వైఎస్ కాంగ్రెస్ కొంపముంచుతారా?
Publish Date:May 23, 2012
Advertisement
రాష్ట్రంలో 18 అసెంబ్లీ,ఒక లోక్ సభ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో పాల్గొంటున్న కాంగ్రెసుపార్టీ ప్రస్తుతం ఒక విచిత్రమైన సందిగ్థంలో పడింది. వైఎస్ కృషితో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆయన హయాంలో జరిగిన కుంభకోణాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. కానీ, వైఎస్ పేరుతో జనం మధ్య తిరుగుతున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి సభలకు పెద్దమొత్తంలో జనం తరలివస్తున్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు సామాన్య,మధ్యతరగతి ప్రజలకు ఎంతో కొంత మేలు చేశాయి.వారికి జరిగిన ప్రయోజనాలను ఎన్నికల ప్రచారంలో చెబుదామని కాంగ్రెస్ నాయకులు అనుకుంటే సిబిఐదర్యాప్తులో వైఎస్ పేరు కూడాప్రముఖంగా వినిపిస్తోంది.దీంతో వైఎస్ పేరును ఉచ్ఛరించడానికే వారు భయపడుతున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ కూడా తప్పుచేశారన్నా భావన కల్పించేలా సిబిఐ ఛార్జిషీటు ఉండటంతో ఆయన పాపాలు ఎవరు భరించారన్న చర్చ ఆ పార్టీలో మొదలైంది.వైఎస్ హయాంలో అక్రమాలు ఉంటే ఆ పాపాలు మాత్రం తమ ఖాతాలోకి రావని,మంచి మాత్రమే తమ పార్టీకి వస్తుందని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకరరెడ్డి అంటున్నారు. అయితే అవినీతి,అక్రమాల నేపథ్యంలో వైఎస్ పేరును పార్టీలో నుంచి ఎంత త్వరగా చెరిపేస్తే అంత మంచిదన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత టి.హనుమంతరావు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద సిబిఐ ఛార్జిషీటులో దివంగత నేత వైఎస్ పేరును చేర్చటం కాంగ్రెస్ పార్టీ అలజడి సృష్టించింది. ఈ పాపాన్ని ఎవరు మోయాలన్న దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/ys-rajasekhara-reddy-congress-24-14237.html





