని ఉత్తర్వులను యధాతధంగా అమలు చెయ్యడం తప్ప... పైగా అంతకు ముందే రాజు కూడా చెప్పాడుగా అతనేం చెప్తే అవన్నీ అమలు చెయ్యాలని.
రాజైన బానిస చెప్పినట్లే ప్రధాన మంత్రి ఒక భటుడిని పిలిచి రాజు తల తీయించాడు.
ఆ తర్వాత బానిస సేవకుడే ఆ రాజ్యానికి రాజయ్యాడు.
ఇది వినడానికి కాస్తంత విడ్డూరమైన కథే కావచ్చు. కానీ ఇక్కడ చెప్పదల్చుకున్నది ఏమిటంటే మన జీవితమూ అంతే. ఈ కథలోలాగే మనమే రాజులం. . మన మనసు ఆ సేవకుడు. మనలో చాలా మంది ఆ మనసును రాజును చేసేస్తాం. కానీ దాని మార్గంలో ఆ తర్వాత జరిగే తంతు చూస్తుంటే మనసనే సేవకుడు కథలోని బానిస చెప్పినట్లు చేస్తే మన అర్హత, జీవితంపై పట్టు, ఆధిపత్యం, శక్తి, ఇలా ప్రతిదీ అంతరించిపోతాయి. అందుకే మనం ఏ నిర్ణయాన్నైనా చైతన్యవంతులై ఉన్నప్పుడు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉన్నప్పుడే ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. అలాకాకుండా మనల్ని మనసనే దాసుడికి అప్పగిస్తే మనలోని న్యాయాలు, ధర్మాలు అన్నీనూ అస్తమిస్తాయి. మన స్థానంలో మనసు ఉంటుంది. మనముండం.
- యామిజాల జగదీశ్