అమెరికా పౌరసత్వం ఇక అందని ద్రాక్షేనా?
Publish Date:Jun 23, 2026
Advertisement
అమెరికాలో స్థిరపడి ఆ దేశ పౌరసత్వం సాధించాలనుకునే వలసదారుల కలలు నెరవేరడం ఇక కష్ట సాధ్యమే. అమెరికా ప్రభుత్వం యూఎస్ సిటిజన్‌షిప్ దరఖాస్తు ఫీజులను రికార్డు స్థాయిలో పెంచేందుకు కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన గనుక అమల్లోకి వస్తే, అమెరికా పౌరసత్వం పొందడం సాధారణ వలసదారులకు దాదాపు అసాధ్యమే. . ఈ కొత్త ముసాయిదా నిబంధనను ఫెడరల్ రిజిస్టర్‌లో అధికారికంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం సోమవారం (జూన్ 22) విడుదల చేశారు. పౌరసత్వ దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అవుతున్న పూర్తి ఖర్చులను రాబట్టుకోవడమే లక్ష్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన కఠినమైన స్క్రీనింగ్ విధానాలు, భద్రతా తనిఖీలకు అయ్యే అదనపు వ్యయాన్ని కూడా ఈ ఫీజుల ద్వారానే భర్తీ చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, పేపర్ ఫైలింగ్ ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక వ్యక్తి 760 డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 71,940 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ ఫీజును ఏకంగా 1,330 డాలర్లకు పెంచనున్నారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా లక్షా పాతిక వేల,895 రూపాయలు అన్నమాట. కేవలం ఒక్క దరఖాస్తుపైనే దాదాపు 570 డాలర్లు అంటే రమారమి 75 శాతం అదనపు భారం పడనుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. అప్పీల్ బోర్డు ముందు పునఃపరిశీలన కోసం వేసే అభ్యర్థన ఫీజును కూడా అమెరికా ప్రభుత్వం భారీగా పెంచేసింది. ప్రస్తుతం 830 డాలర్లుగా (సుమారు రూ. 78,566) ఉన్న ఈ అప్పీల్ ఫీజును ఏకంగా లక్షా 475 డాలర్లకు అంటే.. లక్షా 39 వేల 620రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు. ఇది దాదాపు 77.7 శాతంపెంపు అన్నమాట. ఈ భారీ ఫీజుల పెంపును డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు సమర్థించుకుంటున్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అవుతున్న వాస్తవ ఖర్చులను ఏమాత్రం భరించలేకపోతున్నాయని, ఒక వలసదారునికి లభించే అత్యంత విలువైన ప్రయోజనం పౌరసత్వమేనని వారు అంటున్నారు. అయితే.. ఈ సంస్కరణలపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు, శాశ్వత నివాసితులపై ఈ నిర్ణయం కోలుకోలేని దెబ్బ కొడుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తక్కువ, మధ్యతరగతి ఆదాయ వర్గాలకు అమెరికా పౌరసత్వం ఇకపై అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పౌరసత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా వలసదారులు ఆర్థికంగా వేగంగా ఎదగడానికి, పౌర భాగస్వామ్యంలో చురుగ్గా పాల్గొనడానికి గతంలో అమెరికా ప్రాధాన్యత ఇచ్చేదని, కానీ ప్రస్తుత నిర్ణయం ఆ ఆశయాలకు గండి కొట్టేలా ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీ మాజీ అధికారులు సైతం విమర్శిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం వెలువడనుంది.
http://www.teluguone.com/news/content/us-citizenship--out-of-reach-36-223836.html





