TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నక్కయుక్తి
ఒక ఊరికి చివర్లో రైతు ఉండేవాడు. ఆయన ఇల్లును ఆనుకుని దట్టమైన అడవి ఉండేది. రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది. దానికి బాగా గింజలు, ఇంకా మంచి మంచి తిండీ, పెడుతూ పెంచుతున్నాడు ఆయన. రాబోయే పండగరోజున దానితో మంచిగా పలావు చేసుకుందామని ఆయనకు చాలా ఉబలాటంగా ఉంది.
ఒకనాడు కోడిపుంజు రైతు ఇంటి గోడ పైకెక్కి, ’కొక్కొరోకో’ అని గట్టిగా అరుస్తూ కూర్చుంది. దానిని అడవిలోంచి ఒక నక్క చూడనే చూసింది. బాగా బలిసిన ఆ కోడిపుంజును చూడగానే నక్కకు నోరూరింది. ఎలాగైనా కోడిపుంజును రుచి చూడాల్సిందేననుకుంది. మెల్లగా అది కోడిపుంజు నిలబడివున్న గోడ దగ్గరకు వచ్చి, "ఓ కోడిపుంజుగారూ! ఎంత శ్రావ్యమైన కూతండీ మీది! మళ్లీ మళ్లీ వినాలనుందండీ నాకు, మీ కూతని!. నేను రోజూ ఇక్కడికి వచ్చి మీ కూతను వినాలనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా?" అని అడిగింది. నక్క మాటలకు అప్పటికే పొంగి పోయిన కోడిపుంజు "దానికేం భాగ్యమండీ నక్కగారూ! రండి..రండి. రోజూ వచ్చి వినండి. దానికేం భాగ్యం?" అన్నది కులుకుతూ.
ఇక రోజూ నక్క అక్కడికొచ్చి గోడ కింద కూర్చోవటం మొదలు పెట్టింది. నక్కను చూసి గోడమీది కోడిపుంజు రెట్టించిన ఉత్సాహంతో కూతలు కూసేది. మెల్లిగా అది కొంచెం కొంచెం చిందులేయటం కూడా అలవాటు చేసుకుంది. కొద్ది రోజుల్లోనే నక్కకూ, కోడిపుంజుకూ సాన్నిహిత్యం ఏర్పడింది. కోడిపుంజు నక్కను పూర్తిగా నమ్మింది. ఒక రోజున నక్క కోడితో అన్నది: "ఇవ్వాళ మీ ఆటా,పాట నాకు ఎంతో ఇంపుగా అనిపిస్తున్నాయి కోడిగారూ! మీరలా ఆడుతూ పాడుతూ ఉంటే నేనిట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోదండీ!" అని.
"ఓహ్! మీరు భలే పొగుడుతారండీ నక్కగారూ, నా గానందేముంది.." అంటూనే ఒళ్ళు మరచిన ఆ కోడి కాలుజారి గోడమీది నుండి క్రింద పడిపోయింది. అవకాశాన్ని జారవిడుచుకోని నక్క వెంటనే ముందుకు దూకి, దాన్ని నోట చిక్కించుకుని అడవిలోకి పారిపోయింది. అందుకనే, పొగడ్తలకు లొంగకూడదు.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో