RELATED EVENTS
EVENTS
డలాస్‌లో మహాత్ముడికి నివాళి అర్పించిన భారత అంధుల క్రికెట్ టీం


డాలస్, టెక్సాస్: జూలై 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు అమెరికా పర్యటనలో ఉన్న ‘‘భారతీయ అంధ క్రికెట్ జట్టు’’ మంగళవారం డాలస్ లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించి జాతిపితకు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యుడు కమల్ కౌశల్, బాబీ, రవి మొదలైన వారు వీరికి ఘనస్వాగతం పలికారు.

బోస్టన్, న్యూ యార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ డి.సి, చికాగో, డాలస్, లాస్ ఏంజిల్స్, సియాటెల్ మరియు బే ఏరియా లలో పర్యటిస్తున్న ఈ క్రికెట్ జట్టులో సమర్తనం ఇంటర్నేషనల్ ఛైర్మన్ డా. మహన్ టెష్, టీం మేనేజర్ ధీరజ్ సెక్వేరియా ఆటగాళ్ళు - దున్న వెంకటేశ్వర రావు, సునీల్ రమేశ్, షుక్రం మాజిహ్, సంజయ్ కుమార్ షా, రవి అమితి, పంకజ్ భూ, నీలేష్ యాదవ్, నరేష్ తుందా, నకుల బడానాయక్, మహారాజ, లోకేష్, గుడ్డాడప్ప, దుర్గారావు తోమ్పాకి, దినేష్ రాత్వా, దినాగర్, దేబరాజ్ బెహరా, అజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

వీరిలో కొంతమంది పూర్తిగా అంధులు, మరికొంతమంది కొద్దిగా మాత్రమే చూడగల్గుతారు. వీరి క్రికెట్ బంతి సాధారణ బంతిలా కాకుండా దానిలో శబ్దంచేసే కొన్ని మువ్వలు లాంటివి ఉంటాయి. బౌలర్ బంతి విసిరినప్పుడు, ఆ బంతి చేసే శబ్దం ఆధారంగా ఎటువైపు ఎంత వేగంతో బంతి వస్తుందో అంచనావేసి బాట్స్ మాన్ బంతిని కొడతాడు.



ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని చాంపియన్స్ గా నిలిచిన ఈ భారతజట్టులో విజయవాడకు చెందిన అర్జున అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. ఈ క్రికెట్ టీం విదేశీ పర్యటన మొత్తాన్ని ‘సుబ్బు కోట ఫౌండేషన్’ వారు స్పాన్సర్ చేసి తగు ఆర్ధిక సహకారం అందించడం ముదావహం. పర్యటిస్తున్న అన్ని నగరాలలో అంధులు క్రికెట్ ఎలా ఆడతారో తెలియజేస్తూ ఎగ్జిబిషన్ మ్యాచ్స్ ఆడుతూ తమ క్రికెట్ ఆటలు సుదీర్ఘ కాలం విజయవంతంగా కొనసాగడానికి కావలసిన ఆర్ధిక పరిపుష్టికోసం విరాళాలు సేకరిస్తున్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;