Facebook Twitter
ఎంత స్థానికమో, అంత సార్వజనీనం.!

కవిగా హరగోపాల్ మట్టిపొత్తిళ్ల నుంచి తంపి దాకా ప్రయాణం చేశాడు. ఈ కవితా యానాన్ని పరిశీలిస్తే ఆయన కవిగా ఎంత పరిణతి సాధించారో అర్థమవుతుంది. వివిధ ప్రజా సమస్యలను, అంశాలను వస్తువుగా ఎంచుకుని తన జీవన తాత్త్వికతను ప్రకటించుకున్నారు. ఆయన కవిత్వం సాంద్రతను సంతరించుకున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఆయన కవిత్వంలో వాచ్యం మాయమై సాంకేతికత హెచ్చింది. అంతేకాదు, భావోద్వేగాల సమాహారంతో తంపిలోని కవిత్వం ఆస్వాదయోగ్యంగా మారింది.

బాల్యం, కౌమరాం నాటి జ్ఞాపకాలను వలపోతగా కవితల్లో పరుస్తూ వర్తమాన సామాజిక పరిస్థితులకు, పరిణామాలకు అన్వయించడం చాలా కవితల్లో చూస్తాం. ఇది ఆయన కవిత్వానికి ఒక పరిమళాన్ని అద్దింది. పొడిగింపును ప్రసాదించింది. పదాడంబర పటాటోపం లేదు. తెలంగాణ పదజాలం మాత్రమే కవిత్వమనే బుకాయింపు లేదు. స్థానిక పదాలను, ఉపమలను తీసుకుని సమాజాన్ని, రాజకీయాలను, మానవ స్థితిగతులను వ్యాఖ్యానించాడు. స్థానిక పరిణామాలూ పరిస్థితులనూ తీసుకుని జాతీయ, అంతర్జాతీయ పరిణామాలనూ పరిస్థితులను చిత్రక కట్టాడు. తెలంగాణ పదజాలాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రయోగించిన కవుల జాబితాలో హరగోపాల్ చేరాడు. ఇంత సమర్థంగా తెలంగాణ పదజాలాన్ని, పనిముట్లను, సంప్రదాయ ప్రతీకలను వాడుకున్న కవులు తెలుగులో చాలా అరుదుగా కనిపిస్తారు. దానివల్ల స్థానికత ఎంతగా వ్యక్తమైందో అది అంతగా సార్వజనీనతను సంతరించుకుంది.   

వాగు, నిట్టాడు, మనిషి పేరుందా?, లెంకుతున్న, సొట్టచెంపల మనిషి వంటి చాలా కవితలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి. మనిషికీ మనిషికి మధ్య ప్రేమను, మానవీయతను, పోరాట ఆవశ్యకతను, వ్యక్తులు సమూహం కావాల్సిన అవసరాన్ని తన కవిత్వమంతటా హరగోపాల్ పరుచుంటూ పోయాడు. సమాజంలోని వర్తమాన తిరోగమన వాదాలను, పరిస్థితులను తిప్పి కొట్టాడు. నయా ఫాసిస్టు పాలనను వ్యతిరేకించడంలో ధైర్య సాహసాలను  ప్రదర్శించాడు.  దేవుడు లంచగొండి కదా  అని పలికేంతగా ధైర్యసాహసాలను ప్రదర్శించాడు. మత రాజకీయాలతో నయాఫాసిస్టు పాలన సాగుతున్న తరుణంలో ఆ మాట అనడానికి మనిషికైనా, కవికైనా ఆ ధైర్యం కావాలి.  దేశం జైలులెక్క విస్తరిస్తున్నది అని వర్తమాన పరిస్థితిని చెప్పాడు. కనిపించని నిర్బంధాన్నే కాకుండా కనిపిస్తున్న నిర్బంధ వాతావరణాన్ని  ప్రతి దినం శ్వాసను కొనుక్కున్నట్లే వుంది  అంటూ వ్యక్తం చేశాడు. 
మరింత ఆవేశంతో హరగోపాల్ ఇలా అంటున్నాడు 

     మళ్లీ మళ్లీ మానవత్వం చిగురించకుండా
    మళ్లీ మళ్లీ ధ్వంసరచనల మీద గొంతెత్తకుండా అరెస్టు చేయండి
    మళ్లీ మళ్లీ వేయి ఆలోచనల పూలు పూయకుండా
    వసంతాన్ని అరెస్టు చేయండి
అంటూ  ప్రస్తుత పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ప్రస్తుత నయా ఫాసిస్టు పాలనలో ‘మనకు కొంచెం స్వేచ్ఛ కావాలి  అంటూ హరగోపాల్ నినదిస్తున్నాడు.
    
ప్రస్తుత పరిస్థితులను, పరిణామాలను అడ్డుకోవడానికి  
     ఒరే రంగా, యాదికున్ననా
    నువ్వు మల్ల గులేరు పట్టుకోవాలి
    పిట్టల్ని, కాయల్ని కాదు 
    గురి చూసి కొట్టు  
    అన్నీ కొట్టుడు పోయే ఖాతాలే 
 అని పిలుపునిచ్చాడు.

రైతులపై, రైతు పోరాటాలపై అతను సానుకూలమైన కవిత్వాన్ని రాశాడు.  మట్టి చట్టిల వెన్నెల,  రైతు చీమ  వంటి కవితలు  తంపి  కవిత్వ సంపుటిలో వున్నాయి. పంజాబ్ రైతుల ఆందోళనకు మద్దతుగా అతను కవిత్వం రాశాడు. హరగోపాల్ కవిత్వం నుంచి ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులు, పరిణామాలు ఏవీ తప్పించుకుని పోలేదు.  వ్యక్తిగతంగా హరగోపాల్ కవిత్వ పరిణామ క్రమానికి తంపి ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. వస్తువు ఎంపికలోనే కాకుండా అభివ్యక్తిలోనూ ఆ చోటికి అతను చేరుకున్నాడు. దానికి అతని కవిత్వంలోనే మనకు రుజువు లభిస్తుంది. 
     నరుకు, కాల్చు, ఉరికిచ్చి చంపు చారిత్రక పదాలు అనే పాత అభివ్యక్తి తీరును నిరసిస్తున్నాడు. అవి చారిత్రక పదాలుగానే మిగులుతాయని అంటున్నాడు. ఉద్యమ కవిత్వం, ప్రగతిశీల కవిత్వం కొత్త అభివ్యక్తిని ఎంచుకోవాలని సంకేతిస్తున్నాడు. అందుకు అనుగుణంగానే కొత్త డిక్షన్‌తో వచ్చిన హరగోపాల్ కవిత్వం నేల విడిచి సాము చేయలేదు. అతిశయోక్తులు పలకలేదు. కృత్రిమ ఆశావాదాన్ని ప్రచారం చేయలేదు. 

హరగోపాల్ కవిత్వం చదువుతుంటే నా కవిత్వాన్ని చదువుకుంటున్న అనుభూతి కలిగింది. ఇద్దరం ఆలేరు వాగు ప్రవాహానికి పరవశించిపోయినవాళ్లమే. వట్టిపోయినప్పుడు వాగులోని ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టినవాళ్లమే. ఆలేరు గ్రంథాలయంలోని పుస్తకాలను చదివి జీర్ణం చేసుకున్నవాళ్లమే. అందుకే ఈ కవిత్వానికి మెట్టప్రాంతం ఆవేదనల నుంచి, పోరాటాల నుంచి పెల్లుబుకిన ఉద్వేగం వుంది. అందుకే ఈ కవిత్వానికి ఇంత మట్టివాసన.  తెలుగు ఆధునిక కవిత్వం, ముఖ్యంగా తెలంగాణ ఆధునిక కవిత్వం అభివ్యక్తిని నిలబెడుతున్న కవిగా హరగోపాల్ నిలిచిపోతాడు.

-కాసుల ప్రతాపరెడ్డి