రసవత్తరంగా వైసీపీ బెజవాడ రాజకీయం...
Publish Date:Aug 2, 2017
Advertisement
ఏపీ రాజధాని ప్రాంతంపై వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. రాష్ట్ర రాజకీయాలకు రాజధానిగా ఉన్న విజయవాడలో పార్టీ బలహీనంగా ఉందని గుర్తించిన జగన్.... పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. 2014 ఎన్నికల్లో విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో ఒక స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. విజయవాడ వెస్ట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా అధికార పార్టీలోకి ఫిరాయించడంతో... ఆ ఒక్కటి కూడా వైసీపీ కోల్పోయింది. దాంతో విజయవాడలో వైసీపీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడుతోన్న జగన్... వచ్చే ఎన్నికల నాటికి బెజవాడలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు. అదే సమయంలో నమ్మకమైన వారికే పార్టీ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూడు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులు ఉన్నారు. జలీల్‌ఖాన్ జంప్‌తో విజయవాడ వెస్ట్ బాధ్యతల్ని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కి అప్పగించారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి గెలిచినా... ముస్లింలు అధికంగా ఉన్న ఈ స్థానంలో ఆయన సీటు ఇస్తారో లేదో చెప్పలేని పరిస్థితి. ఇక విజయవాడ సెంట్రల్‌కి వంగవీటి రాధా ఇన్‌ఛార్జ్‌గా ఉండగా.... అదే నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని పార్టీలో చేర్చుకున్నారు జగన్. దాంతో సెంట్రల్ టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. వంగవీటి రంగా ప్రధాన అనుచరుడైన మల్లాది... 2009లో సెంట్రల్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మల్లాదికి విజయవాడ నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వంగవీటి రాధా నగర అధ్యక్షుడిగా ఉండగా... ఆమధ్య పార్టీలో చేరిన వెల్లంపల్లికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మల్లాది పార్టీలోకి రావడంతో.... ఆ పదవిని విష్ణుకి ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయవాడలో పార్టీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని భావిస్తోన్న జగన్... మల్లాదికి నగర బాధ్యతలు అప్పగించి... పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారట. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా వంగవీటి రాధా జనసేనలోకి వెళ్తేనే... సెంట్రల్ సీటును మల్లాది ఇస్తారని, లేదంటే రాధాకే దక్కతుందని అంటున్నారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి పెద్దగా పట్టులేదు. గత ఎన్నికల్లో ఇక్కడ్నుంచే వంగవీటి రాధా ఓటమి పాలయ్యారు. దాంతో ఎన్నికల తర్వాత రాధాను ఈస్ట్ నుంచి సెంట్రల్‌కి మార్చారు జగన్. ప్రస్తుతం తూర్పు ఇన్‌ఛార్జ్‌గా బొప్పన బవకుమార్ ఉన్నారు. అయితే ఇక్కడ కూడా నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిని పార్టీలో చేర్చుకుని.... తూర్పు ఇన్‌ఛార్జ్‌గా నియమించనున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయవాడలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటోన్న జగన్.... నాయకత్వ మార్పులపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో విజయవాడకు మకాం మార్చడమే కాకుండా... పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా బెజవాడకే తరలిస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా గత ఎన్నికల్లో జరిగిన తప్పులు... ఈసారి జరగకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపులో జరిగిన పొరపాట్లు... 2019లో జరగకూడదనే నిర్ణయానికి వచ్చారట.
http://www.teluguone.com/news/content/ycp-vijayawada-45-76747.html





