భారత్ జన వికాస్.. విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ పేరిదేనా?
Publish Date:Aug 10, 2026
Advertisement
రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేసిన విజయసాయి.. అడుగులు ఇప్పుడు మళ్లీ పాలిటిక్స్ దిశగా పడుతున్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయి.. ఇటీవల మళ్లీ పాలిటిక్స్ పై తన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ మధ్య కొంత కాలం సొంత మీడియా అంటూ హడావుడి చేసిన విజయసాయి.. ఇప్పుడు పాలిటిక్సే తన గమ్యం అని చెప్పకనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. వైరల్ అవుతున్న ఈ వార్తలలో విజయసాయి పెట్టబోయే సొంత పార్టీ పేరు భారత్ జన వికాస్ అంటూ నెట్టింట వైరల్ అవుతోంది. వైసీపీలో ఉండగా రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన విజయసాయి.. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా వ్యవహరించి హస్తినలో చక్రం తిప్పారు. అయితే ఆ తరువాత పార్టీలో మారిన పరిస్థితుల్లో ప్రాధాన్యత కోల్పోయి, అవమానాలను ఎదుర్కొనాల్సి రావడంతో.. వియసాయి పార్టీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసేసి, పార్టీలో కోటరీ అంటూ నిందిస్తూ.. ఇక వ్యవసాయమే వ్యాపకం అంటూ దణ్ణం పెట్టి మరీ రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న దానిని బట్టి విజయసాయి త్వరలో ఏర్పాటు చేయబోయే సొంత పార్టీకి భారత్ జన వికాస్(బీజేవీ) అనే పేరు పరిశీలనలో ఉంది. గతంలో ఆయన కొత్త పార్టీ ప్రకటనతో పాటు ఒక సొంత మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. మరి చూడాలి ఆయన మీడియా సంస్థ ఏర్పాటు చేస్తారా? కొత్త రాజకీయ పార్టీతో జనం ముందుకు వస్తారా అన్నది. Vijayasai Reddy New Party, Bharat Jana Vikas, AP Politics Latest News, Vijayasai Reddy Political Re Entry, Former MP Vijayasai Reddy, YSRCP Vijayasai Reddy
http://www.teluguone.com/news/content/vijayasai-reddy-new-party-39-228548.html





