Facebook Twitter
అమరుకుని కథ

అమరుకుని కథ

 

మన దేశం జన్మనిచ్చిన అనేకమంది తత్వవేత్తలలో ఎన్నదగినవారు, ఆదిశంకరాచార్యులవారు. అతి చిన్న వయసులోనే వేదాలకు భాష్యాలు వ్రాసిన శంకరుడు, కేరళలోని 'కాలడి'లో జన్మించాడు. దేశమంతటా సంచరిస్తూ, అనేకమంది పండితులతో శాస్త్రచర్చలు జరిపి, గెలిచాడు. "పరమాత్మకు- ఆత్మకు భేదం లేదు" అనే 'అద్వైత' సిద్ధాంతాన్ని నెలకొల్పాడు.

ఓ సారి ఈయనకూ, మండనమిశ్రుడనే మరొక తత్త్వవేత్తకూ శాస్త్రాలమీద గొప్ప చర్చ జరిగింది. ఆ చర్చలో మండనమిశ్రుని భార్య ఉభయభారతి కూడా పాల్గొన్నది. చర్చలో మండన మిశ్రుడు వెనుకబడ్డాడు. వాదనలో తన భర్త ఓడిపోతూ ఉండడం చూసి ఉభయభారతి కల్పించుకున్నది; ఆదిశంకరుడిని కుటుంబం గురించీ, పెళ్ళీ పిల్లల గురించీ ప్రశ్నించడం మొదలుపెట్టింది.

ఆదిశంకరులవారు చిన్నతనంలోనే సన్యసిం-చినవాడు. పెళ్ళి చేసుకోలేదు; అందువల్ల సాంసారిక విషయాలేవీ ఆయనకు అనుభవంలో లేవు. మరి ఇప్పుడు జవాబు ఏమని చెబుతాడు? ఆయనకు ఎటూ పాలుపోలేదు. అందుకని అయన ఆ దంపతుల వద్ద కొంతకాలం సమయం అడిగాడు. 'ఉభయ భారతి అడిగిన అంశాల గురించిన అనుభవ జ్ఞానం సంపాదించటం‌ ఎలాగ' అని ఆలోచిస్తూ దేశాటనను కొనసాగించాడు.

అట్లా పర్యటిస్తూ శంకరాచార్యులవారు, ఆయన శిష్యులు చివరికి ఒక రాజ్యం చేరుకున్నారు. ఆ రాజ్యపు రాజు అమరుకుడు. వీళ్ళు వెళ్ళే సమయానికి అమరకుడు చనిపోయి ఉన్నాడు. అతని శరీరాన్ని దహనం చేయాలని బంధువులంతా చితి పేరుస్తున్నారు.

 

అది చూడగానే శంకరునికి ఒక ఆలోచన వచ్చింది. ఆ దగ్గరలోనే ఉన్న ఒక గుహలోకి పోయి కూర్చొని, శిష్యులతో "నాయనలారా, చూడండి, ఇప్పుడు నేను నా ఈ శరీరాన్ని విడిచిపెట్టి, అమరుకుని శరీరంలోకి ప్రవేశిస్తాను. కొద్ది కాలం తర్వాత తిరిగి వస్తాను. నేను అలా తిరిగి వచ్చేంతవరకూ నా ఈ శరీరాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుతూండండి" అని చెప్పి, శంకరులు తనకు తెలిసిన 'పర కాయ ప్రవేశం' అనే విద్యని ఉపయోగించుకొని, తన దేహాన్ని విడిచి, అమరుకుని దేహంలోకి ప్రవేశించారు.

మరుక్షణం అమరుకుడు లేచి కూర్చున్నాడు. బంధువులందరూ ఆశ్చర్య-పోయారు: 'చనిపోయాడు అనుకున్నాం గానీ, నిజానికి ఈయన ఇంకా ప్రాణాలతోటే ఉండి ఉంటాడు' అనుకున్నారు; రాజవైద్యులంతా నివ్వెరపోయారు, సిగ్గుతో తలదించుకుకున్నారు; ప్రజలంతా 'మా రాజుకు ఏమీ కాలేదు' అని చాలా మురిసిపోయారు. రాణిగారు, పిల్లలైతే మహా సంతోషపడ్డారు. ఇక అక్కడ గుహలో, శంకరుని అసలు శరీరాన్ని కాపాడుకుంటూ, ఎప్పుడు తిరిగి వస్తాడా అని చూస్తూ కూర్చున్నారు ఆయన శిష్యులు.

అమరుకుని దేహంలోనికి చేరిన శంకరాచార్యులవారికి ఆ క్షణంనుండే సంసారం ఎదురైంది. ఆ ప్రపంచాన్ని ఆయన తనదైన నిర్లిప్తతతోటీ, నిరాసక్తతతోటీ గమనిస్తూ, తనకు ఎదురౌతున్న ప్రతి అనుభవాన్నీ తన జ్ఞానంలో పొదవుకుంటూ పోసాగాడు. రాజుగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ అద్భుతంగాను, వివేక పూరితంగాను ఉండినై తప్ప, గతంలో రాజు అమరకుడు ఇస్తున్నట్లు లేవు.

ఈ తేడాని మొదట గమనించింది, అమరకుని భార్య. ఆమె చాలా తెలివైనది. 'తన భర్తకు ఏమైంది? చనిపోయినట్లు ఎందుకయ్యాడు, మళ్ళీ ఎలాగ లేచి కూర్చున్నాడు? ఇంత చక్కగా, ఎవరో రుషి మాదిరి, ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?' అని ఆమె ఆలోచిస్తూనే ఉన్నది. చివరికి ఆమెకు అర్థమైంది: "ఇది అసలు తన భర్త కాదు. ఎవరో వేరేవాడు, చనిపోయిన తన భర్త దేహంలో ఉన్నాడు!" అని. మరి ఇప్పుడు ఏం చేయాలి?

 

"ఇది అందరికీ చేతనయ్యే ఆషామాషీ విద్య కాదు. ఈయన ఎవరో గొప్ప సిద్ధుడు అయి ఉంటాడు. అట్లాంటివాడు ఎందుకనో, అమరుకుని శరీరాన్ని ఎంచుకున్నాడు. త్వరలో విడిచిపెట్టి పోతాడు అట్లా పోనివ్వకూడదు. ఇందులోనే ఉండేట్లు చెయ్యాలి. ఈ సిద్ధ పురుషుని వల్ల రాజ్యమూ, రాజవంశమూ కూడా చల్లగా కొనసాగేట్లు చూడాలి" అనుకున్నదామె. 

వెంటనే ఆమె తెలివిగా, రాజుగారికి ఏమాత్రం తెలీకుండానే తమ సైనికులను ఆదేశించింది: "మన రాజ్యంలో ఎక్కడా శవం అంటూ లేకుండా చూడండి. జంతువుల శరీరాలు గానీ, మనుషుల శవాలుగానీ, వెతికి వెతికి అన్నిటినీ తక్షణం కాల్చేయండి" అని. "అట్లా కాల్చేస్తే, అమరుకుని దేహంలో ఉన్న సిద్ధపురుషుడి కళేబరం కూడా కాలిపోతుంది కదా, ఇక అతడు శాశ్వతంగా తమతో ఉండిపోతాడు!" అని ఆమె ఆలోచన.

ఇక ఇక్కడ, గుహలో ఉన్న శంకరుడి శిష్యులకు 'గురువుగారి దేహాన్ని కాపాడడం ఇప్పుడింక కష్టం' అని అర్థమవ్వసాగింది. కనిపించిన శవాలనన్నిటినీ కాల్చేస్తున్నారు రాజభటులు. ఏదో ఒక క్షణాన వాళ్ళు గుహ దగ్గరికి రాకపోరు; గురువుగారి శరీరాన్ని కూడా కాల్చేయకపోరు! ఎలాగ ఇప్పుడు?" అని వాళ్ళు కంగారు పడ్డారు. అయితే వాళ్ళకు తెలుసు- తమ గురువుగారు వెళ్ళింది అమరుకుని శరీరంలోకే. అందుకని వాళ్ళు వేషాలు మార్చుకొని గబగబా రాజసభకు వచ్చారు. "తత్త్వమసి, తత్త్వమసి, రాజన్" అంటూ పాటలు పాడటం మొదలెట్టారు.

"తత్త్వమసి" అనేది ఉపనిషత్తులలో వాక్యం. "జీవాత్మ అయిన నువ్వే పరమాత్మవు" అని సూచిస్తున్న అద్వైత వాక్యం అది. లౌకికంగా చూస్తే కూడా ఆ వాక్యానికి అర్థం "అదే నువ్వు" అని. "అయ్యో, నీ శరీరాన్ని నువ్వే కాల్చేయమని ఆదేశించావేమి? అది అసలు నువ్వే కదా?" అని రాజుగారి దేహంలో ఉన్న శంకరాచార్యులవారికి అనుచరులు సూచించారనమాట.

 

దాంతో శంకరులవారికి సంగతి అర్థమైంది. మరుక్షణం ఆయన అమరుకుడి దేహాన్ని వదిలి తన నిజ శరీరంలోనికి ప్రవేశించాడు. అమరుక మహారాజు మళ్ళీ ఓసారి మరణిం-చాడు. తన ఆలోచన ఫలించలేదని గ్రహించిన రాణి విషయాన్ని ఇక పొడిగించలేదు. మళ్ళీ ఓసారి అమరుక మహారాజులవారికి అంత్యక్రియలు మొదలయ్యాయి.

అమరుకుని దేహంలో ఉన్నప్పుడు తనకు కలిగిన సంసారానుభవంతో శంకరులవారు అమరుక కావ్యాన్ని రచించారు. ఆ అనుభవం ఆధారంగా ఉభయభారతి అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులివ్వగలిగారు. మండన మిశ్రుడిని ఓడించారు. అమరుకుడి ఉదంతాన్ని పురస్కరించుకుని సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పుకుంటారు.

కవి రమరుః కవి రమరః, 
అన్యే కవయః కపయః | 
కవిర్హి చోరః మయూరశ్చ, 
చాపలమాత్రం పరం దధతే || 

"అమరుకుడే కవి. అతడు మాత్రమే 'అమరుడు'- అంటే చావు లేని వాడు. 
మిగిలిన కవులు అసలు కవులే కాదు- వాళ్లంతా 'కపులు'- అంటే కోతులు! 
ఇంకా ఎవరినైనా కవులు అనాలంటే 'చోరుడు, మయూరుడు' అన్న కవుల్ని కొద్దిగా అలా అనచ్చు. 
వీళ్ళు కాక మిగిలిన కవులందరినీ ఏదో చాపల్యంతో అలా 'కవులు' అనచ్చేమోగానీ నిజానికి వాళ్ళెవ్వరూ అసలు కవులు కానే కారు!" అని దీని తాత్పర్యం.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో