TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
విధివ్రాత
వంగదేశాన్ని ఒకప్పుడు అనంగుడు అనే రాజు పరిపాలించే వాడు. ఆ సమయంలో అక్కడి ఓ పల్లెటూళ్ళో హనుమంతు అనే విద్వాంసుడొకడు ఉండేవాడు. 'జాతకాలు చూడటంలో ఆయనకి ఎదురే లేదు' అని చెప్పుకునేవారు. ఒకరోజున హనుమంతు యథాలాపంగా పుస్తకాలు సవరిస్తూంటే అనంగ మహారాజు జాతక చక్రం కనబడింది. తమ రాజుగారి జాతకం ఎలా ఉందో చూద్దామని లెక్కలు వేసిన హనుమంతుకు ఆ జాతకంలో పెద్ద దోషం ఒకటి కనబడ్డది: 'మరొక నాలుగు ఐదు రోజుల్లో రాజుగారికి ప్రాణగండం ఎదురౌతుంది. ఆయన దాని నుండి తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశాలూ లేవు' సంగతి తెలిసాక ఇక హనుమంతు ఊళ్ళో నిలువలేపోయాడు. ఈ విషయాన్ని వెంటనే రాజుగారికి తెలియజేయాలని బయలుదేరాడు. మూడు రోజులపాటు నడిచి, ఎన్నో అవస్థలు పడి, చివరికి రాజధానికి చేరుకున్నాడు. ఉదయాన్నే రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు. "రాజుగారు ఇక్కడ లేరు.
దేశాటనలో ఉన్నారు" అన్నారు ద్వారపాలకులు. "రాజుగారితో ముఖ్యమైన విషయం చెప్పాలి" అన్నాడు హనుమంతు. "ఆ ముఖ్యమైన విషయం ఏమిటో మాకే చెప్పు" అని నవ్వారు ద్వారపాలకులు. అయితే అదే సమయంలో ఒక మంత్రిగారు వచ్చారు అక్కడికి. హనుమంతు మంత్రిగారితో మొరపెట్టు-కున్నాడు- "రాజుగారితో నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆలస్యం ప్రమాదానికి దారి తీస్తుంది!" అని. మంత్రి హనుమంతుని ఊరడించి సంగతి కనుక్కొని, ఆయన్ని మహా మంత్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. మహామంత్రి అనేక రాచకార్యాలలో వ్యస్తంగా ఉన్నాడు. 'హనుమంతు కేవలం బహుమానాల మీది ఆశతో, ప్రశంసల కోసం ఊరికే ఇలా చెబుతున్నాడు' అని మహామంత్రికి అనిపించింది. "ముందు ఇతన్ని చెరసాలలో బంధించండి. అసలు విషయం ఏంటో చెప్పించండి. రేపటి వరకూ ఇతను అదే మాట మీద ఉంటే, అప్పుడు మన ఆస్థాన జ్యోతిష్యుడిని రమ్మందాం" అన్నాడాయన.
భటులు తక్షణం హనుమంతుని చెరసాలలో బంధించారు. అనేక రకాలుగా ప్రశ్నించారు అతన్ని. ఎన్ని రకాలుగా అడిగినా హనుమంతు తను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు తప్ప మాట మార్చట్లేదు. "ఆలస్యం ప్రమాదానికి దారి తీస్తుంది. బాద్యత గలవారిని ఎవరినైనా రమ్మనండి" అంటాడు; "అసలైనా నాదగ్గరికి వచ్చినవాళ్ళ జాతకాలు చూసుకొని హాయిగా ఉండక, నాకెందుకు వచ్చింది ఈ ఖర్మ? అసలు రాజుగారి జాతకాన్ని చదివి చెప్పేందుకు అస్థాన జ్యోతిష్యులు ఉంటారు కదా?" అని వాపోతాడు హనుమంతు. మరునాడు ఉదయం అస్థాన జ్యోతిష్యుడికి కబురు వెళ్ళింది. "ఇక్కడెవరో ఒకతను వచ్చాడు పల్లె నుండి.
రాజుగారి గురించిన ముఖ్యమైన విషయం ఏదో చెబుతాడట. మీరు రావాలి కారాగారం దగ్గరికి" అని. జ్యోతిష్యుడు "నేను ఒక్క ఐదు నిముషాల్లో వస్తున్నాను- ఆలోగా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి" అని వెనక్కి కబురు పెట్టి గబగబా ఆస్థానానికి చేరుకున్నాడు. అంతలోకే వార్తాహరుడొకడు దుర్వార్తను మోసుకొచ్చాడు: రాజుగారు ప్రజల కష్టాలు విచారించే క్రమంలో రాజ్య సరిహద్దులో బస చేసారు. అంతకు ముందు రోజు రాత్రి ఆకస్మికంగా శత్రుసైన్యం జరిపిన దాడిలో రాజుగారు వీరమరణం చెందారు! అంత:పురంలోని వారంతా బావురుమన్నారు.
"మనం బంధించిన ఆ పండితుడిని వెంటనే సగౌరవంగా రప్పించండి" అన్నాడు అస్థాన జ్యోతిష్యుడు. భటులు వెళ్ళి చూసే సరికి కారాగారంలో హనుమంతు కూడా చనిపోయి ఉన్నాడు! అక్కడ రాజు చనిపోయిన కొద్దిసేపట్లోనే ఇక్కడ ఈయనా మరణించి ఉంటాడన్నారు వైద్యులు. "రాజుగారి ప్రాణాలకు గండం ఉందని నాకూ తెలుసు. అయితే ఈ విషయాన్ని వెలువరించిన వారికి కూడా ప్రాణగండం ఉందని తెలుసుకున్నాక, సంగతిని వెలిబుచ్చకుండా సమస్యను ఎలా పరిష్కరించటమా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది" అని ఆస్థానజ్యోతిష్యుడు వాపోయాడు. "పాపం అందరి జాతకాలూ చూసిన హనుమంతు తన జాతకాన్ని తను చూసుకోలేకపోయాడు- విధి వ్రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది" అన్నారు మంత్రిగారు, తనూ విచారపడుతూ, 'రాజుగారి వారసుడిని ఎలా ఎన్నుకోవటమా' అని ఆలోచిస్తూ.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో