వరలక్ష్మీ తల్లీ రావమ్మా 

వరలక్ష్మీ తల్లీ రావమ్మా      వరలక్ష్మీ తల్లీ రావమ్మా  వరమిచ్చే వరలక్ష్మీ రావమ్మ  పసుపు , కుంకుమ  పూల పళ్ళెము తోడ ముత్తైదవులంతా  స్వాగతమిత్తుము శ్రావణ శుక్రవార  వరలక్ష్మీ తల్లీ రావమా !!   సౌభాగ్యములు మాకిచ్చే జననీ  నీ రాకాతో మే తరించూ వేళ  మామిడి తోరణాల , ముత్యాలముగ్గుతో  రాశిగా పూలతో పూజించుమమ్మా  పసుపు కుంకుమ అక్షింతల తోడ  కొలిచేము తల్లీ ..   తోరములు కట్టీ , రూపునూ పూజించి  గృహమున వనితలకు వాయనాలు ఇచ్చుచూ  వరముల వరలక్ష్మీ నిన్ను మేము స్మరింతుము    కళకళ లాడే గృహమున  నీవే మా కల్పవల్లీ తల్లీ  నీవమ్మా .. నీ కరుణా , ప్రేమను  మా పై కురిపించువమ్మా  ఇలలో నీకే అందరమూ వేచీయున్నాము తల్లీ !! వరలక్ష్మీ తల్లీ రావమ్మా !!   నీ పూజా వ్రతమూ చేసే  భాగ్యము , వరమును ఇవ్వమ్మా  తల్లీ పిల్లా పాపల తోడ హారతి  నీ కిచ్చేము మనసా మా తల్లీ  వరలక్ష్మీ రావమ్మా !!   సకల లోక జనులను రక్షించే  తల్లీ నీ దయా కృప లతో మమ్ము ఎల్లవేళలా  కాపాడు వరలక్ష్మీ తల్లీ .. వరములిచ్చే వరలక్ష్మీ రావమ్మా  భూలోక వనితలా నోము పండించమ్మా  వరమివ్వు తల్లీ వరలక్ష్మీ తల్లీ రావమ్మా !! - దివ్య చేవూరి  

నిత్య స్వతంత్రం (ఆగస్టు 15 స్పెషల్)

తెల్లవారితే స్వతంత్రదినోత్సవం   స్వతంత్రభారతికి అక్షర నీరాజనాలర్పించాలని కాగితం, కలం ముందుంచుకుని ఆలోచనా తపస్సులోకి వెళ్ళిపోయాను. అదేమి చిత్రమో తెలియదుగానీ, ఎప్పుడూ కదం త్రొక్కే                నా మేథాశ్వం నేడు అడుగు కదపనని మొండికేసింది. నిముషాలనూ, గంటలనూ నిర్దయగా నలిపేస్తూ... కాలం తన దారిన తను వెళ్ళిపోతూనేవుంది.... మౌనంగా. భావప్రసవానికై పురిటి నొప్పులు పడుతున్న నేను, ఎందుకో కన్నులు తెరిచి చూసాను.....నాకు తెలియకుండానే. నిబిడాంధకారం తప్ప మరేదీ కనిపించలేదు నాకు. గమ్యం తెలియని బాటసారిలా బయటకు బయలుదేరాను. శ్రావణమాసపు శీతల గాలులు శరీరాన్ని సేద దీరుస్తున్నాయి. నేను నడుస్తున్నా.... నా మనస్సు మాత్రం ఆలోచిస్తూనే వుంది. ఎక్కడనుంచో లీలగా చిరునవ్వుల జల్లులు నా ఏకాగ్రతనూ, ఏకాంతాన్ని ఒక్కసారి భగ్నం చేసాయి. నాకు తెలియకుండానే నేనా దిశగా వెళ్ళాను. ఒక నవయవ్వన సౌందర్యరాశి...వనమయూరాలతో, స్వర్ణహరిణాలతో పాటలు పాడుతూ, ఆటలాడుతూ  నాకు కనిపించింది. శుక, పిక, సారస సమూహాలు తమ కలస్వనాలతో...ఆమె స్వతంత్ర లయవిన్యాసానికి స్వరజతులు వేస్తున్నాయి. సింహ, శార్దూల, మత్తేభ, భల్లూకగణాలు... ఆమె నాట్యభంగిమలను నయనమనోహరంగా తిలకిస్తూ,  ఆనందంతో చిందులేస్తున్నాయి. ‘‘ఆహా! ఎంతటి స్వేచ్ఛా సంబరం! ’’ అనుకుంటూ అనిమిషనేత్రుడనై తిలకిస్తున్న నన్ను దగ్గరకు రమ్మని ఆ సుందరి పిలిచింది. మంత్రముగ్ధుడనై నేను ఆమె దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. ‘‘నాకు అక్షర నీరాజనాలర్పించాలని వచ్చావు కదూ!’’ కోటి సితారులు మీటినట్లు పలికిందామె... ఒయ్యారాలుపోతూ. ‘‘ ఔనన్నట్లు’’ ఎంతో నిజాయతీగా, అమాయకంగా తలూపాను. ఆ అడవి ప్రాణులు ఎంతో అవహేళనగా పకపకా నవ్వాయి. వాటి నవ్వులోని భావం నాకు అర్ధం కాలేదు. ‘‘ అమాయకుడా! అర్ధంకాలేదా! అయితే విను. నేనేనాడూ అస్వతంత్రురాలిని కాదు. స్వేఛ్ఛాసంచారిని. మీరే...మీ రచయతలే.... మూర్ఖులు, శాడిస్టులు. మీ అస్వతంత్ర భావాల బందిఖానాలో నన్ను బంధించి వుంచడం మీ నైజం. వాస్తవంలోనే కాదు...భావనలో కూడా స్వతంత్రంగా బ్రతకలేని దుర్బలులు మీరు. నా గురించి నీకు తెలియదేమో! నా నడకలో ఎప్పుడూ పవిత్ర భాగీరథి హొయలున్నాయి. నా ఎదలో ఎప్పుడూ పావన గోదావరి గలగలలున్నాయి. నా గళంలో ఎప్పుడూ  మధురామృత రారులున్నాయి.   నా పదంలో కృష్ణాతరంగ మృదంగ విన్యాసాలున్నాయి.                    నిత్య వసంత ఋతుశోభ నా స్వంతం. వేద విఙ్ఞాన  వాఙ్మయ వైభవం నా గంధం. సనాతన సాంప్రదాయాలకు సాకారం....నా ఆకారం. అందాన్ని, ఆనందాన్ని దర్శించలేని అంధులు కనుకనే... మీ రచనల్లో నన్ను నిరంతర బందీని చేసి... ఆనందిస్తూంటారు.                               రక్తాక్షరాలతో మృత్యుగీతాలు రాసుకుంటూ...సంతోషిస్తూంటారు. జాతి వైషమ్యాలు, కుల కార్పణ్యాలు, భాషా భేదాలు పెంచుకోమని నేను మీకు ఏనాడైనా చెప్పానా? సరిహద్దు రేఖలు గీసుకుని సంగరాలు సాగించమన్నానా? మానవత్వాన్ని మరచి మారణహోమాలు చెయ్యమన్నానా?                                   మీతోపాటు సమానంగానే కన్నానే ఈ ప్రాణులను కూడా...! కానీ...ఇవేనాడూ వర్గభేదంతో, విభేదించడం నేను చూడలేదు. సమైక్యతా భావమేరా...  ‘‘స్వతంత్రం ’’ అంటే. ఐకమత్యతా జీవనమేరా...‘‘స్వతంత్రం’’ అంటే. అడ్డాలనాడే  గానీ...గడ్డాలనాడు కాదు...బిడ్డలంటే. అందుకే...మాతృత్వ మమకారాన్ని కూడా చంపుకుని, మీ నరజాతి మొత్తాన్ని శాశ్వతంగా వెలి వేసాను. మేథోవంతులమనే అహంకారంతో మీరు చేసిన స్వయంకృతాపరాధానికి, నేను మీకు వేసిన శిక్ష ఇదే. మీకు ఏడాదికి ఒకేఒక్క స్వతంత్రదినం. కానీ...మాకు ప్రతినిత్యం స్వతంత్రదినమే. ఫో!  పోయి నిస్సారమైన కవితలు రాసుకుంటూ కాలం గడుపు.’’ ఆమెలా కటువుగా పలుకుతున్నా...అవి కఠోర సత్యాలనిపించాయి నాకు. ఆత్మవంచన చేసుకుంటూ...అష్టైశ్వర్యాలతో తులతూగడంకన్నా.., అనంత స్వతంత్రం అనుభవించే ఆ అరణ్యమృగాలతో కలసి జీవించడం మేలనిపించింది నాకు. అంతే.... అహం విడచి, ఇహం మరచి అవనత శీర్షంతో క్షమించమంటూ..  ఆ తల్లి పాదాల మీద వాలిపోయాను. నా కన్నీరు ఆమె పవిత్ర పాదాలను అభిషేకించాయి. ఆ తల్లి ఎంతో ప్రేమతో నన్ను అనుగ్రహించి, ఆశీర్వదించింది. ద్విపాదినైన నేను....చతుష్పాదినయ్యాను.                            యం.వి. సుబ్రహ్మణ్యం

శ్రావణమాసం వేళ...

శ్రావణమాసం వేళ     శుభోదయం  గుర్తుకొస్తూ .. గుర్తున్నాయి ... గుర్తుకొచ్చాయి 😊 ఆగస్టు నెల ప్రారంభం  శ్రావణమాసం కై వనితలు ఎదురుచూసే వేళ  శ్రావణ లక్ష్ములు కొలువుతీరే వేళ  శ్రావణ మంగళ , శుక్రవారాల లో పడతులు కళ కళ లాడే వేళ  శ్రావణ మాసము లగ్గాల సందడి ,  పురోహితులకై వెతుకులాడే వేళ  శ్రావణ మాసము పర్వదినమున  ముంగిళ్ళు తోరణాలతో , రంగవల్లులతో కళకళ లాడే వేళ  అన్న దమ్ముల అనురాగముకై సోదరి రాఖీ పౌర్ణమికి ఎదురుచూసే వేళ  జన్మదిన శుభాకాంక్షలు , వివాహామహోత్సవముల శుభాకంక్షలతో బంధుమిత్రులకు జేజేలు తెలిపే వేళ  గృహప్రవేశం తో పాలు పొంగించే శ్రావణమాసము వేళ  ఆడపిల్లలు పుట్టినింట మెట్టినింట దీవెనలు , పసుపుకుంకుములు అందుకునే శ్రావణ మాసం ఎంతో కళ  ఆడపడుచుల రాకపోకలు సారెనందుకునే వేళ  గౌరమ్మకు నోమును నోచీ , వరలక్ష్మీ వ్రతమును ఆచరించి వాయనాలు ,రూపును పెట్టి పూజించే శ్రావణ మాసం  తాంబూలములు ఇచ్చేవేళ .. అంతర్జాలం లో శ్రీ మహలక్ష్ములు పెట్టే అలంకరణలు , పాటలు , నగలు చూచుటకు రెండు కళ్ళూ చాలని వేళ  శనగలు , కానుకల ఎంపికలు హడావిడి అంతా ఇంతాకదు ఈ శ్రావాణమాసం వేళ .. దుస్తులకు , ముస్తాబులకు ఈ మాసమే ఓ అందమైన వేళ  అరచేత గోరింట , పట్టు పావడలతో ముద్దు ముద్దు గా మురిపించే బుజ్జి బంగారాలు కొంగు బంగారాలు చిన్ని లక్ష్ముల ఆనందమాడే వేళ  వాడ వాడలు , దేశ విదేశాలు కొనుగోలుకు , కొరియర్లకు మహా మహా రద్దీలు  దర్జీలు , నగల దుకాణాలు కళకళలు  నాకెంతో ఇష్టమైన ఈ ఆగస్టు నెల , శ్రావణమాసం పర్వదినాలు  సందడి తెచ్చే వేళకోసం ఎదురుచూసే వేళ !! - Divya .Chevuri

ప్రేయసి జన్మదినం

ప్రేయసి జన్మదినం     మొదటిసారి నీ మాట విన్నప్పుడు మీఅమ్మ ఎంత ఆనందంగా ఉందో, నీతో మాట్లాడిన ప్రతిసారి నేను అంత ఆనందంగా ఉంటాను.. నీతో తొలి అడుగు వేయించడానికి మీ నాన్న ఎంత ఆరాట పడ్డారో; నీతో ఏడడుగులు వేయడానికి నేనంత ఆరాటపడుతున్నాను.. నీ జననం వాళ్ళకి అద్భుతం.. నీ పరిచయం నాకు అదృష్టం.. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈరోజు నాకు ప్రత్యేకం.. ఎందుకంటే ఈరోజు నీ జన్మదినం.. నీ జన్మదినానికి నేను ఏదైనా ఇవ్వాలి.. కాని నేనే నిన్ను ఒకటి అడుగుతున్నాను.. నాకో మాట ఇస్తావా.. "జన్మ జన్మలకి నాతో ఉంటావో లేదో తెలీదు కాని.. ఈ జన్మకి నాతో ఉండిపోయి.. నీ ప్రతి జన్మదినం నాతో జరుపుకో".. మాట ఇస్తావు కదా.. నీ జన్మదినానికి నేను కోట్లు ఖర్చు పెట్టలేకపోవొచ్చు.. కాని కొవ్వొత్తుల వెలుగులో నీ ముఖం మీద స్వచ్ఛమైన నవ్వు తెప్పించగలను.. ఎందుకంటే ఆ నవ్వంటే నాకు చాలా ఇష్టం... ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ  నువ్వు జీవితాంతం ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, జన్మదిన శుభాకాంక్షలు. - గంగసాని  

గర్జిస్తున్న తెలుగువాడు

  గర్జిస్తున్న తెలుగువాడు     తెలుగువాడు తెలుగువాడు తెలుగువాడు ఏమైపోయాడు అప్పటి తెలుగువాడు. దమ్మున్నోడు, ధైర్యమున్నోడు ఎప్పటికి ఈ మౌనం వీడుతాడు.   బ్రిటీష్ తుపాకీ గుండ్లకు గుండె చూపించిన టంగుటూరి తెలుగువాడు ఆ గుండె ధైర్యానికి నిజమైన వారసుడ్నని ఎప్పుడు చాటి చెప్తాడు ఈ తెలుగువాడు. రాష్ట్రసాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తెలుగువాడు ప్రాణభయం వదిలి ప్రత్యేకహోదా కోసం ఎప్పుడు పోరాడతాడు ఈ తెలుగువాడు. విల్లు పట్టి బ్రిటీష్ వెన్నులో వణుకు పుట్టించిన అల్లూరి తెలుగువాడు పిడికిలి బిగించి కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు తలబడతాడు ఈ తెలుగువాడు.   తెలుగువాడు తెలుగువాడు తెలుగువాడు ఏమైపోయాడు అప్పటి తెలుగువాడు. దమ్మున్నోడు ధైర్యమున్నోడు ఎప్పటికి ఈ మౌనం వీడుతాడు.   ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అప్పటి తెలుగువాడు నీలో నాలో బ్రతికే ఉన్నాడు. టంగుటూరిలా గుండె ధైర్యం చూపిస్తాడు పొట్టి శ్రీరాముల్లా ప్రాణత్యాగానికైనా వెనకాడడు అల్లూరిలా చివరివరకు పోరాడతాడు కేంద్రం తలవొంచి ప్రత్యేకహోదా సాధించి తీరుతాడు ఎందుకంటే వాడు తెలుగువాడు.   - గంగసాని  

బాలలవనం ఒక అక్షరాలవనం

బాలలవనం ఒక అక్షరాలవనం   ఎంతో మంది పెద్ద పెద్ద కవులు సాహిత్య సేద్యం చేస్తున్నారు. ఎన్నో సంకలనాలు వేశారు. అందులో అమ్మపైన మాతృస్పర్శ, రైతులపై రైతు సకళనాలు, కార్మికులపై కార్మికుల సంకలనాలు ఇలా అన్నీ పేరు గాంచిన కవుల కవితలన్నీ ఒకే చోట పేర్చి సంకలనాలు చేశారు. అలాంటి కోవకు చెందిన సంకలనం విద్యార్థులతో శ్రీ అక్షరమాలి సురేష్ గారు మారుమూల గ్రామమైన ఆంధ్ర నుంచి కర్నాటక బార్డర్ వలస గ్రామంకు ఉపాధ్యాయుడుగా నియమితులయ్యాడు. అక్కడ అందరి మాతృభాష కన్నడ చదువు మాత్రమే తెలుగు. మొదట చిలా ఇబ్బందులతో విద్యార్థులను తన ఆట పాట కదలతో తన వైపు తిప్పుకున్నాడు.  తెలుగు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ సాహిత్యం పై అభిమానంతో విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసే విధంగా గోడపత్రికకు “బాలలవనం” అనే పేరు పెట్టి అందులో చిత్రాలు, పద్యాలు, చిన్నచిన్న కవితలు సేకరించి పెట్టేవారు. అప్పుడు తట్టిన ఆలోచనే విధ్యార్థులతో ఒక సంకలనం తేవాలని వెంటనే ఆ సంవత్సరం విధ్యార్థులకు కవిత్వం అంటే ఏమిటని ఎలా రాయాలని విధ్యార్థులకు అభిరుచి కలిగించి దాదాపు 46మంది విద్యార్థులతో ఒక సంకలనం వేయడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది. మొత్తానికి  “బాలలవనం” అనే పేరుతో ఒక సంకలనం తీసుకువచ్చారు. ఈ సంకళనం నాకు తెలిసి ఇరు రాష్ట్రలలో మొదట తీసుకువచ్చారు.  యం.రమేష్ అనే 7వ తరగతి విద్యార్థి చినుకు అక్షరం అనే కవితలో చినుకు చినుకు కలిసి పడితే వర్షం అంటారు/ అక్షరం అక్షరం కలిసి కాగితం మీద పడితే దానిని పుస్తకం అంటారని ఎంతో కొంత కవిత్వ చాయలుంటే కానీ ఇలాంటి భావం రాదని మనం చదివితే అర్థమైపోతుంది. నదిలాంటి జీవితం అనే కవితలో విద్యార్థి కరుణ జీవితం పై ఎంత అవగాహన ఉంటే ఇలాంటి వాస్తవాలు రాస్తుందో చూడండి. కదులుతూ కదులుతూ ముందుకు నడువు నేస్తమా/ కష్టాలు రానీ దుఃఖాలు రానీ/ నీ ప్రయాణం సాగనివ్వు/ నీ ప్రయాణం కొనసాగనివ్వు/ కష్టాలే నీ జీవితం/ దుఃఖాలే నీ జీవెతం/ జీవితమనేది ఒక నదిలాంటిది ఇలా నది మలుపులు జీవిత మలుపులకు ముడి పెట్టి ఒక విద్యార్థి రాయడం అద్భుతమనిపించింది. అర్పిత 10వతరగతి విద్యార్థి ఓ భరతమాత కవితలో ఓ భారతమాత అందుకో నా వందనాలు/ పిల్లలు నీ స్వేచ్ఛ కోరుతున్నారమ్మా/ కంటికి రెప్పలా కాపాడుతారమ్మా అంటూ భరతమాతని కాపాడుకోవాలని ఎంత దేశభక్తి ఉంటే ఇలాంటి అక్షరాలు ఒక మాల కూర్చిందోమరి. మా ఊరి చెరువు అంటూ దీపిక 8వ తరగతి విద్యార్థి ఆ చెరువుపై ఉన్న అమితమైన ప్రేమను ఎంతో ఇష్టంగా చెప్పింది. దేవుళ్ళు అనే కవితలో రాంచరణ్ 8వ తరగతి విద్యార్థి రాసిన వాక్యాలు దేవుళ్ళు పంచుతారు భక్తిని/ గురువులు పంచుతారు విద్యని/ అమ్మ నాన్నలు పంచుతారు ప్రేమని/ స్నేహితులు పంచుతారు సంతోషాన్ని అంటూ మనం ప్రతి ఒక్కరి నుండి ఎదో ఒకటి  ఈ పుస్తకంలో ఇంకా అమ్మ, ఆట, ఉదాహరణ, విజ్ఞానం, ఆకాశరాజు, నా ఆశ, విత్తనం, ప్రకృతి, చదువులమ్మ జీవితం, గోరింటాకు, ప్రాణం, నేనే శ్రీశ్రీ, అయ్యోపాపం, కత్తి కన్నా కలం మిన్న ఇలా ఈ పుస్తకంలో 146 కవితలు, మినీ కవితలు ఉన్నాయి. విద్యార్థులులతో ప్రతి ఉపాధ్యాయుడు అందరూ తప్పకుండా చదివించాల్సిన పుస్తకం. సమీక్షకులు: కుంచె చింతాలక్ష్మీనారాయణ 

ఉంటామరి - ఇకశలవు

ఉంటామరి - ఇకశలవు   ఓ విలంబి ఉగాది  స్వాగతం, నీకు సుస్వాగతం  "సంవత్సరాది" - ఉగాది పేరుతో  పెల్లుబికేవుత్సాహానికి ప్రతిరూపం నీవు  ప్రపంచంలోని ప్రతిదేశంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదోఒక పేరుతో  నీవు ఆవిష్కృతమౌతావు అందరి అభిమానం చూరగొని ఆదరించ బడుతావు ఐనానీవు కొదరికేమరుపురాని మేలు చేస్తావు మరిచిపోలేని విషాదిన్ని మిగుల్చుతావు మరికొందరికి  అందుకేనీవు పక్షపాతివి అంటాను నేను  అయినా నిన్ను తప్పక ఆహ్వానిస్తాము మేము ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా  నీవు అందరి జీవితాల్లోకి తప్పక వచ్చి వెళ్తావు అందుకే నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించి  మా గౌరవం మేము కాపాడుకుంటాము  మాకు మేము మేలు  చేసి నీగౌరవం నీవు కాపాడుకుంటావాని ఆశిద్దాము. గతంలో మాకు జరిగిన కష్టాలను ఏకరువు పెట్టను నిష్టూరాల నెగాళ్ళను ఎగదొయను నామటుకు  నేను నిర్లిప్తంగానే వుంటాను ఉగాది పచ్చడిలో  వేప పూతలోని చేదును  మామిడి పిందెల్లోని వగరును  ఉప్పు, పులుపు, కారాల్ని మాయం చేసి  మాకు తీపినే మిగుల్చు మరి మంచినే చేస్తానని నమ్ముతున్నాను మరి నీమంచి నీవు నిలబెట్టుకొని  నా మాట దక్కిస్తావని శలవు తీసుకుంటున్నాను  నా మాట దక్కిస్తావుగా మరి,  ఉంటా, ఇక శలవు...  రచన : వి. వరప్రసాదరావు

అమ్మభాష

అమ్మభాష అమ్మభాషయనిన, అమిత మక్కువ నాకు. అందులో ఏముంది? అతిశయమును తప్ప, ఎవరమ్మ భాష, వారికిని గొప్ప, అనుచు వెళ్ళకండి, అభిజ్ఞానులార! "జంతి భాష" యనుచు, పొగడిరి కొందరు. "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్"అనిరి ఇంకొందరు. నాగమ్మ కొడుకు, నరసింహ వారసుడు, కృష్ణదేవరాయలనుచు, పిలవబడెను తాను. తల్లి "తుళు"ను వదలి, తన కన్న మిన్నగా, తాను ప్రేమించినాడు. "దేశ భాషలందు తెలుగు లెస్సనుచు". రాయలతో బాటుగా, రాగమందుకొనెను, వినుగొండ వల్లభుడు, విలువైన కవి తాను. సంస్కృతంబు పిదప, సంపూర్ణ వ్యాకరణము, కలిగియన్నది నా, కన్నతల్లి భాష. "గాలి వీచెను చల్లగా! గాలి చల్లగా వీచెను! చల్లగా వీచెను గాలి! చల్లగా గాలి వీచెను! వీచెను గాలి చల్లగా! వీచెను చల్లగా గాలి! ప్రపంచ భాషలను, పరికించి చూడుడు. ఏ భాషలో లేని, అరుదైన గుణమిది. పద్యాలు పాడుట,  తెలుగోని సొమ్మని, తెలియపరచినారు, తొలి తెలుగు కవులు. "పంచె కట్టుట లోన, ప్రపంచాన మొనగాడెవ్వడు? తెలుగోడికి గాక తెగువయెవ్వరికి కలదు. పంచ భక్ష్య పరమాన్నంబులు, కంచమున వడ్డింప, గోంగూరకై గుటకలు వేయువాడు! ఎవరయ్య,ఎవరనుచు, అడిగినదెవరన్న?" నారాయణరెడ్డి గాకనది నింకెవ్వడు! కమ్మనైన అమ్మ, కనులముందుండ! మమ్మనుచు పార్థివ దేహంబు పలవరించెదవేళ? అంతరించిపోవు అధికార భాషలలో,  తెలుగుయునూ ఉన్నది, తెలుసుకొనుడు  జనులు తెప్పరిల్లి. చేజారిపోయిన చేతికందదుతాను. కాపాడుకొనుడు కర్తవ్యమ్ముకలిగి. ఇందిరా.వెల్ది,

మధుమాసం

మధుమాసం   శిశిరమేలువాని శీతకన్ను వలన, వికృతత్వం పొందిన ప్రకృతి శోభ? మరుల శరుని చూసి  మధుమాసమైంది. వనమెల్ల మురిసింది, వలపుల రతి కన్యలా. మధుపానమొనరించి మత్తెక్కిన భ్రమరాలు? ఝంకారం చేసె, విరామ పద్ధతిలో. సహకార వరుడు, సందడి చేస్తుండు. వలపు విరిపూతలను, వధువు కోకిలకివ్వ. వగరు పులుపును తిన్న, వయ్యారి కోయిల. కులుకుతూ పాడింది, కుహూ, కుహూ స్వరాలు. మోడువారిన బతుకులు? చిగురులేశాయి? మొద్దునుండి ఆకు, మొలకెత్తి చూసింది. పల్లవించి తాను, పయ్యెదను పరచింది. పగలంత, వనమంత, వెండి ఎండలు మండు. రేయంత తనచెంత, పండు వెన్నెల నిండు. పచ్చని తృణాలు పుడమిని, పానుపుగా మార్చాయి. గట్ల మెత్తలను పెట్టి, ఘల్లుమని నవ్వాయి. చిలకమ్మ పెట్టింది, సరి కొత్తకాపురము, మామిడితొర్రలో మసలి ఉందామని. తలమీద దినకరుడు, తాడించు కిరణాలు. వనమంత పవనుడు, వీచు శీతలాలు. సౌరభాలు చిలుకు, సుమ పరిమళాలు. మది పులకించు, తీయని హాయితో. పిల్ల తెమ్మెరలు, గాలి గంధాన్ని మోస్తూ. ప్రకృతిలో ప్రతి అణువూ, పరవశిస్తోంది. కువకువలు,కళకళలు, గలగలలు,సరిగమలు. కాలం గీసిన అద్భుత ఋతు చిత్రం? వసంతం ఇందిరా.వెల్ది,

రా విలంబము లేక విళంబి రమ్ము

రా! విలంబము లేక "విళంబి" రమ్ము      నిగ నిగల మావికొమ్మల  చిగురులు తిని కోకిలమ్మ చేతములలరన్  తెగ ముచ్చట పడిపోవుచు జగమలరగ పాడుచుండె చైత్రదినములన్ రాగ మధురమ్ముగా చైత్రరాగములను పాడుచుండ వసంతాన పంచమమున కోకిలా! మధురమగు నీ కూత చేత అమనికి వచ్చె మధుమాసమనెడు పేరు! కొంటె కుఱ్ఱ యొకడు కూ.హు .కూ హు యన విన్న కోకిలమ్మ విసుగు లేక  బదులు పల్క సాగె పంచమ స్వరములో ననగ ననగ రాగ మతిశయల్ల పూలదండలు  కట్టి ద్వారాలయందు మామిడాకులు కట్టి గుమ్మముల యందు  వేపపూల పచ్చడుల నైవేద్య మిచ్చి మల్లె దండలు వేసి నమస్కరింతు! వాకిలి యందు తోరణము స్వాగత గతిక యాలపించగా వేకువలందు నందముగ విచ్చిన మల్లెలు నవ్వుచుండగా కోకిలలెల్ల కూయ సుమకుంజ పధమ్ముల మెల్ల మెల్లగా శ్రీకరమై 'విళంబి ' దయచేయుము వేగమె తెల్గు నేలకున్ రచన : డా|| కావూరి పాపయ్య శాస్త్రి

తెలుగు గీము (ఇల్లు)

తెలుగు గీము (ఇల్లు)    1. ఆ|| వె||   ముందు వాకిలలికి ముగ్గులిడు మగువ                  అంచురవిక వాణి - అమరెలంగ                  పసుపువేప నొడల - పారాణిపాదాలు                  వెలుగు చున్నదదిర - తెలుగు గీము                   2. ఆ|| వె||   ఉట్టి మీద యూగు - గట్టి పెరుగు కుండ                  అటక మట్టు మీద - ఆవజాడి                   క్రింద కుదురు మీద చింత బొట్టల బుట్ట                  చెలుగు ధాన్యరాశి - తెలుగు గీము ౩. ఆ|| వె||  సుబ్బలక్ష్మి పాడు - సుప్రభాతస్వరం                  పొద్దు పొడవకుండ - బోరుమంటు                   ఇంటి మద్య నుండి - వినిపించునట్టిల్లు                  కులుకు తోరణమది తెలుగు గీము 4. ఆ|| వె||  పనసతొనల కన్న - పంచదారలకన్న                 జుంటు తేనె కన్న - జున్నుకన్న                 చెరుకు రసము కన్న - చెలియ మాటలకన్న                 తేట తెలుగు మాట - తేనెతిపి                  అనుచునుడివె - యోగివేమనపుడు రచన : శ్రీ పోతనపల్లి పాపయ్య

నాలో భావం ఉసులాడినపుడు మది పలికిన భాష

నాలో భావం ఉసులాడినపుడు మది పలికిన భాష అమ్మ:  ఊయల నందు...             ఊసులాడిన పాప...             ఊ కొట్టినా ఆమ్మ...             ఊహించే భాష నా తెలుగుభాష !! నాన్న:  చెరుకుగడలోని పాకంబును             చేర్చి నా ఆకలిని తీసి              చేరువనే నన్నుకాంచే             చేతన నిచ్చే నా తండ్రిభాష తెలుగుభాష ప్రేమ:   నామది భావ సంద్రమా...              నే మధుర లిఖితంగా                        నా వాచకం కమనీయంగా...              నీ మలచగల మదివర్ణం నా తెలుగుభాష ఆదరణ: చినుకుపడితే చిన్నహృదయాలు               చిందులేస్తూ చిలిపిగా ఆడేఆటల్లో               చిగురించే క్రొత్త జీవనానికి...               చైత్రమై వచ్చే భాష నా తెలుగుభాష  రచన : గీత 

తెలుగు భాషా యోష

తెలుగు భాషా యోష   సీ.      ద్రావిడంబున బుట్టి తప్పటడ్గులు వేసి            కులికెను చిన్నారి తెలుగు బాల            అరవ కేరళ మలయాళ కన్నడ భాష           లక్క చెల్లెండ్రతో నాడి పెరిగె           అమర వాణి యనెడు నత్త వారింటికి           ముద్దరాలై వచ్చె ముదిత తెలుగు           తత్సమ తద్భవాల్ తనవార లయ్యిరి           భారత భాషలు పాత చెలులె. తే. గీ. అన్యదేశ్య సఖుల తోడ నాడిపాడి            ఇట్టి బంధు మిత్రులతొ తెల్గింతదయ్యె           విశ్వమున చిత్ర కీర్తితో విస్తరించె.           అన్నమాచర్య పాటతో హరిని గొలిచె. సీ.      నన్నయ్య వాక్సుధా నానార్ధ సూక్తిచే           నక్షర రమ్యత నమరె తెలుగు           తిక్కనార్యుని యచ్చ తెలుగు పలుకులచే           వయ్యారియై తెల్గు వన్నె కెక్కె           నెర్ర నాంధ్ర కవిత నెలనాగ ప్రౌఢయై           శ్రీనాథ ప్రియవాణి సిరులు గులికె           పోతన భక్తితో పులకరించెను తెల్గు           అష్ట దిగ్గజముల నందమలరె.             రచన : శ్రీ అచ్యుతానంద బ్రహ్మచారి