వేరీజ్ రోజా!?
Publish Date:Jul 25, 2024
.webp)
Advertisement
మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఇటీవలి కాలంలో ఎక్కడా వినిపించలేదు.. కనిపించలేదు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నిత్యం మీడియా ముందకు వచ్చి విపక్ష నేతలపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్న రోజా.. వైసీపీ ఓటమి, నగరిలో స్వయంగా తన పరాజయం తరువాత సైలెంటైపోయారు.
ఓటమి తరువాత ఒకటి రెండు సార్లు మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడానని మమ అనిపించినా ఆ తరువాత మాత్రం ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. మధ్యలో తమిళనాడులోని ఓ దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో సెల్ఫీ వీడియో విషయంలో ఆమె చేసిన ఓవరేక్షన్ వికటించింది.
వరుసగా రెండు సార్లు నగరి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రోజా.. జగన్ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా కూడా పని చేశారు.
మంత్రి కావడానికి ముందు జబర్దస్త గా నిత్యం టీవీలో కనిపిస్తూ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు బాగానే చేశారు. ఆ టీవీ షోలోనే పలు సందర్భాలతో తన సినీ హీరోయిన్ గా, రాజకీయ నాయకురాలిగా తనకు వచ్చిన గుర్తింపు కంటే జబర్దస్త్ షో ద్వారానే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పుకున్నారు. అటువంటి రోజా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జబర్దస్త్ షోకు దూరమైనా, ప్రతిపక్ష పార్టీల నేతలపై తన దురుసు మాటలు, అనుచిత విమర్శల ద్వారా నిత్యం ప్రజలలో ఉన్నారు. అదే ఎన్నికలలో తన విజయానికి బాటలు వేస్తుందని భ్రమించారు. సరే ఎన్నికలలో వైసీపీని జనం ఓడించారు. నగరిలో రోజాను ఛీ కొట్టారు. పోలింగ్ జరిగిన రోజునే తన ఓటమిని అంగీకరించేసి, సొంత పార్టీ వాళ్లే తనకు వ్యతిరేకంగా పని చేశారని ఆరోపణలు గుప్పించిన రోజా ఆ తరువాత అంటే ఫలితాలు వెల్లడి అయిన తరువాత.. మంచి చేసి కూడా ఓడిపోయాం అంటూ ముక్తాయించారు.
సరే అదంతా పక్కన పెడితే కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులపై కానీ, తమ పార్టీ అధినేత రాష్ట్రంలో వైసీపీ వాళ్లపై అధికార పక్షం దాడులు, హత్యలకు పాల్పడుతోందంటూ ఊరూవాడా ఏకమయ్యేలా గగ్గొలు పెడుతున్నా రోజా నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాకపోవడం ఏమిటని వైసీపీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి.
మరో వైపు పరిశీలకులు ఆమె ఏపీ రాజకీయాలకు దూరం జరిగి తమిళనాడుకు షిఫ్ట్ అయిపోయేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. తన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇటు తెలుగు, అటు తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టే చాన్స్ రోజా పోగొట్టుకున్నారని, ఇప్పుడు భవిష్యత్ అగమ్యగోచరంగా మారి మౌనముద్ర వహించారని అంటున్నారు. అయితే రోజా సైలెంటైపోవడంపై నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/where-is-roja-25-181503.html












