TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తెలుగుజాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలదనం… తల్లితండ్రి నేర్పినట్టి మాతృ భాషరా… తెలుగు మరిచిపోతే, వాళ్ళని నువ్వు మరిచనట్టేరా… ఈ పాట నిజమే కదా…!
మన తెలుగు భాష మన అమ్మ దగ్గర నుండే మనకు మొదలు అవుతుంది. తెలుగువారమైన మనకు మన అమ్మ భాష తెలుగే ఉంటుంది… కాబట్టి అమ్మ దగ్గర నుండే తెలుగులో మాట్లడడం, తెలుగులో వినడం ప్రారంభం అవుతుంది. అందుకే తెలుగు భాష మనకు మాతృభాష…
ఎవరి అమ్మవారికే గొప్ప అన్నట్టుగా ఎవరి మాతృభాష వారికే గొప్ప… కానీ తెలుగు భాషకు ప్రత్యేకత ఉంటుందని అంటారు. ఎప్పుడో చరిత్రలోనే రాజుల కాలంలోనే దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పబడింది. వ్యాకరణం దీని ప్రత్యేకత… అది ఎంత ప్రత్యేకమో అంత సాధన కూడా అవసరం అంటారు… లేకపోతే తెలుగు వ్యాకరణం నేర్చుకోవడం అంత సులువు కాదని అంటారు.
మన మాతృభాష అయిన తెలుగు భాషలో అనేక పద్యాలు, కవితలు, గద్యములు, సామెతలు, సూక్తులు, పురాణాలు ఇంకా అనేక రచనలు లభిస్తాయి.
కనీసం గత వెయ్యి సంవత్సరాలుగా ఒక వెలుగు వెలుగుతున్న మన తెలుగు భాష యొక్క విశిష్టత గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భాష యొక్క విశిష్టత బహుముఖాలుగా ఉంటుంది. ఒక భాషయొక్క ఔన్నత్యాన్ని పరిక్షించాలంటే ఆ భాష సాహిత్యపరంగా ఎంత పరిణితి చెందింది అన్న విషయం పరిశీలించాలి. ఆ కోణంలో చూస్తే తెలుగు భాషకి అగ్రతాంబూలం ఇవ్వచ్చు. ఛందోబద్ధమైన పద్యం తెలుగు భాషలో పరిణితి చెందినంతగా ఇతర భాషల్లో చెందలేదనే చెప్పచ్చు. తెలుగులో ఒక్క పద్యంలో ఒకే అలంకారం కాకుండా రెండు, మూడు, నాలుగు అలంకారాలు కూడా చోటు చేసుకుంటాయి. శబ్దాలంకారాలకీ, చమత్కారాలకీ చేమకూర వేంకట కవి గారి “విజయ విలాసం” భాషా సౌందర్యం కోసం రామరాజభూషణుని “వసుచరిత్రము”, తెలుగు భాష లాలిత్యం, సౌకుమార్యం తెలియాలంటే అల్లసాని వారి “మనుచరిత్రము”; పద గుంఫనం, విరుపుల కోసం తెనాలి వారి “పాండురంగ మాహాత్మ్యం”, భాషా మాధుర్యం, భక్తి భావాల కోసం పోతన గారి భాగవతం ఒక సారి తిరగేస్తే చాలు.
తెలుగు భాషలో గల పద్యములందు ఉండు అర్ధములు విశేషమైన విషయమును తెలియజేస్తూ ఉంటాయి. చిన్న చిన్న పదాలతో నాలుగు లైన్లలో ఉండే ఈ పద్యాలలో ప్రతిపదార్ధము వచనంలో ఎక్కువగా ఉంటుంది. వీటి భావాలు విశేషమైన అర్ధమును తెలియజేస్తాయి.
దైవచింతన, తత్వచింతన, సామాజిక పోకడలు ఇలా అన్నింటపైనా తెలుగు భాషలో తెలుగు పద్యాలు విశేషమైన భావాలను వ్యక్తపరుస్తాయి. ఇంకా ఇవి చాలా తక్కువ నిడివి గలిగిన వ్యాక్యాలతో ఉంటాయి… అవి కూడా మూడు వ్యాక్యాలు ఇంకా ఒక మకుట వ్యాక్యం కలిగి ఉంటాయి. తెలుగు భాషలో గొప్ప గొప్ప కవులు ఉన్నారు. గొప్ప గొప్ప ఇతిహాస, పురాణాలను అనువదించినవారు ఉన్నారు… అవి అన్ని కూడా సంస్కృత భాష నుండి తెలుగుకు తర్జుమా చేసినవే… తెలుగు భాషలో కవులకు లోటు లేదు పదాలకు లోటు లేదు…
చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు “దేశబాషలందు తెలుగులెస్స” అనుట ఆశ్చర్యం గాదు. బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము.
తెలుగు బాష మాధుర్యం: తెలుగు భాషకి ఉన్న మరొక విశిష్ట ప్రక్రియ అవధానం. ఇది తెలుగు భాషలో వికసించినంతగా మరే భాషలోనూ వికసించ లేదు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం, పంచ సహస్రావధానం – ఇలా విస్తరిస్తూ పోతోంది.
తెలుగులో పదాలు అజంతాలు, అంటే అచ్చులతో అంతం అవుతాయి. అందుచేత తెలుగు వినడానికి శ్రావ్యంగా ఉంటుంది. మన పురాణాల్లోనూ, కావ్య-ప్రబంధాల్లోనూ వాడబడిన తెలుగు భాష ఎంత ఉత్కృష్టంగా, మహోన్నతంగా ఉంటుందో మనందరికీ తెలిసినదే. తెలుగులో ఒక పదానికి ఎన్నెన్నో పర్యాయ పదాలు ఉంటాయి. ఇలా ఉండటం ఆ భాష యొక్క ఔన్నత్యానికి నిదర్సనం.
తెలుగు బాష కోటి కిటికీల గాలి మేడ: తెలుగు బాష కొల్లలుగా క్రొత్త పదాలను తనలో కలుపుతుంది.తెలుగు బాష కోటి కిటికీల గాలి మేడ. అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకి గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు,సంస్కృత పదాలు క్షీరనీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు బాష విశిష్టత.
తెలుగులో ద్వర్ధి కావ్యాలు అని ఉన్నాయి. అంటే ఒకే గ్రంథంలో అవే పద్యాలు రెండు కథలు చెబుతాయి. అలాగే త్ర్యర్థి కావ్యాలు ఉన్నాయి. అంటే ఒకే గ్రంథంలో మూడు కథలు. ఇలాంటి క్లిష్టమైన ప్రక్రియలు మరే ఇతర భాషలోనూ లేవేమో.
ఇంక పద్యాల విషయానికొస్తే ఒకే పద్యానికి, రెండు, మూడు, నాలుగు అర్థాలు మాత్రమే కాక ఒకే పద్యానికి 64 అర్థాలు చెప్పిన సందర్భo కూడా ఉoది. రామరాజభూషణుని “వసుచరిత్రము” లో “స్వైర విహార ధీరలగు.... అనే పద్యానికి పెద్దాపుర సంస్థానంలోన విద్వత్కవి, వైణికులు శిష్టా కృష్ణమూర్తి శాస్త్రి గారు 64 రకాల అర్థాలు చెప్పారట.
ఇంక తెలుగులో చిత్రకవిత్వం అని ఉంది. పద్యం మొదటి పాదం మొదలుకొని చివరిదా చదివితే ఒక అర్థం, అదే పద్యాన్ని చివరినుండి మొదటిదాకా చదివితే మరొక అర్థం వచ్చే ప్రక్రియ ఉంది. అలాగే “వికటకవి” లాగ పద్య చరణాలన్నీ ముందునుంచి వేనుకకీ, వెనుకనుండి ముందుకీ చదివినా ఒకే లాగ ఉండే పద్యాలు కూడా ఉన్నాయి.
పద్యమంతా ఓష్ఠ్యాలతో, అంటే పెదవులు కలుపుతూ ఉచ్ఛరించే పదాలతో (పఫబభమ-లు) రాయడం లేదా నిరోష్ఠ్యంగా (పఫబభమ-లు లేకుండా) రాయటం; ఈ పద్ధతిలో కావ్యమంతా రాయటం అధ్భుతం కదా. ఈ విధంగా తెలుగు భాష ఔన్నత్యంగురించీ, విశిష్టత గురించీ ఎంతైనా చెప్పవచ్చును.
మన తెలుగు కవులు: నన్నయ, తిక్కన, ఎఱ్ఱన తెలుగు పాండిత్యము తో మెప్పించిన ఉద్ధండ కవులు. మన తెలుగు కవులు అపార ప్రజ్ఞాధురీణులు. సంస్కృతాంధ్ర పదములు ప్రయోగించటం లో నేర్పరులు. పోతన సంస్కృతాంధ్ర పధములు; పెద్దన మనుచరిత్ర లోని తేట తెనుగు నుడికారపు సొంపులు, వంపులు, తామర తంపరలు, అల్లసాని వారి ఆ అల్లికజిగిబిగి లో తెలుగు పదములు, సంస్కృత శబ్ధములు పడుగుపెకల వలె అల్లుకుంటాయి. మన తెలుగు కవులంతా ఈ విధ్యలో నేర్పరులే. తెలుగు కవులకు జరిగిన సత్కార గౌరవములు ప్రపంచములో ఏ దేశంలో ఏ కవులకూ జరగలేదు. తెలుగువారి సహృదయత, సాహితీ రసికత, నిరుపమానములు. తెలుగు బాష వాజ్మయము లో ప్రాతఃస్మరణీయులు కవిత్రయము, నన్నయ్య ను రాజరాజు ఆదరించాడు. తిక్కన ను మనుసిద్ది, ఎఱ్ఱప్రెగడను వేమారెడ్డి గౌరవించారు. శ్రీనాథుడు రెడ్డి రాజుల కవిగా మహాభోగాలు అనుభవించాడు. ఆయనకు ప్రౌఢధేవరాయులు కనకాభిషేకం చేశాడు. పోతన మహాకవికి తమ హృదయంలోనే దేవాలయాలు కట్టి తెలుగువారు నేటికీ ఆరాదిస్తారు. సాహితీ బొజుడైన కృష్ణదేవరాయులు కవులను పూజించిన విషయము జగత్ ప్రసిద్దము. పెద్దన కవికి రాయులు గండపెండేరము తొడిగి గౌరవించాడు.
తెలుగు బాష సంగీతానికి అనువైన అజంత బాష. తెలుగు ఆజన్మ సంగీత కవచకుండలాలతో భాసించింది. సంగీత కళారాధనలో మన తెలుగు వారికి కలసి వచ్చిన గొప్ప అదృష్టం మన మాతృ బాష తెలుగు.
తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు
పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు
మురళి రవాళులు! కస్తూరి పరిమళములు
కలిసి ఏర్పడే సుమ్ము మన తెలుగు బాష”
ఈ తెలుగు నేలపై జన్మించడం ఒక గొప్ప వరం ఒక గొప్ప అదృష్టం
పుడమి జడలో పరిమళ పద కుసుమం
విశాల జగత్తులో ప్రశాంత భావ సంద్రం
హరివిల్లెరుగని మనోహర మది వర్ణం
మధురిమ లిఖితం కమనీయ వాచనం
మన హృదయ సంధాన భాషా వనం
సొగసైన రాగం రమణీయ శ్రవణం
మన యెద పలికే సాహిత్య గాంధర్వ గానం
ఇది నే తెలుపగలిగిన నా తెలుగు గొప్పదనం