కంగారూలపై సఫారీల ఘన విజయం.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను కైవసం
Publish Date:Jun 14, 2025
Advertisement
ఫైనల్స్ అంటే ఒత్తిడికి గురవుతారన్న అపవాదు ఉన్న సఫారీలు దాన్ని అధిగమించి కంగారూలపై ఘన విజయం సాధించారు . దక్షిణాఫ్రికా జట్టు అస్ట్రేలియాపై అద్భత విజయం సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బవుమా సేన విజేతగా నిలిచింది. 213/2 స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సఫారీ జట్టు మరో మూడు వికెట్లు కోల్పోయి 83.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఐదెన్ మార్‌క్రమ్ (136) అద్భుత శతకం సాధించాడు. విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ చక్కటి డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో అయిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే విజయం ఖాయం కావడంతో తర్వాత వచ్చిన బ్యాటర్ పని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 212 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 138 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 207 పరుగులు చేసింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. బౌలర్లకు సహకరించిన పిచ్‌పై ఐదెన్ మార్‌క్రమ్, తెంబా బవుమా (66) పోరాట పటిమ ప్రదర్శించారు. బవుమా ఔటైనా.. మార్‌క్రమ్ దాదాపు చివరి వరకు క్రీజులో ఉండి దక్షిణాఫ్రికా జట్టుకు చిరస్మరణీయమైన గెలుపును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 5 వికెట్ల తేడాతో లంచ్ బ్రేక్‌కు ముందే మ్యాచ్‌ను గెలిచి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని సఫారీ జట్టు గెలుచుకుంది. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్‌ను నెగ్గింది.
http://www.teluguone.com/news/content/world-test-championship-39-199948.html





