RELATED EVENTS
EVENTS
మహాశివరాత్రి దినాన – డల్లాస్ లో టాంటెక్స్ తెలుగు వెన్నెల

డాలస్, ఫిబ్రవరి 19: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారి సాహిత్య వేదిక నెల నెలా  నిర్వహించే "నెల నెల తెలుగు వెన్నెల" 55 వ సమావేశం, ఫిబ్రవరి 19 న స్థానిక ఒహ్రీస్ రెస్టరెంట్ లో జరిగింది.   జనవరి మాసం తెలుగు వెన్నెల సంక్రాంతి రోజున జరుపుకుని, ఫిబ్రవరి మాసం తెలుగు వెన్నెల మహా శివరాత్రి రోజున జరుపుకోవడం విశేషం. డల్లాస్ సాహితీ ప్రియుల తో పాటుగా హ్యూస్టన్, ఆస్టిన్ నగరాల నుండి కూడా సాహిత్యాభి మానులు ఈ కార్యక్రమం లో ఉత్సాహం గా పాల్గొన్నారు. స్వీయ రచనలు, వెండితెర వేదిక, స్థానిక సాహితీవేత్త కన్నెగంటి చంద్ర గారి “మూడవ ముద్రణ” పుస్తకావిష్కరణ మొదలైనఅంశాలతోపాటు మరొక ప్రవాస కవి శ్రీ విన్నకోట రవిశంకర్ గారు ముఖ్యఅతిథి గా పాల్గొన్న ఈ కార్యక్రమం, సాహిత్య వేదిక కార్యనిర్వాహక కమిటీ అద్యక్షులు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన చాలా ఆహ్లాదంగా జరిగింది.

 

ముందుగా స్వీయ రచనల లో భాగంగా ప్రముఖ ప్రవాస కథకులు నిడదవోలు మాలతి గారు, కథ – దాని తీరుతెన్నులు, కథలు రాయడం లో గమనిచాల్సిన వస్తువుల గురించి వివరించి తను రాసిన కొన్ని కథల లోని విషయాలు ప్రస్తావించారు. మహాశివరాత్రి మీద, శివుని గొప్పతనం మీద ధూర్జటి పద్యాలను సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు కాజ సురేశ్ గారు చదివి వినిపించారు. అలానే మహాశివరాత్రి నాడు ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు లోని కోటప్పకొండ తిరునాళ్ళ ప్రసిద్ధిని, వైభవాన్ని వివరిస్తూ చేకూరి కేసీ తన అనుభవాలను పంచుకున్నారు. తన చిన్నతనం లో శివుడి మీద పాడిన పద్యాలనూ, పాటలను డా.ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు పాడి వినిపించడం సభికులందరినీ ఆకట్టుకుంది. హ్యూస్టన్ నుంచి విచ్చేసిన శ్రీ చిట్టెన్ రాజు గారు ‘విసాయాసం’ అనే హాస్య కథ ను చదివి వినిపించి, వచ్చే నెల మార్చి 10 మరియు 11 న హూస్టన్ లో జరుగుతున్నటువంటి మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు డల్లాస్ సాహీతి మిత్రులందరికీ ఆహ్వానం అందించారు. వెండితెర వేదికలో భాగం గా, ఫిబ్రవరి 9వ తేదిన పరమపదించిన ప్రసిద్ధ అలనాటి సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారిని స్మరించుకుంటూ, అయన జీవిత విశేషాలను నసీం షేక్ క్లుప్తంగా పంచుకున్నారు. ‘సంతానం’, ‘నర్తనశాల’, ‘హరిచంద్ర’, ‘వీరకంకణం’, ‘ఇలవేల్పు’, ‘సంకల్పం’, ‘శ్రీ మద్విరాట పర్వం’, ‘వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ మొదలగు ఎన్నో చిత్రాలకు దక్షిణామూర్తి గారు సంగీతం అందించి వాటి విజయాలకు తోడ్పడ్డారు. దక్షిణామూర్తి గారు సంగీతం అందించినటువంటి చిత్రాలలోని ప్రసిద్ధి చెందిన పాటలను ప్రదర్శించి ఆయనకు ఘనమైన నివాళిని అందించారు.

 

ఇప్పటిదాకా ఒక కవిగా పరిచయస్తులైన శ్రీ కన్నెగంటి చంద్ర గారు, తను 32 సంవత్సరాలుగా రాస్తున్నటువంటి కథల సంపుటి “మూడవ ముద్రణ – కన్నెగంటి చంద్ర కథలు” పుస్తకాన్ని ముఖ్యఅతిథి శ్రీ విన్నకోట రవిశంకర్ గారు, తానా అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ గారు, ప్రముఖ రచయిత్రి శ్రీ మాలతీ నిడదవోలు గారు మరియు హ్యూస్టన్ నుంచి వచ్చిన వంగూరి ఫౌండేషన్ వ్యవస్తాపకులు శ్రీ చిట్టెన్ రాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. శ్రీ విన్నకోట రవిశంకర్ గారు పుస్తక రచయిత చంద్ర గారి గురించి ప్రస్తావిస్తూ, సాధారణంగా కవులకు కథలు రాయడం, కథకులు కవిత్వం చెప్పడం అంత ఒప్పదన్న నానుడి ని చంద్రగారు తప్పని రుజువు చేసారని, ఒక కవి గానే కాకుండా, ఒక కధకుడి గా అయన ప్రతిభ, పరిణతి మూడవ ముద్రణ కథలు చదివితే తెలుస్తున్నదని అన్నారు. సాహిత్యవేదిక కార్యవర్గ సభ్యులు శ్రీ మద్దుకూరి చంద్రహాస్ గారు “మూడవ ముద్రణ” పుస్తకం గురించి మాట్లాడుతూ అందులో తనకు నచ్చినటువంటి ‘మూడవ ముద్రణ’, ‘పాప’, మొదలైన కథలలో, రచయిత చూపించినటువంటి కథాగమనాన్ని, శైలిని, ఇతర ప్రత్యేకతలను ప్రస్తావించి అభినందించారు. అలానే మరో కార్యవర్గ సభ్యులు శ్రీ మల్లవరపు అనంత్ గారు మూడో ముద్రణ లోని కథలలోని కొన్ని విషయాలు చదివి వినిపించారు. కార్యక్రమం లో ముఖ్యఅతిథి శ్రీ విన్నకోట రవిశంకర్ గారు “వచన కవిత్వం – పరిణామాలు, పరిశీలన” అనే అంశం మిద ప్రసంగించారు. తెలుగు సాహితీ చరిత్ర లో ఛందస్సుల బందోబస్తును తెంచుకుని ఉద్భవించిన వచన కవిత్వం తీసుకువచ్చిన మార్పు చాల గణనీయమైనదని, దీని ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలను, పరిణామాలను వివరించారు. ఈ వచన కవిత్వం రాయడం లో అజంతా, ఇస్మాయిల్, శ్రీశ్రీ, ఆలూరి బైరాగి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మొదలగు ప్రముఖ కవులు అనుసరించిన శైలిని ఒక్కొకటిగా వివరిస్తూ వివిధ కాలాల కనుగుణంగా వచన కవిత్వం లో వచ్చిన మార్పులను చాలా లోతుగా, సోదాహరణంగా వివరించారు. ఈ అంశం మిద ముఖ్యఅతిథి పంచుకున్న విషయాలు, ఆయనకున్న పరిశీలనాశక్తి కి అద్దం పట్టాయి. చివరగా సంప్రదాయ కవిత్వమైనా, వచన కవిత్వమైనా గమనం లో తేడా మాత్రమె కాని గమ్యం లో తేడాకాదని, ఏరచనకైనా నిజాయితి ఒక ముఖ్యమైన ప్రమాణం అని, రచయితలు తమ ఆలోచనలను మరింత విస్తృత పరిచి మరిన్ని మంచి రచనలు చేయాలనీ ఆకాంక్షించారు.

 

 

చివరగా... ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సంయుక్త కార్యదర్శి మరియుసాహిత్య వేదిక కార్యనిర్వాహక కమిటీ అద్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారు, టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు మల్లవరపు అనంత్ గారు, చామకూర బాల్కి గారు, తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్ గారు ముఖ్యఅతిథిని దుశ్శాలువతో సత్కరించారు.  సాహిత్య వేదిక కార్య వర్గ సభ్యులు శ్రీ విన్నకోట రవిశంకర్ గారికి జ్ఞాపిక ను బహుకరించారు.   ఈ కార్యక్రమానికి టాంటెక్స్ అద్యక్షులు శ్రీమతి గీత దమ్మన గారు, పూర్వాద్యక్షులు శ్రీ NMS రెడ్డి గారు, కార్యదర్శి శ్రీ ఊరిమిండి నరసింహ రెడ్డి గారు,కోశాధికారి శ్రీ కృష్ణారెడ్డి ఉప్పలపాటి గారు మరియు ఇతర కార్యనిర్వాహక సభ్యులు శ్రీ చిన్న సత్యం గారు , శ్రీమతి జ్యోతి వనం గారు, శ్రీ పూర్ణచంద్ర రావు గారు, మహేష్ ఆదిభోట్ల గారు కూడా హాజరు అయ్యారు.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;