Facebook Twitter
సిందూరం

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌థ‌ల పోటీలో క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి రూ. 516 గెలుపొందిన క‌థ‌   


కార్తీక పౌర్ణమి, చందమామ ఆకాశంలో చుక్కల రాజ్యాన్నేలుతున్న చక్రవర్తిలా వెలుగులీనుతున్నాడు. మేడమీద వెన్నెల ఊదారంగు చీరకట్టుకుని మల్లెపందిరి నీడలో ఊయల ఊగుతూంది. ఇంటి వాకిలిలో ఉన్న పారిజాత చెట్టు కొమ్మలు మేడమీద వరకు విస్తరించాయి. 

                   ప్రతి కొమ్మకు గుత్తులు గుత్తులుగా పూసిన పారిజాతాల పరిమళం వెన్నెల  శరీరాన్నీ, మనసుని స్పృశిస్తూన్న ప్రతిసారి  "నిన్న రాత్రి నీ నవ్వులు  మన  వాకిలిలో ఎలా వాలాయో చూడు?" అని తన కళ్ళు మూసి వాకిలంతా పరచి వున్న పారిజాత పూవులను చూపించిన ఆ చిలిపికళ్లే తన కళ్ళముందు కదలాడుతున్నాయి. మల్లెపూలంటే తనకిష్టమని మేడమీదవరకు తీగను పాకించి ఎంతో అందంగా మల్లెపందిరితో తనకి ప్రేమ మందిరాన్ని కట్టిన ప్రేమికుడు. తప్పదు నీకు, నువ్వు నా ఊహల్తోనే  ఊరేగాలని అందులోనే ఊయల కూడా పెట్టిన రసికుడు ఆ సూర్య. 

         "వస్తే, మూడునెలల తర్వాత వస్తాను, జాగ్రత్త‌!!" అని చెప్పి వెళ్ళాడు. ఆ లెక్క ప్రకారమైతే గురువారం రావాలి, ఈ రోజు ఆదివారం. వెన్నెల ఎదురుచూస్తూనేవుంది. మనసైన  వారి కోసం చూసే ఎదురుచూపులు మరింత అందంగా ముస్తాబవుతాయ్. అందుకే ఆ ఊదాచీర.

           "అమ్మా! కిందకి వెళ్దాం" అంటూ కొంగు పట్టుకు లాగుతోంది నాలుగేళ్ల హాసిని. " రా!" అని హాసిని వేలు పట్టుకుని నెమ్మదిగా మెట్లు దిగుతోంది వెన్నెల.

          " అర్థమౌతుందా ! ఇప్పుడు నీకు ఏడో నెల. ఆ చీర కట్టుకోవడం అవసరమా? తగుదునమ్మా అని మెట్లు ఎక్కడం, దిగడం. ఎందుకొచ్చింది ఆ బాధ? నైటీ వేసుకోవచ్చు కదా!?" కిందనుంచి గదమాయించింది రత్నం.

"ఈ ముసలిదానికి అన్నీ కావాలి"  మనసులో  అనుకుని   పైకి మాత్రం "అలాగే అత్తమ్మా!"  అన్యమనస్కంగా సమాధానం చెప్పి ఇంటిలోనికి వెళ్ళింది.

       "నా పెద్దకోడలేదే!" వెనక నుంచి చిన్న అరుపులాంటి విరుపు.

         అసలే సూర్య ఇంకా రాలేదన్న దిగులుతో ఉన్న  వెన్నెలకి, పెద్ద‌కోడలేదే! అని అనేసరికి  "చూడలేదత్తమ్మా!" కాస్త విసురుగా చెప్పి తన గదిలోకెళ్ళింది హాసినిని తీసుకుని. గడియారం తొమ్మిది గంట గొట్టింది. 

          సూర్య పెళ్లికి ముందు, "ఇదే నీ కోడలు" అని ముద్దు చేసి మరీ తన అమ్మ చేతిలో పెట్టింది దానినే. అదే  "నైసీ" పేరుకి తగ్గట్టే నైస్ గా, అందంగా, తెల్లగా తోకూపుకుంటూ ఇల్లంతా తిరుగుతూంది ఇంటి పెత్తనం దానిదే అన్నట్టు.  

         "ఎంతైనా పెద్దకోడలు పెద్ద కోడలే దానికి అణకువ ఎక్కువ, ఇదెక్కడికెళ్ళింద"ని గొణుగుతూ  నైసీనీ వెతుకుతోంది రత్నం.

           హాసిని తన నాన్నిచ్చిన టెడ్డిని, వాళ్ళమ్మ చేతిని గట్టిగా పట్టుకొని ఎడమ ప్రక్కగా పడుకుంది. తన కూతురి చిట్టి చేతులలో బందీగా వున్న చేతిని నెమ్మదిగా తీస్తూ   నిదరపోతున్న తన కూతురు కళ్ళవైపు చూసింది. అచ్చం వాళ్ళనాన్నలాగే నిశ్చలమైన జలపాతంలా  అందంగా నిదురపోతోంది హాసిని. సూర్యని కళ్ళలో నింపుకుని హాసిని వైపు చూస్తోంది వెన్నెల.

         ‌‌"దీనికి దానికన్నా పొగరెక్కువైంది లోపలికి రమ్మంటే రానంటుంది ఆ గేటు దగ్గరే వుంటానంటుంది"   రుసరుసలాడుతుంది రత్నం నైసీ వైపు చూస్తూ.

         "ఏవే రత్నం!  ఆ నోరులేని దానితో నీకెందుకే, నువు రావే లోపలికి"  అనునయంగా పిలుస్తున్నాడు నాయుడు.

       ‌‌"అవును! నీ కొడళ్ళకి నీకు నోరెక్కడిది. నోటిలో వేలు పెడితే కొరకలేని అమాయకులు మీరు. నేనేగా నోరేసుకుని ఊరిమీదపడిపోయేది"  నిష్ఠూరాలాడుతూ ఇంటి తలుపేసి  లోపలికి వెళ్ళి  గదిలో వున్న నాయుడు దగ్గరకెళ్ళి నీళ్ళందించింది.
గేటు దగ్గర ఒకటే మొరుగుతోంది నైసీ. 

      "దానికీ చెవిలో వూదుంటాడు మహానుభావుడు మూడునెలల తర్వాత వస్తానని, అందుకే అది అలా మొరుగుతోంది. అయినా ఈ మహాతల్లి  మల్లెపూవులా తెల్లని  యూనిఫాంలో వచ్చే నా మొగుణ్ణి గేటు దగ్గరే ఆపి, పైకి ఎగిరి ఒళ్ళంతా నాకేసి తన ప్రేమంతా ఒలికించి నలిపేసిన తర్వాత గాని నా దగ్గరకి పంపదు. నిజమే అదే మొదటి భార్య మా ఆయనకి" మనసులో అనుకుని గదినుంచి బయటికొచ్చి ఇంటి తలుపు తీసింది.

"నైసీ! ఇలా రావే ఈ మెట్లు దగ్గరికి వచ్చి పడుకో " అంది.

           వెన్నెల మనసు నైసీ పసిగట్టగలదు. అందుకే‌ అది వెన్నెల కాళ్ళ దగ్గర వరకు చేరుకుని తన ముందరి రెండు కాళ్ళని పైకిలేపి వెన్నెల కళ్ళ వైపు  చూసింది తదేకంగా. ఆ చూపులని అర్థం చేసుకున్న వెన్నెల దాని తల  నిమిరి " ఏమోనే నాకు తెలీదు! ఎందుకు రాలేదో ....వస్తారులే!. వెళ్ళి పడుకోవే" అంది లాలింపుగా. లేపిన  ముందరి రెండు కాళ్ళు కిందకి దింపి  తోకూపుకుంటూ మెట్లదగ్గరకెళ్ళి కూచుంది ముభావంగా.

          వెన్నెల హాసిని మీద చేయేసి సూర్య గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలో కి జారుకుంది. 
ఫోన్ రింగ్ అయిన శబ్దం. ఫోన్ తీసి "హాలో" అంది నిద్రమత్తులో
"భాభి మై శుక్లా! కైసే హో?  భేటి కైసీ హే" (వదిన మీరెలా వున్నారు, పాప ఎలా వుంది).
"సబ్ కుచ్ ఠీక్ హే..ఆప్ కైసే హే". (అందరూ బాగున్నారు....మీరెలా వున్నారు) అంది వెన్నెల.
"భాభి భయ్యా కౌన్సీ షిప్ మే గయా ?" ( అన్నయ్య ఏ షిప్ లో వెళ్ళారు?) అడిగాడు శుక్లా.
"మేరేకో నయీ మాలుమ్. వో బాత్  ఆప్ హమ్ లోగ్ సే నయి బాతాయెంగేనా?" (నాకు తెలీదు ...అయినా మీరు  మాతో అవేం చెప్పరుగా!?) అంది వెన్నెల.
"టికే భాభి టేక్ కేర్" (అలాగే వదినా, జాగ్రత్త!!) అని కాల్ కట్ చేశాడు శుక్లా.

   వెన్నెల ఫోన్ స్క్రీన్ పై ఫ్లాష్ అవుతున్న టైం చూస్తే అది 2:30 A.M చూపిస్తోంది. 
ఏంటి? ఈ టైం అప్పుడు ఫోన్ చేసి భయ్యా ఏ షిప్ మీద వెళ్ళాడు అని అడుగుతున్నాడు. సాధారణంగా ఎక్కడికి, ఏ షిప్ అన్న విషయాలు ఎవరికి చెప్పరుగా, మరెందుకు ఈ టైంలో ఫోన్ చేసి అంత ఆతృతగా అడుగుతున్నాడు ‌..... జరగరానిదేదైనా జరిగిందా  అనే ఆలోచన  వచ్చేలోపే కళ్ళనుండి నీళ్ళు కారిపోతున్నాయి. ఒళ్ళంతా చల్లబడి వణుకుతూ గుండె ఒక్కసారి బరువెక్కుతుండగా  వెంటనే శుక్లాకి ఫోన్ చేసి, "శుక్లా, జస్ట్ టెల్ మి....ఐ కెన్ టేకిట్"  (శుక్లా, విషయం చెప్పండి నేను తీసుకోగలను) అని అంది కాని వెక్కి వెక్కి ఏడుస్తోంది.
"భాభి  నథింగ్ హేపెన్డ్...... టేక్ కేర్ "  ( వదినా ఏమి అవలేదు జాగ్రత్తగా ఉండు) అన్నాడు శుక్లా ఓదార్పుగా.

                   బాధో , దుఃఖ‌మో, భరించలేని నొప్పో వచ్చినప్పుడు "అమ్మా!" అంటూ  మన ఆత్మను అక్కున చేర్చుకుని తన మాటలతో ఓదార్చి లాలించేది అమ్మభాషే.  అందుకేనేమో ఆ పిచ్చితల్లి తెలుగే తెలియని వాడితో వెర్రిగా గుండెలని అరచేతిలో పెట్టుకొని  "నిజం చెప్పు ...ఆయన....ఎలా వున్నారు? ... నేను ధైర్యం గానే వుంటాను ...." అంటోంది అధైర్యంగా ఊపిరి బిగపట్టి తన్నుకొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ.

               బాధకి మించిన  భాషేది, కన్నీటికి మించిన లిపేది.  "భాభి ఆప్ మత్ రోయియే ...మే థోడా డౌట్ సే కాల్ కియా . సబ్ కుచ్ టీక్ హోగా...భయ్యా కో కుచ్ నయి హోగా...సమ్మాల్ కే రహో "  ( వదినా నువ్వు ఏడవద్దు ...నేను  చిన్న అనుమానంతో కాల్ చేసానంతే..అక్కడ అంతా బాగానే ఉండి ఉంటుంది ... అన్నయ్యకి ఏమి అవ్వదు..నువ్వు ధైర్యంగా, జాగ్రత్తగా ఉండు) గొంతు గద్గదమై కాల్ కట్ చేశాడు శుక్లా. 

                వెన్నెల గొంతు తడారిపోతోంది.. అమ్మ పడే వేదన  భరించలేక  కడుపులోని బిడ్డ గట్టిగా తన్నుతుంది.  చేతులతో కడుపుని నిమిరి లోపలి బిడ్డను స్థిమితపరిచి, మంచం ప్రక్కనే రాగి చెంబులో వున్న నీటిని తాగింది. గుండె వేగం కాస్త నెమ్మదించింది.
మనసు మట్టుకు అతి వేగంగా సూర్యని వెతుక్కుంటూ గుండెలోతులను తవ్వుతూ వెళుతోంది .
*   *   *

                    "చూడండి వెన్నెల గారు, మా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని ఈ పెళ్లి చూపులకి వచ్చాను. పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పలేను కాని నా ప్రాణాన్ని దేశానికి రాసిచ్చి,   నీతో ప్రేమను, జీవితాన్నీ పంచుకుంటాను అని అబద్ధం చెప్పి  ఒక అమ్మాయి మెడలో తాళి కట్టలేను. అందుకే, నిజం చెప్తున్నాను. నేను ఇండియన్ నేవిలో సర్వీస్ చేస్తున్నాను. ఇన్ని పనిగంటలు , ఇన్ని సెలవులు అని  ఏమి ఉండవు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.  మీరు నన్ను ఎప్పుడూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడక్కూడదు నేను ఏమి చెప్పకూడదు.

ఒక్కోసారి యుద్ధనౌక లో ఏమైనా అయినా మీ దగ్గరకి అధికారకంగా సమాచారం రావడం ఆలస్యమవచ్చు . ఒక్కోసారి అంతుచిక్కని కారణాల వల్ల నిర్దిష్ట సమాచారం లేకపోతే ఏడు సంవత్సరాల వరకు కూడా మీకు సరియైన సమాచారం అందించడం కుదరకపోవచ్చు. మేం సర్వీస్ లో వున్నప్పుడు సెల్ ఫోన్ వాడకూడదు. మీరు ఎంతటి విపత్కర పరిస్థితుల్లో వున్నా  నేను మీతో ఉండటానికి కుదరకపోవచ్చు. ఇలా వుంటుందండి మా జీవితం. 

               మీరు పర్లేదు. అందంగానే వున్నారు.  దాని కన్నా మీ కళ్ళల్లో  కనిపించే  దైర్యం నాకు నచ్చింది. ఎందుకంటే నా కన్నా మీరే ఎక్కువ ధైర్యంగా ఉండి కుటుంబాన్ని నడిపించాల్సి వస్తుంది. మీరు నేను చెప్పిన నా జీవితం గురించి ఆలోచించే ఒక నిర్ణయానికి రండి. కంగారులేదు మీ అమ్మగారు, నాన్నగారు చెప్పారని వప్పుకోకండి..." అన్నాడు సూర్య వెన్నెల వైపుచూస్తూ...

                కోటి ఆశలతో కళ్యాణ జీవితం గురించి కలలు కనే  కన్నెపిల్లకు ఆహ్లాదం కలిగించే మాటలకు బదులుగా, అతడినుండి తూటాల్లాంటి మాటలు తగిలినయి. వెన్నెల మనసు బాధతో విలవిల లాడింది.
కానీ... తరువాత స్థిమితపడి ఆలోచించే కొలది అతనిలోని ఫ్రాంక్ నెస్, స్థిర నిర్ణయాలు, దేశం పట్ల అంకితభావం, ఇవన్నీ అతన్ని ఇష్టపడేలా చేశాయి. ఇటువంటి భర్త నీడలో జీవితానికి ఓ సార్ధకత ఏర్పడుతుందని భావించింది. వెన్నెల సూర్య వైపు ఆరాధనగా చూడసాగింది.

            "ఏంటండీ వెన్నెల గారు అలా చూస్తున్నారు? నా గురించి మీకు అన్నీ చెప్పి, మీ గురించి నేను ఏమి అడగలేదనా!?. నన్ను పెళ్ళి చేసుకుంటే ఎక్కువగా సర్దుకుపోవలసింది, ప్రేమను మోయాల్సింది, పెంచాల్సింది కూడా మీరే!!. అందుకనే నా గురించి మీకన్నీ చెప్పాను కాని నేను మీతో సర్దుకుపోను, మీరు ఎలా ఉంటే అలానే కలిసిపోతాను. మీరు సైన్స్ స్టూడెంట్ అని విన్నాను మీ భాషలో  చెప్పాలంటే  ఐ విల్ బి కెటలిస్ట్ టు యువర్ లైఫ్ బట్ యు ఆర్ మై లైఫ్ ఆఫ్టర్ కంట్రీ (మీ జీవితంలో నేనో ఉత్ప్రేరకాన్ని  కాని నా జీవితమే మీరు దేశం తర్వాత). ఇవి నా మనసులోని నా మాటలు. నా జీవితం నా భార్యతో ఇలానే ఉంటుంది. ఇలా చెప్పానని సినిమాటిక్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోకండి. ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయానికి రండి..... నాతో జీవితం పంచుకోవడం అంటే  వర్షంలో సింధూరం నుదుటికి  అద్దుకున్నట్టే, అందుకనే చెప్తున్నాను బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి రండి."  అన్న సూర్య మాటలు గుర్తుకు వచ్చిన వెంటనే అద్దం దగ్గరకెళ్ళి సింధూరం సరిచేసుకుంది వెన్నెల. వెనువెంటనే  నీకు  తోడున్నామంటూ కన్నీళ్ళు మళ్లీ మొదలయ్యాయి.

               "శుక్లా ఎందుకు ఫోన్ చేసాడు?నౌక మీద దాడి  జరిగింది!? ... సూర్య దాడి జరిగిన నౌకలో వున్నాడన్న అనుమానంతోనా !!... సూర్యకి ఏదైనా జరిగిందేమోనన్నా సందేహంతోనా!. ఒకవేళ ఏదైనా జరిగి వుంటే నన్ను సంసిద్ధం చేద్దామ‌నా... ఎందుకు చేసినట్టూ...ఏం జరిగినా, నేనేంత ఏడ్చినా దేశ రక్షాణార్థం శుక్లా ఏం చెప్పడు, చెప్పలేడు,చెప్పకూడదు." అని తనలో తానే మాట్లాడుకుంటోంది వెన్నెల.

              అంతులేని, అవగతమవని నిస్స‌హాయ దుస్థితిలో ఉన్నప్పుడు మనిషికి స్ఫురణకొచ్చేది శరణాగతే. ఏదో అతీతమైన, అద్భుతమైన  శక్తుంది అది నన్ను నడిపిస్తుంది, కాపాడుతుంది అని అనుకుంటే అది నమ్మకం. ఆ నమ్మకంపై దృష్టి నిలిపితే భక్తి. నీవు తప్ప దిక్కులేదు అని ఆ నమ్మకాన్నే భక్తితో అర్ధిస్తే అదే శరణాగతి. 

               "భగవంతుడా... నువ్వే నాకు శరణు... నా చెంతన సూర్య లేకపోయినా పరవాలేదు... భారతమాత ముద్దుబిడ్డగా అతడికి ఇష్టమైన యుద్ధ‌రంగం లోనే ఉండనీ... ఎక్కడున్నా ఆయన నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి. ఆ విషయం నాకు తెలిస్తే చాలు...." అని వేడుకుంది.

        ‌‌     ఎంతటి ఎదురు దెబ్బ తగిలినా కాస్త వేగాన్ని పెంచుతుందే కాని విశ్రమించదు గుండె. అదే గుండెనిబ్బరం. చిన్న పాటి అదిరిపాటుకే భయపడి మూసుకునే కళ్ళు, గుడ్లు కక్కుకునేలా ఏడ్చి, ఏడ్చి ఎప్పుడు విశ్రమించాయో తెలియనేలేదు వెన్నెలకి.
             
ఆ నిదురన్నదే లేకపోతే ఊపిరాడని మనసులకు  ఊరట లేక ఎన్ని ప్రాణాలు ఉస్సూరుమనేవో!!. ఆవేధన భరించలేక ఎన్ని ఆక్రందనలు గాలిలో కలిసేవో. నిజమే.. నిదుర మరణం ఎన్నో కఠోరమైన నిజాలకి, నిట్టూర్పలకి, నిరాశా నిస్పృహలకి. ఉదయం జననం ఎన్నో ఆశలకీ, అవకాశాలకి, బ్రతికి నిరూపించాలన్న ఆశావాహా దృక్పథానికి.
            "ఏమే వెన్నెల, వెన్నెల" అని తలుపు తడుతోంది రత్నం. ఎంత సేపటికీ తలుపు తీయలేదు వెన్నెల.
             ఒక అరగంట తర్వాత మళ్ళీ " ఏమేవ్! వెన్నెల ఈ రోజు కార్తీక సోమవారమే దాన్ని స్కూలుకి కూడా పంపాలి ...లే! లే!" అని ఒక చేతిలో ముగ్గు గిన్నె పట్టుకొని మరో చేత్తో తలుపు తడుతోంది రత్నం‌. "వస్తున్నా" అని హాసినిని తీసుకుని బయటకొచ్చి పళ్లు తోమించి, స్నానం చేయించి జడ వేస్తోంది వెన్నెల.

"మతి గాని పోయిందేంటే వెన్నెల.. ఒంటి జడ వేస్తున్నావు దానికి" అని వంట గదిలోకెళ్ళింది రత్నం.
"ఏమ్మా! ఇంకా రెడీ చేయలేదా... హాసిని తల్లి రా..రా" అని  బైక్ స్టార్ట్ చేసాడు నాయుడు.
"అమ్మా బై‌...బై" అని వాళ్ళ తాత బైక్  ముందెక్కి కూచొని స్కూల్ కెళ్ళింది హాసిని.

              " వెన్నెల!  నేను,  మావయ్య సత్యవతమ్మ  గారింటికి వెళ్తున్నాం. ఆవిడ  ఆరోగ్యం  బాగులేదంట.  మధ్యాహ్నం వచ్చేస్తాం. భోజనం రెడి చేసి వుంచు" అని చెప్పింది రత్నం.

            "కడుపుతో వున్న పిల్ల ఏంచేస్తుంది. నువ్వే భోజనం రెడి చెసెయ్యవే రత్నం. కాసేపాగి బయల్దేరదాం" అన్నాడు నాయుడు.

           "ఆ... మీకే వుంది కోడలు మీద  ప్రేమ. కానుపు సుఖంగా అవ్వాలంటే ఆమాత్రం పనిచేయాలి. తప్పేం లేదు. అయినా నేను కాయగూరలు కోసి వుంచాను. స్టౌ మీద పెడితే సరిపోతుంది...రండి...రండి." అంటూ ఇంటి నుంచి బయటికి నడిచి నాయుడి గారి బైక్ దగ్గర నుంచుంది.

"అమ్మా! జాగ్రత్తా" అని వెన్నెల వైపు చేయూపుతూ నాయుడు గారు వాళ్ళావిడని అనుసరించారు.
" ఏమే వెన్నెల! నైసీకి తినడానికేమైనా పెట్టు"  నాయుడు గారి బైక్ మీద వెళ్తూ కోడలికి ఉత్తర్వు జారీ చేసింది రత్నం.

         "ఇదిగో తిను" అని కంచంలో నాలుగు బిస్కెట్లు పెట్టి  నైసీ ముందుంచి తాను సోఫా మీద కూచుంది  వెన్నెల.

         నైసీ బిస్కెట్ల వైపు చూడకుండా వెన్నెల కళ్ళు కారుస్తున్న కన్నీటి వైపే చూస్తోంది. నైసీ  సోఫా మీద కెక్కి దాని ముందరి రెండు కాళ్ళు వెన్నెల భుజం మీద పెట్టి తన నోటితో కరుచుకు వచ్చిన నాప్కిన్ తో వెన్నెల చెంపలు తుడవడానికి ప్రయత్నిస్తుంటే వెన్నెల మరింత ఉద్వేగానికి గురైంది.  

నైసీ తల మీద చెయి వేసి నిమిరుతూ.. "ఏమే నైసీ,  మీ ఆయనెక్కడున్నాడే ? ఎలా వున్నాడే? నువ్వైనా చెప్పవే నాకు దిక్కు తోచట్లేదే" అని ఏడుస్తుంటే నైసీ సోఫా మీద నుంచి దిగి వెన్నెల చీరకొంగు లాగుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కి తీసుకెళ్ళి కూచోబెట్టి టిఫిన్ ఉన్న  గిన్నెని వెన్నెల వైపుగా జరిపి తినమన్నట్టుగా సైగ చేసింది.
అప్పుడు కూడా వెన్నెల  కన్నీళ్ళే కారుస్తోంది కాని  నైసీ అందించిన ప్రేమ వల్లనేమొ ఆ  కన్నీటిలో కాస్త  తియ్యదనం కలిసింది. కాస్త వూరట లభించి గుండె బరువు తగ్గింది.
*
        
 "ఏంటే వెన్నెల వారం రోజులనుంచి చూస్తున్నాను..... ఎందుకలా వుంటున్నావ్... ఒక సారి డాక్టర్ గారి దగ్గరకి తీసుకెళ్ళనా"  అనునయంగా అడిగింది రత్నం.

             "ఏమి లేదత్తమ్మా!"  ముభావంగా సమాధానం చెప్పి "రా! హాసిని పడుకో" అని తీసుకెళ్ళి తన గదిలోకి  నిద్రబుచ్చుతోంది హాసినిని.
బయట నైసీ ఒకటే మొరుగుతోంది.

           "నైసీ అరవకు ....హాసిని పడుకుంటుంది " అని అరుస్తూ బయటకొచ్చి చూసేసరికి వెన్నెలకి ఒక్క క్షణం ఏమౌతోందో అర్థం కాలేదు.
   
    నైసీ సూర్య మీదకెక్కి తన ఒళ్ళంతా నాకుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

       వెన్నెల కి నోట మాట రాలేదు. గుండె తేలికయ్యి  తన  కళ్ళల్లో తియ్యని గోదారి సుడులు తిరుగుతున్నాయి. మన సంస్కృతిలో జంతువులకున్నంత  స్వేచ్ఛ‌ మనుషులకి లేదు. భార్యాభర్తల మధ్య  అభిమానం, ఆకర్షణ, అనురాగం ఆ నాలుగు గోడలకే పరిమితమై అక్కడినుంచి సరాసరి గుండె నాలుగు గదులలో తిష్ట వేసుకుని కూచుంటాయెమో అవి తమ వారిని చూసిన వెంటనే  కట్టతెచ్చుకుని‌ పరిగెట్టిస్తాయి మనసుని, మనిషిని.  

         వెన్నెల సూర్య వైపు వెళ్తుండగా... మెట్ల మీద నుంచి దిగుతున్న రత్నం "బాబు ఎప్పుడు వచ్చావు రా, ఎలా వున్నావురా"  అనడుగుతూ సూర్యకి దగ్గరగా వెళ్తుంది. కానీ సూర్య కళ్ళు ఇంటి లోపలినుంచి వస్తున్న వెన్నెలను చూస్తున్నాయి. వెన్నెల తన కన్నీరు వాళ్ళత్త చూస్తుందేమొ అని వెంటనే తన గదిలోకి వెళ్లిపోయింది.

     "రారా!! "అంటూ సూర్య చేయిపట్టుకుని నాయుడిగారి  దగ్గరకి తీసుకెళ్ళింది రత్నం.

       " నాన్నా!! బాగున్నావా ?. వెన్నెల ఎందుకో   కొన్ని రోజుల నుంచి చాలా దిగులుగా ఉంటుంది చూడరా"  కొడుకుని తనివితీరా  చూసుకుని, తల నిమురుతూ అన్నాడు నాయుడు.

"నెలలు నిండుతున్నకొద్ధి అలాగే ఉంటుంది లెండి" అని  జ్యూస్ తో  వున్న గ్లాసుని సూర్యకి అందించింది  రత్నం.

          "అలా కాదే రత్నం .. వెన్నెల ఏదో బాధపడుతుందే" సూర్యవైపు ఆ సంగతేంటో చూడు అన్నట్టు సైగ చేస్తూ అన్నాడు నాయుడు.

          "నేనొచ్చాను కద నాన్నా.... చూసుకుంటానులే" అని అక్కడ నుంచి  తన గదిలో కెళ్లేటప్పటికి వెన్నెల అటు వైపుగా కూర్చుని ఉంది. 
          "ఎంతైనా మొదటి భార్య మొదటి భార్యే నేనొచ్చిన వెంటనే ముద్దుల్లో  ముంచేసి, నలిపేసి తన ప్రేమలో తడిపేసింది. నువ్వు చూడు ఎంత వూరిస్తున్నావో" అని  సూర్య‌ వెన్నెల వైపు చూస్తున్నాడు.

            వెంటనే వెన్నెల  సూర్య వైపు విసురుగా తిరిగి "అవును మీ లాంటోళ్ళకి మనుషులెందుకు, కుక్కలే కరెక్ట్" అని కన్నీటిని తుడుచుకుంది.

" ఏమైంది వెన్నెలా" అంటూ‌ దగ్గర కి తీసుకున్నాడు సూర్య.

         "శుక్లా పోయిన ఆదివారం అర్థరాత్రి ఫోన్ చేసి నువ్వే షిప్ లో  వెళ్ళావని అడిగాడు. అప్పటినుండి  నేనెలా బ్రతుకుతున్నానో  నాకే అర్థం కావట్లేదు" అని సూర్యని గట్టిగా హత్తుకుంది.

               "వాడికేదో డౌట్ వచ్చి వుంటుంది. అంతేగాని ఏమి అవలేదు. అయినా నువ్వింత పిరికిదానివనుకోలేదు. అనవసరంగా చేసుకున్నాను ఈ పిరికి పిల్లని"  మొట్టికాయ వేస్తూ అన్నాడు.

            "నీ కోసం ఒకటి తెచ్చాను" అని తనజేబులో వున్న మల్లెపూలు తీసి ఇవ్వబోతుండగా  "వెన్నెల ఒకసారి రా " అని బయట నుంచి రత్నం పిలిచింది.
"ఆ!! వస్తున్నా" అని బయటికెళ్లి రత్నం వైపు చూసింది.

               "ఏడో నెల జాగ్రత్త!!" అని చెప్పి వెన్నెల చేతికి నీరు నింపిన రాగి చెంబునిచ్చి తన గదిలోకి వెళ్లి పోయింది రత్నం.

              "మా అమ్మ  ఎందుకు పిలిచింది?"  వెన్నెల చేతిలో మల్లెపూలు పెడుతూ అడిగాడు సూర్య.
           "మీ మల్లె పూలు ఇప్పుడు పెట్టుకోకుడదట"  మల్లె పూవులా నవ్వుతూ అంది వెన్నెల. ఎన్నో రోజుల తర్వాత ఆ గదిలో సూర్యుడు వెన్నెలలు కురిపిస్తున్నాడు.

*   *    *

             " అమ్మా! నేను  వెన్నెలని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను. నాన్నని హాసినిని స్కూలునుంచి తీసుకురమ్మను.  స్కాన్ తీయాలంటున్నారు  సాయంత్రం వచ్చేసరికి లేటవ్వచ్చు." అని సూర్య , వెన్నెలని తీసుకుని బయటకెళ్ళాడు.

              "ఏంటి అత్తమ్మకి అబద్ధం చెప్పావ్" కారు సీటు బెల్టు పెట్టుకుంటూ అడిగింది వెన్నెల.

              "నిజం చెప్తే బోలెడు సెంటిమెంట్ లు చెప్తుంది మీ అత్త. అయినా నిన్న నేనొచ్చినప్పుడు నీ మొహం చూసి నాకు దిగులు పట్టుకుంది. అందుకే ఈ రోజు నిన్ను అలా బయట తిప్పుదామని నిర్ణయించుకున్నాను. ఎక్కడకి వెళ్తాం చెప్పు?"   కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు సూర్య.

            భర్త బయటికి తీసుకెళ్తున్నాడు అన్నదానికన్నా తన బాధని, మనసుని అర్థం చేసుకున్నాడన్న ఆనందం వెన్నెల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
            "మీ ఇష్టం అండి. ఎక్కడికైనా పర్లేదు చివర్లో ఆర్.కే. బీచ్ కి మట్టుకు ఖచ్చితంగా తీసుకెళ్లాలి" ముద్దుగా అడిగింది వెన్నెల.

                 "నిన్నటి వరకు ఆ సముద్రంలోనే ఉన్నానే వెన్నెల, మళ్ళీ సముద్రానికే తీసుకుని వెళ్లమంటే ఎలా?" అని జాలిగా మొహం పెట్టాడు సూర్య.
                 "అందుకే ఆ సముద్రం దగ్గరకి తీసుకుని వెళ్లమంటున్నాను. నిన్నెప్పుడు తన దగ్గర వుంచుకుంటుందిగా కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెబుదామని"  సూర్య వైపు ప్రేమగా చూస్తూ అంది.
            "అంటే తప్పదంటావ్,  ఏదేమైనా బీచ్ కి వెళ్ళాలి అంతేగా!!" అని కారు స్పీడ్ చిన్నగా పెంచాడు సూర్య.

*   *    *

"ఆ! జాగ్రత్త " అంటూ వెన్నెలకి చేయందించాడు. కారు దిగింది వెన్నెల.
సూర్య, వెన్నెల సముద్రపు ఒడ్డున నడుస్తున్నారు.
"కాస్త నెమ్మదిగా నడవండి" సూర్య చేయి గట్టిగా పట్టుకుని ఆపింది .

"పోనీ కూచుందామా వెన్నెల"  అలల గాలికి చెదిరిన వెన్నెల ముంగురులను సవరిస్తూ అన్నాడు.
"నేనిప్పుడు కింద కూర్చోలేను సూర్యా " నీరసంగా అంది వెన్నెల.

                  "చూడు,  ఆ చివరన సోఫాలు, కుర్చీలు అద్దెకు  ఏర్పాటు చేశారు .. నాలుగు అడుగులేస్తే చాలు " వెన్నెల చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు  సూర్య.
                " వెన్నెల మా అమ్మతో ఎలా ఉంటున్నావో  ఏంటో ? ఆవగింజంత విషయానికి కూడా ఆకాశమంత అరుస్తుంది"   నవ్వుతూ అడిగాడు సూర్య.

                "అమ్మ అంటే ఆకాశమేగా మరి; అందుకే అలా అప్పుడప్పుడు  ఉరుముతూ ఉంటుంది ప్రేమగా " అంది వెన్నెల కూడా అంతే అందంగా నవ్వుతూ.
"ఇలాంటి మాటలతోనే మా అమ్మతో నెగ్గుకొస్తున్నావే, ఎంతైనా గడసరి కోడలివే "  అని వెన్నెల బుగ్గలని పుణికాడు.

             "ఆ! మరే మీరు మీ అమ్మ అమాయకులు. మీరు యుద్ధం గెలవాలంటే అస్త్రాలు ఉపయోగించాలి. మరి మొగుడు పక్కన లేకుండా అత్త ప్రేమను  గెలవాలంటే  మాటలే ఆయుధాలు"  అని చిన్నపాటి గర్వం తో  వెన్నెల చెప్తుండగా  సూర్య తన  ఫోన్ వైపు తదేకంగా చూస్తున్నాడు.

               వెన్నెల "ఏంటి అంతలా చూస్తున్నారు" సూర్య చేతితో ఉన్న  ఫోన్ ని తీసుకుని స్క్రీన్ పై వున్న ఫోటోని చూసి  "అబ్బా! ఎంత బాగుంది ?  ఎవరీ చిట్టీ తల్లి చాలా బాగుంది.‌అయినా ఇంత ముద్దులొలికే ఫొటో చూస్తూ మీరెందుకు విచారంగా మొహం పెట్టారు" అని ప్రశ్న మీద ప్రశ్న వేసింది వెన్నెల.

               "వెన్నెల  హాసిని డెలివరీ అప్పుడు నేను రాలేదని బాధపడ్డావ్ అప్పుడు నేను నీకో విషయం చెప్పాను గుర్తుందా  మా ఫ్రెండ్ బెహ్రాకి పాప పుట్టిందని"  చెప్తుండగా మధ్యలో మాట అందుకుని వెన్నెల "అవునండి గుర్తుంది. మీ ఫ్రెండ్ భార్య డెలివరీ టైం లోనే చనిపోయిందన్నారు.....ఆ పాపేనా? పాపం తల్లి లేకుండా చేసాడు దేవుడు" దైన్యంగా  సూర్య వైపు చూసింది.

              "తల్లే కాదు వెన్నెలా... ఇప్పుడు తండ్రి కూడా....." గొంతు గద్గదమైంది, కంటి వెంట కన్నీటి జీర  మాట్లాడలేక పోయాడు సూర్య.

"ఏమైందండి!?" భర్త భుజం మీద చెయ్యి వేసింది.
                
"నువ్వన్నది నిజం వెన్నెల.  మాలాంటి వాళ్ళకి మనుషులతో పెళ్లిళ్లనవసరం నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోతాం మిమ్మల్ని" అన్నాడు సూర్య, వెన్నెల కళ్ళల్లో కి చూస్తూ.

              "మీరు నేను నిన్న రాత్రి అన్న మాటని  సీరియస్ గా తీసుకున్నారా! అది నాకు మీ మీదున్న ప్రేమండి. మీరెందుకు రాలేదోనన్న భయం. ఏ విషయం ఎవరిని అడగలేని, అడగకూడని నిస్సహాయత. మీరెలా వున్నారో తెలీయక నేను పడిన ఆందోళనలో అలా అన్నాను. నిజం చెప్పనా సూర్య, నీతో క్షణకాలం సహచర్యానికైనా కోటి జన్మల తపస్సు చేయాలి. ఎంతో అదృష్టం నీ ఇల్లాలినయ్యాను"  సూర్య చేతిలో చేయి వేసి గట్టిగా వత్తుతూ అంది.

                  "ఏదేమైనా నువ్వన్నదాంట్లో నిజం ఉంది.  నిన్న చెబితే నువ్వు భయపడతావని, బాధ పడతావని చెప్పలేదు. శుక్లా అనుకున్నది నిజమే. మా నౌకపై దాడి జరిగింది. శత్రువుపై ప్రతిదాడి చేస్తున్నప్పుడు నన్ను కాపాడబోయి తను.... తను.... మిగిలిన వివరాలు నేను చెప్పకూడదు. కాని...... ఇప్పుడు ఆ చిట్టితల్లికి ఒక మామ్మ తప్ప ఎవరూ లేరన్నది నిజం" మాట.. మాట కూడబలుక్కుని వచ్చే కన్నీటిని ఆపుకుంటూ చెబుతున్నాడు సూర్య.

         "ఆ పాపను మనం పెంచుకుందాం. ఆ మామ్మను కూడా మనమే చూసుకుందాం. మనింటికి తీసుకొచ్చెయండి" అంది వెన్నెల చెమ్మగిల్లిన కళ్ళతో.

"నిజంగా అంటున్నావా వెన్నెలా!!"  ఆశ్చర్యంగా, విస్మయంగా చూసాడు సూర్య.

             "అతడు ప్రపంచానికి దేశం కోసమై ప్రాణాలు విడిచిన భరతమాత ముద్దుబిడ్డడైతే నాకు నా ప్రాణమైన మిమ్మల్ని కాపాడిన దేవుడు. ఆ దేవుడు కన్నబిడ్డని పెంచడం, అతనిని కన్నతల్లిని చూడడం నా కర్తవ్యం.. అంతకు మించిన అదృష్టం." అంది నిశ్చయంగా వెన్నెల.

              "రెప్పొద్దున్న నాకే ఏమైనా అయితే" అని  అనబోతున్న సూర్య నోటిని  తన అరచేతితో  మూసింది వెన్నెల.

              "ఎన్నో సార్లు చెప్పాను మీరీ మాట అనొద్దని. ఏమౌతుందండి!?  నా నుదుటి కుంకుమ దేశసౌభాగ్యాన్ని  కాపాడడానికి రక్త సింధూరమై భరతమాత నుదుటిపై చేరుతుంది అంతేగా!!..మీరు దిద్దిన ఈ సింధూరం ఎన్నటికీ వాడని మందారం"  అని సూర్య చేతిలో చేయివేసి అతని కళ్ళలోకి చూస్తూ చెబుతున్నప్పుడు ఒక్కసారిగా ఇద్దరి కనుల చివరి కన్నీటి చుక్కలు రాలుతున్నాయి మనదేశపు పచ్చద‌నానికై కురిసిన తొలికరిలా......


- భాగ్యలక్ష్మి  అప్పికొండ