TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
కాకమ్మ-గువ్వమ్మ
ఒక ఊళ్లో ఒక కాకమ్మ, ఒక గువ్వమ్మ ఉండెనంట. కాకమ్మకేమో పేడ ఇల్లంట. గువ్వమ్మకేమో ఇటుక ఇల్లంట. ఒకసారి పెద్దగా గాలివాన వచ్చిందట. ఆ వానకు కాకమ్మ పేడ ఇళ్లంతా కరిగిపోయిందంట. దూరుకునేకి ఇల్లు లేక కాకమ్మ గువ్వమ్మనన్నా అడుగుదామని గువ్వమ్మ దగ్గరకు పోయి- "గువ్వమ్మా! గువ్వమ్మా! నాకు రవ్వంత తావివ్వవా, పడుకునేకి?" అని అడిగిందంట. "ఎహె, ఫో!నేను నా మొగునికి నీళ్లు పొయ్యల్ల!" అన్నదంట గువ్వ. మళ్లీపోయి అడిగిందంట కాకమ్మ-"గువ్వమ్మా! గువ్వమ్మా! నాకు రవ్వంత తావివ్వవా, పడుకునేకి?" అని. "ఎహె, ఫో! నా మొగునికి బట్టలు తొడగాలి నేను!" అన్నదంట గువ్వమ్మ.
మళ్లీ ఇంకోసారి పోయి అడిగిందంట కాకమ్మ-"గువ్వమ్మా! గువ్వమ్మా! నాకు రవ్వంత తావివ్వవా, పడుకునేకి?" అని. "ఎహె, ఫో! నా బిడ్డలకు నీళ్లుపొయ్యాలె!" అన్నదంట గువ్వమ్మ. మళ్లీ పోయి గువ్వమ్మను అడిగిందంట కాకమ్మ- "గువ్వమ్మా! గువ్వమ్మా! నాకు రవ్వంత తావివ్వవా, పడుకునేకి?" అని. "ఎహె, ఫో! నా పిల్లలను బడికి పంపాలి!" అన్నదంట గువ్వమ్మ. మళ్లీ పోయి గువ్వమ్మను అడిగిందంట కాకమ్మ- "గువ్వమ్మా! గువ్వమ్మా! నాకు రవ్వంత తావివ్వవా, పడుకునేకి?" అని. "సరే ఇస్తాగానీ, నువ్వు పప్పుల గూట్లో పడుకుంటావా? లేక మిక్స్చరు గూట్లో పడుకుంటావా?" అని అడిగిందంట గువ్వమ్మ. "పప్పులగూట్లోనూ పడుకుంటాను, మిక్చరు గూట్లోనూ పడుకుంటాను గువ్వమ్మా!" అన్నదంట కాకమ్మ.
"సరేలె"మ్మని కాకమ్మకు ఆ గూళ్లను చూపిందంట గువ్వమ్మ. గువ్వమ్మ ఇంట్లో పడుకున్న కాకమ్మ ఆ గూళ్లలో ఉన్న పప్పులు, మిక్స్చరు మొత్తాన్నీ తినేసి, గూడంతా పెంటనేసి, తెల్లారకనే అక్కడినుండి ఎగిరిపోయిందంట. ఇక తెల్లారగానే "ఆకలమ్మా! ఆకలి" అన్నాయంట గువ్వమ్మ పిల్లలు. ఏమైనా ఇద్దామని పప్పుల గూడుకీ, మిక్చరుగూటికీ వెళ్లి చూస్తే కాకమ్మ చేసిన పనంతా కనబడింది గువ్వమ్మకు. "అయ్యో! ఎంతపని చేసింది కాకి, ఎక్కడకెళ్ళిందిది?" అని దాన్ని వెదుకుతూ పోయిందంట గువ్వమ్మ. పోతావుంటే దానికి ఎద్దును పట్టుకుని ఒకాయప్ప కనిపించినాడంట. "ఒకెద్దాయప్పా! ఒకెద్దాయప్పా! నీకేమన్నా కాకమ్మ కనిపించెనా ఈ పక్కన?" అని అడిగిందట.
"లేదు లేదు, గువ్వమ్మా! అదిగో ఆ...డ రెండెద్దులాయప్ప ఉన్నాడు. ఆయప్పకేమైనా కనపడినాదేమో, పొయ్యి అడుగు" అని చెప్పెనంట ఒకెద్దాయప్ప. రెండెద్దులాయప్పేమో మూడెద్దులాయప్పను, ఆయప్పేమో నాలుగెద్దులాయప్పను , ఆయప్పేమో ఐదెద్దులాయప్పనూ, ఐదెద్ద్దులాయప్పేమో అరెద్దులాయప్పనూ చూపిచ్చిరంటగానీ, కాకి జాడమాత్రం తెలీలేదంట గువ్వకు. అయినా అంతపని చేసినదాన్ని ఊరికే వదిలితే ఎలాగని ఓపికగా వెదుకుతూనే ముందుకుపోయిందంట గువ్వమ్మ. ఆరెద్దులాయప్ప కూడ ఏడెద్దులాయప్పను చూపిచ్చెనంట. చివరికి ఏడెద్దులాయప్ప "అదిగో గువ్వమ్మా! ఆ నేరెడుమాన్లో, నేరేడుకాయలు తింటావుంది చూడు, కాకమ్మ!" అని కాకిజాడ చెప్పెనంట.
నేరేడుమాను దగ్గరకుపోయి "కాకమ్మా! కాకమ్మా! నాకు ఆకలవుతాంది. చెట్టెక్కేటంత బలం నాకిప్పుడులేదు, తినేకి కొన్ని నేరేడుగాయలు పీకెయ్యవా?" అని అడిగిందంట గువ్వమ్మ. అప్పుడు అన్నీ కుళ్లిపోయిన కాయలను కిందకేసిందంట కాకమ్మ. "ఆహా! నీ పనిచెబుతానుండమని, ఏదీ కాకమ్మా, నీ పళ్లు ఎలా ఉన్నయో చూపించవా కాస్త?" అని అడిగిందంట గువ్వమ్మ. "దానికేం చూడు" అని నోరు తెరిచిందంట కాకమ్మ. కాకి నోరు తెరవగానే, సిద్దంగా ఉన్న గువ్వమ్మ ఎగిరి వెళ్లి, తను తెచ్చుకున్న గుండ్రాయితో కాకమ్మ పళ్ళను ఊడగొట్టి, నోట్లో కారం వేసి, పట్టుకుని బావిలోకి విసిరేసిందంట.
కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో