Facebook Twitter
కాకి-చిలుక-పిచ్చుకల కథ

కాకి-చిలుక-పిచ్చుకల కథ

 

 

అనగనగా ఒక అడవిలో ఒక కాకి, పిచ్చుక, చిలుక ఉండేవి. కాకి, పిచ్చుక చాలా మంచి స్నేహితులు- కానీ చిలుక మాత్రం కాకిని చూసి ఊరికే అసహ్యించుకుంటూ ఉండేది. ఒకరోజు కాకి, పిచ్చుక రెండూ ఎందుకనో చాలా వాదించుకున్నాయి. చిలుక ముందుకొచ్చి, కాకిని మరింత తిట్టి, పిచ్చుకను వెంటబెట్టుకొని పోయింది.

 

అయితే అదే రోజున నక్క ఒకటి, చిలుకని తినేద్దామని పథకం వేసింది. "చిలుక పడుకున్న సమయం చూసుకొని, మెల్లగా- చప్పుడు కాకుండా- చెట్టు ఎక్కి దాన్ని తినేస్తా" అని ప్లాన్‌ చేసింది.

 


ఆ రోజు రాత్రి చిలుక పడుకోగానే నక్క వచ్చి, గుట్టు చప్పుడు కాకుండా చెట్టెక్కబోయింది. అయితే అక్కడే ఉన్న కాకి దాన్ని చూసింది. ఇంకేముంది? ఒక్క సారిగా నక్క మీదికి దూకింది- ఎక్కడ పడితే అక్కడ పొడవటం మొదలు పెట్టింది. 

కాకి ధాటికి తట్టుకోలేని నక్క మూలుగుతూ పోరాటం మొదలు పెట్టింది. వాటి ఆ అరుపులకి మేల్కొన్నది చిలుక. తన చుట్టూ ఏం జరుగుతున్నదో చూసి, అది గబగబా లేచి ఎగిరిపోయింది. అటు నక్క కూడా 'బ్రతుకు జీవుడా' అని తోచిన దారిన పరుగు పెట్టింది. ఇప్పుడు చిలుక చాలా మారిపోయింది. కాకి మంచితనాన్ని అర్థం చేసుకున్నది. దానికి ధన్యవాదాలు చెప్పింది. అప్పటి నుంచి కాకి-చిలుక-పిచ్చుక మూడూ మంచి స్నేహితులైపోయాయి.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో