వ్యసనాలు మూడు రకాలు

వ్యసనాలు మూడు రకాలు...   1. సమాజం ఛీ కొట్టేవి : డ్రగ్స్ తీసుకోవటం, వేశ్యల వద్దకి వెళ్లటం వగైరా వగైరా 2. సమాజం పట్టించుకోనివి : సిగరెట్ , మందు తాగటం, పొగాకు నమలటం వగైరా వగైరా 3. సమాజం వ్యసనంగా అసలు గుర్తించనవి : అతిగా తినటం, మాట్లాడటం, డ్రెస్సింగ్ చేసుకోటం, సెంట్లు, పర్ఫ్యూమ్ లు కొట్టుకోవటం వగైరా వగైరా మూడు రకాల వ్యసనాల మీదా మనిషికి ఆశ వున్నా... సమాజం ఛీ కొట్టేవాటికి మనిషి ఎక్కువ దూరంగా వుంటాడు! సమాజం పట్టించుకోని వాటికి తెగించి దగ్గరవుతాడు! సమాజం వ్యసనంగా గుర్తించని వాటికి విచ్చలవిడిగా బానిసవుతాడు! అందుకే, ఎక్కువ నష్టం... మూడో రకం వ్యసనాలతోనే వస్తుంటుంది!

మాతృభాష దినోత్సవంతో ఉపయోగం లేదా!

  మాతృభాష దినోత్సవంతో ఉపయోగం లేదా!   1952 ఫిబ్రవరి, 21. అది బెంగాలీ భాషను మాట్లాడేవారు ఎక్కువగా ఉండే తూర్పు పాకిస్తాన్ ప్రాంతం. బెంగాలీని కూడా అధికార భాషగా ప్రకటించాలంటూ అక్కడి ప్రజలు ఎంతోకాలం నుంచీ పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వం వారి మాటలు వినకపోవడంతో నిదానంగా వారి ఆశ కాస్తా ఉద్యమస్థాయికి చేరుకుంది. అలా ఆ రోజున బెంగాలీ భాషని గుర్తించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు కొందరు విద్యార్థులు ఢాకా హైకోర్టు వద్దకు చేరుకున్నారు. కానీ పోలీసులు వారి నిరసనను ఏమాత్రం అంగీకరించలేదు సరికదా... విద్యార్థులని కూడా చూడకుండా వారి మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలలో అధికారికంగా మరణించినవారు నలుగురు. ఇక అనధికారికంగా చనిపోయినవారి సంఖ్యలో స్పష్టత లేదు. ఢాకాలో ఆనాడు చనిపోయిన నలుగురు విద్యార్థుల త్యాగం వృధా పోలేదు. క్రమేపీ అది పూర్తిస్థాయి ఉద్యమంగా రూపుదిద్దుకుంది. బెంగాలీ మాట్లాడే ప్రజలంతా కలిసి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే స్థాయికి చేరుకుంది. దానికి భారత ప్రభుత్వం కూడా మద్దతు పలకడంతో 1971లో బంగ్లాదేశ్ పేరిట ప్రత్యేక దేశం ఏర్పడింది. ఇదీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వెనక ఉన్న కథ. ‘మన సంస్కృతిని పరిరక్షించుకునేందుకు భాష ఓ అద్భుతమైన సాధనం,’ అంటూ ఈ రోజుని ఐక్యరాజ్యసమితి ప్రపంచ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. మాతృభాష దినోత్సవం వెనక ఉన్న గాథ సరే! కానీ అప్పటికీ ఇప్పటికీ మాతృభాషల విషయంలో ఎలాంటి మార్పు వచ్చింది? అని ప్రశ్నించుకుంటే జవాబు నిస్సారంగానే ఉంటుంది. ఇన్ని అస్తిత్వ ఉద్యమాల మధ్య కూడా మాతృభాషలు తమ ఉనికిని నిలబెట్టుకోలేకపోతున్నాయి. తాత్కాలకి ప్రయోజనాల కోసం ఆంగ్లబోధన వైపే మనం మొగ్గు చూపుతున్నాం. తెలుగువాడి సత్తా చాటిన అమరావతిలో రాజధానికి నిర్మిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వమైనా, తెలంగాణ పలుకుబడి కోసం పోరాడి నెగ్గిన తెరాస ప్రభుత్వమైనా చివరికి ఆంగ్లానికే మొగ్గు చూపుతున్నాయి. పిల్లలకి ప్రాథమిక విద్య అంతా మాతృభాషలోనే సాగాలనీ, మాతృభాష మీద పట్టు సాధించిన తరువాతే ఇతర భాషలని సులువుగా నేర్చుకుంటారనీ పరిశోధనలు ఎంతగా మొత్తుకుంటున్నా కూడా తెలుగునాట విద్య తీరు మారడం లేదు. పైగా ఇప్పటికే ఉన్న తెలుగు మాధ్యమాల స్థానంలో నిదానంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ఇరురాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రయత్నిస్తున్నాయి. మనం ఎన్నుకొన్న ప్రభుత్వాల పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ ప్రజల సంగతి చెప్పేదేముంది. తెలుగు నేర్చుకుంటే నాకేంటి? అనే ప్రశ్న దగ్గరే మనం ఆగిపోతున్నాం. అవసరం అయితే ఏ ఫ్రెంచో, జర్మనో నేర్చుకుంటున్నాం కానీ తెలుగుని ద్వితీయభాషగా నేర్చుకునేందుకు కూడా మన పిల్లలు ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితులలో తెలుగునాట మేధావులం అని చెప్పుకునేవారి తీరు కూడా అగమ్యంగానే ఉంది. ఉన్న తెలుగుని కాపాడుకోవడం ఎలాగా అన్న ఆలోచనని పక్కనపెట్టి... తెలుగులో ఉన్న సంస్కృత పదాలని నిషేధించాలనీ, ప్రతి ఆంగ్ల పదానికీ సమానార్థకంగా ఎలాగైనా ఓ తెలుగు పదాన్ని కనుక్కోవాలనీ తాపత్రయపడిపోతున్నారు. ఏతావాతా ఇటు ప్రజలకు కానీ, అటు ప్రభుత్వానికి కానీ, పెద్దలకు కానీ తెలుగుని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అన్న లక్ష్యమైతే ఉన్నట్లు కనిపించడం లేదు. కాబట్టి ఎప్పటిలాగానే ఈసారి మాతృభాష దినోత్సవం సందర్భంగా కూడా తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనీ, కృష్ణదేవరాయలకు ఇష్టమైన భాష అనీ.. ఎప్పటిలాగే కొన్ని రొడ్డుకొట్టుడు వాక్యాలను వల్లెవేయాల్సిందే. ఆపై ఓ టీ తాగి, సమోసా తిని హాయిగా ఇంటికి చేరుకుని... తెలుగుతో సహా ప్రపంచాన్నంతా మర్చిపోయి నిద్రపోవడం తప్ప మరేదన్నా జరుగుతుందని ఆశించడం అసాధ్యం! - నిర్జర.    

మొండి ప్రేమికులను ఎదుర్కోవాలంటే.. (వాలెంటైన్స్ డే స్పెషల్)

  మొండి ప్రేమికులను ఎదుర్కోవాలంటే.. (వాలెంటైన్స్ డే స్పెషల్)     ప్రేమంటే అదో అందమైన అనుభూతి. కానీ ఆ ఆలోచన కేవలం ఒక్కరికే ఉంటే! తన మనసుకి అనుగణంగా ప్రవర్తించమంటూ అవతలివారిని పీడిస్తుంటే... సినిమాల్లో అయితే హీరోలు పదే పదే విసిగించగానే, అమ్మాయిలు పడిపోయినట్లు చూపిస్తూ ఉంటారు. ‘ఇడియట్’ అంటూ తిట్టిన అమ్మాయిలే వారికి లొంగిపోయినట్లు కథ నడిపించేస్తారు. కానీ అదే ప్రవర్తన కళ్ల ఎదుట కనిపిస్తే... అది ప్రేమ కాదు నరకాన్ని తలపిస్తుంది. చివరికి అది ఎటు దారి తీస్తుందో అని మనసు తల్లడిల్లిపోతుంది. అందుకనే కాస్త భద్రంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు అవసరం... తాత్సారం వద్దు ఎక్కడైనా బావే కానీ అని ఓ మోటు సామెత ఉంది. నిజజీవితంలో ఇది తప్పక గుర్తుంచుకోదగ్గదే! ఎదుటి మనిషి ప్రపోజ్ చేయగానే, కుండబద్దలు కొట్టినట్లు మనసులో మాట చెప్పేయడం ముఖ్యం. అంతేకాదు! ఒకరు మన వెంట పడుతున్న విషయం అందరికీ తెలిసినా, అది ఎటు దారి తీస్తుందో ఊహించే అవకాశం ఉన్నా... చూసీచూడనట్లు ఊరుకోవడం మంచిది కాదు! పెద్దల దృష్టికి ఒక వ్యక్తి వద్దన్నా వెంటపడుతుంటే, దాన్ని పెద్దలతో చర్చించడం చాలా అవసరం. అది ఉపాధ్యాయులైనా కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులైనా కావచ్చు.... వారికి విషయాన్ని వివరించి ఉంచాలి. పెద్దలతో చెబితే లేనిపోని గొడవలు అవుతాయేమో అన్నది కేవలం అపోహ మాత్రమే! అలాంటి సందర్భాలలో వారి సూచనలు చాలా ఉపయోగపడతాయి. కర్ర విరగకుండా, పాము చావకుండా... ఆకతాయిల తాకిడి నుంచి బయటపడేస్తాయి. లక్ష్యం మీద ధ్యాస కొంతమంది ఆకతాయిలను గమనిస్తున్న కొద్దీ, వారు చెలరేగిపోతుంటారు. వారి హడావుడిలో పడి మన చదువు కూడా దెబ్బతినిపోతుంది. లక్ష్యం మీద దృష్టి చూపించాల్సిన వయసులో, కెరీర్ను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదుగా! అందుకనే ఆకతాయిలకు ఎలాంటి ప్రాధాన్యతనీ ఇవ్వకండి. వారిపట్ల ఎప్పుడైతే మీకు ఆసక్తి లేదన్న సూచన అందిందో, వాళ్లు మరో దారి చూసుకుంటారు. చదువు తరవాతే ప్రేమ అనే నిశ్చయంతో ఉన్న అమ్మాయిల జోలికి చాలామంది పోరు. స్నేహితులతో పంచుకోండి మొండి రోమియో మిమ్మల్ని విసిగిస్తున్న విషయం స్నేహితులకి చెప్పండి. అవసరమైన సలహా ఇచ్చేందుకైనా, ఆపదలో కలసికట్టుగా నిలిచేందుకైనా వారి బాసట మీకు ఉపయోగపడుతుంది. సదరు ప్రేమికుడని ఓ కంట కనిపెట్టేందుకు కూడా ఈ జాగ్రత్త ఉపయోగపడుతుంది. అంతేకాదు! చాలామంది కుర్రకారు పైకి చూడటానికి గంభీరంగా ఉంటారు. కానీ ఎదురుగాలి వీస్తోందని తెలియగానే నిదానంగా జారుకుంటారు. హద్దులు దాటితే ప్రేమిస్తున్నానంటూ సాగే వేధింపులు హద్దు మీరితే జాగ్రత్తపడండి. పైశాచికమైన ప్రవర్తనతో విసిగిస్తాడనో, భౌతిక దాడులకు దిగుతాడనో అనుమానం వస్తే ధైర్యంగా ముందడుగు వేయండి. కాలేజ్ యాజమాన్యానికి చెప్పడం, కుర్రవాడి తల్లిదండ్రులతో నేరుగా విషయాన్ని చెప్పించడం, సామాజిక మాధ్యమాలలో మీ భయాన్ని పంచుకోవడం.... ఎక్కడా మీకు న్యాయం జరగదన్న అనుమానం ఉంటే నేరుగా మహిళా సంఘాలనో, పోలీసులనో ఆశ్రయించడం చేయాల్సిందే! పరిస్థితి చేయి దాటుతోందని అనిపిస్తే ఆత్మరక్షణ కోసం జాగ్రత్తపడాల్సిందే! - నిర్జర.      

స్వేచ్ఛకి సాటేది!

  స్వేచ్ఛకి సాటేది!   అనగనగా ఓ అందమైన చిలుక! అడవిలో తన నేస్తాలతో కలసి ఆడుతూ పాడుతూ ఉండే ఆ చిలుక కాస్తా ఆ దారిన పోతున్న ఓ వర్తకుడి కంట్లో పడింది. అంతే! అదను చూసి దాన్ని తన సంచిలో వేసుకుని ఇంటికి పట్టుకుపోయాడు ఆ వర్తకుడు. వర్తకుడి ఇంట్లో చిలుకకి అన్నీ ఉండేవి… ఒక్క స్వేచ్ఛ తప్ప! వెండి పంజరంలో దాన్ని బంధించి, బంగారు పళ్లెంతో దానికి ఆహారాన్ని అందించేవాడు వర్తకుడు. అయినా చిలుక మనసంతా అడవి మీదే ఉండేది. ఇదిలా ఉండగా ఆ వర్తకుడు వ్యాపారం చేసేందుకు మళ్లీ బయల్దేరాల్సిన సమయం ఆసన్నమైంది. ‘చూడూ! నేను మళ్లీ నీ కుటుంబం ఉండే అడవిగుండానే వెళ్తున్నాను. అక్కడ నీ నేస్తాలతో ఏదన్నా సందేశాన్ని అందించాల్సి ఉంటే చెప్పు!’ అన్నాడు వర్తకుడు. ‘సరే! నా కుటుంబం ఉండే ఆ మామిడి చెట్టు మీకు గుర్తే కదా! అక్కడికి వెళ్లి మీ తోటి చిలుక చాలా బాధలో ఉంది అని చెప్పండి. ఏదో తిండీ తిప్పలూ వెల్లమారిపోతున్నాయే కానీ స్వేచ్ఛ కరువైందని చెప్పండి. తను ఎక్కడున్నా తన మనసు మీతోనే ఉంటుందనీ, మిమ్మల్ని కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటుందనీ చెప్పండి.’ అంది చిలుక. చిలుక చెప్పిన సందేశాన్ని తీసుకుని వర్తకుడు అడవిగుండా ప్రయాణాన్ని సాగించాడు. అక్కడ అతనికి చిలుక కుటుంబం నివసించే మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద నిలబడి వర్తకుడు ‘మీ తోటి చిలుక నా దగ్గరే ఉంది. అది మీ అందరి తోడునీ, ఈ అడవిలోని స్వేచ్ఛనీ కోరుకుంటోంది. కానీ ఏం చేసేది! నాకు ఆ చిలుక అంటే ప్రాణం. అందుకనే దాన్ని వదిలిపెట్టలేను. అందుకే కేవలం దాని సందేశాన్ని మాత్రమే తీసుకువచ్చాను. ఇప్పడు మీ సందేశం ఏదన్నా ఉంటే చెప్పంది. నేను తనకి అందిస్తాను’ అన్నాడు. వర్తకుడి మాటలు వింటూనే ఓ చిలుక చెట్టు మీద నుంచి ఢామ్మని పడిపోయింది. జరిగిన దానికి వర్తకుడు కంగారుపడిపోయి మారుమాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు. వ్యాపారాన్ని ముగించుకున్న వర్తకుడు ఇంటికి తిరిగి రానే వచ్చాడు. ‘ఏం జరిగింది! నా సందేశాన్ని మా కుటుంబానికి అందించారా? వారు ఏమన్నారు?’ అని అడిగింది చిలుక. ‘ఆ నీ సందేశాన్ని అందిచాను. కానీ… కానీ… నా మాటలు వినగానే ఓ చిలుక ఢామ్మని చెట్టు మీద నుంచి కిందకి పడిపోయింది’ అన్నాడు వర్తకుడు. ఆ మాటలు వింటూనే పంజరంలోని చిలుక కూడా ఒక్క పెట్టున కుప్పకూలిపోయింది. ‘అరెరే! అక్కడ జరిగిందే నాకు అర్థం కావడం లేదంటే, ఇదేంటి….’ అనుకుంటూ లబోదిబోమంటూ వర్తకుడు పంజరాన్ని తెరిచి ఆ చిలుకను చేతిలోకి తీసుకున్నాడు. వర్తకుడు అలా చిలుకను చేతిలోకి తీసుకున్నాడో లేదో ఒక్క ఉదుటున ఆ చిలుక ఎగిరిపోయి తలుపు దగ్గరకి చేరుకుంది.  ‘నా నేస్తాలు నాకందించిన సందేశం ఇదే! ఎవరైనా మమ్మల్ని బంధిస్తే ఇలా తప్పించుకోవాలని మా పెద్దలు చెప్పేవారు. నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పడు మళ్లీ నాకు ఆ ఉపాయాన్ని గుర్తుచేశారుగా. ఇక బయల్దేరతాను.’ అంది చిలుక. ‘మరి నా సంగతో! నేను నిన్ను ఇంతగా ప్రేమించాను. నీకోసం వెండి, బంగారాలు అందించాను. మూడుపూటలా నచ్చిన ఆహారాన్ని ఇచ్చాను. ఇవన్నీ వదులుకుని నువ్వు వెళ్లిపోతావా!’ అంటూ బేలగా అడిగాడు వర్తకుడు. ‘ప్రపంచంలో ఏ జీవికైనా బానిసత్వాన్ని మించిన దౌర్భాగ్యం ఉండదు. స్వేచ్ఛే కనుక లేకపోతే కడుపు నిండినా తృప్తిగా ఉండదు. బంగారంతో చేసినా కానీ పంజరం పంజరమే! అది నాకు వద్దు. దాని బదులు ఎండిన చెట్టు మీద ఖాళీ కడుపుతో కూర్చున్నా బతికున్నాననీ, నా జీవితం నే చేతిలోనే ఉందనీ తృప్తిగా ఉంటుంది. సెలవ్!’ అంటూ తుర్రుమంది చిలుక.    

" ఏడు రోజులు " 37వ భాగం

" ఏడు రోజులు " 37వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి                  అంతలోనే ఆ ఇంటివాళ్ళంతా ఒక్కొక్కరిగా ఆ గదిలోకి రాసాగారు. అందరిలోనూ హడావిడి... కంగారు! కొందరిలో తోడుగా కోపం కూడా!     భవానీశంకర్ ఎవ్వరికీ భయపడలేదు. తుపాకి ఎత్తి అప్రమత్తుడయ్యాడు. అందరూ అతడివైపు భయంగా, నిస్సహాయులుగా చూస్తుండిపోయారు.     "ఎవ్వరైనా నాకు అడ్డువస్తే కాల్చిపడేస్తాను" భయపెడుతూ క్రమంగా అందర్నీ దాటుకుని వెలుపలికి నడిచాడు. భయపడుతూనే కొందరు అతడి వెంటే వచ్చారు.     ఆ పెద్ద బంగ్లాలోని గదుల్ని దాటి పూర్తిగా బయటకు వెళ్ళేవరకు తుపాకీ గురిపెట్టే వున్నాడు భవానీశంకర్. బయటకు వెళ్ళాక ఒకపక్కగా పార్క్ చేయబడిన యమహా కనబడింది.     ఒక చేత్తో తుపాకి ఎక్కుపెట్టి మరోచేత్తో యమహా స్టార్ట్ చేసుకుని, రివ్వున ముందుకు దూసుకుపోయాడు అతడు. జరిగిన అనూహ్యపరిణామానికి వాళ్ళంతా మరబొమ్మల్లా నిలబడిపోయారు.     భవానీశంకర్ మధ్యలో ఎదురయ్యింది పోలీస్ వ్యాన్. షార్వాణీ ధరించి, టోపీ పెట్టుకుని, అచ్చు ముస్లిం కుర్రాడిలా తయారైవున్న అతగాడు... పోలీసుల్ని చూసి కూడా కించిత్ భయపడలేదు. బండిని రైల్వేస్టేషన్ వైపు పోనిస్తూ "తండ్రీ భగవంతుడా... నువ్వే నన్ను కాపాడాలి" ఆదుర్దా కొద్దీ అనుకున్నాడు.     బండి పదిహేను నిముషాల్లో రైల్వేస్టేషన్ చేరుకుంది. ప్లాట్ ఫామ్ పై ఓ రైలు చిన్నజర్క్ తో కదులుతోంది. అది ఎక్కడికి వెళ్ళే రైలు అన్న సంగతి గురించి ఆలోచించలేదు భవానీశంకర్. బండిని... రైఫిల్ ను అక్కడే వదిలేసి, వేగంగా పెరుగెట్టుకువెళ్ళే రైలు ఎక్కేశాడు.     రైలు వేగాన్ని పుంజుకుంది. తల పట్టుకుని కూర్చుండిపోయాడు భవానీశంకర్.     అతడు కూర్చున్న బోగీలోనే ఆ చివర్న గౌసియా... కమలాకర్ లు వున్నారు. కమలాకర్ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. గౌసియా పడుకుని ఏదో ఆలోచిస్తోంది.     "గౌసియా..." కాసేపటి తర్వాత పిలిచాడు కమలాకర్.     "ఊ..." పలుకుతూ చెప్పింది గౌసియా.     "అక్కడికి వెళ్ళాక మరెక్కడికో వెళ్తానని వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు" చెప్పాడు.     అతడు ఆ మాట అనగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.     "ఏడ్వొద్దు. వాస్తవం చెబుతున్నాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లుగా వాళ్ళను ఇబ్బంది పెడితే వాళ్ళు నిన్ను విసుక్కోవచ్చు. ఇందువల్ల నిన్ను పట్టించుకునే వాళ్ళే లేకపోవచ్చు" అన్నాడు అతడు.     "మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు నాది. డబ్బులు ఎవ్వరివైనా కావొచ్చు. నేను హైద్రాబాద్ వెళ్ళడం అనవసరపు ఖర్చే అవుతుంది. కానీ నాకు ఇక్కడ వుండాలని లేదు. మీరంతా నా స్వంత కుటుంబసభ్యుల్లా వుంటున్నప్పటికీ, డాక్టర్ బాబు ఏ క్షణాన నాపై కోప్పడ్తాడో నన్న భయం... నన్ను ఇంకెవరైనా మోసం చేసి తీసుకువెళ్తారేమోనన్న భయం... నన్ను క్షణక్షణం వెంటాడుతున్నాయి. తోడుగా భవానీశంకర్ కోసం ఆశపడి, అడియాశను అందుకున్నాను కాబట్టి... అక్కడ ఎంతమాత్రం నిలవబుద్ధికావడంలేదు" చెప్పుకుపోయింది గౌసియా.     "నేను నిన్ను అర్థం చేసుకోగలను గౌసియా! కాపోతే నేను చెప్పేదే నీవు అర్థం చేసుకోవడంలేదు.     నీది పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని అమాయకత్వం. నీ వయసు పిల్లలు చాలామంది ఎంతో తెలివిగా, ఎంతో చలాకిగా, ప్రవర్తిస్తుంటారు. కానీ నీలో ఆ తెలివి, ఆ చలాకీతనం ఎంతమాత్రం లేవు. నీవు చాలా అమాయకురాలివి. ఈ అమాయకత్వంతో నీవు నీ ఇష్టప్రకారం ప్రవర్తించవద్దు. వెళ్ళినచోట వాళ్ళకు అనుగుణంగా మసులుకోవాలి. వాళ్ళు చెప్పినట్లుగా వినాలి" ఆత్మీయంగా చెప్పాడు అతడు.     "అట్లాగే" తలాడించిందామె.     కమలాకర్ ఇంకేం చెప్పలేదు. గౌసియా కూడా ఇంకేం మాట్లాడలేదు. కాసేపటి తర్వాత చిటికెనవేలు చూపిస్తూ లేవబోయింది గౌసియా. ఆసరాపట్టాడు కమలాకర్.     కమలాకర్ తోడుతో టాయ్ లెట్ వైపు నడిచింది గౌసియా. భవానీశంకర్ కూర్చుని వున్న వరుసముందు నుండే ఆమె నడిచివెళ్ళింది. కానీ అతడు అలాగే తల పట్టుకుని కూర్చుని వున్నందున, ఆమెను గమనించలేదు.     ఆమె టాయ్ లెట్ కువెళ్ళి వస్తుంటే అతడు అలాగే కూర్చుని వున్నాడు. ఆమె కూడా ఎవరివైపూ చూళ్ళేదు. కాగా, ఆమె ఆ వరుస దాటి వెళ్ళబోతుండగా, "హమ్మా హమ్మయ్య" అనుకుంటూ తలెత్తాడు భవానీశంకర్. కానీ అతడు గౌసియావైపు చూళ్ళేదు. కాపోతే అతడు ద్వారం పక్కనే కూర్చుని వున్నందున, అతడి గొంతు ఆమె చెవిలోకి చేరగానే ఆమె అడుగులు అప్రయత్నంగా ఆగిపోయాయి.     తల తిప్పి ఆదుర్దాగా ప్రయాణికుల్ని గమనించింది. భవానీశంకర్ ను చూడగానే ఆమె కనుబొమలు ముడిపడ్డాయి.     "నువ్వేనా?"       "అగ్నిపర్వతపు అంచులోని హిమశిఖ రానివేనా?"     ముస్లిం యువకుడిలా వేషం ధరించిన భవానీశంకర్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తోందామె. కమలాకర్ గౌసియావైపు అర్థంకానట్లుగా చూస్తుండిపోయాడు.     "శం...క...ర్..." కొన్నిక్షణాల తర్వాత మెల్లగా పిలిచిందామె.     అతడు చప్పున తలతిప్పి చూసి, ఆ వెంటనే "గౌసియా..." అంటూ కళ్ళింత చేసి ఆత్రంగా లేచి వచ్చాడు.     ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆనందమో... ఆవేదనో... అర్థంకాని తనమో... తెలీదుగానీ, ఆమె కళ్ళల్లో సకలభావాలు ఇమిడిపోయాయి. ఏదో ఆవేశం కూడా ఆమెలో పొంగిపొర్లుతుంటే అతడ్ని చూస్తూ అలాగే నిలబడలేకపోయింది.     భవానీశంకర్ కూడా ఎంతోసేపు ఆమెను చూస్తూ నిలబడలేకపోయాడు.     "గౌసియా... " మరోసారి పిలుస్తూ చప్పున వచ్చి ఆమె చేతుల్ని పట్టుకున్నాడు. అతడి కళ్ళల్లోనూ నీళ్ళు... ఆమె మీది అభిమానానికి, ప్రేమకి, ప్రతీకలుగా కనబడుతున్నాయి.     ఆలస్యం అయిందేమో అని అటు తొంగి చూసిన కమలాకర్ కి అంతా అర్థమైంది. ఇద్దర్నీ తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ, "రామ్మా గౌసియా..." అన్నాడు.     కమలాకర్ వైపు అప్పుడు చూశాడు భవానీశంకర్. కమలాకర్ ని చూడగానే అతడిలో భయం పెరిగింది. చప్పున గౌసియాకు దూరం జరిగాడు.     "భయపడొద్దు..." అన్నాడు కమలాకర్.     భవానీశంకర్, కమలాకర్ ని చూడగానే ఎందుకు భయపడుతున్నాడో అర్థంకాక ఇద్దరివైపూ ఒకసారి కంగారుగా చూసి, "కమలాకర్ సారు చాలా మంచివాడు" చెప్పింది గౌసియా.     భవానీశంకర్ మనసు అప్పుడు కుదుటపడింది. ముగ్గురూ పక్క వరుసలోకి నడిచి కూర్చున్నారు.     గౌసియా పడుకుంటే ఆమె తల దగ్గరే కూర్చుని ఆమెవైపు అర్థంకానట్లుగా చూశాడు.     "నేను చచ్చి బతికాను" అతడి చూపుల్ని అర్థం చేసుకుంటూ తొలిమాటగా మాట్లాడింది గౌసియా.     ఆమాత్రానికే భరించలేని వాడిలా గౌసియా చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు భవానీశంకర్.             రైలు సికింద్రాబాద్ స్టేషన్ ని సమీపిస్తోంది. అంతవరకూ గౌసియా పడిన అవస్థల్ని పూర్తిగా తెలుసుకున్న భవానీశంకర్ మనిషి కాలేకపోయాడు.     అతడిది గమ్యం తెలియని పయనం. ఆమె మాత్రం అక్కడ దిగాల్సివుంది. కానీ అతడ్ని వదిలి ఆమె దిగలేకపోతోంది.     "గౌసియా! నీవు వెళ్లక తప్పదు. కోలుకునే వరకూ మోహన్ వాళ్ల హాస్పటల్ లోనే వుండు. ఆ తర్వాత నీవు కోరుకున్న వాడివెంట వెళ్ళిపోదువుగాని." అన్నాడు కమలాకర్.     "వద్దు. నేను అక్కడికి వెళ్తే నాగురించి పోలీసులకి తెలుస్తుందేమో అనిపిస్తోంది. అందుకే నేను తన వెంటే వెళ్లిపోతాను." భవానీశంకర్ చేతుల్ని గట్టిగా పట్టుకుంది గౌసియా.     "గౌసియా గురించి బయటకి తెలిస్తే తన ప్రాణానికి ముప్పు కలగవచ్చు... కలగకపోవచ్చు. కానీ ముస్లింలు మాత్రం ఆమెను తిరిగి నాకోసం ముస్లింలు మాత్రం ఆమెను తిరిగి నాకోసం రానివ్వరు. మేమిద్దరం ఎక్కడికైనా వెళ్లిపోతాం. ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయి ఏమతం, ఏకులం లేకుండా మనసున్న మనుషులుగా బతుకుతాం. మాకు అండగా నిలవండి." చేతులు జోడించాడు భవానీశంకర్.     "గౌసియాను ఈ పరిస్థితుల్లో వెంట తీసుకు వెళ్లి కష్టాలుపడలేవు నువ్వు. అయినా మీ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? నీవు మగపిల్లాడివి.... ఎక్కడైనా బతకగలవు. కానీ తను ఆడపిల్ల. భద్రత లేకుండా ఈ సమాజంలో జీవించడం చాలా కష్టం." అన్నాడు కమలాకర్.     మరేం మాట్లాడలేకపోయాడు భవానీశంకర్. నిలువునా గాయాలతో వున్న తన ప్రియురాలిని వేదన నిండిన కళ్ళతో చూస్తుండిపోయాడు.     "మోహన్ వాళ్ల కుటుంబం చాలా మంచి కుటుంబంలా వుంది. వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకోగలరు. కాబట్టి గౌసియా తప్పకుండా నీకోసం వస్తుంది. ఈ విషయంలో నేను హామీ ఇవ్వగలను బెంగాపెట్టుకోవద్దు.     నీవు మెడ్రాస్ వెళ్లిపోయి ఏదైనా పని చేసుకో. అక్కడ నీవు సయ్యద్ పాషాగానే బతుకు. అదే పేరుతో నీ చిరునామా తెలుపుతూ నాకు ఉత్తరం రాయి. నీవు ఇకనుంచీ నా స్వంత తమ్ముడివే. కాబట్టి ఏ అవసరం వచ్చినా సంకోచంలేకుండా నాతో చెప్పు. నాకు చేతనైన సహాయం చేస్తాను.     ముఖ్యంగా నీవు చేసే పని ఎంతచిన్నదైనా కావచ్చు. ఆపని నిన్ను ప్రయోజకుడిగా మారిస్తే నీ పెళ్లాన్ని ధైర్యంగా పోషించగలవు. లేదంటే ఒక్క నిముషాన్ని వెనకేసుకోవడానికి నీవు ఎన్నో అవస్థల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ భవిష్యత్తుకోసం ఒక స్థానాన్ని సంపాదించుకో. ఆతర్వాత గౌసియాను నేనే స్వయంగా తీసుకువచ్చి నీకు అప్పచెబుతాను.... సరేనా!" చెప్పుకుపోయాడు కమలాకర్.     కాసేపు ఆలోచించి 'సరే' అన్నట్టుగా తలాడించాడు భవానీశంకర్.     రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది. తన ప్రియుడు తనకు దూరమైపోతున్నాడన్న బాధ ఆమెను ఇక నిలవనీయలేదు. చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడవసాగింది. భవానీశంకర్ లోనూ గొంతులోనే వుంది దుఅఖం. కానీ బలవంతాన ఆపుకుంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు.     "మనం తప్పకుండా కల్సుకుంటాం. ఈ ఎడబాటు కొన్నాళ్ళే!"     రైలు కొంతదూరం ముందుకు సాగిపోయి ఆగింది.     కమలాకర్ వెళ్లి ఆటోరిక్షా తీసుకువచ్చాడు.     భవానీశంకర్ జాగ్రత్తగా గౌసియాను ఆటో ఎక్కించాడు.     వాళ్ళ అనురాగాన్ని చూస్తూ నిల్చున్న కమలాకర్... భవానీశంకర్ భుజాన్ని తట్టి ధైర్యం చెబుతూ, "మీ ప్రేమ గెలిచింది. కానీ పరిస్థితులు ప్రతికూలంగా వున్నాయి. అనుకూలం అయ్యేవరకు ఓపిక అవసరం" అని, తన ప్యాంటు జేబులోంచి రెండువందల రూపాయలు తీసి అందివ్వబోయాడు.     "వద్దు" అన్నాడు భవానీశంకర్.     "ఫర్వాలేదు తీసుకో" అంటూ రెండువందల రూపాయల్ని భవానీశంకర్ చేతికి అందించి, ఆటో క్కి కూర్చున్నాడు కమలాకర్.     మరుక్షణం ఆటో ముందుకు కదిలింది. కదిలిన ఆటోలోంచి వీడ్కోలుగా చేయి వూపింది గౌసియా. భవానీశంకర్ కూడా తన చేతిని గాలిలోకి ఎత్తి వూపాడు.     వెళ్తున్న ఆటోనే చూస్తూ అలాగే చేయి ఊపుతూ నిలబడిపోయాడు భవానీశంకర్! *

" ఏడు రోజులు " 36వ భాగం

" ఏడు రోజులు " 36వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి                    ఆదివారం     ఉదయం పదిన్నరకు భవానీశంకర్ విషయమై ముంతాజ్ ని కల్సేందుకు గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళాడు కమలాకర్!     "గౌసియా వచ్చింది. నీ పక్కన వున్న కుర్రాడు ఎక్కడ వున్నాడు?" అడిగాడు కమలాకర్.     ముంతాజ్ కమలాకర్ వైపు అర్థం కానట్టుగా చూశాడు.     "అదేం ముంతాజ్ అలా చూస్తున్నావు? గౌసియా దొరికింది. నిన్న నీ వెంట వచ్చిన కుర్రాడు ఆ పిల్ల లవ్వర్ అంటకదా?" అన్నాడు.     "ఆ విషయం నీకెవరు చెప్పారు?" అడిగాడు ముంతాజ్.     "గౌసియానే చెప్పింది"     ముంతాజ్ కు అనుమానం వచ్చింది. "నిన్న గౌసియా కోసం తాము మామూలుగా వెళ్ళారు. ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించారు. ఒకవేళ గౌసియా నిజంగానే తిరిగివచ్చినా, భవానీశంకర్ అక్కడికి వెళ్ళినట్టు ఆమెకు ఎలా తెలుస్తుంది?"     ఈ అనుమానం రాగానే... "వాడు నిన్ననే వెళ్ళిపోయాడు" చెప్పాడు ముంతాజ్.     "అయ్యో! అనవసరంగా ఆ పిల్లలో ఆశలు పెంచానా ఏంటీ" మనసులో అనుకుని, "ఆ కుర్రాడి పేరేమిటి?" అడిగాడు కమలాకర్.     "గోపాల్" చెప్పాడు ముంతాజ్.     "అలాగా!" అంటూ తలాడించి "అలవాటులో పొరపాటు..." తనలో తను గొణుక్కుని, "వెళ్తాను ముంతాజ్... నాకు టైమ్ అయ్యింది" అని చెప్పి అక్కడ్నుంచి బయటపడ్డాడు కమలాకర్.     అతడు అలా వెళ్ళిపోగానే ఇలా రెండవదారి వెంబడి, తన లూనామీద ఇంటికి బయలుదేరి వెళ్ళాడు ముంతాజ్.     ఇంటిదగ్గర భవానీశంకర్ టీవీ చూస్తూ కూర్చుని వున్నాడు. అతడి ముఖంలో నిరాసక్తత స్పష్టంగా కనబడుతోంది.     "అరే శంకర్... నువ్వు వెంటనే ఇక్కడ్నుంచి తప్పుకోవాలిరా" వెళ్ళగానే హడావిడిగా చెప్పాడు ముంతాజ్.     "ఎందుకు?" భవానీశంకర్ లోనూ హడావిడి.     "నువ్వు ఇక్కడ వున్నావని పోలీసులకు తెల్సినట్టుంది. నిన్న మనం వెళ్ళామే ఆ దవాఖానా కాంపౌండర్ ఇంతక్రితం నా దగ్గరికి వచ్చాడు. నీ గురించి ఆరా తీశాడు" చెప్పాడు ముంతాజ్.     "అయితే ఇప్పుడెలా?" కంగారుపడిపోయాడు భవానీశంకర్.     "నీవు అస్సలు ఈ వూర్లోనే వుండొద్దు. హైద్రాబాద్ వెళ్ళిపో! నేను నీ వెంటే వస్తాను. అక్కడ మా మేనత్త వాళ్ళ ఇంట్లో వుందువుగాని" అన్నాడు ముంతాజ్.     "ఇప్పటికిప్పుడు హైద్రాబాద్ వెళ్ళొద్దు. వెళ్తుంటే మిమ్మల్ని ఇక్కడే మధ్యలోనే పట్టుకోవచ్చు. కాబట్టి ముందు నీ స్నేహితుడు నజీర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. అక్కడ మధ్యాహ్నం దాకా వుంటే, పరిస్థితి కొద్దిగా కుదుటపడవచ్చు" కల్పించుకుంది ముంతాజ్ తల్లి హుస్సేన్ బీ.     "ఆ పనిచేద్దాం... రారా" అంటూనే బయటకు నడిచాడు ముంతాజ్. వెనకే నడిచాడు భవానీశంకర్.     పది నిముషాల్లో నజీర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు మిత్రులు ఇద్దరూ. నజీర్ వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. అంత పెద్ద ఇంట్లో మొత్తం ఇరవైఐదు మందిదాకా వుంటారు. వాళ్ళందరికీ మతచాదస్తం కూడా ఎక్కువ! కాబట్టి ముంతాజ్ చెప్పిన ప్రకారం భవానీశంకర్ అక్కడ ముస్లిం యువకుడిగా మారాడు.     "వీడు నా దోస్త్... సయ్యద్ పాషా! హైద్రాబాద్ నుండి వచ్చాడు. మా ఇంట్లో అమ్మ తప్పిస్తే ఎవ్వరూ వుండరు కాబట్టి వాడికి బోర్ గా వుంటుందని ఇక్కడికి తీసుకువచ్చాను" ఉర్దూలో నజీర్ తో చెప్పాడు ముంతాజ్.       "దవాఖానా దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు కదరా" అన్నాడు నజీర్.     "నేను మర్డర్ కేసు విషయమై పక్క పల్లెకు వెళ్తున్నాను" చెప్పాడు ముంతాజ్. అదే సమయంలో ముంతాజ్ కు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని వెంటనే చెప్పాడు.     "వీడికి నీ టోపి, షార్వాణీ ఇవ్వరా? వచ్చేప్పుడు అట్లాగే వచ్చాడు గానీ, మాసిపోయాయని ఇక్కడికి వచ్చాక మార్చుకున్నాడు. ఇది నా డ్రెస్సే" నజీర్ చెప్తూ భవానీశంకర్ డ్రెస్సును చూపించాడు ముంతాజ్.     స్నేహితుడు ఎందుకు అలా చెప్తున్నాడో అర్థంకాలేదు భవానీశంకర్ కు. అయినప్పటికీ మౌనంగా వుండిపోయాడు. అదే సమయంలో నజీర్ కు వాళ్ళమ్మ దగ్గర్నుంచి పిలుపువచ్చింది. నజీర్ వెంటనే వెళ్ళిపోయాడు.     "ఏంట్రా?" నజీర్ వెళ్ళిపోగానే అడిగాడు భవానీశంకర్.     "నీకు వీళ్ళ సంగతి తెలీదురా! వీళ్ళ ముస్లిం పిచ్చి సామాన్యమైనది కాదు. ఇలా ప్యాంట్, షర్టూ వేసుకునేవాళ్ళను వీళ్ళు అసలు సిసలైన ముస్లిం కాదనుకుంటారు. మా ఇంటిదగ్గరే నీకు షార్వాణి తొడిగించుకు వద్దామనుకుంటే, ఆలస్యం ఎంత మాత్రం మంచిది కాదు అన్పించింది. అందుకే ఇక్కడ ఇలా చెప్పాను.     "నీవు ఇక్కడ పొరపాటున కూడా తెలుగులో మాట్లాడొద్దు. ఇంకో విషయం ఏంటంటే జ్వరం వచ్చినట్లుగా నటించు. లేదంటే వాళ్ళతో పాటుగా నమాజ్ చేయమంటారు" భుజం తడుతూ చెప్పి, "నీవు ఈ గెటప్ లోనే బయటకు వెళ్ళావనుకో. నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు..." అన్నాడు ముంతాజ్.     "ఏంటోరా. అన్నీ అవస్థలే" అన్నాడు భవానీశంకర్.     "బాధపడొద్దు. అల్లా వున్నాడు. ణీ కష్టాలు అన్నీ గట్టెక్కుతాయి" ధైర్యం చెప్పాడు ముంతాజ్.     చిరునవ్వుతో తల పంకించాడు భవానీశంకర్. మరో పదినిముషాల తర్వాత ముంతాజ్ వెళ్ళిపోయాడు. నజీర్ భవానీశంకర్ తో బాగా కలిసిపోయాడు. ముభావంగా వుంటాడేమోనని భయపడ్డ భవానీశంకర్, నజీర్ తనతో స్నేహంగా కలిసిపోయినందుకు ఆనందపడ్డాడు. తనుకూడా నజీర్ తో స్నేహంగా మెలుగుతూ, నజీర్ వాళ్ళ ఇంటినుండే షిరాజ్ కోసం నంబరు కలిపాడు.     ఆ సమయంలో నజీర్ సమాజ్ కోసమని కింది హాల్లోకి వెళ్ళాడు. అతడి కుటుంబసభ్యులు అందరూ ఆ హాల్లోనే నమాజ్ చేస్తారు. భవానీశంకర్ కు అదే అవకాశం అన్పించింది. కానీ కొద్దిసేపువరకు ఎంగేజ్ వచ్చింది. అయినప్పటికీ ప్రయత్నిస్తూ పోయాడు. కాసేపటికి నంబర్ కల్సింది. అవతల షిరాజే లైన్లోకి వచ్చాడు.     "హలో..."     "సిరాజ్... నేను" అన్నాడు భవానీశంకర్.     "భవానీశంకర్?" అన్నాడు సిరాజ్.     "అవున్రా! అక్కడ పరిస్థితి ఎలా వుంది?" అడిగాడు భవానీశంకర్.     "పరిస్థితులు చాలా కటువుగా వున్నాయి. నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావద్దు. నీవు గౌసియా వాళ్ళ నాన్నను చంపేసినందుకు, మరెవ్వరినైనా హిందువును చంపెయ్యాలన్నంత కసిగా వున్నారు మా ముస్లింలు. కానీ అంత సాహసం ఎవ్వరూ చేయరు. ఎందుకంటే, ఇప్పటికే ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు తారాస్థాయికి చేరుకుని వున్నాయి. కాబట్టి ఆవేశపడినా కూడా హద్దులలోనే వుంటారు. మీ అమ్మానాన్నలకు పోలీసులు రక్షణగా వున్నారు. ఇక నువ్వు ఎక్కడ వున్నావో ఏమోగానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దు" అవతల షిరాజ్ మాట్లాడుతూ పోతున్నాడు.     ఇవతల భవానీశంకర్ కు టెన్షన్ పెరిగిపోతుంటే... "నా గురించి పొరపాటున కూడా ఎవ్వరితో మాట్లాడవద్దొరేయ్" మధ్యలోనే అందుకున్నాడు.     "నాకు అన్నీ తెల్సు" అన్నాడు సిరాజ్.     "ముంతాజ్ గాడు ఫోన్ చేశాడా?" అడిగాడు భవానీశంకర్.     "చేయలేదు. నువ్వు ఎక్కడ వున్నావు?"     "ముంతాజ్ గాడి స్నేహితుడి ఇంట్లో వున్నాను. ఇక్కడ భవానీశంకర్ గా కాదు, సయ్యద్ పాషాగా వున్నాను"     "అదేంట్రా?"     "అదో పెద్ద కథ" భవానీశంకర్ అంటుంటేనే ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది.     "తర్వాత మాట్లాడదాం" అంటూ చప్పున ఫోన్ పెట్టేశాడు భవానీశంకర్. నజీర్ వచ్చి జానీమా తీసుకుని వెళ్ళాడు. నిజానికి నజీర్ ఎదురుగా కూడా తను ఫోన్ చేయగలడు. కానీ మాట్లాడే విషయాలు సీక్రెట్ కాబట్టి దొంగచాటుగా మాట్లాడాల్సి వచ్చింది. అదే అతడు చేసిన పొరపాటు అయ్యింది.     పది నిముషాల తర్వాత మేడమీదకు వచ్చి సూటిగా అడిగాడు నజీర్.     "నువ్వెవరు?"     అదిరిపడి చూశాడు భవానీశంకర్.     "నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు" నజీర్ గొంతులో కాఠిన్యం.     అంతా అర్థమైంది భవానీశంకర్ కి. చాటునుండి తన మాటల్ని నజీర్ విన్నాడని అనుకుంటున్నాడు అతడు. కానీ చాటునుండి భవానీశంకర్ మాటలు వినలేదు నజీర్. వాళ్ళది ప్యారలల్ ఫోన్. భవానీశంకర్ మాట్లాడే సమయంలోనే ఎవ్వరికో అత్యవసరమై ఫోన్ చేయబోయి, అంతా వినేశాడు. అంతేకాదు, పేపర్ ద్వారా గౌసియా సంగతి తెలుసు కాబట్టి... ఆ వెంటనే పోలీస్ స్టేషన్ కు కూడా ఫోన్ చేసి మేడమీదకు వచ్చాడు. ఆ సంగతి భవానీశంకర్ కు తెలియకపోయినా, తన బండారం బయటపడింది కాబట్టి వెంటనే అక్కడ్నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అందుకు అవకాశమే లేకుండా పోయింది.     "ఇప్పుడేం చేయాలి?" భయంగా మన నిస్సహాయంగా నిలబడిపోయిన భవానీశంకర్ కు చప్పున ఒక ఆలోచన వచ్చింది. అతడు ఆలస్యం చేయలేదు. మెరుపువేగంతో ముందుకు దూకి, అక్కడ గోడకు తగిలించి వున్న తుపాకీ చేతుల్లోకి తీసుకున్నాడు. 

క్రిస్మస్ పండుగ కోలాహలం!

క్రిస్మస్ పండుగ కోలాహలం!   క్రిస్మస్ తాత వస్తాడు.... ఏదో ధ్రువప్రాంతం నుండి, ధ్రువపు జింకలు లాగే స్లెడ్జ్ బండి ఎక్కి, తెల్లటి బరివి గడ్డంతో, నవ్వు నిండిన ముఖంతో, ఎర్రటి ఊలు అంగీతో. ఆ అంగీనిండా లోతైన జేబులు... జేబులునిండా టాఫీలూ, చాక్లెట్లూ, బహుమతులూ! అందరికీ అన్నీ అందిస్తాడు సంతోషంగా, నిర్విరామంగా. ఏ పిల్లలు ఇష్టపడరు ఆయన్ని? ఊరూరా నక్షత్రాలను పోలిన స్వాగత చిహ్నాలూ, వాడవాడలా రంగురంగుల బట్టలూ, పండుగ వాతావరణం. నూతన సంవత్సరానికి ఆహ్వానం, చర్చిల గంటలు, ప్రార్థనాగీతాల సాధనలు. మంచుకురిసే ఉదయాలు. మబ్బుతునకలు లేని ఆకాశంలో కిక్కిరిసిపోయి, ఇక ఎప్పుడు బయటకి ఊడిపడతాయో అనిపించే తారల రాత్రులు. వణికించబోతున్నాను సిద్ధంకండని హెచ్చరించే వెచ్చని చలి. అన్నింటినీ మించి పిల్లల్ని ఊరించే శలవలు. ఇన్ని సంతోషకర విషయాల నడుమ అందరం మరోసారి పరిశుద్ధ ప్రవక్త, దేవుని కుమారుడూ అయిన ఏసు ప్రభువులోని గుణాలను మరోసారి స్మరిద్దాం. కరుణామయుడూ, విస్వాసుల రక్షకుడూ అయిన ఆ ప్రభువు చూపిన సత్యమార్గంలో మనమూ పయనించేందుకు ప్రయత్నిద్దాం. విద్వేష కావేశాలను, మారణకాండల్నీదూరంచేసుకొని మన హృదయాలలోనూ పవిత్రతను నింపుకుందాం. హింస, పరపీడనల్ని దైవం ఏనాటికీ మెచ్చదని మరోసారి గుర్తుచేసుకుందాం. మతం ఉన్నది మనుషుల్ని దూరం చేయటానికి కాదనీ, మనసుల్ని దగ్గర పరచేందుకు ఉద్దేశించినదనీ చాటుదాం. విశ్వాసపు బలాన్ని, ప్రేమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుత వ్యక్తి ఏసు ప్రభువు. డిసెంబరు  25 న ఆయన జన్మ దినాన్ని పురస్కరించుకొని  మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు   Courtesy.. kottapalli.in  

" ఏడు రోజులు " 35వ భాగం

" ఏడు రోజులు " 35వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి        ముఖ్యంగా గౌసియా "ఎవరు?" అనే విషయం ఆ దంపతులు పోలీసులకు చెప్పలేదు. కాగా డాక్టర్ దినేష్ గౌసియా గురించి పోలీస్ స్టేషన్ కు "కనబడటంలేదు" అని రిపోర్టు ఇచ్చాడు. ఆ రిపోర్టు ఆధారంగా అనుమానం వచ్చిన పోలీసులు, ఆ తర్వాత గంటసేపటికే తిరిగి గౌసియా వున్న ఇంటికి వచ్చారు. వాళ్ళ అనుమానం నిజమయింది. కాని గౌసియా హాస్పిటల్ కెళ్ళడానికి విముఖత చూపించింది. అందుకు ఆమెను ఎవ్వరూ బలవంతపెట్టలేదు. ఆమె వెళ్ళాలనుకున్న మోహన్ వాళ్ళ అన్నయ్య హాస్పిటల్ కే పంపించాలనుకున్నారు.     అదే సమయంలో వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చింది. ఫోన్ ప్రకారం ఆ ఇంటి యజమాని తండ్రి విజయవాడలో గుండెనొప్పితో మరణించాడు. దీంతో వాళ్ళు అప్పటికప్పుడే విజయవాడ వెళ్ళేందుకు సిద్ధం కావడం, తప్పనిసరి పరిస్థితిలో గౌసియా హాస్పిటల్ కే వెళ్ళడం, అంతా అరగంటలో జరిగిపోయింది.     హాస్పిటల్ కు వెళ్ళాక డాక్టర్ తనమీద మళ్ళీ కోప్పడతాడేమోనని గౌసియాకు భయమనిపించింది. కాని డాక్టర్ ఎంత మాత్రం కోప్పడలేదు. ప్రేమగా మాట్లాడాడు.     "హమ్మయ్య" అన్పించింది గౌసియాకు. కాగా కాంపౌండర్ కమలాకర్ ద్వారా తన కోసం "ఒక కుర్రాడు" వచ్చి వెళ్ళాడని తెలిసి, ఎవరా... అని ఆలోచించసాగింది గౌసియా.     "పేరు తెలీదుకాని, ఎత్తుగా... దృఢంగా... చామనచాయ రంగులో వుంటాడు"     చిన్నవయసులోనే భారీ పర్సనాలిటి కలిగిన తన భవానీశంకర్ వివరాలు అవి!     మంచి ఎత్తు, దృఢమైన శరీరం, చామన ఛాయరంగు, మొనదేలిన ముక్కు, చురుకైన చూపు, ఒత్తయిన జుట్టు, తీరైన మీసకట్టు, నిజంగా తన భవానీశంకర్ ఎంత బాగుంటాడో! ఆ అందగాడు తనను వెదుక్కుంటూ వచ్చాడా?     ఆ ఆలోచనకే ఆమె మనసు పులకించిపోయింది. "అతడు ఎక్కడ వున్నాడు?" ఆరాటపడిపోయింది.     "ముంతాజ్ అని తెల్సిన కుర్రాడివెంట వచ్చాడు. వుంటే వాళ్ళ ఇంట్లోనే వుండొచ్చు" అన్నాడు కమలాకర్.     "దయచేసి అతడ్ని పిలిపిస్తావా?' అభ్యర్థనగా అడిగింది గౌసియా.     "ఎందుకు అంత ఆదుర్దా? ఆ కుర్రాడిలో కూడా ఇదే ఆదుర్దా కనబడింది" అన్నాడు కమలాకర్.     "తనూ... భవానీశంకర్" చెప్పింది గౌసియా.     అపనమ్మకంగా చూశాడు కమలాకర్.     "కావొచ్చు అనుకుంటున్నాను" అంతలోనే ఆమెలోనూ అపనమ్మకం.     "అతడు నీవు ప్రేమించిన కుర్రాడే అయితే మీ ఇద్దరు కల్సుకుంటున్నందుకు సంతోషం! కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో...ఆ కుర్రాడిదీ ప్రేమించే వయసు కాదు, నీదీ ప్రేమించే వయసు కాదు. మీ ఇద్దరూ ఇప్పుడు చదువుకోవాలి. మీ భవిష్యత్తుకో దారి వెదుక్కోవాలి" అన్నాడు కమలాకర్.     "నిజమే కావొచ్చు సార్! కాని ఇప్పుడు మాత్రం మేం ఇద్దరం... ఒకర్ని విడిచి ఒకరం వుండలేం. ప్రేమలో పడటం మా పొరపాటు అయినప్పటికీ మేం విడిపోయి బతకలేం!" అంది గౌసియా.     "మిమ్మల్ని విడిపొమ్మని నేను చెప్పడం లేదు. మీ ఇద్దరూ కల్సి బతకాలన్నదే నా ఆశ! కాపోతే సందర్భం వచ్చింది కాబట్టి వాస్తవం చెప్పాను" అని కాసేపాగి, "రేపు ఉదయాన్నే ఆ కుర్రాడ్ని ఇక్కడికి పిలిపిస్తాను సరేనా?" అన్నాడు అతడు.     "మీరు ఈ సహాయం చేస్తాను అంటుంటేనే, భవానీశంకర్ నా కళ్లముందు నిల్చున్న ఆనందం కలుగుతోంది కాని అతడు భవానీశంకర్ కాకపోతే నేను ఎలా తట్టుకోవాలి? అని భయం అన్పిస్తోంది కూడా" అంది గౌసియా.     "చూడమ్మాయీ! ముందే ఆశలు పెంచుకుని నిలువెత్తున ఆనందంలో కూరుకుపోకూడదు. ఒక విషయం గురించి గెలుపు ఓటములు రెండింటిని ఊహించుకోవాలి. వాటి ఫలితాన్ని ఎదుర్కోడానికి నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలి" చెప్పాడు అతడు.     "అట్లాగే" బుద్ధిగా తలాడించిందామె.        హాస్పిటల్లో గౌసియా లేకపోవడం అనేది "డిస్చార్జి" అయితే భవానీశంకర్ అంతగా బాధపడకపోయేవాడు కాని ఆమె ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయిందని తెల్సి... కారణం ఊహించుకోలేక కలవరపడిపోసాగాడు.     మొదట "తన గౌసియా ఇక్కడికెలా వస్తుందని? ఆమె ఉనికిని ఆ వూర్లో నమ్మలేకపోయాడు. కానీ హాస్పిటల్లో తెల్సుకున్న వివరాల ప్రకారం ఆమె తన గౌసియానే అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మనిషి కాలేకపోతున్నాడు కూడా! ఇలాగని హాస్పిటల్లోనే అతడు తన బాధను వ్యక్తం చేసుకోలేదు. తను ఎవరో ఎవ్వరికీ తెలీకూడదు అనుకున్నాడు కాబట్టి, హాస్పిటల్లో వున్నంతసేపూ బాధను అదిమి పట్టుకున్నాడు.     ఇంటికి వచ్చాక ఇక ఒక్కక్షణం కూడా అక్కడ వుండాలనిపించలేదు భవానీశంకర్ కు. గౌసియను వెదుక్కుంటూ వెళ్ళిపోవాలనిపించింది. ఆ విషయాన్ని ముంతాజ్ తో చెప్తే వెళ్ళనివ్వడు కాబట్టి అతడికి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవాలనుకున్నాడు. కాని వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ్నుంచి వెళ్ళిపోతే తనది గమ్యం తెలియని పయనం అవుతుంది. అలాగని ఆ వూర్లో వుండడానికి అతడి మనసు ఒప్పుకోవడం లేదు.     వింతగా ఆడుకుంటున్న పరిస్థితులు మనసును చిత్రవధ చేస్తుంటే ఆలోచిస్తూ పడుకునివున్నాడు భవానీశంకర్.     "ఏంట్రా? దవాఖానకు వెళ్ళివచ్చినప్పటి నుండి ఇలా తయారైపోయావు?" వచ్చి పక్కలో కూర్చున్నాడు ముంతాజ్.     "గౌసియా గుర్తొస్తోందిరా" చెప్పాడు భవానీశంకర్.     "నాకు తెల్సు" అని కాసేపాగి, "అదృష్టం వుంటే ఇద్దరూ కల్సుకుంటారు. అనవసరంగా బాధపడొద్దు" చెప్పాడు ముంతాజ్.     భవానీశంకర్ ఏంమాట్లాడలేదు. ముంతాజ్ కూడా ఇంకేం అనలేదు. కొన్ని క్షణాల మౌనం తర్వాత భవానీశంకరే మెల్లగా నోరు విప్పాడు.     "ముంతాజ్"     "ఊఁ?"     "రేపు హైదరాబాద్ వెళ్ళిపోతాను"     "నీకు దమాక్ గాని కరాబ్ అయ్యిందా?"     "నాకు ఇక్కడ ఉండాలనిపించడంలేదు. అందుకే రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను"     "వెళ్ళి ఎక్కడ వుంటావు?"     ఏం చెప్పలేకపోయాడు భవానీశంకర్.     "పరిస్థితులు కుదుటపడేవరకు ఇక్కడే వుండు. గౌసియా ఆచూకీ కూడా ఈ రెండుమూడు రోజుల్లో తెల్సిపోతుంది" ముంతాజ్ అన్నాడు.     "...."     "నీవు గనుక ఇక్కడ్నుంచి కాలు తీశావనుకో, నీ కష్టాలు నువ్వే కొనితెచ్చుకున్నవాడివి అవుతావు. కాబట్టి మరేం ఆలోచించకుండా హాయిగా పడుకో" చెప్తూనే స్నేహితుడి పక్కలో పడుకుండిపోయాడు ముంతాజ్.     భవానీశంకర్ మాత్రం అలాగే ఆలోచిస్తూ... "ఇంతకూ గౌసియా ఎక్కడికి వెళ్ళినట్టు? తనను ఎవరైనా తీసుకువెళ్ళారా? లేక తనే వెళ్ళిందా? తను ఎలా వెళ్ళినా సరే... తనకు ఏమీ జరగకుండా క్షేమంగా వుండాలి" అని మనసులో అనుకున్నాడు.

" ఏడు రోజులు " 34వ భాగం

" ఏడు రోజులు " 34వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి     మెల్లగా ముందుకు నడవసాగింది గౌసియా. ఆమె లోపలికి వెళ్ళిందల్లా, గౌసియా రావడం ఆలస్యం కావడంతో మళ్ళీ బయటకు వచ్చి గౌసియా పరిస్థితిని గమనించి, దగ్గరగా వచ్చి, తన చేయిని ఆసరాగా అందించింది.     ఇంట్లోకి వెళ్ళాక గౌసియాకు వాలు కుర్చీ చూపిస్తూ, "కూర్చో" అంది.     "ఆ! ఇప్పుడు చెప్పు?" గౌసియా కూర్చోగానే అడుగుతూ వెళ్ళి అక్కడున్న మరో చెయిర్ లో కూర్చుందామె.     గౌసియా తన అసలు పరిస్థితి గురించి చెప్పుకోలేదు. కేవలం హాస్పిటల్లో అతగాడు తనను మోసం చేసి తీసుకువచ్చిన కథను మాత్రం చెప్పుకుంది.     "అసలు మీది ఏవూరు? నువ్వెవరు?" అడిగిందామె.     "మాది హైద్రాబాద్. మా అమ్మా, నాన్న అక్కడే వుంటారు" చెప్పింది గౌసియా.     "ఇక్కడికి ఎలా వచ్చావు?"     గౌసియా కాసేపు మౌనం వహించి, ఆ తర్వాత ఇక తప్పదన్నట్టుగా తన కథను విపులంగా చెప్పుకుంది.     "చ్చొ చ్చొ చ్చొ" గౌసియా కథ విని జాలి పడిందామె. గౌసియా కళ్ళనీళ్లు తుడ్చుకుంది.     "ఈ చిన్నవయసులో ఆ ప్రేమలు ఎందుకమ్మా నీకు? నీది చదువుకునే వయసు. చదువుకుని జీవితంలో స్థిరపడ్డాక ప్రేమిస్తే ఆ ప్రేమకు అర్థం వుంటుంది. కాని ఈ ఎదిగీఎదగని వయసులో నీలో ప్రేమ కలిగింది అంటే, అది ప్రేమ కాదు. తెలియని తనం! ఆకర్షణ!     "ఈ ఆకర్షణలో మునిగి తెలియనితనాన్ని తెలిసినతనం అనుకుంటున్నావు నువ్వు! ఏదోలే...జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నీ జీవితం సుగమం కావాలి. అంతేకదా?" అందామె.     అవును అన్నట్లుగా తలాడించింది గౌసియా.     "ఇంకో విషయం! ప్రేమ కారణంగానే నిన్ను ప్రేమించిన కుర్రాడు హత్యకేసులో ఇరుక్కున్నాడు. ఇందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో క్షోభను అనుభవిస్తుండవచ్చు! ఒక్కసారి ఈ విషయం గురించి వాస్తవంగా ఆలోచించు"     "నిజమే" తలాడిస్తూనే అంది గౌసియా.     "మీ నాన్న చనిపోవడానికి కూడా మీ ప్రేమే కారణం! మీ నాన్న మూర్ఖుడు కావొచ్చు. దుర్మార్గుడు కావొచ్చు. కాని అతడికీ ప్రాణాలమీద తీపి వుంటుంది. ఆ తీపిని నీ ప్రియుడు చంపేశాడు" అని కాసేపాగి, "నువ్వు ఏమైనా అనుకో పాపా! మీ నాన్నను చంపేసి ఆ కుర్రాడు మంచిపనిచేశాడు. నీ తండ్రిలాంటివాళ్ళు బతకడంకంటే చావడమే మేలు! మీ నాన్నకు బాధ్యతలు వున్నాయి. కాని ఆ బాధ్యతల్ని నెరవేర్చుకుంటాడనే నమ్మకం మీ నాన్న ఒకవేళ బతికివున్నా నాకు లేకపోయేది"     "అవును"              "నిన్ను అమ్మివేసినందుకు మీ నాన్న చేసిన పనికి కూతురిగా ఇంకా ప్రేమిస్తున్నావో తెలీదు గాని... మీ నాన్నను చంపినందుకు ఆ కుర్రాడ్ని అభినందిస్తున్నాను. ఆ కుర్రాడి పరిస్థితికి ఒక తల్లిగా బాధపడుతున్నాను"     "...."     "అవునూ... ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్తావు? మీ ఇంటికి ఎలాగూ వెళ్ళలేవు. ఎవరైనా బంధువులుగాని, స్నేహితులుగాని, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు వున్నారా?" అడిగిందామె.     "నేను ఎవ్వరి ఇంటికీ వెళ్ళను. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన మోహన్ భయ్యా వాళ్ళ ఇంటికే వెళ్తాను" గౌసియా అంటుంటేనే ఇంటి యజమాని వచ్చాడు. రాగానే గౌసియావైపు ఎవ్వరు అన్నట్లుగా చూశాడు.     "మన అనుమానం నిజమేనండీ" రాగానే భర్తతో అందామె.     "అవునా?" అంటూ ఆమెకు ఎడంగా వున్న చెయిర్ లో కూర్చున్నాడు అతడు. అతని ముఖంలో ఏదో గొప్ప నిజాన్ని తెలుసుకున్నంత ఆసక్తి.     "ఈ దరిద్రపు వెధవమీద మనకు నెలరోజులనుండి అనుమానంగానే వుంది. ఇక ఈరోజు మన అనుమానాన్ని నిజంచేస్తూ ఈ పిల్లను హాస్పిటల్లో వుంటే బలవంతంగా ఎత్తుకువచ్చాడు. ముదనష్టపు వెధవ... వాడి పిండా కూడు పందులు తినుగాకా!" ఆమె గొంతులో ఆవేశం.     "నాకు ఈ మధ్యాహ్నమే వాడిపై అనుమానం వచ్చింది. కాని పెద్దగా పట్టించుకోలేదు..." అన్నాడు అతడు.     "వాడ్ని ఈ రాత్రికే ఇల్లు ఖాళీ చేయించేద్దాం! ఇట్లాంటి మోసాలు హైదరాబాద్ వంటి మహానగరాల్లోనే అనుకున్నాం. కాని ఇలాంటి వెధవలు తగలబడితే మన వూళ్లు కూడా పాడైపోతాయి" ఆమెలో ఆవేశం తగ్గలేదు.     "ఇల్లు ఖాళీ చేయించడం ఒక్కటే కాదు, వాడ్ని పోలీసులకు పట్టివ్వాలి" అతడిలో కూడా ఈసారి ఆవేశం.     "అవును అవును" దరువేసిందామె.     కాని రాత్రి ఎనిమిదిగంటలు కావొచ్చినా కూడా, గౌసియాను తెచ్చిన ఆ వ్యక్తి ఇంటికి రాలేదు. తొమ్మిది కావొస్తుంది అనగా ఐదారుమంది స్నేహితులతో కలిసి వచ్చాడు. అప్పటికి గౌసియా వాళ్ళ చల్లని నీడలో సేదతీరి పడుకునివుంది.     "వాడి దగ్గరకు వెళ్ళిరానా?" భార్యను అడిగాడు అతడు.     "ఇద్దరం కల్సివెళ్దాం" అందామె.     ఇద్దరూ కలిసి వెంటనే బయటకు నడిచారు. వాళ్ళు వెళ్లేసరికి తాగుతూ కూర్చుని వున్న మిత్రబృందం ఉలిక్కిపడి చూసింది.     "మా ఇంట్లో వున్నప్పుడు మా కుటుంబ సంభ్యుల్లో ఒకరిగా వుండాలి. కాని ఇదేంటి శ్యామ్?" అన్నాడు అతడు.     "ఆ!" ఉలిక్కిపడ్డాడు శ్యామ్ ఉరఫ్ రమణ.     "మాకు ఇలాంటి పద్ధతులు నచ్చవు" అందామె.     "మీరు ఏం మాట్లాడ్తున్నారు ఆంటీ... నాకేం అర్థం కావడంలేదు" రమణ అంటుంటేనే అతడి మిత్రులు మందుసీసాల్ని తీసి పక్కకు పెట్టేశారు.     "అన్నీ తెలిసాకే మాట్లాడుతున్నాం" ఇంటి యజమాని నిష్టూరంగా అంటుంటేనే "ఈ రాత్రిదాకా కూడా నువ్వు మా ఇంట్లో వుండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపో" కోపంగా చెప్పిందామె.     "అదేం ఆంటీ?" విస్మయంగా చూశాడు రమణ.     "ఏంలేదు! నీలాంటివాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు" అంటూ వెంటనే బయటకు నడిచాడు అతడు. వెనకే నడిచింది భార్య.     "ఏంట్రా? మన కొంప మునిగేలా వుంది?" వాళ్ళు వెళ్ళిపోయాక మిత్రులకు మాత్రమే వినబడేలా అన్నాడు రమణ.     "వెళ్ళిపోదాం పదరా" వెంటనే ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు.     "పోరా! వీళ్ళు మనల్ని ఏం చేస్తారు?" ఇంకో మిత్రుడు అన్నాడు.     "మనల్ని ఏంచేయరు? వీడ్ని చేస్తారు" మరో మిత్రుడు రమణ భుజం పట్టుకున్నాడు.     "అందుకే పదరా" అంటూనే లేచి నిల్చున్నాడు రమణ.     అంతలోనే ఆ వీధిలోని కొందరు పెద్దమనుషుల్లాంటి వ్యక్తుల్ని వెంటేసుకుని అక్కడికి వచ్చాడు ఆ ఇంటి యజమాని. వెంటే అతడి భార్య కూడా వుంది.     వాళ్ళను చూడగానే ప్రాణం పోయినంత పనయ్యింది రమణకు. అందర్నీ ఒకమారు చూసి, ఆ వెంటనే అక్కణ్ణుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.     అతడి ప్రయత్నం విఫలమైంది. గౌసియా ప్రస్తావన తీసుకువచ్చి అందరూ అతడ్ని చివాట్లు వేశారు. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయబోయాడు అతడు.     "పాపం అని పాముకు పాలుపోస్తే, పగతో కోరలు చాచిందంట. నీ సంగతీ అలాగే వుంది.     "ఆ పిల్లను నేను నిజంగానే హైదరాబాద్ తీసుకువెళ్ళాలనుకున్నాను. కాని నా మంచితనాన్ని ఆ పిల్ల గుర్తించలేదు"     "చాల్లేవయ్యా! నీమీద, నీ ప్రవర్తనమీద మాకు ఎప్పటినుండో అనుమానంగా వుంది. నీలాంటివాళ్ళను వూరికే వదిలిపెట్టకూడదు. పోలీసులకి పట్టించి చర్మం వొలిపించాలి" ఒక పెద్దమనిషి అన్నాడు.     "చర్మం వొలిపించడం ఒక్కటే కాదు, వీడికో వైన్ షాప్ వుందికదా, దాన్ని మొత్తం తగలబెట్టేద్దాం" ఇంకో పెద్దమనిషి అన్నాడు.     మరో పెద్ద మనిషి ఏంమాట్లాడకుండా వేగంగా రమణవైపు కదిలి, అనూహ్యంగా అతడి కాలర్ పుచ్చుకుని చెంప పగలగొట్టాడు. అతడి అహం దెబ్బతింది. తట్టుకోలేకపోయాడు. తనని కొట్టిన ఆ పెద్దమనిషిని పళ్లు కొరుకుతూ రౌద్రంగా చూస్తూ వెనక్కి నెట్టేశాడు.       ఆ తోపుకు ఆ పెద్దమనిషి వెల్లకిల్లా పడిపోయాడు. అతడు ఆ వీధి అంతటికే కాదు, వూర్లో కూడా గౌరవమైన వ్యక్తి. అంతటి వ్యక్తినే రమణ అలా నెట్టడాన్ని ఎవ్వరూ సహించలేకపోయారు. అందరూ ఒక్కుమ్మడిగా రమణమీదకు ఎగబడి దేహశుద్ధి చేయడం మొదలెట్టారు. అందులో భాగంగా అతడి మిత్రులు కూడా తన్నులు తిన్నారు.     "పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయండి" ఎవరో అన్నారు. ఆ మాట అలా వెలువడిందో లేదో ఇలా ఓ కుర్రాడు పరుగున బయటకు వెళ్ళాడు.     పదిహేను నిమిషాల్లో పోలీసులు వచ్చారు. రమణను అతడి మిత్రులను పట్టుకునివెళ్ళారు. జరిగినదంతా చూడగానే గౌసియా కాళ్ళూ చేతులు వణకనారంభించాయి.     "గురుడికి మంచి గుణపాఠం జరిగింది" అంటూ తన ఇంట్లోకి వచ్చాడు యజమాని.       "ఇప్పుడే కాదండీ, నెలరోజుల కిందట కూడా ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడంట" వెనకేవస్తూ అంది.     "ఎప్పుడు?" అతడు అర్థంకానట్టుగా చూశాడు భార్యవైపు.     "మనం బుచ్చిబాబు పెళ్ళికని విజయవాడ వెళ్ళినప్పుడు" చెప్పింది భార్య.     "అలాగా! ఎవరు చెప్పారు ఈ సంగతి?"     "ఇప్పుడు కామాక్షమ్మ చెప్తోంది"     "అందుకే తగిన శాస్తి చేశాంకదా" అతడు అంటుంటేనే పొరుగింటి విమల హడావిడిగా వచ్చింది.     "ఏంటి వొదినా? మీకు ఇంతయినా బుద్ధివుందా? ఆ రౌడీ వెధవలతో కల్పించుకోవడం ఎందుకు? ఈరోజు వాడ్ని పోలీసులకి పట్టిచ్చామని కాదు, రేపొద్దున కక్షగట్టి వాడు మనల్ని ఏమైనా చేస్తే?" రాగానే కంగారుగా అంది.     "వాడు మనల్ని ఏంచేస్తాడు?" అన్నాడు అతడు.     "అలా అనుకోవద్దు అన్నయ్యా! రౌడీనాయాళ్ళు పాముల్లాంటి వాళ్లు. ఎక్కడ పొంచివుంటారో తెలీదు. అయినా మీకు సంబంధంలేని విషయంలో కల్పించుకున్నారు. నాకు భయంగా వుంది" అంది విమల.     "సంబంధంలేని విషయం ఎందుకు అవుతుంది? మా ఇంట్లో అద్దెకు వుంటూ చేయరాని పనులు చేశాడు కాబట్టే కల్పించుకున్నాం" అన్నాడు అతడు.     "ఏమో అన్నయ్యా! వాడ్ని భయపెట్టి వదిలేసివుంటే సరిపోయేది. కాని ఏకంగా పోలీసులకు పట్టిచ్చారు? మీరు కాబట్టి అలా చేశారు. నేనైతే నాకెందుకొచ్చిన గొడవ అంటూ ఇల్లు మాత్రం ఖాళీ చేయించి వూరుకునేదాన్ని! అంతేకదా. తనకుమాలిన ధర్మంలేదు" అంటూ గౌసియా వైపు చూసి, "ఈ అమ్మాయేనా?" అడిగింది విమల.     "ఏమ్మా... ఏ తల్లి బిడ్డవోగాని, నీకోసం వీళ్ళు ఇంత హైరానా పడిపోయారు. మున్ముందు ఎన్ని కష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఏమో?" అంటూ గౌసియాకు చేరువగా వెళ్ళింది విమల.     గౌసియా పడుకున్నదల్లా లేచి కూర్చోడానికి ప్రయత్నించింది. "ఫర్వాలేదులే... పడుకో" అంటూ మరేదో మాట్లాడబోయింది విమల. అంతలోనే బయటనుండి పిలుస్తూ వచ్చింది ఆమె కూతురు. "వస్తున్నాను" అంటూ ఆ వెంటనే వెళ్ళిపోయింది విమల.     "చూడమ్మాయీ! ఎవరో ఏదో అంటున్నారని నువ్వు బాధ పడవద్దు. నీవు మా కూతురులాంటిదానివి" విమల వెళ్ళిపోగానే గౌసియాతో అన్నాడు అతడు.     "సరే" అన్నట్లుగా తలాడించింది గౌసియా.

" ఏడు రోజులు " 33వ భాగం

" ఏడు రోజులు " 33వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి           ఆయా ఎవరో ఇన్ పేషెంట్ తో మాట్లాడుతోంది. నెమ్మదిగా ఆమెవైపు నడిచాడు అతడు.     "పెద్ద డాక్టరు ఇప్పుడు దొరకడు అని చెప్పాను కదా" అతడ్ని చూడగానే అంది ఆయా.     "చిన్న డాక్టర్ వస్తాడు కదా" అన్నాడు యువకుడు.     "ఇద్దరూ ఆపరేషన్ థియేటర్ లోనే వున్నారు"     "ఇదేం హాస్పిటల్? ఈ సమయంలో ఇన్ పేషెంట్ ఎవ్వరికైనా సీరియస్ అయితే?"     "లోపలికి నంబరుంది. సీరియస్ అనుకుంటే కలుపుతాను" అంది ఆయా.     "మంచిది" అని కాసేపాగి, "అవునూ, ఉదయాన్నే ఎవరైనా టైఫాయిడ్ పేషెంట్ వచ్చారా ఇక్కడికి?" అడిగాడు అతడు.     "ఎవ్వరూ రాలేదే" అంది ఆయా.     "ఇప్పుడు వస్తాడు" అంటూ వెళ్ళి అక్కడున్న విజిటర్ చెయిర్స్ వరసలో కూర్చున్నాడు అతడు.     పదిహేను నిముషాలు గడిచిపోయాయి. ఆపరేషన్ థియేటర్ లోంచి కాంపౌండర్ వెలుపలికివచ్చి, ఆయాకు మందుల చీటి ఇస్తూ, "ఈ మందులు మన మెడికల్ హాల్లో లేవు. అవతలి వీధిలో వున్న మెడికల్ హాల్లో ఈ మందులు దొరుకుతాయి. వెంటనే వెళ్ళి తీసుకురాపో" అని చెప్పి, ఆ వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు.     ఆయా వడివడిగా బయటకు నడిచింది. అట్లాంటి అవకాశంకోసమే ఎదురుచూస్తున్న అతగాడు, ఆయా అలా బయటకు వెళ్ళగానే ఇలా గౌసియా దగ్గరకి నడిచాడు.     "ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు?" అడిగింది గౌసియా.     "ఫోన్లో అన్నయ్యతో మాట్లాడాను. తను ఎమర్జెన్సీ కేసులో వున్నాడు కాబట్టి నామీద తీవ్రంగా కోప్పడ్డాడు. ఆ కోపంలోనే 'ఆ అమ్మాయి ఇక్కడే వుండాలి. ఎక్కడికీ వెళ్ళడానికి వీల్లేదు' అని చెప్పాడు" అన్నాడు అతడు.     "మరి ఇప్పుడెలా?"     "ఇంకేం ఆలోచించేది లేదు, వెళ్దాం"     "సరే"     "నేను ఆటో తీసుకువస్తాను" అంటూ మెరుపు వేగంతో బయటకు నడిచి, రోడ్డెంబడి వెళ్తున్న ఆటోని చప్పట్లు చరుస్తూ "ఆటో" పిలిచాడు.     ఆటో ఇటు తిరిగింది. అతడు వెంటనే లోపలికి నడిచాడు.     "ఆయాకు చెప్పాలా?" అడిగింది గౌసియా.     "చెప్పాను. తీసుకువెళ్ళమంది"     "నాకు నడవడం చేతకాదు. పట్టుకుని మెల్లగా నడిపించు"     "ఎత్తుకు వెళ్తాలే" అంటూనే గౌసియాని తన రెండుచేతులమీదకు గబుక్కున ఎత్తుకున్నాడు అతడు.     అతడి ఓ చేయి నడుందగ్గరి ఆమె గాయంమీద ఒత్తిడిని పెంచింది. ఆమె భరించలేకపోయింది.     "అ...మ్మా..." బాధగా అరిచింది.     "ఏమయ్యింది?" గాభరాపడ్డాడు.     "ఈ చేయి తీయండి..." బాధపడుతూనే అతడి చేతిని దూరం జరుపుకుంది.     అప్పుడు గమనించాడు అతడు ఆమె గాయాన్ని. "ఓ సారీ! చూళ్ళేదు" అంటూ తనచేయిని దూరం జరిపి, ఆ వెంటనే డోర్ దాకా నడిచి, అటూఇటూ చూసి, ఎవ్వరూ తమని గమనించడం లేదు. ఆయా కూడా రావడంలేదు అని నిర్ధారించుకున్నాక, పరుగున వెలుపలికి నడిచాడు.             *    *    *     మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళాడు ముంతాజ్.     "ఏమంటోందిరా నీ లవ్వర్?" ముంతాజ్ రాగానే, తన చేతిలోని ఏదో మేగజైన్ ను పక్కకు పెడుతూ అడిగాడు భవానీశంకర్.     "ప్చ్... డిస్చార్జి అయ్యింది" నిరాశగా చెప్పాడు ముంతాజ్.     "భగ్న ప్రేమికుడివి అన్నమాట" టీజ్ చేసాడు భవానీశంకర్.     "ఏదోగాని, గోపాల్ గాడు ఫోన్ చేసాడు" చెప్పాడు ముంతాజ్.     "ఏమన్నాడు?" ఆత్రంగా చెయిర్ లోంచి లేచి ముంతాజ్ చేతుల్ని పట్టుకున్నాడు భవానీశంకర్.     "గౌసియా ఇంకా హైద్రాబాద్ కు రాలేదట"     "అదేం?"     "నాకేం తెల్సురా?"     "ఇంకా ఏం చెప్పాడు?"     "మీ అమ్మా, నాన్నలకు నీ గురించి చెప్పగానే చాలా సంతోషించారట! నిన్ను ఇప్పుడే ఇంటికి రావొద్దని చెప్పారంట! గౌసియా వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దీనంగా ఉందట! వాళ్ళ తండ్రి మరణం వాళ్ళను విపరీతంగా కృంగదీస్తుంటే మనుషులు కాలేకపోతున్నారంట"     "బిడ్డను అమ్ముకుని మాత్రం ధైర్యంగా ఉండగలిగారా?" వెంటనే కసిగా అన్నాడు భవానీశంకర్.     "అదే నాకు అర్థంకాలేదు" అన్నాడు ముంతాజ్.     "మొత్తానికి గౌసియా ఇంకా బాంబేలోనే వుందేమో?" అన్నాడు భవానీశంకర్.     "ఇంక అక్కడే వుంటుంది కదా" అంటూ చొక్కా గుండీలు తీసుకోసాగాడు ముంతాజ్.     "ఇంకా ఏమేం మాట్లాడాడు?" భవానీశంకర్ లో ఆసక్తి.     "ఇంకేం మాట్లాడలేదు. మళ్ళీ రేపు ఫోన్ చేస్తానన్నాడు. మరి కనీసం రేపైనా దవఖానకు వస్తే బాగుంటుంది" అంటూ చొక్కా వదిలి హ్యాంగర్ కు తగిలించాడు ముంతాజ్.     "రావాలనే వుంది. కాని భయంగా వుందిరా! అయినా రావడానికి ప్రయత్నిస్తాను! కాపోతే ఇప్పుడు ఒక నంబరు ఇస్తాను. ఆ నంబరుకు ఒకసారి ట్రై చేసి వివరంగా మాట్లాడు. అక్కడ సిరాజ్ అని నా ఫ్రెండు వుంటాడు. వాడు లేకపోతే వాడి అక్క పర్వీనా వుంటుంది. ఇద్దరిలో ఎవరు వున్నా అక్కడి పరిస్థితి గురించి పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళు వుండేది మాకు దగ్గరే, పైగా వాళ్ళు గౌసియా వాళ్ళకు బాగా తెలుసు" చెప్పాడు భవానీశంకర్.     "వాళ్ళు ముస్లింలు కదా?" అన్నాడు ముంతాజ్.     "నీలాగే వాళ్ళకు కూడా హిందూముస్లీం తేడాలులేవు. మంచి మనసే మతం, కలిసి వుండటమే కులం అని అనుకుంటారు. ఇంకో విషయం తెల్సా? మా ప్రేమలో సహాయపడింది కూడా వాళ్ళే" చెప్తూనే అదే హ్యాంగర్ కు తగిలించి వున్న తన ప్యాంటు జేబులోని పర్సును ఫోన్ నంబర్ కోసం బయటకు తీయబోయాడు భవానీశంకర్ కాగా, పర్సు పొరపాటున జారి కిందపడిపోయింది.     "నీ పర్స్ బాగుందిరా" అంటూ వంగి కిందబడిన పర్సును చేతుల్లోకి తీసుకుని తెరిచి చూసిన ముంతాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.     "ఏమయ్యిందిరా?" కలవరపడ్డాడు భవానీశంకర్.     "ఈ... ఈ... మె...?" ముంతాజ్ తడబడ్డాడు.     "గౌసియా" చెప్పాడు భవానీశంకర్.     "సారీరా" వెంటనే స్నేహితుడి చేతుల్ని పట్టుకున్నాడు ముంతాజ్.     అర్థంకానట్టుగా చూశాడు భవానీశంకర్.     "దవఖానాకు వచ్చింది ఈ అమ్మాయేరా" ఆయాసపడినట్లుగా చెప్పాడు ముంతాజ్.     "ఆ?" నమ్మలేకపోయాడు భవానీశంకర్.     "నిజం! ఈ అమ్మాయే! నేను బాగా గుర్తుపట్టగలను"     "బాంబేలో వున్న గౌసియా ఇక్కడికి ఎలా వస్తుంది?"     "అదంతా నాకు తెలీదు. నేను చూసింది ఈ అమ్మాయినే, పొరపాటున మనసు పారేసుకున్నదీ ఈ అమ్మాయిపైనే! నీకు నమ్మకం కుదరకపోతే స్వయంగా వెళ్ళి చూసాకే నమ్ము"     "డిస్చార్జి అయ్యింది అన్నావు కదా"     "ఇదే వూర్లో వేరే దవాఖానలో వుంటుంది. ఇప్పుడే వెళ్దాం" అంటూనే తిరిగి చొక్కా వేసుకున్నాడు ముంతాజ్.     "ఏంచేస్తుంది అక్కడ?" అడిగాడు భవానీశంకర్.     "ఏంచేయదు. అక్కడ కూడా తను పేషెంటే" చెప్పాడు ముంతాజ్.     అర్థంకానట్టుగా చూశాడు భవానీశంకర్.     "ఆలస్యం అమృతం...విషం... పదరా" అంటూనే బయటకు నడిచాడు ముంతాజ్.     వెనకే నడిచాడు భవానీశంకర్.             *    *    *