TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పుచ్చకాయ కథ
నారాయణ రెడ్డి- నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు- శశి, కిరణ్, వైష్ణవ
అది మంచి వేసవి కాలం. పిల్లలందరికీ సెలవలు. నారాయణ రెడ్డి ఆ రోజు ఉదయం బజారునుండి ఒక పుచ్చ కాయని తెచ్చాడు. పిల్లలంతా అది చూసి చాలా సంబరపడ్డారు.
నారాయణరెడ్డి దాన్ని ఐదు భాగాలు చేసాడు. మొత్తంగా ఫ్రిడ్జ్‌లో పెడుతూ "అందరం తలా ఒక ముక్కా తిందాం, సరేనా?! మధ్యాహ్నం అన్నం తిన్న తరువాతే తినాలి!" అన్నాడు. పిల్లలంతా 'సరే' అన్నారు.
కానీ కిరణ్ మటుకు ఆగలేకపోయాడు. వాడి మనసంతా "తిందాం తిందాం" అని తొందరపెట్టింది. అందరూ 'మధ్యాహ్నం' అని ఊరుకున్నారు కదా, కిరణ్ మాత్రం ఎవరికీ తెలవకుండా ఫ్రిజ్‌లోంచి ఒక ముక్క తీసుకొని తినేసాడు.
మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేసాక, నారాయణ రెడ్డి "ఇప్పుడింక పుచ్చకాయ ప్రోగ్రాము" అంటూ వెళ్లి ఫ్రిజ్ తలుపు తెరచి చూసాడు. అందులో ఒక ముక్క లేదు!
నారాయణ రెడ్డి దాన్నే తెచ్చి ముందు పెడుతూ "మీ నలుగురిలో ఎవరు, వాళ్ల వాటా పుచ్చకాయ తినేసింది?" అని అడిగాడు. "నేను తినేసా" అని చెబుదామనుకున్నాడు కిరణ్. కానీ 'ఎందుకు తిన్నావు?' అని కోప్పడతారేమో?! -అని, నోరు మెదపలేదు. "సరే, పర్లేదులే, మనలో ఎవరికో చాలా ఆకలి వేసి ఉంటుంది. మిగిలిన దాన్నే మనం అందరం పంచుకుందాం" అని నవ్వి, ఆ మిగిలిన నాలుగింటినే అందరికీ సమానంగా పంచాడు నారాయణ రెడ్డి.
"ఇది తప్పు! అందరికీ కొంచెం కొంచెం తగ్గిపోతుంది!" గొణిగాడు పెద్దోడు.
"నేనేలే, తిన్నది! బాగా ఆకలివేసేసరికి, ఆగలేక తినేసాను. ఇప్పుడు ఇవన్నీ మీకే!" అన్నాడు కిరణ్, నోరు విప్పి. నారాయణ రెడ్డి వాడి భుజం తడుతూ "ఏమీ పర్లేదు. ఈ సారి ఇంకా పెద్ద పుచ్చకాయ తెచ్చుకుందాం. ఏదైనా సరే, అందరం కడుపునిండా తినటం ముఖ్యం. ఎప్పుడు తిన్నా, ఉన్నదాన్నే సమానంగా పంచుకొని తిందాం!" అన్నాడు.
ఆశ్చర్యం, అటు తర్వాత ఎప్పుడూ ఇంట్లో పంపకాల సమస్య రాలేదు.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో