TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
దిద్దుబాటులో వెలుగుబాట!!
తెలుగు సాహిత్యంలో ఎంతో గొప్పగా చెప్పుకునే రచయితలు, సామాజిక, సంఘ సంస్కర్తలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో గురుజాడ అప్పారావు గారు కూడా ఒకరు. ఈయన రచయితగా, కవిగా, సంఘసంస్కర్తగా తెలుగు వారి గుండెలో ఎంతో బలమైన ముద్ర వేశారు.
ముఖ్యంగా స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి, బాల్యవివాహాలు అణిచివేయడానికి, సామాజిక చైతన్యానికి తన అక్షరాలనే అస్త్రాలుగా మలచి ప్రజల్లోకి వదిలి, ఆలోచనలను రేకెత్తించినవాడు గురజాడ అప్పారావు. ఈయన కన్యాశుల్కం నాటకం ఎంత ప్రసిద్ధి చెందినదో అందరికీ తెలిసిందే. శతాబ్ద కాలం దాటినా దాని ప్రభావాన్ని కోల్పోని, నేటి కొత్త సాహితీకారులు తప్పకుండా చదవాల్సినది కన్యాశుల్కం. అయితే ఈయన రచించిన వాటిలో దిద్దుబాటు అనే చిన్న కథ సూక్ష్మంలో ఎంతో గొప్ప సారాన్ని చెబుతుంది.
అసలు ఏమిటీ దిద్దుబాటు!!
శీర్షికలోనే అర్థమంతా ఉంది. ఇందులో ఎలాంటి ఘోడార్థం లేదు. చేసిన తప్పును సరిదిద్దుకోవడం, తను చేసింది తప్పు అని గ్రహించడం. క్లుప్తంగా ఇదీ కథ. అయితే దాన్ని కథగా చూడలేము, ఎందుకంటే అన్నీ వాస్తవ జీవిత సదృశ్యాలే అందులో కనబడతాయి.
ఈ కాలానికీ….. దిద్దుబాటు!!
అవును కాలానికి సంబంధం లేని కథ ఇది. కాలాలు ఎన్ని మారినా ఎప్పటికీ నిలిచి ఉండే కథ. చదువు ఆవశ్యకతను ఎంతో చక్కగా చెప్పిన కథ, బంధాలు ఎలా చక్కదిద్దుకోవాలో ఎంతో చక్కగా తెలియజెప్పే కథ.
చదువుకున్న వాడు, సామాజిక చైతన్యం కలవాడు, పురుషాధిక్యత చూపించనివాడు కథలో పాత్రధారి గోపాలరావు. కానీ ఒకటే మచ్చ, మీటింగులు, బయట ఏవో పనులు అంటూ రాత్రిళ్ళు ఎప్పుడో ఒంటిగంటకు ఇంటికి వెళ్తున్నాడు. గోపాలరావు భార్య కమలిని ఎంతో చక్కనిది, భర్త అంటే ఎంతో గౌరవం, అంతకుమించి ఆరాధనా!!
ఒకరోజు గోపాలరావు రాత్రి ఒంటిగంటకు ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా చీకటి, దీపము లేదు, దీపం పెట్టే ఇల్లాలు కనిపించలేదు, పనివాడు రావుడు, వాడిలో పితృస్వామ్య వ్యవస్థ తొంగిచూస్తుంది. భార్యను భర్త అణగదొక్కడం లేదా బెదిరించడమనే వృత్తంలో ఉంచాలని చెప్పినట్టుంటాయి వాడి మాటలు.
పంతులుగారికి బుద్ధి వచ్చిందని, ఇంకెప్పుడూ అలా చేయనని చెప్పాడని పుట్టింటికి వెళ్లిపోయిన భార్యకు చెప్పి తీసుకురమ్మంటాడు గోపాలరావు. అక్కడ కూడా ఎన్నో ఏళ్లుగా పనివాడిగా ఉన్నాడనే నమ్మకంతోనే వాడికి ఆ పని చెబుతాడు. అదొక బాధ్యతాయుతమైన నమ్మకం. తప్పు చేసినపుడు మగవాడు అహంకారం చూపించకుండా వైవాహిక జీవితాన్ని సరిచేసుకునే మార్గం.
"ఆడవాళ్లకు చదువు చెప్పించగానే ఇలాగే చేసి పోతారు" అనే అర్థం వచ్చేట్టుగా మాట్లాడతాడు రావుడు.
కానీ గోపాలరావు అంటాడు "ఓరీ మూర్ఖుడా భగవంతుడు సృష్టించిన ఉతృష్టమైన వస్తువు చదువుకున్న అడపిల్లనే" అంటాడు. అంటే ఆడపిల్లకు చదువు ఎంత ముఖ్యమో 1910 సంవత్సరంలోనే ఈ కథలో గురజాడ గారు అందరికీ అర్థమయ్యేలా ఎంతో చక్కగా వివరించారు. కాయహ ఆసాంతం చదివిన పాఠకులకు అయ్యో ఈ గోపాలరావు మంచోడే, ఈయనను వదిలేసి కమలిని అలా ఎలా వెళ్లిపోయిందో, గోపాలరావు తప్పు చేసాడు నిజమే, కానీ ఆ తప్పు మినహయిస్తే అతడు ఎంతో మంచివాడు కదా అనుకుంటారు చదువరులు.
కానీ…..
గోపాలరావు బుద్దొచ్చిందన్నాకా, కమలినిని తీసుకురమ్మని రావుడికి చెప్పాకా, ఆ గదిలో మంచం కింద నుండి కమలిని కిలకిల నవ్వులు పాఠకులకు ఎంతో ఆహ్లాదాన్ని చేకూర్చుతాయి. ఎలాంటి అనవసర హంగామా లేకుండా సాగిపోయే ఈ కథలో ఎదుటి మనిషిని అర్థం చేసుకోడంముఖ్యంగా ఎదుటి వారి ఆలోచనలకు, ప్రవర్తనకు గౌరవం ఇవ్వడం ఇంకా చెప్పాలంటే పనివాడని రావుడుని కొట్టినా మళ్లీ మానవత్వంతో లోపలికి తీసుకెళ్లి ఎంతో ఆత్మీయంగా మాట్లాడటం ఇలా చూసే ప్రతి కోణంలోనూ ఎంతో గొప్ప కథగా అన్ని కాలాల మీధా నిలబడుతుంది.
ఈ దిద్దుబాటు పిల్లల ఆలోచనకు ఓ మంచి వెలుగుబాట!!
◆వెంకటేష్ పువ్వాడ.