TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
శిడిమాను
ఎడ్లబండి పల్లంలోకి వచ్చింది. ఒక్కసారిగా జోడెద్దులు జోరందుకున్నాయి. దాంతో పట్టుతప్పిన కావేరి వెనక్కి తూలింది. రామచంద్ర పట్టుకోనట్లయితే కింద పడిపోయేదే. "అమ్మో" అంటూ రామచంద్ర గుండెల మీద తలవాల్చి అతన్ని గట్టిగా పట్టేసుకుంది.
అబ్బాయిని గట్టిగా పట్టుకొని కూర్చో అమ్మాయ్" అన్చెప్పింది రామచంద్ర తల్లి రత్నాంబ. సిగ్గుపడింది కావేరి. సరిగా కూర్చొని, పక్కనే ఉన్న కర్రను పట్టుకుంది. బండిలో కూర్చొని ఉన్న మిగతా ఆడాళ్లు ఆ జంటను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
ఆ బండే కాదు, ఎన్నో బళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా పోతున్నాయి, నాగార్పమ్మ శిడి ఉత్సవాన్ని చూడ్డానికి. నాగార్పమ్మ (నాగవరపమ్మ) అంటే గ్రామ దేవత. రైలుకట్ట మీదుగా కొత్త కాల్వ బ్రిడ్జి దాటి జీడిమామిడి తోటల మధ్య నుంచి ఇసుకలో పోతే అల్లంత దూరంలో మామిడి తోటల మధ్య కొలువు తీరిన నాగర్పమ్మ గుడికెళ్లాలంటే సొన దాటుకుని పోవాలి. ఎంత ఎండాకాలమైనా నీళ్లుండటం ఆ సొన విశేషం. ఎడ్ల బళ్లు సొన అవతల ఆగిపోయాయి. బళ్లు తోలేవాళ్లు బళ్లనీ, ఎద్దుల్నీ అక్కడి మామిడి చెట్లకి కట్టేసి, ఎద్దుల ముందు గడ్డిమోపులు పడేస్తున్నారు.
మగాళ్లు ఫ్యాంట్లు, ఆడాళ్లు చీరలు మోకాళ్ల దాకా ఎత్తి పట్టుకుని సొనలో దిగారు. చీరెత్తి పట్టుకోవాలంటే ఎక్కడ లేని సిగ్గూ, బిడియం ఆవరించాయి కావేరిని. "నా వల్ల కాదు" అంది చిన్నగా రామచంద్రతో.
"అయితే చేతుల్లో ఎత్తుకొని తీసుకెళ్లేదా?" అన్నాడు సరదాగా కన్నుగీటుతా.
"ష్" అంటా కళ్లతో కాస్త కోపాన్ని అభినయించి, చీర కుచ్చిళ్లు కాస్త ఎత్తి పట్టుకుని నీళ్లలోకి దిగింది. చల్లగా తగిలాయి నీళ్లు. ఆమె చేయి పట్టుకొని, చిన్నగా నడిపిస్తూ ఇవతలకి తీసుకు వచ్చాడు రామచంద్ర.
"అబ్బా" అంది కావేరి.
"ఏంటి?" కంగారుగా అడిగాడు.
"కాలిమీద ఏదో కుట్టింది."
ఏదో అర్థమైనట్లు ఆమెను అక్కడే ఉన్న బండరాయి మీద కూర్చోబెట్టి, ఆమె కాలిని చేతుల్లోకి తీసుకుని చూశాడు. పిక్కమీద నల్లగా జలగ! గట్టిగా లాగేసి, టక్కున నీళ్లలోకి విసిరేశాడు. అప్పటికే అది నెత్తురు తాగిన దానికి గుర్తుగా ఎర్రటి చార.
"ఏంటది?" అడిగింది.
"అది జలగ. సిటీ అమ్మాయివి కదా, ఇప్పటి దాకా చూసుండవు. అవునా" అన్నాడు. అవునన్నట్లు తలూపింది.
"ఏం కాదుగా?" అడిగింది, కాలివంక చూసుకుంటా.
"ఏం కాదు. నేనున్నానుగా" ధైర్యం చెప్పాడు.
గుడివద్ద గోలగోలగా అరుపులూ, "నాగార్పమ్మకీ జై" అన్న కేకలూ వినిపించాయి.
"రా.. రా..." అంటూ అమెను అటు తీసుకుపోయాడు.
శిడిమానును పైకి లేపుతున్నారు. పెద్ద దూలానికి చివర బోను, ఆ బోనులో మేక. దూలాన్ని పూర్తిగా పైకిలేపారు. పూజారి ఏవో మంత్రాలు చదివి, "కానీయండి" అనగానే అక్కడున్న జనం చేతుల్లోని పూలు, అరటిపళ్లు పైకి విసిరి వేస్తున్నారు. వాటిలో కొన్ని బోనుకీ, దాని లోపల ఉన్న మేకకీ తగులుతున్నాయి.
రామచంద్ర, కావేరి కూడా పూలు విసిరారు.
"భలే ఉంది ఈ ఆచారం. ఆ మేకనే చేస్తారు?" అడిగింది కావేరి.
"అమ్మవారికి బలిస్తారు. అలా చేస్తే ఊళ్లో బాగా వానలు పడతాయనీ, కరువు కాటకాలు ఉండవనీ జనం నమ్మకం" చెప్పాడు.
"అయ్యో పాపం మేక" అంది జాలిగా.
"ఇప్పుడు నయం. దాని మీదకు పూలు విసిరేస్తున్నారు. ఒకప్పుడైతే టెంకాయలు విసిరేసేవాళ్లు. అవి తగిలి ఆ మేక ఎంత నరకం అనుభవించేదో."
"మరి టెంకాయల బదులు పూలెందుకేస్తున్నారు?"
"దానికో చిన్న కథుంది. వింటానంటే చెబుతా."
"సరే"
వాళ్లమ్మకు చెప్పి కావేరిని గుడి వెనకున్న మామిడి తోటలోకి తీసుకుపోయాడు రామచంద్ర. ఒక చెట్టుకింద శుభ్రం చేసుకుని కూర్చున్నారు.
"ఇంత ఎండలోనూ ఎంత హాయిగా ఉందిక్కడ. ఇలాంటి చోట ఇల్లు కట్టుకొని ఉంటే ఇంకెంత బావుంటుందో" అంది కావేరి, అతడి భుజం మీద తలవాల్చి.
"అమ్మాయిలో భావుకత్వం ఉబుకుతుందే" అన్నాడు, గాలికి ముఖం మీద పడుతున్న ఆమె ముంగురుల్ని సరిచేస్తా.
"సరే సరే. ఇందాకటి కథ చెప్పు" అంది, అతడి చేతిమీద గీతలూ గీస్తా.
గొంతు సవరించుకున్నాడు రామచంద్ర. "దాదాపు ఇరవై ఏడేళ్ల కింద జరిగిన కథ.. కాదు సంఘటన ఇది.." అంటా మొదలు పెట్టాడు.
* * *
పదేళ్ల కొడుకు చిన్నాని వెంటబెట్టుకుని వెళ్లాడు మల్లయ్య, నాగార్పమ్మ శిడి ఉత్సవానికి. శిడిమాను తిప్పడానికి కొంత సమయం పడుతుందని తెలిసి గుడెనక ఉన్న తమలపాకుల తోటలోకెళ్లారు తండ్రీ కొడుకులు.
వాళ్లమాదిరే కొంతమంది ఆ తోటలో తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటే, ఇంకొంతమంది పేకాడుతూ కూర్చున్నారు. చిన్నాకి ఆ తోటలో ఉంటే చాలా హాయిగా అన్పిచ్చింది. తమలపాకుల పాదులు, పందిళ్లకు పాకిన తమలపాకుల తీగలు, మధ్యమధ్యలో మామిడి చెట్లు, ఆ పాదులకు ఆనుకొని మొదలైన అరటి తోటలు.. బయట మండిపోతున్న రోహిణీ కార్తె ఎండలకు విరుద్ధంగా చల్లటి వాతావరణం. అక్కణ్ణించి కదలాలనిపించలేదు.
"నాన్నా. నాకా మావిడికాయ కావాలి" అనడిగాడు చిన్నా, ఓ చెట్టుకు కనిపిస్తున్న మామిడికాయను చూపిస్తా. తిరనాళ్లకొచ్చే జనం దులిపేస్తారనే భయంతో తోటలోని మామిడికాయల్ని రెండు రోజుల ముందే యజమాని కోసేశాడు. కనిపించలేదేమో ఆ ఒక్క మామిడికాయ మిగిలిపోయింది.
మల్లయ్య ఎగిరాడు కానీ ఆ కాయ అందలేదు.
"చెట్టెక్కి కోస్తా" అన్నాడు చిన్నా. "సరే"నని కొడుకుని చెట్టెక్కించాడు మల్లయ్య.
కష్టపడి ఆ కాయని ఎట్లాగో పట్టుకొని కోశాడు చిన్నా. కిందకు దిగుతున్న అతడికి గుడి దగ్గిర శిడిమాను పైకిలేస్తున్న సన్నివేశం కనిపించింది.
"నాన్నా. అక్కడ మేకను పైకి లేపుతున్నారు" అని చెప్పాడు.
"అదేరా శిడి. తొందరేం లేదులే. నెమ్మదిగా దిగు" చెప్పాడు మల్లయ్య. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆదరాబాదరాగా దిగేంతలో కాలు పట్టుతప్పింది. సర్రున జారిపోయాడు చిన్నా. నయం. కిందపడలేదు. మొదలు నుంచి కొమ్మలు వేరయ్యే చోట పడ్డాడు. ఒక కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు, కిందపడకుండా.
"అరెరే..." అంటా కొడుకుని కిందికి దించాడు మల్లయ్య.
చేతిమీద చల్లగా ఏదో పడింది. చూస్తే నెత్తుటి చుక్క. అప్పటికే చేయి చూసుకుంటున్నాడు చిన్నా. ఎడమచేయి మధ్యలో చర్మం చీరుకుపోయి ఎర్రగా కనిపిస్తోంది. ఆ నెత్తుటి వెనుక తెల్లటి చర్మం.
గబగబా దగ్గర్లో ఉన్న ఏదో మొక్క ఆకుల్ని కొన్ని తుంచి, వాటిని గట్టిగా వొత్తాడు. రసం బొట్లు బొట్లుగా గాయం మీద పడ్డాయి. మంటతో "అమ్మా" అన్నాడు చిన్నా.
"ఓర్చుకో. దెబ్బ తొందరగా మానిపోతుంది ఈ రసంతో" ధైర్యం చెప్పాడు మల్లయ్య.
ఇద్దరూ శిడిమాను కాడికి పోయారు. శిడి పూర్తిగా పైకిలేచింది. దూలాన్ని కింద స్తంభానికి గట్టిగా కట్టేశారు. బోనులో ఉన్న మేక మొహాన పసుపు, కుంకుమ బొట్లు. మెడలో దండ.
ఏవో మంత్రాలు చదువుతా "కానియ్యండి" అన్నాడు పూజారి.
మరుక్షణం అక్కడే ఉన్న ఒక పెద్దాయన, చేతిలోని టెంకాయని గట్టిగా విసిరాడు. అది మేక మొహంవేపు బోనుకు గట్టిగా తగిలింది. ఠప్పున పగిలింది కాయ. ముక్కలు చెల్లా చెదురుగా పడ్డాయి. మేక భయంతో "మే.. మే.." అనరిచింది.
ఆ తర్వాత అక్కడున్నవాళ్లంతా టెంకాయలు మేకమీదికి విసురుతున్నారు. విపరీతమైన భయంతో మేక అదేపనిగా అరుస్తోంది. బోనుకు తగిలి పగిలిన కొబ్బరి చిప్పలు కొన్ని దాని వొంటికి తగులుతున్నాయి. అది కేకలు పెడుతుంటే కిందనున్న జనం కేరింతలు కొడుతున్నారు. రాక్షసానందంతో ఈలలు వేస్తున్నారు. చూసిన చిన్నా "అయ్యో పాపం మేక" అన్నాడు జాలిగా.
మేక పడుతున్న బాధ చూస్తుంటే చిన్నారి చిన్నా గుండెను ఎవరో మెలి తిప్పుతున్నంత బాధగా ఉంది. పొట్టలో దేవినట్లుగానూ ఉంది. కళ్లముందు ఒక ప్రాణమున్న మేకని అట్లా కొట్టి హింసిస్తూ అక్కడి జనం ఎట్లా ఆనందం పొందుతున్నారో అతడికి అర్థం కావడం లేదు.
"నాన్నా, పాపం ఆ మేకని అట్లా బాధపెట్టడమెందుకు? చూడు అదెట్లా వొణికిపోతోందో. ఒకేసారి దాన్ని చంపెయ్యొచ్చు కదా?" అడిగాడు తండ్రిని బాధగా.
కొడుక్కి ఏమని చెబుతాడు మల్లయ్య. "అది ఆచారంరా అబ్బాయ్. మనం ఏమీ చెయ్యలేం. ఆచారాన్ని మార్చలేం" అన్నాడు.
తండ్రి మాటలు చిన్నాకి నచ్చలేదు. కానీ తండ్రి ఈ విషయంలో ఏమీ చెయ్యలేడనే సంగతి అర్థమైంది. మేక పడుతున్న కష్టం, దాని కదలికల్లో తెలుస్తున్న మరణ భయం అతడి చిట్టిగుండెని నిలవనీయకుండా చేస్తోంది.
ఆ పనిని ఎట్లాగైనా అడ్డుకోవాలి. మేకని కాపాడాలి. కానీ ఎట్లా? కింద వందలమంది జనం.. ఎక్కడెక్కణ్ణించో వొచ్చి ఈ దారుణమైన పనిని చూస్తా ఆనందం పొందుతున్న వాళ్లని ఎట్లా ఆపడం?
చిన్నా ప్రాణం కొట్టుకుపోతోంది. ఒకటే ధ్యాస. ఆ దారుణాన్ని ఆపాలి. మేకని ఆ హింస నుంచి కాపాడాలి. ఎక్కణ్ణించి వొచ్చిందో అంత మొండి ధైర్యం!
తండ్రి చేతిని వొదిలించుకుని సర్రున పరిగెత్తాడు. మల్లయ్య తేరుకునేలోపే శిడిమాను దూలం వొద్దకు చేరుకున్నాడు.
"రేయ్ చిన్నా.. అబ్బాయ్.. ఆగరా.. ఎక్కడికి?" అంటా వెంటపడ్డాడు మల్లయ్య. అక్కడి జనం ఆశ్చర్యంగా, కళ్లు పెద్దవి చేసుకుని చూస్తున్నంతలోనే దూలం మీదికి ఎగిరి, పైన పడుకుని, గట్టిగా పట్టుకున్నాడు. బల్లిలా దానిపై పాక్కుంటూ పోయాడు.
మల్లయ్య గుండె గుభేల్మంది. ఓవైపు జనం శిడిమాను మీదికి టెంకాయలు విసిరి కొడుతూనే ఉన్నారు. అవి చిన్నాకి తగిలితే.. వొణికిపోయాడు. వొళ్ళంతా చెమట్లు పట్టేశాయి.
"రేయ్ అబ్బాయ్. ఏం చేస్తున్నావ్. కిందికి దిగరా. ప్రెమాదంరా. దెబ్బలు తగుల్తాయిరా" అని కేకలు పెట్టాడు. జనం గోలలో అతడి మాటలు చిన్నాకి వినిపించలేదు. వినిపించినా పట్టించుకునే స్థితిలో లేడు.
దూలంపైన పాక్కుంటూ బోను దగ్గరకు చేరుకున్నాడు చిన్నా. అసలే అంతకుముందు చెట్టుమీద జారి చీరుకుపోయిన చెయ్యి. పాకుతుంటే రాపిడై నెత్తురు కారుతోంది. బాధను పంటి బిగువున ఓర్చుకుంటా బోనుని పట్టుకున్నాడు. టెంకాయలు విసరొద్దని అడ్డంగా చేయ్యి ఊపాడు.
అతణ్ణి చూస్తున్నా, జనం టెంకాయలు విసరడం ఆపలేదు.
"అయ్యా ఆపండి. టెంకాయలు విసరమాకండి" అని గట్టిగా అరుస్తున్నాడు మల్లయ్య ఏడుస్తా. అంతలోనే జరగరానిది జరిగిపోయింది. ఒక టెంకాయ నేరుగా చిన్నా తలని బలంగా తాకింది. "అమ్మా" అని కేకేశాడు. అతడి చేతులు బోనుని వొదిలేశాయి. పట్టు తప్పిపోయింది. ఆమైనే కిందపడ్డాడు.
"అబ్బాయ్ చిన్నా" అని పెద్దగా అరుస్తా చేతులు చాపాడు మల్లయ్య. నేరుగా అతడి చేతుల్లో పడ్డాడు చిన్నా. అంత పైనుంచి పడటంతో, ఆ బరువుని తట్టుకోలేక మల్లయ్య కిందపడ్డాడు. నయం. రాయిపై పడకుండా ఇసుకలో పడ్డాడు. ఒక్కసారిగా అక్కడ కోలాహలం. ఎవరో ఆపినట్లే టెంకాయల ప్రవాహం ఆగిపోయింది. అంతా ఆ తండ్రీకొడుకుల చుట్టూ మూగారు. చిన్నా నుదుటి మీంచి ధారగా నెత్తురు. అతడు స్పృహలో లేడు. ఒకాయన నాడి చూశాడు.
"పిల్లాడు బతికే ఉన్నాడు" అన్నాడు. ఇంకొకతను గబగబా ఏదో ఆకుపసరు చిన్నా తలపై పిండాడు.
మంటకి అటూ ఇటూ కదిలాడు చిన్నా.
"వేలెడంత లేడు. ఎంత పని చేశాడు. ఎందుకెక్కాడు శిడిమీదికి?" అందరి నోటా ఇవే మాటలు.
* * *
"ఆ రోజుతో శిడిమాను మీదికి టెంకాయలు విసరడం ఆగిపోయి, పూలదండలు విసరడం మొదలయ్యింది. అప్పట్నించీ ప్రాణభయంతో మేక అరుపులు లేవు. దాని బలి ఆగిపోకపోవచ్చు. కానీ గంటలకొద్దీ అది పడే హింస మాత్రం ఆగింది" చెప్పి ఆగాడు చతుర్వేది.
"ఇదంతా నీకెట్లా తెలుసు? అంతా చూసినట్లే చెప్పావు" అడిగింది కావేరి.
"నాకు తెలుసు. నేను చూశా" అన్నాడు సన్నగా నవ్వుతూ.
ఏదో గుర్తుకు వొచ్చినట్లు అతడి నుదుటి వొంక పరీక్షగా చూసింది. నుదుటిపై జుట్టు మొదలయ్యే చోట నల్లటి గాయం మచ్చ. గబుక్కున అతడి డమ చెయ్యి పట్టుకొని చూసింది. మోచేతి పైభాగంలో పెద్ద గాయం గుర్తు.
"అమ్మదొంగా.. చిన్నా.." అంది కావేరి అతడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అటు ఇటూ కుదుపుతా..
- బుద్ధి యజ్ఞమూర్తి