Facebook Twitter
నక్క పాట

నక్క పాట

 

 

 

అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒక రోజున దానికి బాగా ఆకలి వేసింది. ఆహారంకోసం వెతుకుతూ వెళ్ళింది. కొంచెం దూరాన్నే దానికి ఒక కుందేలు పిల్ల కనిపించింది. దాన్ని చూడగానే నక్క నోట్లో నీళ్ళు ఊరాయి. "ఎలాగైనా సరే దానిని పట్టుకొని చంపి తినాలి" అని నిర్ణయించుకుంది అది. కుందేలును పట్టు కుందామని మెల్లగా నక్కుకుంటూ దాని దగ్గరకు వెళ్ళింది. అయితే తెలివైన కుందేలు నక్కను చూదగానే పరుగు అందుకున్నది.

నక్క కూడా ఊరుకోకుండా కుందేలు వెంట పడింది. సరిగ్గా ఆ సమయంలోనే కుందేలుకు ఏనుగుల గుంపు ఒకటి అడ్డం వచ్చింది- వాటిని తప్పించుకొని ఎటుపోవాలో తెలీక గందరగోళ పడి, అది కాస్తా నక్కకు దొరికి పోయింది. నక్క వగరుస్తూ, చొంగ కార్చుకుంటూ దాన్ని ఎత్తి పట్టుకొని, "నీ చివరి కోరిక ఏమిటో కోరుకో!" అని కుందేలును అడిగింది వెటకారంగా. కుందేలు ఒక్క క్షణం ఆలోచించి, "మరేమీ లేదు. చనిపోయే ముందు ఓ పావు గంట సేపైనా నీ పాట వినాలని ఉంది" అన్నది.

 

 

నక్క కొంచెం ఉబ్బిపోయింది; కొంచెం‌ ఆశ్చర్య పడింది. "దీనికి నా పాట వినాలని ఎందుకు, అంత ఉత్సాహం?" అనుకుని, తను ఉత్సాహపడ్డది. మెల్లగా గొంతెత్తి పాడటం మొదలు పెట్టింది. త్వరలోనే దాని ఊళ గొంతు చాలా దూరం వరకూ వినిపించసాగింది. ఆ చుట్టు పక్కల పొలాల్లో ఉన్న రైతులు దాని ఊళ విని "ఇదెక్కడినుండి వచ్చిందో‌ ఇప్పుడు. మన కోళ్ళన్నీ‌ ఇక మనవి కావు! దీని పని పట్టాల్సిందే" అని కట్టెలు పట్టులొని, పరుగున వచ్చారు. గాత్ర కచేరీ చేస్తున్న నక్కను చంపి చక్కా పోయారు. "అబ్బ!‌ బ్రతికిపోయాను" అనుకుంటూ‌ కుందేలు పిల్ల అడవిలోకి పరుగు పెట్టింది! 


- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో