Facebook Twitter
ఆధునిక కవిత్వంలో విలక్షణమైన కంఠస్వరం

ఆధునిక తెలుగు కవిత్వంలో నందిని సిధారెడ్దిది ప్రత్యేకమైన గొంతుక. తన కవిత్వంలో ఆయన తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సామాజిక చైతన్యం, ప్రాంతీయ అస్తిత్వాలను ప్రతిబింబింపజేశారు. ఆయన కవిత్వం కేవలం భావ వ్యక్తీకరణకు మాత్రమే పరిమితం కాలేదు. అది తెలంగాణ సమాజ చరిత్రకు, వేదనకు, ఆకాంక్షలకు సాహిత్య రూపం కూడా.

నందిని సిద్ధారెడ్డి కవిత్వంలో అత్యంత ముఖ్యమైన లక్షణం తెలంగాణ మాండలిక భాష వినియోగం. తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు పరాయి భావనకు గురైన తెలంగాణ భాషను ఆయన కవిత్వంలో గౌరవనీయమైన స్థాయికి తీసుకువచ్చారు. సాధారణ ప్రజల మాటలు, పల్లె జీవన రీతులు, రైతు జీవితపు అనుభవాలు ఆయన కవిత్వంలో అత్యంత సహజంగా ప్రతిఫలిస్తాయి. అంతేకాదు.. వస్తువు ఏదైనా సరే, అతి సులభంగా, సహజంగా తెలంగాణ పదజాలంతో, నానుడులతో పూర్తి అధునిక వచన కవిత్వం రాసిన అతి కొద్ది మంది తెలంగాణ కవుల్లో సిధారెడ్డి ప్రముఖుడు. అది ఆయనకు అనివార్యమైంది కూడా. ఈ రకంగా ఆయన తెలంగాణ కవిత్వం ప్రత్యేకతను అగ్రభాగాన నిలపడమే కాకుండా మొత్తం తెలుగు కవిత్వానికి కొత్త డిక్షన్ ను అందించారు. ఆ రకంగా ఆధునిక తెలంగాణ వచన కవిత్వ భాషను రూపొందించిన కొద్ది మంది కవుల్లో ఆయన ముందుంటారు. 

తెలంగాణ అస్తిత్వ ఉద్యమం సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో వేళ్లూనుకోక ముందు నుంచి తెలంగాణ భాష , నుడికారం పూర్తి స్థాయి వచన కవిత్వం  ఆయన నుంచి వెలువడింది. ‘భూమి స్వప్నం‘, ‘సంభాషణ’, ‘ఒక్క బాధా కాదు’  నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ‘అనిమేష‘ వరకూ అన్ని కవితా సంపుటుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. అందువల్లనే కె. శివారెడ్డి కవిత్వ ప్రభావం ఆయనపై పడలేదు.

నందిని సిద్ధారెడ్డి కవిత్వం సామాజిక చైతన్యంతో కూడుకున్నది. తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్న అన్యాయం, ఆర్థిక వెనుకబాటుతనం, సాంస్కృతిక వివక్ష వంటి అంశాలు ఆయన కవిత్వంలో ప్రతిధ్వనిస్తాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన రాసిన పాటలు ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని పెంచాయి. ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉర్రూతలూగించింది. ఆయన కవిత్వంలోని ప్రతీకలు చాలా వరకూ సజీవమైనవి. భూమి, నది, వర్షం, చెట్టు వంటి ప్రకృతి అంశాలు తెలంగాణ సమాజపు జీవన పోరాటానికి ప్రతీకలుగా మారుతాయి.  నందిని సిధారెడ్డి తెలంగాణ ఆధునిక సాహిత్యంలో ఒక ఉద్యమ కవిగా గుర్తింపు పొందారు. ఆయన రచనలు తెలంగాణ సాంస్కృతిక స్వరూపాన్ని ప్రతిబింబించడమే కాకుండా ప్రజలలో ఆత్మగౌరవాన్ని పెంపొందించాయి. నందిని సిధారెడ్డి కథలు కూడా రాశారు. ’నాగటి తరం‘ అనే నవల రాశారు. పదునైన సాహిత్య విమర్శ కూడా చేశారు. తెలంగాణ భాషపై ప్రత్యేక అధ్యయనం చేశారు. కానీ ఆయనకు కవిగానే ఎక్కువ పేరు వుంది. 

-కాసుల ప్రతాపరెడ్డి