వీహెచ్ ఇంత మాట అనేశారేంటి!
Publish Date:Jun 27, 2023
Advertisement
ఈ మధ్య కాలంలో మారుతున్న తెలుగు రాజకీయాలలో ప్రాముఖ్యంగా వినిపిస్తున్న కొన్ని పేర్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కూడా ఒకరు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి అప్పుడు సంచలనం రేపగా.. అప్పటి నుండి యాత్రల, ధర్నాలు, నిరసనలు చేపట్టి ఏదో ఒక విధంగా తన పార్టీకి గుర్తింపు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్ని చేసినా పార్టీకి మైలేజీ దక్కకపోవడంతో ఇప్పుడిక ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని కొద్ది రోజులుగా తీవ్ర ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చలు కూడా పూర్తి కాగా త్వరలోనే ఆమె పార్టీని విలీనం చేయడం ఒక్కటే బ్యాలెన్స్ అని కూడా చెప్పుకుంటున్నారు. అటువంటిదేమీ లేదని షర్మిల స్వయంగా ఖండించినా ఆ ప్రచారం ఆగడం లేదు. ఆమె ఖండన అశ్వత్థామ హత: కుంజరహ: చందంగా ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత, షర్మిల తండ్రి వైఎస్ఆర్ తో మంచి అనుబంధం ఉన్న నేత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కురు వృద్ధుడైన వీ హనుమంతరావు మాత్రం షర్మిలను పూచిక పుల్ల లెక్కన మాట్లాడేశారు. “షర్మిల లేదు.. గిర్మిల లేదు.. పోవాయ్.. గామెను ఏపీలోకి పొమ్మను.. అక్కడ బాగుంటది”అని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా షర్మిల ఎవరో తనకు తెలియదన్న వీహెచ్ ఇటీవల కాలంలో పేపర్లలో ఎవరో ఏదో రాస్తున్నారని.. మీడియా ప్రతినిధులు వైఎస్ కుమార్తె అని గుర్తు చేయడంతో.. “`ఆ.. ఆ.. ఆమెనా.. వైఎస్ కూతురా?” అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తనకు తెలియదన్న ఆయన అయినా ఆమెకి తెలంగాణలో కంటే ఏపీలో ఉంటేనే ఉపయోగమని సూచించారు. “గిక్కడ ఆమెకు బోనమెత్తుట తెల్సా.. తెలంగాణ యాస తెలుసా? బాస తెలుసా?.. గేం చూసి ఆమె రాజకీయం చేస్తది. మాకు అవసరం లేదు. ఆమె వస్తానంటే.. ఎవరు మాత్రం రానిస్తరు” అని ఆమెని సీమ బిడ్డగానే వీహెచ్ మాట్లాడారు. ఒకవైపు షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకురావాలని పలువురు పెద్దలు సంప్రదింపులు జరుపుతున్న వేళ వీహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు కథనాలొస్తున్నాయి. డీకే శివకుమార్ వైఎస్ఆర్ హయం నుండే ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న కారణంగా ఇప్పటికే షర్మిలతో రెండు మూడు సార్లు సంప్రదింపుల కూడా జరిపినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ముందుగా పొంగులేటి, జూపల్లి లాంటి నేతల చేరికల అనంతరం షర్మిల విలీనం కూడా ఉంటుందని కాంగ్రెస్ క్యాడర్ కూడా బలంగా నమ్ముతున్న వేళ వీహెచ్ ఇలా షర్మిల లేదు గిర్మిల లేదు అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. షర్మిల గనుక తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ఆమెని రాజ్యసభకు కూడా నామినేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానం హామీ ఇచ్చిందని కూడా తాజాగా కథనాలొస్తున్నాయి. అది కూడా కర్నాటక కోటాలోనే డీకే ఆధ్వర్యంలోనే షర్మిలను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని షర్మిల పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే, షర్మిలను తెలంగాణ రాజకీయాలలోనే ఉంచుతారా? ఏపీ రాజకీయాలకు పంపిస్తారా అనే చర్చలు కూడా సాగిపోతుండగా.. వీహెచ్ ఇలా షర్మిల తెలంగాణ రాజకీయాలకు అవసరం లేదని.. ఆమెకి అసలు తెలంగాణ గురించి ఏం తెలుసంటూ ఎద్దేవా చేయడం ఇప్పడు మరో చర్చకు దారి తీసింది. మరి ఇంతకీ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా? చేస్తే ఏపీకా? తెలంగాణకా? ఏమో చూద్దాం!
http://www.teluguone.com/news/content/vh-says-sharmila-has-no-space-in-telangana-39-157417.html





