ఏపీలో డీఎస్సీ వినా సమస్యలే లేవా.. వైసీపీ తీరు పట్ల పార్టీ శ్రేణుల్లోనే పెదవి విరుపు.!
Publish Date:Sep 18, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను అస్త్రంగా మలచుకుని అధికార కూటమిపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ తీరుపై పొలిటికల్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా వరుసపెట్టి ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ఈ తరహా రాజకీయ వ్యూహం ఏ మేరకు సఫలమవుతుంద అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే . ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం ఒకే అంశంపై పదే పదే దృష్టి పెట్టడం వల్ల రాజకీయంగా ఆశించిన ప్రయోజనం దక్కుతుందా? అన్న సందేహాలు వైసీపీయులలోనే వ్యక్తం అవుతున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా, మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది. ఈ అంశాన్ని విడతలవారీగా ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వ తీరును నిలదీసేలా వ్యూహాలు రచిస్తున్నది.. అయితే.. ఈ తరహా నిరంతర ఆరోపణలు క్షేత్రస్థాయిలో ఏ రకమైన ఫలితాలను ఇస్తున్నాయన్న ప్రశ్నకు మాత్రం సంతృప్తికరమైన సమాధానం రావడం లేదు. వైసీపీ విమర్శలు, ఆందోళనల పట్ల జనబాహుల్యంలో ఎటువంటి ఆసక్తీ కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి పార్టీల నేతలు వైసీపీ ఆరోపణలు, విమర్శలకు దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ హయాంలో ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోని తీరును ఎత్తి చూపుతున్నారు, ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్న విమర్శలు, ఆందోళన పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే అని ఎదురుదాడికి దిగుతున్నారు. రాజకీయంగా చూస్తే, వైసీపీ తీరు.. సొంత పార్టీ నేతలు, శ్రేణుల్లోనే గందరగోళం సృష్టిస్తోంది. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం ఒకే ఒక్క పరీక్షా విధానంపై మాత్రమే గళమెత్తడం వల్ల రాజకీయ ప్రయోజనం అటుంచి.. నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. అన్నిటికీ మించి డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ ఆరోపణలు, విమర్శలను అధికార యంత్రాంగం కొట్టి పారేస్తున్నది. వైసీపీ విమర్శించిన ప్రతి అంశంపైనా స్పష్టమైన వివరణ అధికారికంగా ఇస్తూ.. నియామక ప్రక్రియపారదర్శకంగా జరిగిందని ఆధారాలతో సహా వివరణ ఇచ్చున్నది. దీనివల్ల కూడా వైసీపీ డీఎస్సీపై చేస్తున్న విమర్శలు నీరుగారిపోతున్నాయి. ఇంకా డీఎస్సీ నియామకాలలో అవకతవకలు అంటూ వైసీపీ దానినే పట్టుకు వేళాడితే.. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ మరింత పలుచన అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [YS Jagan, Mega DSC controversy, YCP political strategy, AP teacher recruitment, ruling and opposition politics, Telugu One]
http://www.teluguone.com/news/content/ys-jagan-25-231779.html




