గౌతంరెడ్డి వెనుక "అపరిచిత వ్యక్తి" ఎవరు..?
Publish Date:Sep 6, 2017
Advertisement
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. రాజకీయంగా ఎదగడానికి నేతలు వేసే ఎత్తుగడలు చాలా చిత్రంగా ఉంటాయి..నిన్నటి వరకు మనతో తిరిగిన వ్యక్తి మనవైపే వేలేత్తి చూపుతాడు..తిట్టిన వ్యక్తే పొగుడుతాడు.. ఇదంతా రాజకీయ చదరంగంలో చాలా కామన్ . రంగా హత్య తర్వాత బెజవాడ టోటల్‌గా సైలెంట్ అయ్యిందని చెప్పవచ్చు. చిన్న చిన్న సెటిల్‌మెంట్లు చేసేవారిని కూడా ఖాకీలు అణిచివేయడంతో విజయవాడ ప్రజలు చాలా ప్రశాంతంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మళ్లీ అక్కడ స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దివంగత వంగవీటి రంగాతో పాటు ఆయన సోదరుడు రాధా హత్యలపై ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ నేత గౌతంరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రంగా అభిమానుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. తమ అభిమాన నేతపై గౌతమ్‌రెడ్డి నోరు జారడంతో రంగా తనయుడు రాధాకృష్ణ తన అనుచరులతో కలిసి గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లడం..పోలీసులు ఆయన్ను అడ్డుకుని స్టేషన్‌కు తరలించడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇద్దరు నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కి పార్టీ పరువుని నడిబజార్లో తీస్తుండటంతో వైసీపీ అధినేత సీరియస్ అయ్యారు. గౌతమ్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పుడూ సంయమనంతో వ్యవహరించే గౌతమ్‌రెడ్డి హఠాత్తుగా ఎందుకు నోరు జారారా అని పార్టీ నేతలు, కార్యకర్తలు జుట్టు పీక్కొంటున్నారు. అయితే జగన్మోహన్‌రెడ్డే కావాలని ఇంత హైడ్రామా ఆడించారని ప్రచారం జరగ్గా.. కాదు ఇది వేరే వ్యక్తి డైరెక్షన్‌లో జరిగింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014లో వైసీపీ టికెట్‌పై విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన గౌతమ్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి బొండా ఉమా చేతిలో ఓటమిపాలయ్యారు. సరే వచ్చేసారి సత్తా చూపిద్దాంలే అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరారు. సెంట్రల్ నియోజకవర్గంపై మొదటి నుంచి పట్టున్న నేత కావడంతో ఈ టికెట్‌ను మల్లాదికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. దీంతో తన రాజకీయ భవిష్యత్‌పై గౌతమ్ ఒత్తిడికి లోనయ్యారట. దానికి తోడు నంద్యాల, కాకినాడ ఫలితాల్లో టీడీపీ చేతిలో వైసీపీ చావు దెబ్బతినడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. వీటన్నింటిని బేరీజు వేసుకుని ఇటీవల బీజేపీ నేతలను కలిసి మంతనాలు సాగించారని..పార్టీ మారే విషయంలో ఇద్దరు చర్చించుకున్నారని వార్తలు వచ్చాయి. ఉన్నపళంగా పార్టీ మారితే బాగుండదని..పార్టీ తనంత తానుగా సస్పెండ్ చేసే పరిస్థితి కల్పించుకోవాలని సదరు నేత గౌతంరెడ్డికి సూచించారట...దీనిలో భాగంగానే రంగాపై రెడ్డిగారు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బెజవాడలో చర్చించుకుంటున్నారు. మరి దీనిలో వాస్తవమెంత అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
http://www.teluguone.com/news/content/vangaveeti-ranga-death-45-77588.html





