అనిశ్చితం
posted on Jun 9, 2022
అనుభవం అంతమైపోతుంది
జ్ఞాపకం ఆవిరైపోతుంది
ఆఖరికి కాయం ఒక రోజు
చల్లబడిపోతుంది !!
వెనుకకి తిరిగి చూస్తే
నడచివచ్చిన గతపు రహదారి
మాయమై ఉంటుంది !!
అంతుచిక్కని మాయ
నీ కంటి చెమ్మతో కలిసి
సంద్రమై పొగ మంచులా
అందని ఆకాశంలోకి చేరి
చినుకులా కాలి క్రింది
నేలని తడిపేస్తూ ఉంటుంది !!
ఇక కాస్తోకూస్తో నువ్వు నమ్మగలిగేది
ఆచలమకు తడిసిన
ఆ నేలని మాత్రమే
అదీ మాయమైన రోజున
ఏది మిగులుతుందో జీవితానికి ??
నిన్ను నువ్వే నమ్మలేవు
నీతోనే నీకు రాద్ధాంతం
నువ్వెవరో నీకే తెలియదు
స్వల్పమైన ఎరుక గల
మరమనిషివి నీవు
నీవునికిని కూడా జ్ఞప్తికి రాదు
జీవితమొక అనిశ్చిత మేఘం !!
రచన: కవిత రాయల