ఉపశమనం
posted on Aug 23, 2021
ఉపశమనం
ఎంతైనా కాలానుగుణంగా
మాటను మంత్రంగా
మాయను సృష్టిస్తూ
నమ్మలేని నిజాన్ని
మాటలకు గాలిని లేపనంగారాస్తూ
మనుషుల మనసును కొల్లగొట్టడమే నేటి నాయకులకలవాటు
గారడీల మాయజాలం
ఎన్నికలొస్తేచాలు
నిర్ణయాలన్ని నిమిషాల్లో
పగటికలలను పండిస్తూ
గాలిమేడలు కళ్ళముందుంచుతూ
చెప్పిందేచెప్పి మతి చెదరగొడతరు
దళితరాగాలు దినపత్రికల్లో
ముత్యాల అక్షరాలతో మెరిపిస్తున్నరు
నిద్రలోకూడా అదే కలవరింత
నేటి స్థితి
ఎప్పుడూ ఎన్నికలుంటే ఎంతబావుండు
అందరికి అన్ని బందులిచ్చి
ఉన్న ఇబ్బందులు తరిమేతురు నాయకులు
ఉప ఎన్నికల్లో ప్రజలకింత ఉపకారం జరుగుతుంటే
ఐదేండ్లు ఇంకెన్ని జరిగేనో!
గెలిచినోళ్ళు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి
చల్లగ నీడపట్టునుంటరు
జనంగోడు పట్టదాయే
అందుకే ఉప ఎన్నికలే అందరికింత ఉపశమనం
సి. శేఖర్(సియస్సార్)