ఓ బొజ్జ గణపయ్యా...!

ఓ బొజ్జ గణపయ్యా...! ఓ బొజ్జగణపయ్య మా తప్పులుగాయవయ్య అలవిగాని హామీలు గుప్పించి గద్దెనెక్కాము అంతుబట్టదెట్టో తప్పించుకు తిరుగుమార్గము అప్పుబట్టైనా పూజకు పసిడి ఉండ్రాళ్ళు పెట్టెదము! దండునెట్టా అణచిపెట్టాలో దండమెడతాజెప్పు గండమును దాటించి అండగా నువ్వుండు మందుబాబుల సెక్యూరిటీబాండుల తాకట్టులెట్టైనా గండు గండుగా లడ్డూలు బాండీలకొద్ది పెట్టెదము! గడప గడపాకాడ చిటపటాలె టపటపాలె గడివుదీరేదాక ప్రజల గమ్మునుంచే త్రోవజూపు గంటగంటకో కుల కార్పొరేషన్మీద లోనుబట్టైనా గంపలకొద్దీ పత్రి కొండెత్తు కాదు నింగెత్తు పెట్టెదము! తప్పులెన్నోజేసి అప్పుదెచ్చుకు మ్రింగాలి తప్పులుగాచు పైవాడి కరుణ కరగనివ్వకప్పుడే తప్పుత్రోవన కాకిలెక్కలుజూపి ఋణంబట్టైనా తప్పులెంచకు వడపప్పు బొబ్బట్లు బోలెడు పెట్టెదము! కాసుల కేసులగొస కంటికునుకుకు కినుకయ్యేను కాస్తయినా నిఘానేత్రాల చల్లనిదృష్టి కురచవ్వనీయకు కాష్టందాక రాష్ట్రంలో సమస్తం బ్యాంకులకు కొదవలెట్టైనా కాంతులీడు మల్లెమందారలు కోట్లపుట్టెడ్లు పెట్టెదము! --రవి కిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్!

జ్ఞాన జ్యోతి!

జ్ఞాన జ్యోతి! మదిన వెలుగులుబూయగ  జ్ఞానదివ్వెలెలుగగ  తమస్సునుద్రోలునట్లుగ  మధుర వేణుగానంజేయి మాధవా! ద్వాపరమున అవతరించి  పలు దుర్గుణముల తిమిరాంధకాసురుల జంపితీవు  ఫల్గుణ సారథీ నీవు! మనస్సున మైలనెరుగక  సద్గుణములనొదలి అజ్ఞానులమై దురహంకారులమై మెలుగుతూ నరకాసురలయితిమిపుడు! పాత్రన బొట్టుజమురు నీరంతా గప్పినటు  నిశిపొరగప్పు మనస్సులనా సాంతం జ్ఞానజ్యోతులు దగిలి తామసం దొలుగునటు ఇపుడీ తేజోమయ వేణువూదు మురళీలోలా! మా హృదయక్షీరమును జిలికి నిశాంధగరళమును జంపి అమృతజ్యోతులెలిగించ మురళిని మ్రోగించవయ్యా నల్లనయ్యా! నీరాధ నీప్రకృతిని పంచభూతాలను ప్రాణమున్న ప్రతిజీవినీ ప్రేమించ పరవశమ్ముగా పలికించుము శ్రీకృష్ణా పిల్లనగ్రోవినీ కృష్ణాష్టమిన! -- రవి కిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్!

పూలవనం

పూలవనం తోటలో నాలుగు పూలు పూసాయి ఎవ్వరూ గుర్తించట్లేదు తోటమాలి చూసినట్టున్నాడు నేనూ చూసాను ఇప్పుడు పూలవనం అంతా నాలో నిండింది పాపను చూసా  తోటలో పూలు నవ్వినట్లుగా అనిపించింది.. రోడ్డుపక్కన బిచ్చగాడిని చూసా తోటనిండా పూలు రాలినట్టున్నాయి.. ఎటు చూసినా పూలవనమే ఏ వైపుకి వెళ్ళినా పూలవనమే ఎవరితో మాట్లాడినా పూలవనమే నాతో ఉన్న పూలవనం నా చుట్టూ ఉన్నట్లున్న ఈ పూలవనం నా స్నేహితులకు కూడా పంచాలి పాపం వాళ్ళు పూలనవ్వుల్ని ఎప్పుడూ చూసి ఉండరు పూలవనం ఎంత అందమైనదో అందాన్ని పరిమళంతో పోల్చిన ప్రతీసారీ పుప్పొడి లా పొంగిపోతూనే ఉంటుంది.. ఎంత కమనీయం ఎంత సుగంధీయం ఎంత కోమలం ఈ పూలవనం రోజంతా నాలోనే నాతోనే.. ✍🏻. దాసరి మల్లేశ్

విరహ గీతం!

విరహ గీతం! కృష్ణపక్షపు కడపటి నిశిరాతిరిలా మనస్సాకాశమంతా చీకటావరించి అవలోకనకే చిట్టణువగపడక దిశనెరగక తిరుగు దిమ్మరి నీరదమౌదు! ఎగుభుజలతలనొదిగి సేదదీరాలనోరేడా మదగజగమనా మందహాసా మానసందోచేవని విదియచందురునొసల మరుని విరివిల్లుతీరుతో చిరుతప్రాయపు చూపుల విరిశరముల గుచ్చేవనిజూతు! అంతరంగసీమల్లాడు పరితోషమొందక కొదమసింగపు నడుము విభుని జతగూడక కుసుమశరునికే మరులుగొల్పు మనోహరా స్వప్నదర్శనభాగ్యమేనా ప్రత్యక్షమై నన్నేలుకోవా! ఇదిందిరనై సంఫుల్ల మందారాల కిసలయ మేదుర చాంపేయాల గ్రోలబోదు! మధుమాసపు చలాచల కలకంఠినై మరునిబంటై మావిపూల గుత్తులపై వ్రాలబోదు! దివారాత్రాలు పాంథుడై సంచరించుతూ హేమంత ప్రాభాత సంధ్యల్లో నీహారలేశమై సకలాణువలతోగూడి పరిష్వంగమొనరించబోదు సఖీ నినుగలవ! శుక్లపక్షపు చంద్రబింబోన్నతిలా విరహమతిశయించునే మధురమనోహరలతాంతా దోబూచులాడుతూ తిరుగేవు తలిరబోణీ మనస్దర్పణంమంతా తరిచిజూసేను పట్టగా! శరద్రాత్రుల చంద్రికల గిచ్చుళ్ళు మేని సౌగంధిక తెమ్మర్ల దండయాత్రలు మృగనయనీ వాడిచూపుల వలపుపోట్లు ఎందుంటివో నేనోపలేనిక కుసుమాస్త్రునిపోరిక! ఓ ఇందువదనా కుందరదనా నీ అనుస్మరణల అందోళికలొనూరేగుతున్నా ప్రాణనాథుని కరుణించి జతగూడి మనసిజుని తూపుల తాకిడిని శమింపజేయవా! ఇదీ శ్రీ రాధామాధవుల మిథున ప్రణయం ప్రకృతీ పురుషుల ప్రేమసల్లాపం ప్రియుడూ ప్రియురాలూ అన్నీ తానై అద్భుతం అమేయం అనంతం అజరామరం! - రవి కిషోర్ పెంట్రాల

నా‘వ’ఛాయ

నా"వ"ఛాయ   బతుకు నావ  ప్రవాహపు నీటిలో అలుపెరగని పయనం సాగుతూ ఉంటే నీడకి నిరాశకి ఉనికి ఎక్కడిది ?? కెరటం ఎటు పోతే అటు వెంట కదిలిపోతూ వెంటాడటమేగా నీడ పని !! బ్రదిమి నీడల మయం చెట్టు ఛాయో గరిక పొడనో కానీ నీడ సత్యమేగా !! మది పొడ అందరిలో కానరాదు కానీ అపుడపుడూ గతపు నీడలు కొన్ని రేయి మాటున కమ్ముతాయి ఏకాంతంలో !! రెప్పల మాటు దాగిన ఆ నీడల ప్రవాహం  మూసిన కళ్ళకు కానరాదు !! రెక్కలు తొడిగిన ఆశ  నిశ్శబ్దాల నీడకు విరియని పెదవులేగా మాటు !! ప్రేమకి నీడ లేదు తోడు మాత్రమే కావాలి కాదని మొరాయిస్తే ప్రేమకి విడిదీ లేదు !! వెలుగు నీడ రెండూ ప్రేమ నాణేనికి బొమ్మా బొరుసులు ...!!                                   ర‌చ‌న‌: కవిత రాయల

అనిశ్చితం

అనుభవం అంతమైపోతుంది జ్ఞాపకం ఆవిరైపోతుంది ఆఖరికి కాయం ఒక రోజు చల్లబడిపోతుంది !! వెనుకకి తిరిగి చూస్తే నడచివచ్చిన గతపు రహదారి మాయమై ఉంటుంది !! అంతుచిక్కని మాయ నీ కంటి చెమ్మతో కలిసి సంద్రమై పొగ మంచులా అందని ఆకాశంలోకి చేరి చినుకులా కాలి క్రింది నేలని తడిపేస్తూ ఉంటుంది !! ఇక కాస్తోకూస్తో నువ్వు నమ్మగలిగేది ఆచలమకు తడిసిన ఆ నేలని మాత్రమే  అదీ మాయమైన రోజున  ఏది మిగులుతుందో జీవితానికి ?? నిన్ను నువ్వే నమ్మలేవు నీతోనే నీకు రాద్ధాంతం     నువ్వెవరో నీకే తెలియదు స్వల్పమైన ఎరుక గల మరమనిషివి నీవు నీవునికిని కూడా జ్ఞప్తికి రాదు జీవితమొక అనిశ్చిత మేఘం !!                     ర‌చ‌న‌: కవిత రాయల

ఇంపు కోసం

నాకో గుప్పెడు గాలి కావాలి... పైరగాలి మరిచిన పల్లెల మీదకు విసరడానికి !! ఊరికో గంపెడు కోయిలలు కావాలి... టీవీల రోదన లో  వసంతాలు మర్చిన మర మనుషులకు సీమతమ్మ చెట్ల మీద వాల్చి కుహు కుహూల గీతం వినిపించటానికి !! బీటలు పట్టని వీధి అడుగులు కావాలి.. ఎదురు చూపులతో అలసి సొలసిన వార్ధక్యానికి పలకరింపులతో  సింహాసనం వెయ్యాటానికి !! ఓ చెంబుడు అమృతం కావాలి.. కాలుష్యం అయిన సింధువు లను తేట చేయడానికి.. చిటికెడు చిలక పలుకులు అరువు కావాలి.. అమ్మ ఒడి ఉయలలు లేక ఆటపాటలు అన్ని ఇరుకు గదుల పాలయియిన నేటి బాల్యాన్ని కేరింతలతో జత చేయడానికి ఇంద్రధనస్సు దొంగిలించాలి.. పొట్టకూటి కోసం  ఉరుకుల పరుగుల జీవనంతో అలసిన నగరానికి చినుకుల పులకరింతల రంగులు హృదిన నింపడానికి!! అందుకే నాకెప్పుడు అంతులేని ఆనందాలు కావాలి.. జనంతో మనం కావాటానికి !! కవిత రాయల  

బ్రతుకు సేద్యం!

ఏపుగా నింగినంటుతూ ఫలపుష్పాలతో విరాజిల్లుతూ కొన్ని కాలానికి ఎదురీదుతూ కొన ఊపిరితో బ్రతుకీడుస్తూ కొన్ని ఓనాడెపుడో నాటిన కలల మొక్కలు వాటి స్థితిగతుల తలుస్తూ నడుస్తూ.. పున్నమి పండువెన్నెల్తో తలంటుకొన్నట్టు వెండివన్నెల ఉంగరాల జుత్తుతో ఓ తాత బొత్తిగా దాపరికంలేదని ఎత్తిపొడుస్తూ అమవాస్య రేతిర్ని తలపాగా చుట్టుకొన్నట్టు నిగనిగలాడే నల్లటి సిగతో ఓ బామ్మ! ఊహల వ్యవసాయంజేస్తూ ఎవరికో సాకారమైన పంటనుజూస్తూ భూమికి జానెడు పైన నడుస్తూ గాల్లో గీతలుగీస్తూ ఓ యువకుడు ఎదురురాళ్ళని జూపి ముకుతాడేస్తూ భార్య! ఆశలవిత్తులు సంచులనిండా భుజాన్నేసుకొని నేలేదైనా నెలేదైనా విత్తేస్తామంటూ ప్రపంచ గమనం సాంతం మారుస్తామంటూ అకాశమంత స్థైర్యంతో ఓ కుర్రదీకుర్రాడు! బ్రతుకు సేద్యానికి జంటకై వెదుకు బ్రహ్మచారులు సహచరి వియోగాన కాడి దించేసి జ్ఞానయోగులు ఆనందాల సిరుల పంటలు పండిస్తూ పిల్లలు అమ్మచంకన అన్నీ గమనిస్తూ మా వూరి పార్కులో నవ్వులు పూయిస్తూ కేరింతలతో పసిపాపలు!

రాజకీయ రాబందులు

చిచ్చుపెట్టినోళ్ళొకరు రెచ్చగొట్టె వాలింకొకరు ఉద్యోగుల జీవితాన్ని చిన్నాబిన్నంచేసిన జీ.వో. ఇచ్చినోళ్ళు జీ.వో. అమలుజేసేటోళ్ళు స్థానికతంటూ  వేతనజీవులందరిని వేదనకు గురిజేసినోళ్ళే ఆ...ఇద్దరూ సమయంలేదు మిత్రమా అంటూ గొంతుమీద కత్తుంచిన తుగ్లకొకరు తప్పంటూ నిరసనదెలిపే మేకవన్నె పులులొకరు ఉద్యామాల్జేసి సాధించిన తెలంగాణ గడ్డంతా దొరలచేతుల్లో ధగాపడుతున్నది ఏంజేసినగని ఎప్పుడైనా సామాన్యులే బలిపశువులై అసువులుబాసేది కొత్తజిల్లాలంటూ తెలంగాణనంతా మూప్పైమూడూ ముక్కల్జేసిరి ఉద్యోగాలేయలేక  నిరుద్యోగులకు ఉపాదిలేక కాలయాపనతో కాలమెల్లదీసే కపటదారులచేతుల్లో  అధికారం సైతం తలదించుకుని తటపటాయిస్తూ తల్లడిల్లిపోతంది మార్పైతే రేపటితీర్పు కాలమాగదులే ఉప్పెనై తరమక తప్పదులే గమనిస్తునే వర్తమానం సాగుతున్నది భవిష్యత్తుకది బాటకాకమానదులే సి. శేఖర్

చీకటి శిలలు

నల్లమబ్బులు బరువులను మోసుకొస్తున్నాయి అవి కాలంలో కలిసిపోయిన ప్రాణాలకై విలపిస్తున్న కన్నీటిమూటలు ఎందరి ఆర్తనాదాలో బరువెక్కి ఆషాఢమేఘాలై ఆకాశమంతా ఆవహించాయి నిశీధినీడలలో తమవారి జాడలను వెతికే బంధాలు వానకారు కోయిలలై మూగరాగాలు ఆలపిస్తున్నాయి అమావాస్యను నింపి అమాంతంగా మాయం చేసిన ప్రేమబంధాలను  తెల్లవారి వెన్నెలలో తడిఆరని కన్నులతో  ధారగా ప్రవహించే జ్ఞాపకాల జలపాతాలలో ఒలకబోస్తూ ప్రతినిత్యం చీకటి శిలలై వేదనల అలలలో తడుస్తూ  ఒంటరైన జీవితాలెన్నని లెక్కించేది కరోనా రక్కసి కపాలమాలను ధరించి కాలరాత్రై సాగించే ఈ మారణహోమంలో... నవకోయిల పల్లవముల ప్లవ నామ వత్సరం  ఆమని గీతాలు ఆలపించుతూ ఏతెంచేవేళ  లోకమంతా ఎదురుచూస్తోంది కరోనా రహిత స్వచ్ఛ వాయువులకై... - వకుళ వాసు 9989198334

ఇవాళ్టి కవిత్వ సంభాషణ లోంచి...!

కవిత్వం ఎల్లప్పుడూ గాలిలా వీస్తుంది  కవిత్వం ఎల్లప్పుడూ  గాలికన్నా వేగంగా అంటుకుంటుంది కవిత్వం ఎల్లప్పుడూ  సూర్యునిలా వెలుగుతుంది!  నీరు పల్లానికే ప్రవహిస్తుంది కవిత్వం ఏటికి ఎదురీదుతుంది కవిత్వం తల్లి పాలలా స్వచ్ఛంగా ఉంటుంది!  భూమి ఉన్నంత లెక్కన కవిత్వం కొత్త విత్తులా నాటుకు పోతుంది  కవిత్వం ధరణిపై నవ కళ్యాణానికి ఎప్పుడూ  శ్రీకారం చుడుతూనే ఉంటుంది ! అది మనిషిలా నడుస్తుంది మానవ మేథలా మాట్లాడుతుంది కవిత్వానికి ఎన్నడూ వయో భేదాల్లేవ్ లింగభేదాల్లేవ్ కుల మత జాతి ప్రాంతాల భాషా తేడాల్లేవ్!  అది వర్తమానంపై క్షణ క్షణం సంభాషిస్తూ భవిష్య‌త్‌ చిత్ర రచనలో ఒక అలుపెరుగని విశ్వమోహనధారి కవిత్వం!  కవిత్వం మనలా మరణించదు  కవిత్వం హత్య కు గురికాదు అది బూటకపు ఎన్‌కౌంటర్లకు దొరకదు కవిత్వం ఖైదు నుండీ కూడా  ప్రవహిస్తుంది సామాజిక పురిటిగదిలో లయించే కవిత్వమొక నిరంతర పూర్ణగర్భిణి!  ఒకతరాన్నుండి మరో తరానికి కవిత్వమెప్పుడూ వారధిగా సారథిగా  భాషకు గోసకు ఒక అంతర్గత  జ్వరతీవ్రతకు లోచూపుగా ఒక అగ్నిపర్వత లావాలా  ఎగిసిపడుతూ సాగిపోతూనే ఉంటుంది!  ఎప్పుడైనా నాలుగు వాక్యాలు రాసి  వస్తువేదో చేజారి పోయిందని బాధపడుతూ  హడావుడి పడుతూ అలిసి పోయి  ఒక అసంపూర్ణ గేయాల్నిఅలా వదిలేసి పోయినా  తప్పిపోయిన బిడ్డ రాకడ కోసం కవిత్వం  తల్లిలా తనువంత కళ్ళు చేసుకొని ఎదురు చూస్తూ ఉంటుంది!  కవిత్వం  కవులపాలిట జీతం ఎరుగని కావలి!!  కవిత్వం కవుల జీవితాలెరిగిన హమాలీ!!!  కవిత్వం పసిపాపలానూ నవ్వుతుంది  అది పడుచు పిల్లలానూ గలగలలాడుతుంది  అంతమాత్రాన,  బంపర్ ఆఫర్  ఇవ్వటానికి కవిత్వం  మాటల గారడీల మాయజాలం కాదు అది ముసురుకున్న చీకట్లను పారద్రోలే తారాజువ్వ  అది సృజనకు ఆచరణకూ మధ్య నుండే అగ్ని సరస్సు ! శాఖోపశాఖలై ఊడలు ఊడలుగా దిగి అన్ని భాషానిఘంటువులలోకి తనదైన శైలిలో సంతకాలుచేస్తూ కవిత్వం  కాలవాహినిలా విస్తరిస్తూనే పోతుంది  కవిత్వమెప్పుడూ రోగగ్రస్త సమాజంలో  ఒక ప్రజా వైద్యునిలా పనిచేస్తూ ఉంటుంది అదే ఒకవీరునిలానూ కవాతు చేస్తుంది   కవిత్వం కాలం కత్తుల వంతెన మీద  యుద్ధ తంత్ర నినాదమై  ఎల్లప్పుడూ ముందు నడుస్తూనే ఉంటుంది  చిరంజీవి కవిత్వం!  చిరాయువు ఇవాళ్టి కవిత్వం!!  - సజ్జా వెంకటేశ్వర్లు

ఉపశమనం

ఉపశమనం ఎంతైనా కాలానుగుణంగా మాటను మంత్రంగా  మాయను సృష్టిస్తూ నమ్మలేని నిజాన్ని  మాటలకు గాలిని లేపనంగారాస్తూ మనుషుల మనసును కొల్లగొట్టడమే నేటి నాయకులకలవాటు గారడీల మాయజాలం ఎన్నికలొస్తేచాలు  నిర్ణయాలన్ని నిమిషాల్లో పగటికలలను పండిస్తూ గాలిమేడలు కళ్ళముందుంచుతూ చెప్పిందేచెప్పి మతి చెదరగొడతరు దళితరాగాలు దినపత్రికల్లో ముత్యాల అక్షరాలతో మెరిపిస్తున్నరు నిద్రలోకూడా అదే కలవరింత నేటి స్థితి  ఎప్పుడూ ఎన్నికలుంటే ఎంతబావుండు అందరికి అన్ని బందులిచ్చి ఉన్న ఇబ్బందులు తరిమేతురు నాయకులు ఉప ఎన్నికల్లో ప్రజలకింత ఉపకారం జరుగుతుంటే ఐదేండ్లు ఇంకెన్ని జరిగేనో! గెలిచినోళ్ళు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి చల్లగ నీడపట్టునుంటరు జనంగోడు పట్టదాయే అందుకే ఉప ఎన్నికలే అందరికింత ఉపశమనం   సి. శేఖర్(సియస్సార్)

నా దేశం

 నా దేశం                                                                                                                      నా దేశమంటే నా కెంతో ఇష్టం     నన్ను కాపాడే రక్షాకవచం నా దేశం.     ఎత్తైన శిఖరాలూ, ఎదకదిలించే     గుడి గోపురాలూ     సెలయేళ్ళ గల గలలూ, ఓంకార నాదాలూ     ఆకుపచ్చని చేళ్ళు, ఆమని చందాలు     అందానికి ప్రతిబింబం నా దేశం     నన్ను కాపాడే రక్షాకవచం నా దేశం     విరగబూసిన పూలు నక్షత్రాల తీరు     కన్నుల పండుగజేస్తూ     ఘుమ ఘుమలు వెదజల్లుతూ     మామిళ్ళూ నేరేళ్ళు, జామి, పనసపళ్ళూ     నవధాన్యాలూ నాయింట పండిస్తూ     నందవవనాన్ని మించుతుంది నా దేశం     నన్ను కాపాడే రక్షా కవచం నా దేశం.     రంగు రంగుల రాళ్ళకీ , రతనాల గూళ్ళకి     కోహినూరు వజ్రాలకీ, కోరుకున్న ముత్యాలకి     వెండి బంగారాలకీ, వెలలేని సంపదలకీ     నిలయం నాదేశం     నన్ను రక్షించే ఆలయం నా దేశం     పట్టు చీరల కాంతులు, పడతుల వయ్యారాలూ     నవతకు ప్రతిరూపాలూ , ప్రగతికి కరదీపాలూ     నాట్యాల ఖని, సంగీతాల దుని నా దేశం     నిత్యవైభోగానికి నిదర్శనం నా దేశం     వేరు వేరు భాషలెన్నో పలికిస్తూ     ప్రతి భాషలో పండితులను సృష్టిస్తూ     ఐకమత్యంతో అందరినీ లాలిస్తూ     నన్ను మురిపించే న ఆదేశం నా కెంతో ఇష్టం.     నన్ను కాపాడే రక్షాకవచం నా దేశం.     లలిత కళలకు నిలయం నా దేశం!     సకల శాస్త్రాలకు ఆధారం నా దేశం!     పంచశీల పుట్టింది ఈ చోట     ప్రణాళికలు వెలిశాయి ఈనాట     సమతా మమతల సాగరం నా దేశం!     సకల సౌభాగ్యాల నిలయం నా దేశం!     నా దేశం కలకాలం కళకళలాడుతూ వుండాలనీ     సమసమాజాన్ని సృష్టించి, నవత పండించాలనీ     ఎన్నో పధకాలను రూపొందించింది,     ఆర్ధికంగా , సాఘికంగా , రాజకీయంగా , నైతికంగా     తలెత్తుకు నిలిచేలా నిరంతరం, కృషి చేస్తోంది!     అటువంటి నా దేశం అందంగా వుండాలనీ     జనంతో కిటకిటలాడుతూ,     కూటికి నీటికి బాధపడకూడదనీ     కుటుంబ సంక్షేమాన్ని ప్రోత్సహిస్తూ వుంది     చిన్నకుటుంబాలను కోరుకుంటూ వుంది     అందుకే నాకు నా దేశ మంటే ఎంతో ఇష్టం     నన్ను కాపాడే రక్షాకవచం నా దేశం.     నా దేశం ఆదేశాన్ని అందుకోవడమే నా లక్ష్యం     అర్ధిస్తున్నాను మిన్నల్ని అహర్నిశం     కుటుంబ సంక్షేమాన్ని కోరుకొమ్మని     నా దేశాన్ని రక్షించమనీ.     నా దేశమంటే నాకెంతో ఇష్టం     నన్ను కాపాడే రక్షాకవచం నా దేశం. - శ్రీమతి శారద అశోకవర్ధన్    

యుద్ధం మ‌న‌కు కొత్త కాదు

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌విత‌ల పోటీలో క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి రూ. 516 గెలుపొందిన క‌విత‌                          యుద్ధం మనకేం కొత్త కాదు అనాది నుండి అతివకు  ‘అవనిలో సగం ఆకాశంలో సగం' భాగమంటూ  శాసన సభలో సీట్లకు ...ఇంట్లోని పాట్లకు  నిర్భయ ఉదంతానికి దిశ న్యాయానికి  బాధితుల రక్షణకు బాధ్యులైన వారి శిక్షకు  ఇంటా బయటా సమాన హక్కులకు శారీరక మానసిక రక్షణకు  కన్నబిడ్డలను కన్నవాళ్ళను నమ్ముకున్న వాళ్ళను  నట్టేట ముంచకుండా వారిని రక్షిస్తూ మనల్ని మనం పరిరక్షించుకుంటూ  కంటికి కనపడని యుద్ధాలెన్నో చేసాం  అందుకే యుద్ధం మనకు కొత్తకాదు  కాని ఇప్పుడు చేయాల్సిన యుద్దమే కొత్త ... యుద్ధం చేయాల్సింది ఏ వ్యక్తీ పైనో ఏ పాలకుల పైనో కాదు  కంటికి కనబడకుండా క్షణ క్షణం రాకాసి భూతంలా  విజృంభిస్తున్న ‘కోవిడ్ -19’ వైరస్ మీద  మన మనో సంకల్పాన్ని మన భారత సంస్కృతీ సంప్రదాయాల్ని  పరీక్షించడానికి వస్తున్న మహమ్మారి మీద  పూర్వం మశూచి ప్లేగులెన్ని చూడలేదు  నిబ్బరంగా అందరొక్క తాటిపై నిలబడి ఎన్ని తరిమేయలేదు  ఐకమత్యంగా దీక్షబూని ఎన్ని అవాంతరాలను నివారించలేదు  ఈ పవిత్ర భూమిపై ఎన్ని నూతనావిష్కరణలు పురుళ్ళు పోసుకోలేదు  సహకారం, పరోపకారమే మిన్నయని ఎన్నిసార్లు నిరూపించలేదు  ప్రతి మహిళా నారీ శక్తిగా మారి కుటుంబానికి లక్ష్మణ రేఖ కావాలిప్పుడు  ఉన్నదాంట్లో  కలోగంజో కల్సి తిందామని కట్టుబాటు చేయాలి  కుటుంబ సభ్యులంతా కల్సి ఉండే ఈ సమయం  యోగా వ్యాయామాల‌తో సద్వినియోగ పరుచుకునేలా వ్యక్తిగత పరిశుభ్ర‌త  సామాజిక దూరం పాటిస్తూ రోగనిరోధక శక్తి పెంచే మన వంటింటి చిట్కాలు అమలుచేస్తూ  అన్ని పనుల్లో అందరినీ భాగస్వామ్యం చేస్తూ  పాలకుల మాట పాటిస్తూ  రోడ్లపైకి రాకుండా సహకరిస్తూ  కరోనాపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న  ఆపద్బాంధ‌వులైన వైద్యులు, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది రక్షక భటులు, కొరియర్లు, వాలంటీర్లకు  శతధా సహస్రదా వందనాలర్పిస్తూ  వాక్సిన్ మందులకన్నా మిన్నగా ‘సామాజిక దూరం' కనుగొన్న  అమలుపరుస్తున్న పాలకులకు నమోవాకాలర్పిస్తూ భౌతికంగా ఒక్కరొక్కరుగా విడిపోయినా  ఐకమత్యంగా ఉండి కరోనాను తరిమేద్దాం  పరిశుభ్ర‌త‌తో కరోనాను పాతేద్దాం  సామాజిక దూరంతో సంక్రమణం కాకుండా చంపేద్దాం ఇంటికే పరిమితమై వంటికి ఇంటికి కుటుంబానికి సమాజానికి సాయం చేద్దాం  భావితరానికి మార్గదర్శకంగా నిలుద్దాం  - నామ‌ని సుజ‌నాదేవి