TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు కథకు, తెలుగు దనానికి నిలువెత్తు నిదర్శనం. సహజత్వంతో నిండిన చక్కటి వర్ణనలతో పాఠకులను అట్టే ఆకట్టుకుంటాయి వారి కథలు. చిన్నచిన్న సంభాషణలతో కథను రక్తి కట్టించగల నేర్పరి శ్రీపాద. దాదాపు వంద కథలు రాశారు. ఏ కథకాకథ ప్రత్యేకమైంది. తెలుగు పలుకుబడులు, నుడికారాలు, సామెతలు, జాతీయాలు వీరి కథల నిండా పొదిగి ఉంటాయి. మార్గదర్శి , అరి కాళ్లకింద మంటలు, కలుపు మొక్కలు, గులాబీ అత్తరు ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి కథ ఓ ఆణిముత్యమే. గులాబీ అత్తరు కథ రాజుల కింద పనిచేసే దివానుల కర్కశమైన మనసుకు కళాకారులు బలై పోయిన విధానాన్ని వివరిస్తుంది.
కథలో- ఢిల్లీ నుంచి వచ్చిన షుకురల్లీఖాను పెద్దపురం రాజు శ్రీ వాత్సాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజను కలవాలనుకుంటాడు. తను ఎంతో శ్రమకోర్చి, కాలాన్ని వ్యచ్చించి తయారు చేసిన గులాబీ అత్తరను రాజుకు ఇచ్చి సన్మానం పొందాలనేది ఖాను కోరిక. కానీ రాజును కలవాలంటే ముందు ఎందరి కటాక్షాన్నో పొందాలి. అదో నిచ్చెన మెట్లలా ఉంటుంది. ఖాను తన అత్తరు మహిమతో అందరి కటాక్షాన్నిపొంది చివరకు దివాన్జీని కలవడానికి వెళ్తాడు. ఒక్క అడుగు వేస్తే దివాన్జీ కలిసే దగ్గర ఆడిపోతాడు. అతని లాంటి వారు ఎందరో అక్కడ అతని కనుసన్నల వీక్షణాల కోసం నిలబడి ఉంటారు. ఖాను తన అత్తరు వాసనను దివాన్జీకి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో తన దుగ్గరున్న ఒక అత్తరు సీసా మూత తీసి వెంటనే బిగిస్తాడు. ఆ వాసన క్షణాల్లోని ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తుంది. అక్కడున్న పరివారం, ఠాణేదారు, పెద్దమనుషులు మత్తుతో తుళ్లిపోతారు. కానీ ఆవాసన పీల్చిన దివాన్జీ మాత్రం ' ఏమిటీ కంపు..' అని అడుగుతాడు. ఆ మాటతో ఢిల్లీ నుంచి వచ్చిన ఖానుకు తల కొట్టేసినట్లు అవుతుంది. గోలకొండ నవాబును కలవడానికి రెండు నెలలు కష్టపడ్డాడు, తలప్రాణ తొకకు వచ్చింది. కానీ చివరకు వజీరును కలవగానే ఆ అత్తరు వాసనకు ముగ్దుడై పోయాడు. మెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ పెద్దాపురంలో అత్తరు వాసన కంపుగా భావించిన దివాన్జీ మాటకు ఖాను కొయ్యబారిపోయాడు.
చివరకు అనేక అనుమానాలతోనే జవాను అనుమతితో దివాన్జీ దగ్గరకు వెళ్తాడు. కానీ దివాన్జీ - ' దివాణంలోకి అంగడి సరుకు తెస్తాడా...' అని ముదలకిస్తాడు. శాస్త్రులు, జవాను, ఠాణేదారు కొంత సర్ది చెప్పడంతో దివాన్జీ మామూలుగా మాట్లాడతాడు. కానీ ప్రతి మాటలో అతనిలోని గర్వం, అధికార దర్పం కనిపిస్తుంది. అయినా ఖాను తను తెచ్చిన మల్లె అత్తరు గురించి చెప్తాడు. అలాగే కష్టపడి కాశ్మీరీ గులాబీలతో అత్తరు చేశానని అది పెద్దాపురం రాజుకోసం తెచ్చానని చెప్తాడు. ఢిల్లీలో గోలకొండ, పెద్దాపురం సంస్థానాల గురించి గొప్పగా చెప్పుకున్నారని, గోలకొండ నవాబు తన అత్తరు మెచ్చుకున్నాడని చెప్తాడు. ఖాను అత్తరు గురించి, అతని అత్తరు వాసనకు అందరూ మంత్రముగ్దులవుతుంటారు. కానీ దివాన్జీ మాత్రం 'ఎంతకి కిట్టింది పాపం' అని అడుగుతాడు. దాంతో ఖాను కళాహృదయం దెబ్బతింటుంది. బాధను హృదయంలోనే అణచుకొని ' రాజుగారు సరసులని విన్నాం వారి దర్శనం కోసం' అని అడుగుతాడు. కానీ దివాన్జీ ' మేము వారి భృత్యులం, మాకు కొన్ని విధులు ఉంటాయి. ఢిల్లీలో ఎవరన్నా వజీర్లు ఎవరన్నా వస్తువు తెస్తే దాని మంచి చెడ్డలు తెలియకుండా పాదుషా సన్నిధికి ఉంచనిస్తారా' అని మాట్లాడతాడు. పెద్దమనుషులు, ఠాణేదారు అత్తరు తెచ్చిని ఖానుకు సర్దిచెప్పి తర్వాత కలువు అని పంపించేస్తారు. ఆ రాత్రి అంతా ఖానుకు నిద్రపట్టదు. తను డబ్బుకోసం ఈ అత్తరు తయారు చేయలేదు. కళాకారుల కళకు డబ్బుతో వెలకడతారా.. అసలు ముక్కు మొగమూ తెలియని చోటుకు రావడం తనదే తప్పు.. అసలు సన్మానం మాట దెవుడెరుగు మర్యాదగానైనా ఇక్కడ నుండి వెల్లగలనా.. అని బాధపడతాడు. తెల్లవారి ఠాణేదారు షుకురల్లీఖానుకు ఒక సలహా ఇస్తాడు. సాహసం చెయ్యగలవా అని అడిగి, 'కోట ప్రాకారం దాటకుండా నువ్వు వారి కళ్లబడాలి, లేదా నీ వట్టివేళ్ల అత్తరు వాసనైనా అతనిని ఆకర్షించాలి' అని చెప్తాడు. ఖాను సిపాయిలు అడ్డగించినా వారికి నచ్చజెప్పలేక నానా యుక్తులు పన్నుతూ వారితో మాట్లాడుతూ కాల యాపన చేస్తూ ఉంటాడు. కానీ దివాన్జీ, రాజుల దర్శనం దొరకదు. సిపాయిలు ఎంత చెప్పినా వారిని అటకాయిస్తూనే ప్రాంగణాన్ని దాటకుండా నిలబడతాడు. అంతలో రాజుకోసం వచ్చే పెద్దమనుషులు, చదరంగం సహచరులు అందరూ అక్కడే గుమిగూడతారు. చివరకు రాజు వచ్చే సమయం సమీపించడంతో సిపాయిలు అతడ్ని అక్కడ నుంచి పంపడానికి ప్రయత్నం చేస్తారు.
అది గ్రహించిన ఖాను ' పెద్దాపురం రాజ్యంలో కళాకారులకిదా సన్మానం అంటూ..' ఆవేశంతో మాట్లాడుతాడు. కోపంతో కళ్లు ఎర్రబడి, శరీరం వొణికిపోతుంటాయి. గులాబీ అత్తరు సీసాను చేతిలోకి తీసుకొని 'పెద్దాపురం ప్రభువుకోసం నిద్రాహారాలు మాని తయారు చేశాను. అటు గోలకొండలో, ఇటు పెద్దాపురంలో అంటే దక్షిణదేశంలో నాపేరు నిలిచిపోతుందని పేరాశ పడ్డాను. గులాబీ పువ్వు పరిమళం ఎంత దూరమైనా వ్యాపిస్తుంది. కానీ ముళ్ల ప్రభావం ఉన్నచోటనే వెల్లడి కాదు... దీనిని మహారాజుకు అందించడానికి నాకు మార్గాలు లేవు. నాకు, నా కుటుంబానికి ఇది శిరచ్ఛేదనతో సమానం' అని సీసాను కోటగోడకు విసిరికొడతాడు. సీసా భళ్లుమంటు పగుతుంది. పెంకులు ఘళ్లుమంటాయి. ఆ వాసనకు అక్కడున్న వారు మత్తెక్కిపోతారు. ఆ మత్తు నుంచి కోలుకుని ఖానును చూసే సరికి అతను కొయ్యబారి పోయి ఉంటాడు. పంచకళ్యాణి మీద వస్తున్న రాజు ఆ పరిమళానికి సొక్కి పోయి ఉంటాడు. గుర్రం మాత్రం ఊపిరి తీసుకుంటుూ కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ గుళాబీ అత్తరు పరిమళం ఆ ప్రాంతంలో గుబాళిస్తూనే ఉంటుంది అంటూ శ్రీపాద ఈ కథను ముగిస్తారు.
'ఒక్కొక్క జీవితానికి హృదయమే పునాది అయితే, మరొక్క జీవితానికి మేధస్సు ప్రధానం అయ్యి ఉంటుంది. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయి పోతుంది. అక్కడ సానుభూతిన్నీ పూజ్యమే. ఏ జీవితానికి పునాది హృదయమో అది కళా బంధురం. అక్కడే కళలకు పరిణతి. అక్కడే కళలకు వినియోగం...' 'ఒకరితో మనివి చేసుకోడానికి, సొంతానికి సత్యం గుర్తించడానికీ చాలా అంతరం ఉంది.' ఇలాంటి ఎన్నో గొప్ప సత్యాలు ఈ కథనిండా ఉన్నాయి. ఇక శ్రీ పాద కథాశిల్పం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కథ చదువితే పాఠకుడి మనుసు చివరకు గడ్డకట్టుకొని పోతుంది. కళాకారుల హృదయంలోని సున్నితమైన పొర ఆర్త్రత ఎలా ఉంటుందో ఇట్టే తెలిసిపోతుంది. అందుకే ఈ కథ ఇంకా పది కాలాలైనా ఇట్టే నిలిచి పోతుంది.
- డా. ఎ. రవీంద్రబాబు