Facebook Twitter
పులిప్రార్థన

పులిప్రార్థన

 


దైవభక్తుడు ఒకడు కాలినడకన వెళ్తున్నాడు తీర్థయాత్రలకని. అలా ఒకరోజున అడవిలో నడుస్తుండగా మధ్యాహ్నం అయ్యింది. అక్కడే ఒక పెద్ద చెట్టు కనబడేసరికి, దాని నీడన చేరి కూర్చున్నాడు విశ్రాంతిగా.

అకస్మాత్తుగా ఒక పులి వచ్చి అతనికి ఎదురుగా నిల్చున్నది . దైవభక్తుడు భయంతో గజగజ వణికాడు. తప్పించుకునే అవకాశం లేదు. ఎలాగూ పులి తనను తినేస్తుంది. ఆ సమయంలో అతనికి దేవుడు గుర్తుకొచ్చాడు. "స్వామీ! ఇక నా భారం నీదే" అని కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు.

ఎంతసేపటికీ పులి తన మీదికి దూకదే!? దేవుడు తనని కాపాడాడా? అతనికి అనుమానం వచ్చి కళ్ళు తెరచి చూశాడు.  ఆశ్చర్యం! పులి కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ కనిపించింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. "దైవమహిమ! స్వామీ, నువ్వు నా చెంతే ఉన్నావు" అనుకున్నాడు. ఇంకొంత ధైర్యం వచ్చింది. అడిగాడు-"ఓ పులీ! నేనంటే ప్రాణ భయంతో దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. మరి నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు?' అని.

"మీవల్లనే కదా, మా జాతి రానురాను అంతరించిపోతున్నది?! కొన్ని సంవత్సరాలకు ఇంక ఒక్క పులి కూడా ఈ భూమి మీద కనబడదు. ఇప్పుడు నా దురదృష్టం కొద్దీ నీకు ఎదురు పడ్డాను కదా, నువ్వు నన్ను చంపకూడదని దేవుణ్ని వేడుకుంటున్నాను" అన్నది పులి. మనిషి సిగ్గుతో తల వంచుకొని నిష్ర్కమించాడు అక్కడి నుండి.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో