Facebook Twitter
డి కాదు, ఢీ. కామేశ్వరి

ఏం రాస్తున్నామన్నది తర్వాత శర్మగారూ! ముందు రాయడం ప్రారంభించాలి. కుళాయి తిప్పితేనే గదా నీరొచ్చేది అన్నారు డి. కామేశ్వరి ఓసారి. ఆసారి నాకు చాలా కబుర్లు చెప్పారామె. మీరు కథలపోటీలు నిర్వహిస్తారుకదా! ఆ పోటీలకు కథ రాసినప్పుడు మీరు పేర్కొన్న ఏ నియమనిబంధనలూ నేను పాటించను. కథ రాస్తానంతే! మీకు నచ్చితే బహుమతి ఇస్తారు. ప్రచురిస్తారు. లేదంటే...తిప్పి పంపుతారు. అందులో నాకొచ్చే నష్టం ఏమీలేదు. పైగా ఓ కథ రాశానన్న తృప్తి ఉంటుంది అన్నారు. నవలరాయడం అంటే...రాత్రివేళ కారునడపడంలాంటిదండీ! కారు హెడ్ లైట్స్ వెలుగులో కనిపించిన దాన్నే మనం చూడగలం. చూసిన మేరే ప్రయాణించాలి. అలా ప్రయాణిస్తేనే అన్ని విధాలా క్షేమంగా ఉంటుంది. పక్కచూపులు చూడకూడదు. చూస్తే లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకోవాలన్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు. వాటిని చెప్పేముందు, కామేశ్వరిగారిని నేను మొదటిసారి ఎప్పుడు చూశానో చెబుతాను. 
 పందొమ్మిదివందల ఎనభై ఒకటో...ఎనభై రెండో...సంవత్సరం పెద్దగా గుర్తులేదుగాని, ఈనాడు ప్రచురణలు విపుల:చతురలో నేను పనిచేస్తున్న రోజులు... 
  కె. బి. లక్ష్మి ఆర్టికల్ ఏదో రాస్తున్నది. నేనేదో నవలను పరిశీలిస్తున్నాను. ఆ రోజు కనీసం రెండు మూడు నవలలైనా చదవాలి. ప్రచురణకోసం పంపినవి పేరుకుపోయాయి. 
 వాతావరణం నిశ్శబ్దంగా ఉంది.  
 నమస్కారం! బాగున్నారా? నవ్వు గొంతొకటి వినవచ్చింది.  
 ఎవరై ఉంటారా? అంటూ గొంతువినవచ్చిన వైపుగా చూశాను. తెల్లగా అంతెత్తుఆడమనిషి. చెయ్యెత్తితే ఆమెకు సీలింగ్ ఫ్యాను అందేటట్టుంది. నల్లకళ్లద్దాలు పెట్టుకుని ఉంది. 
 మిమ్మల్నే! బాగున్నారా? అని అడుగుతున్నాను, గొంతు పెంచి, ఎడిటర్ శ్రీ చలసాని ప్రసాదరావుని పలకరిస్తున్నదామె. 
 కూర్చోండి అంటున్నారాయన. కుర్చీ చూపిస్తున్నాడు. వినపించుకోవట్లేదామె. 
 గుర్తుపట్టారా? అని గోలగోల చేస్తున్నదామె. 
 ఎవరీ తల్లి? చెల్లి? తెల్లపులి? లక్ష్మిని అడిగాను. 
 డి. కామేశ్వరి అని నవ్వింది లక్ష్మి.
 న్యాయం కావాలి సినిమా కథ ఈవిడ రాసిందే! ‘కొత్తమలుపు’ పేరుతో చతురలో మనం వేశాం అన్నది. 
 మీరు గుర్తుపట్టలేదు. నా పేరు...అని కామేశ్వరిగారు ఇంకా గొంతు పెంచుతుంటే...ఇక తప్పనిసరై నేను వెళ్లానక్కడకి. 
 మీరెంతగా అరచినా ఎడిటర్ గారికి వినిపించదు మేడం! మీరేది చెప్పదలచుకున్నా అదిగో...ఆ కాగితాల మీద రాసి చూపించండి. ఆయన సమాధానం చెబుతారు అన్నాను. 
 పాపం! ఇంత కూడా వినిపించదా? జాలిచెందారామె. 
 వినిపించదన్నాను.  
 కామేశ్వరిగారు కాగితాలమీద రాయసాగారు. రాస్తూ అరుస్తూనే ఉన్నారు. ఆమె గొంతు ఈనాడు కాంపౌండ్ సెకెండ్ ఫ్లోరంతా ప్రతిధ్వనిస్తూనే ఉంది. 
 నేనేం రాశానో! మీరేం చెప్పారో! నేనేం విన్నానో...ఏదీ నాకు అర్థం కాలేదు. వస్తా అన్నారు మేడం. అక్కణ్ణుంచి కదలి, నన్ను చూసి ఇటుగా వచ్చారు. 
 మీ పేరేంటో? అడిగారు. 
 జగన్నాథశర్మ.
 మీరేనా కథలూ, నవలలూ సెలెక్ట్ చేసేది?
 నేను సెలెక్ట్ చేయనండి! చదివి, నా అభిప్రాయం ఎడిటర్ గారికి చెబుతాను. ఆయన సెలెక్ట్ చేస్తారు. 
 తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని...బాగుంది మీ వ్యవహారం! నావో రెండు కథలు మీ దగ్గర ఉన్నాయి. ఏఁవయ్యాయవి? అడిగారు. 
 తెలియదండి.
 తెలిసినా చెప్పరు. అర్థమయింది. ‘సరే’నని వెళ్లిపోయారామె. వెళ్తూ వెళ్తూ ఎడిటర్ చలసానిగారిముందు అరిచారిలా.  
 వెళ్లొస్తాను.
 వెళ్లిపోయారు కామేశ్వరి. 
 వడగళ్లవాన వెలిసినట్టయింది.  
 పెద్దగొంతుతో మాట్లాడేవారే సంఘర్షిస్తారు. తప్పొప్పులను ఎత్తిచూపుతారు. పెద్దగొంతుతో మాట్లాడేవారే చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందిస్తారు అనేవాడు మానాన్న. మా అమ్మగారు పెద్దగొంతుతో మాట్లాడేది. మనుమలనూ, మనవరాళ్లనూ భయపెట్టేది. భయపడితే మళ్లీ తట్టుకోలేకపోయేది. వారిని దగ్గరగా తీసుకునేది.   
 ఉత్తనే! ఊరకనే అరిచానమ్మా! ఊరుకో! ఊరుకో! అనేది. లాలించేది, బుజ్జగించేది. వారితో పాటుగా కళ్లు చెమర్చుకునేది. 
 కామేశ్వరిగారి స్వరోపాఖ్యానం మా అమ్మను గుర్తుచేసింది. 
 కామేశ్వరిగారి కథాసంకలనం ‘కాదేదీ కథకనర్హం’ చదివాను తర్వాత. అందులోని ‘చోతంత్రం’ కథ మా నాన్న మాటలను ఋజువుపరచింది. ఆవగింజంత వస్తువుతో  మహిళాలోకాన్నే వేలెత్తిచూపించిందామె. రచయిత్రులు వంటచేసినప్పుడు స్టవ్ దగ్గరా, రాసేటప్పుడు టేబుల్ దగ్గరా చాలా బోల్డ్ గా ఉండాలని నేనెక్కడో చదివాను. ఆ మాట కామేశ్వరిగారి విషయంలో నూటికి నూటిపాళ్లూ నిజమయింది.  
 పదో పదకొండో కథాసంకలనాలు, ఎనిమిదో తొమ్మిదో నవలలు రాశారు కామేశ్వరిగారు. సుమారుగా నేనన్నీ చదివినగుర్తు. అన్నీ ఎందుకు చదివానంటే...టీవీ రచయితగా ఉన్నప్పుడు...టీవికి ఏదేని పనికొస్తుందేమో! సంప్రదిద్దామనుకునేవాణ్ణి. టీవీలో ప్రముఖుల కథలు సింగిల్ ఎపిసోడ్స్ గా ప్రసారం చేస్తున్న రోజులవి. 
 చెదరిన బలహీనులను ఏకం చెయ్యడం, వారిని బలవంతులను చెయ్యడం, అలాగే అణచివేతవిషయమై ఒకటయిన బలవంతుల్ని చెదరగొట్టడం, వారిని బలహీనులను చెయ్యడం మంచిరచన లక్షణం. ఆ లక్షణం కామేశ్వరిగారి రచనలన్నిటా నాకు కనిపించింది. లక్ష్యంతో పాటు డ్రామాకూడా అత్యద్భుతంగా ఆవిష్కృతమయింది. ఏ ఇజానికీ ప్రత్యక్షంగా వత్తాసుపలకకపోవచ్చుకాని, పరోక్షంగా తన రచనలన్నిటా స్త్రీవాదాన్ని సమర్థించారు కామేశ్వరిగారు. ఇందులో ఎలాంటి సందేహమూలేదు. 
 నవ్యవీక్లీకి ఎడిటర్ అయిన తర్వాత నన్ను నేను పరిచయం చేసుకుంటూ ఓసారి కామేశ్వరికి గారికి ఫోన్ చేశాను. 
 మీ పేరు విన్నాను శర్మగారూ! అప్పుడప్పుడూ మీ కథలు చదివాను. మిమ్మల్నెప్పుడూ నేను చూడలేదన్నారు కామేశ్వరి. ఈనాడు ఎపిసోడ్ చెప్పాను. విని నవ్వారు. తర్వాత ఏదో సభలో ఇద్దరం కలుసుకున్నాం. పలకరింపులయ్యాయి. 
 మంచి కథ ఒకటి రాసి పంపండి అన్నాను. 
 మంచికథో చెడ్డకథో చెప్పలేనుగాని, నేను ఈ విషయం పాఠకులకు చెప్పాలి. వారు తెలుసుకోవాలి అనుకున్నప్పుడే కథ రాస్తాను. అలాంటి కథ కావాలంటే చెప్పండి, రాసినప్పుడు పంపుతాను అని నవ్వారు. 
 పంపించండి అన్నాను. పంపారు. ఆ కథ అర్థాంతరంగా ముగిసింది అనిపించింది. ఆ మాటే కామేశ్వరిగారికి ఫోన్ చేసి చెప్పాను. దానికి వారిచ్చిన సమాధానం...
 దేనికీ ముగింపు ఉండదు శర్మగారూ! అక్కడితో కథ ఆగిపోయింది. ఆపేశానంతే అన్నారు. 
 తెలివిగా మాట్లాడతారు కామేశ్వరి అనుకున్నాను. కాని కాదు. ఉత్త భోళామనిషామె. 
 రవీంద్రభారతిలో నన్ను ఎవరో సత్కరించారు. బొకే, షీల్డు, శాలువాసహా అంతో ఇంతో క్యాష్ ముట్టజెప్పారు.  
 ప్రేక్షకులలో కామేశ్వరిగారూ, నా భార్యా పక్కపక్కనే కూర్చున్నారు.  
 ఇప్పుడు చూడండీ! ఆ బొకే, షీల్డూ, శాలువా శర్మగారు మీకిస్తారు, క్యాష్ ఇవ్వరు. దానిని భద్రంగా ఆయన జేబులో దాచుకుంటారని నా శ్రీమతికి ఆమె చెప్పారట! వారన్నట్టుగానే నేను ప్రవర్తించానట! చెప్పి పగలబడి నవ్వింది నా శ్రీమతి. 
 తన మనవడో, మనుమరాలో పెళ్లి రిసెప్షన్ కి కామేశ్వరిగారు పిలిస్తే కుటుంబం సహా వెళ్లాను. 
 ఫైవ్ స్టార్ హోటల్ లో డిన్నర్. కాక్ టయిల్ కూడా ఉంది. ఫ్యామిలీతో వచ్చాను కదా! అటు వైపే చూడకుండా కూర్చున్నాను. కూర్చుని ఇబ్బంది పడుతున్నాను. గమనించారు కామేశ్వరి.
 తాగాలనుకుంటే వెళ్లి తాగండి శర్మగారూ! ఇబ్బంది పడకండి అన్నారు. 
 తాగండి శర్మగారూ! వెళ్లి రెడ్ వైన్ తెచ్చుకోండి! బాడీకి వైన్ మంచిదంటారు. వెళ్లండి అన్నారు. 
 నేను నా శ్రీమతివైపు చూస్తుంటే...
 రమణిగారూ! (నా భార్యపేరు రమణి) మీరోసారి కళ్లు మూసుకోండి! శర్మగారో రెండు గుటకలేస్తారు అని నవ్వారు.
 నేను వైన్ తెచ్చుకుని తాగేవరకూ ఊరుకోలేదు. 
 కోవిడ్ సమయంలో ఫోన్ చేశారు. 
 ఎలా ఉన్నారు శర్మగారు? అడిగారు. 
 బాగానే ఉన్నాను అన్నాను. 
 నవ్యవీక్లీ మూసేశారు కదా! కాలక్షేపం ఏమిటి? అడిగారు. 
 పుస్తకాలు చదువుకుంటున్నాను అన్నాను. 
 చదివిన పుస్తకాలు చాలుగానీ, టర్కీస్, కొరియన్ వెబ్ సిరీస్ చూడండి! ముందు ముందు మీకు పనికొస్తాయి అంటూ...ఏ ఏ సిరీస్ లు చూడాలో ఓ పెద్ద లిస్ట్ వాట్సప్ లో పంపారు. 
 మీరెలా ఉన్నారు? అడిగాను. 
 బాగానే ఉన్నానండీ! కాకపోతే ఇంకా ఎందుకు ఉన్నానా? అనిపిస్తున్నది. మనం ఎవరికీ ఉపయోగపడనప్పుడూ, దేనికీ ఉపయోగపడనప్పుడూ జీవించడం వృధా అనిపిస్తున్నది అని నవ్వారు. 
 బలేవారే! అన్నాను. 
 ఆరోగ్యం కోసం ఒకప్పుడు యోగా చేసేదాన్ని. ఇప్పుడు కాలూ చేయూ కూడి రావట్లేదు. దాంతో ప్రాణాయామంతో సరిపెట్టుకుంటున్నాను. చేతిలో సెల్ ఫోనూ, నోటిలో మాటా...గడచిపోతున్నాయి రోజులు అన్నారు. 
 రోజులు గడిపేస్తూ తొంభైలోకి అడుగుపెట్టారు. 
 అయినా నవ్వుతూనే ఉన్నారు. రాస్తూనే ఉన్నారు కామేశ్వరి. 
 ఆమె నవ్వుకి నిర్బంధం లేదు. వారి ఊహలకు వయసులేదు.
 రాయక ఏం చేస్తారు?
 నమ్మకం ఒక కళ. నమ్మింది రాయడం గొప్పకళ. 

 -జగన్నాథశర్మ