ఎమ్మెల్యే మేఘారెడ్డి టికెట్ కొనుక్కున్నారు..చిన్నారెడ్డి షాకింగ్ కామెంట్స్..!
Publish Date:Aug 17, 2026
Advertisement
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ కేటాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి చేసిన ఆరోపణలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఘాటుగా స్పందించారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నారని, డబ్బులకు ఆశపడి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనకే టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి ఆరోపించారు. తనకు టికెట్ ఇచ్చిన సోనియా గాంధీ.. ఆర్థిక సమస్యలు ఉంటే స్వయంగా ఖర్చు పెట్టి గెలిపించాలని రేవంత్ రెడ్డికి సూచించారని ఆయన పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు నిలిచిపోయాయని మంత్రులను అడిగితే.. ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నారని, కాంట్రాక్టులు తన అనుచరులకు దక్కలేదనే కారణంతో పనులు ఆపుతున్నారని వారు చెప్పారని చిన్నారెడ్డి అన్నారు. మేఘారెడ్డి తన అనుచరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తరహాలో తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని చిన్నారెడ్డి హెచ్చరించారు. అయితే తాను పార్టీని వీడబోనని, మేఘారెడ్డి వంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపే వరకు పోరాడతానని వ్యాఖ్యానించారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్వహించిన పలు విడతల సర్వేల ఆధారంగానే తనకు టికెట్ లభించిందని స్పష్టం చేశారు. విజయావకాశాలు ఉన్న అభ్యర్థులకే పార్టీ టికెట్లు కేటాయించిందని, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని అన్నారు. తాను టికెట్ కోసం ఎవరికైనా డబ్బులు ఇచ్చానని ఆరోపిస్తున్న చిన్నారెడ్డి.. ధైర్యముంటే తాను ఎవరికి, ఎంత డబ్బు ఇచ్చానో బహిరంగంగా వెల్లడించాలని మేఘారెడ్డి సవాల్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ద్వారా తన ప్రతిష్ఠను, పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2014, 2018 ఎన్నికల సమయంలో ఇకపై తాను పోటీకి దూరంగా ఉంటానని, అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇచ్చినా వారి విజయానికి కృషి చేస్తానని చిన్నారెడ్డి చెప్పిన విషయాన్ని కూడా మేఘారెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తానని మేఘారెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన తరుణంలో సీనియర్ నేతలు, ఎమ్మెల్యే మధ్య బహిరంగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకోవడం వనపర్తి కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. Vanaparthy Congress, Thudi Megha Reddy, G Chinna Reddy, Vanaparthy MLA, Congress Ticket Controversy, Telangana Congress, Congress Internal Dispute, Ticket Allegations, Congress Leaders, Political Controversy, Telangana Politics, Jivan Reddy, CM Revanth Reddy
http://www.teluguone.com/news/content/vanaparthy-congress-25-229092.html





