తల్లిదండ్రులు చేసే ఈ తప్పులే పిల్లలలో కోపాన్ని మరింత పెంచుతాయట..!
Publish Date:Jul 19, 2026
Advertisement
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు. పిల్లలు తప్పులు చ చేయడం సహజం. తోటి పిల్లలను బాధపెట్టడం కూడా సహజం. కానీ పిల్లలు మాత్రం కొంత సేపు అయ్యాక లేదా ఒక రోజు తర్వాత అవన్నీ మర్చిపోయి తిరిగి కలిసి ఆడుకుంటారు, మళ్లీ గొడవలు కూడా పడతారు. అందుకే పిల్లలను కల్మషం లేని వారు అని చెబుతూ ఉంటారు. అయితే గొడవలు పడినప్పుడో.. లేదా ఇతర పిల్లలు మీ పిల్లలను బాధపెట్టినప్పుడు, ఇతర పిల్లలు చేసిన తప్పులను మీ పిల్లలు మర్చిపోకుండా మనసులో ఉంచుకోవడం వంటివి చేసినప్పుడు అది మంచి విషయం కాదని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. కారణం.. పిల్లలు ప్రపంచాన్ని పెద్దల కంటే చాలా భిన్నంగా చూస్తారు. వారికి, ఒక బొమ్మను పగలగొట్టడం లేదా ఆటలో ఓడిపోవడం చాలా పెద్ద విషయం. అటువంటి పరిస్థితిలో, ఒక స్నేహితుడు వారి మాట వినకపోతే, వారు అభద్రతకు గురై, మోసపోయినట్లు భావిస్తారు. క్రమంగా, పిల్లలలో అహంభావం పెరుగుతుంది, దీనివల్ల క్షమాపణ చెప్పడం లేదా క్షమాపణ కోరడం ఒక కష్టమైన పనిగా అనిపిస్తుంది. ప్రవర్తనను మార్చడం వల్ల కలిగే ప్రభావం.. పిల్లవాడికి క్షమించే అలవాటు లేకపోతే, అతను క్రమంగా ఒంటరివాడు అవుతాడు. మనసులో పగను ఉంచుకోవడం అతని మానసిక ఒత్తిడిని పెంచుతుంది. దేనికీ సర్థుకుని పోలేని మనస్తత్వం, ఇతరుల తప్పులను చూపించే కారణం వల్ల పిల్లవాడు ఎవరితో కూడా ఎక్కువకాలం స్నేహంగా ఉండలేడు. పిల్లలు సున్నితమైన, అర్థం చేసుకునే వ్యక్తులుగా మారాలంటే, క్షమించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులే సహాయం చేయాలి.. తల్లిదండ్రులు చిన్న విషయాలకే కోపగించుకుని, క్షమాపణ చెప్పకపోయినా లేదా క్షమించకపోయినా, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఒకవేళ తను తప్పు చేసి ఉంటే ఏమి ఆశించి ఉండేవాడో ఆ పిల్లవాడిని అడగాలి. ఇతర పిల్లల పరిస్థితిని అర్థం చేసుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మీరు కూడా క్షమాపణ చెప్పి, ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. క్షమాపణ చెప్పడం బలహీనతకు సంకేతం కాదని, గొప్పతనానికి సంకేతమని పిల్లలు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. స్నేహాన్ని బలపరిచే విషయాలు.. ఎవరూ పర్పెక్ట్ కారని పిల్లలకు వివరించాలి. ప్రతిఒక్కరూ తప్పులు చేస్తారు, కాబట్టి అందరిలో తప్పులు మాత్రమే చూడటం తప్పని పిల్లలకు చెప్పాలి. స్నేహ సంబంధం అనేది నమ్మకం , క్షమాగుణం అనే పునాదులపై ఆధారపడి ఉంటుంది. 'క్షమించండి' అని చెప్పడంలో ఉన్న ప్రాముఖ్యతను పిల్లలకు వివరించాలి. క్షమించడం ఎంతో గొప్ప గుణం అని చెప్పాలి. చిన్నతనంలో క్షమించడం నేర్చుకున్న పిల్లలు భవిష్యత్తులో మరింత సంతోషంగా, విజయవంతంగా ఉంటారని మనస్తత్వవేత్తలు నమ్ముతారు. కాబట్టి పిల్లలకు క్షమాగుణం అలవాటు చేయాలి.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/తల్లిదండ్రులు-చేసే-ఈ-తప్పులే-పిల్లలలో-కోపాన్ని-మరింత-పెంచుతాయట-35-226483.html





