Facebook Twitter
రైతు-కుక్క

రైతు-కుక్క

 


అనగనగా ఒక ఊళ్లో అమాయకపు రైతు ఒకడు ఉండేవాడు. అతనికి నాలుగు ఆవులు ఉండేవి. రోజూ అవి ఇచ్చే పాలని అమ్ముకునేందుకు గాను రైతు పట్టణానికి వెళ్ళి వచ్చేవాడు. ఒకసారి అతను అట్లా వెళ్తుంటే కుక్క ఒకటి వచ్చి అతని ఎదురుగా నిల్చున్నది. పాల క్యాన్ వంకే చూస్తూ "భౌ.. భౌ.." మని మొరగటం మొదలెట్టింది. కొంచెం సేపటికి దాన్ని చూసిన రైతు "పాలు కావాలా? ఎన్ని కావాలి?" అన్నాడు దానితో.ఆ కుక్క మళ్ళీ "భౌ..భౌ.." అన్నది. "ఓహో! ఒక లీటరు కావాలా?!" అన్నాడు రైతు. కుక్క మళ్లీ "భౌ..భౌ" అని, ముందుకొచ్చి క్యాన్‌ని నాకింది.

 

"ఉండవే! నువ్వూ, నీ తొందరా!" అన్నాడు రైతు మురిపెంగా, ఒక ఆకుని తీసుకుని, దోనెలాగా చేసి, అందులో పాలు పోసి, కుక్క ముందర పెడుతూ. కుక్క గబగబా పాలన్నీ త్రాగేసి వెళ్ళిపోబోయింది నిశ్శబ్దంగా- "ఏయ్! డబ్బులు ఇవ్వకుండానే పోతున్నావే?!" అని అరిచాడు రైతు. కుక్క ఆగి, అతనికేసే చూస్తూ నాలిక బయట పెట్టింది. "చూసింది చాలు. పాల డబ్బులు కట్టి, కదులు!" అన్నాడు రైతు. కుక్క మళ్ళీ "భౌ..భౌ.." అన్నది. "ఓయ్! నీ దగ్గర డబ్బులు లేవా?! ఐతే పర్లేదులే, రేపు తెచ్చి ఇవ్వు!" అంటూ రైతు తన దారిన తాను పోయాడు. మర్నాడు కూడా అదే సమయానికి కుక్క రైతుకు ఎదురు వచ్చి, "భౌ..భౌ" అని అరిచింది. "‌వచ్చావా! నిన్నటి పాల డబ్బులు- ఇస్తావా?" అన్నాడు రైతు.

 

కుక్క అతని చుట్టూ‌ తిరుగుతూ "భౌ..భౌ.." అంది మళ్ళీ. "ఓహో! ముందు ఒక లీటరు పాలు ఇవ్వమంటావా?! సరే, కానివ్వు!"‌ అని క్రితంరోజు లాగానే ఇంకో లీటరు పాలు తాగించాడు రైతు. పాలు త్రాగాక తన వైపే చూస్తూ కూర్చున్న కుక్కను చూసి విసుక్కుంటూ "ఇంకా ఏం చూస్తావు? చూసింది చాల్లే, డబ్బులు ఇచ్చెయ్యి ఇంక!" అన్నాడు. కుక్క మౌనంగా‌పడుకుంది. "ఏంటి, డబ్బులు ఇవ్వకుండా పడుకున్నావు?! లే, లేచి డబ్బులు ఇవ్వు!" అన్నాడు రైతు దాని దగ్గరికి వెళ్ళి. కుక్క బద్ధకంగా కళ్ళు తెరిచి చూసి, మళ్ళీ పడుకుంది.

"ఏంది వేషాలేస్తున్నావా? డబ్బులు ఇవ్వకుండా పడుకున్నావు?! లే, ముందు!" అన్నాడు రైతు కోపంగా. కానీ కుక్క కదలలేదు. కనీసం కళ్ళు కూడా తెరిచి చూడలేదు. దాంతో‌ కోపం పట్టలేని రైతు చేతికందిన కర్ర ఒకటి తీసుకుని దాన్ని కొట్టేందుకు ముందుకు దూకాడు. అది గ్రహించిన కుక్క చటుక్కున లేచి పరుగు పెట్టింది. రైతు దానివెంట పడ్డాడు.

అతనికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నంలో కుక్క పరుగెత్తుకుంటూ కొండ క్రింద ఉన్న పొదల్లోకి వెళ్ళింది. అయితే సరిగ్గా ఆ సమయానికి ఆ పొదల్లోనే ఒక దొంగ కూర్చొని ఉన్నాడు. అంతకు ముందు రోజు రాత్రి దొంగతనం చేసి తను తెచ్చుకున్న డబ్బుని అక్కడ కూర్చొని లెక్క పెట్టుకుంటున్నాడు వాడు. దొంగని చూడగానే కుక్క ఆగిపోయి "భౌ..భౌ" మంటూ అరిచింది.

దాని వెనకనే పరుగెత్తుకొస్తున్న రైతు "ఏయ్! ఆగు! నా డబ్బులు ఇచ్చెయ్యి మర్యాదగా!" అని అరుస్తున్నాడు. మరుక్షణం ఆ దొంగవాడు డబ్బునంతా అక్కడే వదిలేసి ఉన్నపళంగా పరిగెత్తి పోయాడు. కుక్క ఆ డబ్బుల చుట్టూనే తిరిగి వాసన చూడటం మొదలు పెట్టింది. అంతలో అక్కడికి చేరుకున్న రైతుకు చాలా సంతోషం వేసింది. కుక్క అంటే మళ్ళీ ఓసారి ప్రేమ పుట్టుకొచ్చింది. "ఓహో! ఇదా, నువ్వు ఇందాకటినుండీ చెబుతున్నది! 'నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇక్కడ దాచిపెట్టాను' అని చెబుతున్నావా?‌ నాకు అస్సలు అర్థమే కాలేదు.

'డబ్బులు ఇవ్వను' అంటున్నావేమో, అని నిన్ను అపార్థం చేసుకున్నాను" అంటూ‌ వంగి ఆ డబ్బునంతా తీసుకొని మూటలో పెట్టుకున్నాడు "రెండు లీటర్ల పాలకే చాలా డబ్బు ఇచ్చావే, ఎలాగ మరి?" అంటూ. కుక్క తోక ఊపుతూ "భౌ..భౌ" అన్నది. "సరేలే! నీ బాకీ‌ ఉంచుకోనులే. నీ బాకీ తీరేదాకా రోజూ నీకు పాలు పోస్తానులే, సరేనా?!" అని తృప్తిగా నవ్వుకుంటూ‌ ఇంటి దారి పట్టాడు రైతు.

అయితే ఆ తరువాత మళ్ళీ రైతుకు ఆ కుక్క కనబడనే లేదు. "పాపం పిచ్చిది! తన దగ్గర డబ్బులు లేవని, మళ్ళీ డబ్బులు సంపాదించుకునేందుకు వెళ్ళి ఉంటుంది! దాని డబ్బులు నా దగ్గర ఉన్నాయని అర్థం కాలేదేమో, దానికి!" అని ఇప్పటికీ‌ అనుకుంటూనే ఉన్నాడు రైతు.


కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో