Facebook Twitter
రాణి కడుపులో చేప

రాణి కడుపులో చేప

 

అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒకభార్య. వాళ్ళకు ఎన్నిరోజులైనా పిల్లలు కలుగలేదు. అందుకు వాళ్ళు రోజూ ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఒక రోజున చాలా చేపలు వచ్చాయి అమ్మకానికి. అన్నీ చనిపోయి ఉన్నాయి; కానీ వాటిలో ఒక చేప మాత్రం బ్రతికే ఉంది. రాణి ఆ చేపను చూడగానే మళ్ళీ ఏడ్చింది. "దేవుడా! ఈ చేపనైనా నా కడుపులో వెయ్యరాదా?" అని. చేపలు వెళ్ళిపోయిన మూడు నెలల తర్వాత రాణి గర్భవతి అయ్యింది. రాణి గర్భవతి అయ్యిందని దండోరా వేశారు. అందరూ చాలా సంతోష పడ్డారు. చివరికి రాణికడుపులో చేప పుట్టింది! "దేవుడా! చేప వెయ్యమంటే చేపే వేస్తావా!" అని రాణి కుళ్లి , కుళ్లి ఏడ్చింది. ఆ చేపకు "చేపన్న" అని పేరు పెట్టుకొనింది.


అప్పటి నుండి ఆ చేప రోజు రోజుకూ లావైంది. ఒకరోజున రాణి రాజుతో "ఏమండీ! మన బాబు లావవుతున్నాడు. ఇప్పుడు మన బాబు కోసం ఒక బంగారు బావి కట్టించాలి. కట్టించాక మన బాబుని అందులో ఉంచి రావాలి" అన్నది. రాజు చేపకోసం బంగారు బావిని కట్టించి, చేపన్నను అందులో వదిలాడు. ప్రతి రోజూ ఒక కూలివాడు చేపన్నకు అన్నం తీసుకువెళ్ళేవాడు. ఒకరోజున చేపన్న అన్నం తింటూ అడిగింది- "ఇవాళ్ల ఊళ్ళోంచి ఏదో శబ్దం వస్తున్నది- ఏంటి అది?" అని. అప్పుడు కూలివాడు "చేపన్నా! నీ అంత వయసు ఉన్న వాళ్లకు పెళ్లి జరుగుతున్నది ; నీకేంటి, ఇంకా పెళ్లికాలేదు?" అన్నాడు నవ్వుతూ.


వెంటనే చేపన్నకు కోపం వచ్చేసింది-"ఒరే, నాకు గాని రెండు రోజుల్లో పెళ్ళి చేయకపోతే నేను వచ్చి కనబడ్డవాళ్లనల్లా మింగేస్తా. మీ రాజు,రాణిలతో చెప్పు, ఈ సంగతి. ఫో, త్వరగా" అని బెదిరించింది వాడిని. కూలివాడు ఈ సంగతి రాజు,రాణిలతో చెప్పే సరికి, వాళ్ళిద్దరికీ చాలా దిగులు పట్టుకున్నది. ఎలాగైనా చేపన్నకు తగిన భార్యను వెతకాలని గుర్రమెక్కి బయలుదేరాడు రాజు. అట్లా ఆయన గుర్రం ఎక్కి, గోతం నిండా బంగారు నాణాలు వేసుకొని వెళ్తూ ఉంటే ఒకాయన ఎదురయ్యాడు. "ఎక్కడికి వెళ్తున్నారు, రాజుగారూ?" అని అడిగాడు. "చేపన్నకు తగిన భార్య కోసం వెతుకుతున్నాను" అన్నాడు రాజు. అప్పుడు అతను అన్నాడు- "ఎక్కడికో ఎందుకు రాజుగారూ! నాకు ఇద్దరుకూతుర్లు ఉన్నారు. వాళ్లలో పెద్ద అమ్మాయిని ఇస్తాను" అని.

 


పెద్దలంతా కలిసి చేపన్నకు ఆ పాపను ఇచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుండి ఆ పాపే, చేపన్నకు అన్నం తీసుకువెళ్ళేది. ఒక రోజున ఆమె అన్నం తీసుకువెళ్తుంటే దారిలో ఆలస్యం అయ్యింది. ఆమె చేరుకునేసరికి చేపన్నకు చాలా ఆకలైపోయింది. "ఏమిటే, ఇంతలేటు? నాకు చాలా ఆకలిగా ఉంది" అని అంటూనే ఒక్క సారిగా ఆమెను తినేసింది చేపన్న! ఎంతసేపటికీ ఆమె ఇంటికి రాకపోవడంతో ఇంట్లోవాళ్ళు కంగారుపడ్డారు. అయితే ఎంత వెతికినా ఆమె కనబడలేదు. మరుసటి రోజు నుండీ కూలివాడిని అన్నం తీసుకుపొమ్మన్నారు మళ్ళీ. మరుసటి రోజున కూలివాడు అన్నం తీసుకుపోయాడు; కానీ చేపన్న తినలేదు- "నాకు ఇప్పుడు అన్నం వద్దు. ఇంకో పెళ్ళి కావాలి. చెయ్యకపోతే ఆ పాపను మింగినట్లే మిమ్మల్నందరినీ మింగుతా" అన్నది. 


ఆ విషయం కూలివాడు రాజుతో చెప్పాడు. రాజు గుర్రం ఎక్కి గోతం నిండా బంగారు నాణాలు వేసుకొని పోతూఉంటే అంతకు ముందు కనబడిన వ్యక్తే మళ్లీ కనపడ్డాడు. "ఏమి జరిగింది రాజుగారూ?" అంటే అప్పుడు రాజుగారు జరిగిందంతా చెప్పాడు. ఆయన ఆ బంగారునంతా చూసి "నాకు రెండో కూతురు ఉంది కదా! ఆ కూతుర్ని నీ కోడలిగా ఇస్తానులే" అన్నాడు. చేపన్నకు, ఆ పాపకు మళ్ళీ పెళ్లి అయ్యింది.


మరుసటి రోజు ఆ అమ్మాయి చేపన్నకోసం అన్నం తీసుకొని వెళ్తూ దారిలో రాయి మీద కూర్చొని ఏడవటం మొదలు పెట్టింది. ఆ సమయంలోనే ఆకాశంలో శివుడు, పార్వతి ఎక్కడికో పోతూ ఉన్నారు. "అక్కడ చూడు! కింద ఎవరో ఏడుస్తున్నారు" అని వాళ్లిద్దరూ కిందికి వచ్చారు. "ఎవరమ్మా నువ్వు?" అని అడిగాడు శివుడు. ఆ అమ్మాయి పలకలేదు. అప్పుడు శివుడు "నువ్వు భూతానివా, దయ్యానివా, పిలిస్తే పలకవెందుకు?" అని అడిగాడు. "లేదు! నేను మనిషిని!" అని పెద్దగా అరిచింది ఆ పాప. "మరి ఎందుకు అలా ఏడుస్తున్నావు, చెప్పు?" అన్నాడు శివుడు. ఆమె జరిగిందంతా చెప్పింది. "అలాగా! ఇదిగో పాపా! ఈ ఇసుక తీసుకొని ఆ చేపన్న మీద మూడు సార్లు చల్లు" అని శివుడు, పార్వతి ఆ పాపకు కొంత ఇసుక ఇచ్చి మాయమయ్యారు.

 


అప్పుడు ఆ అమ్మాయి రాయి మీద నుండి లేచి చేపన్న దగ్గరకు పోయింది. "ఏంటే ఇంత ఆలస్యంగా వచ్చావు. నాకు చాలా ఆకలిగా ఉంది " అని అరిచింది చేప. ఆ పాప మాట్లాడకుండా దానికి అన్నం పెడుతూ శివుడు ఇచ్చిన ఇసుకని దానిమీద మూడుసార్లు పోసింది. దాంతో ఆ చేపన్న కాస్తా మనిషిగా మారిపోయాడు! వాడి బుద్ధికూడా మారిపోయింది! అప్పుడు అమ్మాయి చాలా సంతోషించింది. రాజు రాణి, అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత అందరూ సుఖంగా జీవించారు.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో