TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
సాహసం
అది ఒక తాండా. తాండాలో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అది వేసవి కాలం. ఎప్పటి లాగే మగవాళ్ళు అంతా బయటి పనులకు వెళ్ళి ఉన్నారు. వడగాలులు బాగా వీస్తున్నాయి. అంతలోనే ఎక్కడో నిప్పు రవ్వలు లేచాయి. అంతే- తాండాలోని నాలుగైదు గుడిసెలు ఒక్కసారిగా అంటుకున్నాయి.
గుడిసెలలో ఉన్న వాళ్లంతా భయంతో గబగబా బయటకు పరుగు పెట్టారు. గుడిసెముందు తొక్కుడు బిళ్ళ ఆడుకుంటోంది లచ్చిమి. ఈ మంటల్లో వాళ్ళ గుడిసె కూడా అంటుకున్నది. లచ్చిమి వెనక్కి తిరిగి చూసేసరికి మంటలు పెద్దవయ్యాయి. ఒక్క క్షణం పాటు ఆ పాపకు ఏమీ అర్థం కాలేదు.
మరుక్షణంలో తమ్ముడు సోము గుర్తుకు వచ్చాడు. వాడు ఇంట్లో ఉయ్యాలలో పడుకొని నిద్రపోతున్నాడు! వాడికి ఇంకా ఉయ్యాల దిగటమే రాదు. అమ్మ-నాన్నలు వాడిని తనమీద వదిలి పనులకు వెళ్ళారు!! లచ్చిమి తటాలున లేచి గుడిసెలోకి పరుగెత్త బోయింది. బయట మూగిన జనం హాహా కారాలు చేసారు. "లోపలికి పోవద్దు- ప్రమాదం" అని అరిచారు.
కానీ లచ్చిమి భయపడలేదు. తనకు ఏమైతుందో తను అస్సలు ఆలోచించలేదు. "చిట్టి తమ్ముడికి ఏమీ కాకూడదు" అనేది ఒక్కటే ఆ పాప ఆలోచన. చటుక్కున లోపలికి దూరిన లచ్చిమి గబగబా ఉయ్యాలలోంచి సోమును ఎత్తుకుని అదే పరుగున బయటికి వచ్చింది.
ఆ సరికే లచ్చిమి పరికిణీకి నిప్పు అంటుకున్నది. చుట్టు ప్రక్కల వాళ్ళు గబగబా ఆ మంటను ఆర్పేసారు. 'ఇంకాస్త ఆలస్యమైతే మంటల్లో చిక్కుకు పోయేవాళ్ళు. అయినా అంత సాహసం ఎలా వచ్చింది పాపా, నీకు? ప్రమాదం కాదూ?!” అంటూనే అందరూ లచ్చిమి సాహసాన్ని కొనియాడారు.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో