Facebook Twitter
గుణమే అందం

 

గుణమే అందం

 

 

అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఒక వెంట్రుక, రెండవ భార్యకు రెండు వెంట్రుకలు ఉండేవి.

రాజుకి చాలామంది సలహాదారులు ఉండేవాళ్ళు. వాళ్లలో ఒకడు రెండో భార్యకు దగ్గర. ఒకసారి ఆమె వాడితోటి రాజుకు చెప్పించింది: "ఒక వెంట్రుక ఉండే భార్య కన్నా రెండు వెంట్రుకలు ఉన్న భార్య మేలు" అని. వాడి మాటలు పట్టుకున్న రాజు మొదటి భార్యని బయటికి గెంటేశాడు.

మొదటి భార్య అప్పుడు బాధపడుకుంటూ పోతూంటే దారిలో కొన్ని నల్ల చీమలు కనిపించాయి. అవి ఆమెతో అన్నాయి "అమ్మా! అమ్మా! మమ్మల్ని తొక్కద్దు తల్లీ! ఎప్పుడైనా నీకు నోటి నిండా చక్కెర పోస్తాము" అని.

"సరేలే, మిమ్మల్ని తొక్కితే నాకేమొస్తుంది?" అని ఆమె వాటిని తొక్కకుండా ముందుకు పోయింది.

 

ఇంకా ముందుకు వెళ్ళాక ఆమెకు ఒక గాడిద కనిపించింది. గాడిద ఆమెతో "అమ్మా! అమ్మా! నాకు కొంచెం గడ్డి వేయమ్మా, ఎప్పుడైనా నిన్ను ఎక్కించుకొని తీసుకు వెళ్తాను!" అంది. "సరేలే పాపం ఆకలి వేస్తుండచ్చు" అని ఆమె గాడిదకు గడ్డి వేసింది. ఇంకా ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక పాడుబడ్డ గుడి కనిపించింది. అందులో దేవుడు ఆమెతో మాట్లాడాడు: "అమ్మా! నాకు పూజ చెయ్యమ్మా! ఎప్పుడైనా నీకు ఒంటినిండా నగలు ఇస్తాను" అని.

"నీ నగలు నాకెందుకులేగానీ, నీకు పూజ చేస్తాను ఆగు!" అని ఆమె ఆ గుడి అంతా ఊడ్చి శుభ్రం చేసి, అక్కడి అక్కడి పూలు తెచ్చి దేవుడికి పూజ చేసింది.

ఇంకా అట్లా పోతా ఉంటే ఆమెకు ఒక అవ్వ కనబడింది. "నాకేదైనా ఒక రొట్టి కాల్చి పెట్టు తల్లీ! నాకు తెలిసిన సాయం నేను చేస్తాను" అంది అవ్వ.

"దానిదేమున్నది, నీ సాయం నాకేమీ‌ అక్కర్లేదుగానీ, రొట్టె కాల్చి ఇస్తాను ఆగు!" అని అవ్వకు రొట్టె కాల్చి ఇచ్చింది రాణి. రొట్టె తిన్నాక అవ్వ రాణిని చూసి "నీకు వెంట్రుకలు కావాలంటే ఏం చేయాలో తెలుసుగా?" అంది.

 

 

"అయ్యో! అది తెలిస్తే ఇక్కడిదాకా ఎందుకొస్తుంది కథ?" అని రాణి ఆమెకు తన కథ అంతా చెప్పుకుని, "ఇంతకీ అవ్వా! నాకు వెంట్రుకలు రావాలంటే ఏం చేయాలో చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది" అని అడిగింది.

అప్పుడు ఆ అవ్వ ఆమెకు ఒక నది చూపించి, "అందులో మునుగు. నీకు ఏది రాసి ఉంటే అట్టాగ అవుతుంది" అని చెప్పింది. సరే అని రాణి ఆ నదిలో మునగగానే ఆమెకి తల నిండా నల్లని వెంట్రుకలు వచ్చేసాయి!

రాణి అవ్వకు దణ్ణం పెట్టుకొని వెనక్కి తిరిగింది. "దారిలో దేవుడిని కలిసి పో తల్లీ!" అని చెప్పింది అవ్వ.

సరేనని వెనక్కి పోయి దేవుడికి మొక్కుకున్నది రాణి. దేవుడు తన మాట ప్రకారం ఆమెకు ఎక్కడలేని నగలూ ఇచ్చాడు.

ఆమె ఆ నగలు పెట్టుకొని నడుస్తూ పోతావుంటే గాడిద ఎదురై, "మీదికి ఎక్కు! నిన్ను బాగా తీసుకు పోతా" అంది.

అట్లా దేవుడిచ్చిన నగలు పెట్టుకొని, గాడిదనెక్కి పోతున్న రాణిని చూడగానే చీమలు ఆమె నోటినిండా చక్కెర పోసి పంపించినై. అట్లా వచ్చిన రాణిని చూసి రాజు ఇంక నోట మాట రాకుండా అయిపోయినాడు. వెంటనే రెండో భార్యని గెంటేసి, మొదటి భార్యని పిలుచుకున్నాడు.

 

పోతూ పోతూ రెండో భార్య మొదటి భార్యను అడిగింది- "అక్కా! నీకు ఇన్ని వెంట్రుకలు ఎట్లా వచ్చినాయి?" అని.

మొదటి రాణి చెప్పింది "చీమల్ని తొక్కకుండా, గాడిదకు గడ్డి వేసి, దేవుడికి పూజచేసి వెళ్ళి, అవ్వకు రొట్టె కాల్చి ఇచ్చి, నదిలో‌ మునగాలి" అని.

"సరేలే, దానిదేముంది, నేనూ నదిలో మునిగి నిండా వెంట్రుకలు పెట్టుకొని వస్తాను" అని అదే దారిలో పరుగెత్తింది రెండో రాణి.

అట్లా ఆమె పరుగు పెడుతుంటే చీమలు ఆమెను వేడుకొన్నాయి "తల్లీ తల్లీ! మమ్మల్ని తొక్కకు! నీకు నోటినిండా చక్కెర పోస్తాము" అని.

అయినా నదిలో మునగాలని తొందరలో ఉన్న ఆమె, వాటిని అలాగే తొక్కుకుంటూ పరుగు పెట్టింది.

ఇంకాస్త ముందుకు వెళ్లాక గాడిద అడిగింది "తల్లీ! నాకు కొంచెం గడ్డి వేయి. నిన్ను ఎప్పుడైనా ఎక్కించుకు వెళ్తాను" అని.

కానీ "నువ్వు నన్ను ఎక్కించుకునేదేంది, నేనే పరుగు పెడతా వేగంగా" అని గడ్డి వేయకుండానే వెళ్ళిపోయింది ఆమె.

అట్లాగే దేవుడు కూడా ఆమెని అడిగాడు "పూజ చేసి పో తల్లీ! ఎప్పుడైనా నీకు నగలు ఇస్తాను" అని.

 

 

"నీ నగలు నాకెందుకు? నాకే కొల్లలుగా ఉన్నాయి" అని పూజ చెయ్యకుండానే వెళ్ళిపోయింది ఆమె.

అక్కడ అవ్వకు రొట్టె కూడా చేసి పెట్టలేదు. "నీ రొట్టె నువ్వు కాల్చుకో! ఇంతకీ నదికి దారి ఏది?" అని అడిగింది.

అవ్వ నది వైపు చూపించగానే, అక్కడికి పరుగు పెట్టి బుడుంగుమని మునిగింది చిన్న రాణి. లేచి చూస్తే ఏముంది, ఆమెకు ఉన్న రెండు వెంట్రుకలూ ఊడిపోయినై!

అవ్వని అడుగుదామని చూస్తే అక్కడ అవ్వా లేదు, అవతలగా దేవుడూ లేడు, గాడిదా, చీమలూ ఏవీ లేవు!! నిండా గుండు అయిన చిన్నరాణి మళ్ళీ రాజు దగ్గరికి, పెద్ద రాణి దగ్గరికి వెళ్ళి, తన తప్పు ఒప్పుకున్నది.

రాజు, రాణి ఆమెను క్షమించి ఇంట్లో పెట్టుకున్నారు. క్రమంగా చిన్నరాణికి కూడా వెంట్రుకలు వచ్చేసాయి!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో