వాట్సాప్‌పై నిషేధానికి సుప్రీం "రెడ్" సిగ్నల్..
Publish Date:Jun 29, 2016
Advertisement
భారత్‌లో జరుగుతున్న ఎన్నో నేరాలకు, ఘోరాలకు కారణం "సోషల్ మీడియా"నే అని చాలామంది అభిప్రాయం. దీనిలో అగ్రస్థానంలో ఉంది "వాట్సాప్"..ఈ నేపథ్యంలో వాట్సాప్ సహా అలాంటి మరో 20 యాప్‌లను నిషేధించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. హర్యానాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త "సుధీర్ యాదవ్" వాట్సాప్ సహా 20 యాప్‌లు ఎన్‌క్రిప్షన్‌ను అమలు చేస్తున్నాయని, దీని వల్ల సందేశం పంపేవారు, దాన్ని రీసివ్ చేసుకున్నవారు తప్ప మధ్యలో ఎవరూ వాటిని చదవలేరని దేశ భద్రతకు నష్టం చేకూర్చే వాట్సాప్‌ను నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనం..ఈ విషయంలో సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తూ పిటిషన్ కొట్టివేసింది. ఈ ఎన్‌క్రిప్షన్‌పై గత ఏప్రిల్ నుంచి రచ్చ జరుగుతోంది. వినియోగదారుల సందేశాలు, వాయిస్ కాల్స్ సహా హ్యాకర్ల బారిన పడకుండా "ఎండ్ టూ ఎండ్" ఎన్‌క్రిప్షన్ పేరుతో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ని తీసుకువచ్చింది వాట్సాప్. దీని ద్వారా ఆ మెసేజింగ్ యాప్‌లోని డాటాను ఎవరూ హ్యాక్ చేయడానికి వీలు కలగదు. కేవలం మెసేజ్ రాసేవారు, అవతల దాన్ని చూసుకునే వారికి మాత్రమే ఈ మెసేజ్‌లు కనిపిస్తాయి. దీంతో దీని ద్వారా చాట్ చేసే మెసేజ్‌లన్నీ పూర్తిగా భద్రంగా ఉంటాయని వాట్సాప్ చెబుతోంది. అయితే మన ఐటీ చట్టాల ప్రకారం ఈ ఎన్‌క్రిప్షన్ వాడటం నేరం. మన చట్టాల ప్రకారం 256 బిట్ ఎన్‌క్రిప్షన్ వాడినందుకు వాట్పాప్‌పై ఎవరైనా భారత్‌లో కేసు పెట్టవచ్చు. దీనికి భారత్‌లో అనుమతి లభించాలంటే ఎన్‌క్రిప్షన్‌కి సంబంధించిన "కీ" ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి ప్రత్యేక అనుమతి పొందాలి. ముష్కర మూకలు దేశంలో మారణకాండ సృష్టించడానికి గుంటనక్కల్లా వేచి ఉన్న తరుణంలో ఇలాంటి ఎన్‌క్రిప్షన్ దేశ భద్రతకే పెనుముప్పుగా మారే అవకాశ ముందని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా వాట్సాప్ తన ఎన్‌క్రిప్షన్ కీ ని ప్రభుత్వానికి ఇస్తే మంచిది.
http://www.teluguone.com/news/content/whatsapp-45-63130.html





