రా విలంబము లేక విళంబి రమ్ము

రా! విలంబము లేక "విళంబి" రమ్ము  
  


నిగ నిగల మావికొమ్మల 
చిగురులు తిని కోకిలమ్మ చేతములలరన్ 
తెగ ముచ్చట పడిపోవుచు
జగమలరగ పాడుచుండె చైత్రదినములన్


రాగ మధురమ్ముగా చైత్రరాగములను
పాడుచుండ వసంతాన పంచమమున
కోకిలా! మధురమగు నీ కూత చేత
అమనికి వచ్చె మధుమాసమనెడు పేరు!


కొంటె కుఱ్ఱ యొకడు కూ.హు .కూ హు యన
విన్న కోకిలమ్మ విసుగు లేక 
బదులు పల్క సాగె పంచమ స్వరములో
ననగ ననగ రాగ మతిశయల్ల


పూలదండలు  కట్టి ద్వారాలయందు
మామిడాకులు కట్టి గుమ్మముల యందు 
వేపపూల పచ్చడుల నైవేద్య మిచ్చి
మల్లె దండలు వేసి నమస్కరింతు!


వాకిలి యందు తోరణము స్వాగత గతిక యాలపించగా
వేకువలందు నందముగ విచ్చిన మల్లెలు నవ్వుచుండగా
కోకిలలెల్ల కూయ సుమకుంజ పధమ్ముల మెల్ల మెల్లగా
శ్రీకరమై 'విళంబి ' దయచేయుము వేగమె తెల్గు నేలకున్

రచన : డా|| కావూరి పాపయ్య శాస్త్రి